white stone
-
అడవి దొంగ
అనంతపురం సెంట్రల్: యల్లనూరు మండలం కూచివారిపల్లి గ్రామ సమీపంలోని ఎల్లుట్ల అటవీ ప్రాంతంలో జేసీ కుటుంబం భారీ యంత్రాలతో అక్రమ మైనింగ్‌కు తెరతీసింది. రెండు రోజుల క్రితం ముగ్గురాయి వెలికితీతకు పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ కూడా చేశారు. ఖనిజ సంపదను కొల్లగొట్టడంలో భాగంగా ఇప్పటికే దాదాపు 50 అడుగుల మేర మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇందుకోసం సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో భారీ వృక్షాలను కూడా నేలకూల్చారు. ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టాలన్నా అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి. అయితే అధికార పార్టీ నేత కనుసన్నల్లో సాగుతున్న బాగోతం కావడంతో అనుమతి లేకపోయినా యథేచ్ఛగా బ్లాస్టింగ్లు చేపడుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. అనుమతులు రాకమునుపే అటవీ ప్రాంతంలో ఏకంగా దారిని ఏర్పాటుచేసుకొని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసింది. గత నెలలో ఒకసారి, ఈ నెలలో వారం రోజుల క్రితం ఆయన అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాలు, సొంత పనుల మీద పర్యటించే సమయంలో ఆయనకు ప్రొటోకాల్ హంగామా ఉంటుంది. అయితే కూచివారిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్ లేకుండానే వచ్చి వెళ్లడం గమనార్హం. వన్య ప్రాణులకు ముప్పు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. మొక్కల పెంపకం ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఉన్న చెట్లను ఇష్టారాజ్యంగా నరికేస్తుండటంతో ప్రకృతి సమతుల్యత లోపించి వర్షాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో అటవీ ప్రాంతంలో బ్లాస్టింగ్, తవ్వకాల వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. కూచివారిపల్లిలో ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా మైనింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా వన్యప్రాణులు అడవిని వదిలి పొలాలు, గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే వాహనాల రాకపోకలు, ఇతరత్రా కారణాలతో ఈ మధ్య కాలంలో జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ముగ్గురాయికి విపరీతమైన డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఖనిజం ముగ్గురాయి(బెరైటీస్). భూమిలో నుంచి ముడిచమురు, సహజ వాయువులు వెలికితీసే సంస్థలకు ఈ ఖనిజం ఉపయోగపడుతుంది. ఉష్ణ నిరోధక సాధనంగా ఉపయోగపడే ఈ ముగ్గురాయిని అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలైనా దుబాయ్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ప్రపంచ బెరైటీస్ నిల్వల్లో 28 శాతం ఇండియాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యతను బట్టి టన్ను ముగ్గురాయి ధర రూ.5వేల నుంచి రూ.25వేలు పలుకుతోంది. ఇంతటి డిమాండ్ ఉన్న ఖనిజం తవ్వకాలను ప్రయివేట్ వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకున్నా తవ్వకాలు చేస్తుండటం గమనార్హం. -
కుడియా తెల్లరాయి క్వారీ సీజ్
దేవరాపల్లి(మాడుగుల): అనంతగిరి మండలం పరిధిలో గల కుడియా తెల్ల రాతి క్వారీని అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ శాఖ సెక్షన్‌లోని తట్టపూ డి బీట్ పరిధిలో గల రిజర్వడ్ ఫారెస్టులో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నట్టు నిర్ధారించుకుని సీజ్ చేశామని చోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీజర్ రామనరేష్ బిర్లంగి, తెనుగుపూడి సెక్షన్ అటవీశాఖ అధికారి ఎం. రమేష్‌కుమార్ గురువారం తెలిపా రు. అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న దొమ్మంగి పెంటం నాయుడు, మహేంద్ర వీరకుమార్, సందీప్ కార్తీకేయ అనే ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు క్వారీ ప్రాంగణంలో ఉన్న జేసీబీ, డ్రిల్లింగ్ మిషన్ కూడా సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించి రామనరేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా తెనుగుపూడి అటవీ సెక్షన్ ఆఫీసర్ ఎం.రమేష్ కుమార్, తట్టపూడి బీట్ ఆఫీసర్ పి. శంకరాచారి కలిసి అటవీ ప్రాంత పరిశీలనకు వెళ్లారు. పక్కనే ఉన్న కుడియాలోని సర్వే నంబర్ 4 లో గల క్వారీని కూడా గత ఏడాది ఏప్రిల్ 10న పరిశీలించారు. క్వారీ ఏర్పాటు చేసిన స్థలంపై సందేహం కలిగిన అటవీశాఖ స్థానిక అధికారులు జీపీఎస్(గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) పాయింట్ ద్వారా పరిశీలించి, రిజర్వ ఫారెస్టులో ఉన్నట్టు గుర్తించారు. ఆ క్వారీకి 2002 నుంచి 2022 వరకు రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలాజికల్ అనుమతులున్నాయి. అటవీ శాఖ నుంచి ఎటువంటి అనమతులు లేనందున క్వారీని నిలిపి వేయడంతో పాటు క్వారీలో ఉన్న జేసీబీ డ్రిల్లింగ్ మిషన్ల గత ఏడాది ఏప్రిల్ 19న స్వాధీనం చేసుకున్నామన్నారు. క్వారీ నిర్వహించే ప్రాంతం ఫారెస్టు శాఖది కాదని, రెవెన్యూకు సంబంధించినదంటూ కలెక్టర్‌తో పాటు జిల్లా అటవీశాఖ అధికారులకు అప్పట్లో క్వారీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఏడాది తరువాత దీనిపై విచారణ జరిపేందుకు విశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ దర్యాప్తు అధికారిగా నియమించారు. ఆ క్వారీ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని నిర్ధారిస్తూ అటవీ, రెవెన్యూశాఖ అధికారులు సంయుక్తంగా ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ఈ నెల 25న మేరకు క్వారీ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు జేసీబీ, డ్రిల్లింగ్ మిషన్లను సీజ్ చేసినట్టు చెప్పారు. -
బినామీ ‘ఘనులు...’!
తెల్లరాయిపై కన్నేసిన బడాబాబులు ఇతర రాష్ట్రాలకు తరలుతున్న ఏజెన్సీ సంపద అక్రమ లీజులతో గిరిజనులకు అన్యాయం భద్రాచలం, న్యూస్‌లైన్ భద్రాచలం ఏజెన్సీలో ఉన్న అపార ఖనిజ సంపదపై కొంతమంది బడాబాబులు కన్నేశారు. ఇక్కడ ఉన్న తెల్లరాయి నిక్షేపాలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గాజు తయారీకి ఉపయోగకరంగా ఉండే తెల్లరాయి భద్రాచలం ఏజెన్సీలో పుష్కలంగా దొరుకుతుండటంతో గిరిజనుల భూములను లీజుకు తీసుకొని ఈ అక్రమానికి పాల్పడుతున్నారు.భద్రాచలం, దుమ్ముగూడెం, చింతూరు మండలాల్లో తెల్లరాయి నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఇక్కడి మధ్యవర్తుల ద్వారా గిరిజనుల భూములను గిరిజనుల పేరునే లీజుకు తీసుకుని, తమ కనుసన్నల్లో తెల్లరాయి తవ్వకాలు, తరలింపుప్రక్రియ సాగిస్తున్నారు. భద్రాచలం మండలం లక్ష్మీపురం పంచాయతీలోని రంగాపురం, బండిరేవు.., ఎటపాక పంచాయతీలోని బొజ్జుగుప్ప, మాధవరావు పేట.., చింతూరు మండలంలోని చట్టి.., దుమ్ముగూడెం మండలంలోని కొమ్మనాపల్లి సమీపంలో ఇటీవల తెల్లరాయి తవ్వకాలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారి ఒకరు గనుల నిర్వహణకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వటంతో ఈ అక్రమ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక్కడ నుంచి విజయవాడకు తరలించిన తెల్లరాయిని పాలీష్ చేసిన తరువాత తమిళనాడు రాష్ట్రంలోని వివిధ గాజు తయారీ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కారుచౌకగా లీజుకు భూములు : తెల్లరాయి నిక్షేపాలు లభించే గిరిజనులకు చెందిన భూములను తక్కువ ధరకే లీజుకు తీసుకుంటున్నారు. భద్రాచలం మండలంలోని రంగాపురం క్వారీనే పరిశీలించినట్లైతే... ఆ గ్రామంలోని ఎనిమిదిమంది గిరిజనులకు చెందిన 11 ఎకరాల భూమిని గుంటూరుకు చెందిన ఓ గిరిజన మహిళ పేరుతో ఇరవై ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. మొదట్లో ఎకరాకు ఏడాదికి రూ.1000చొప్పున కౌలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల భద్రాచలానికి చెందిన కొంతమంది వచ్చి గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి చనిపోయారని చెప్పి మళ్లీ ఒప్పంద పత్రాలు రాయించుకున్నారని భూమిపై హక్కుదారుడైన మడకం ముత్తయ్య తెలిపాడు. అయితే కౌలు గిట్టుబాటు కాదని పట్టుబడితే ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.2500లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపాడు. రాయి తీయటం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వాటిని పూడుస్తామని చెప్పినప్పటికీ అలానే వదిలేయటంతో పశువులు దానిలో పడి మృతిచెందుతున్నాయని ఆయన తెలిపాడు. అలాగే భద్రాచలం మండలం బండిరేవు క్వారీ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా తెల్లరాయిని తరలిస్తున్న రెండు లారీలను ఇటీవల అధికారులు పట్టుకున్నారు. ఇలా కారుచౌకగా గిరిజనుల భూములను లీజుకు తీసుకొని వాటిలో ఉన్న ఖనిజ సంపదను బడాబాబులు కొల్లగొడుతుండడం గమనార్హం. గిరిజనుల అంగీకారంతోనే లీజు ఒప్పందాలు జరిగాయనే కారణంతో రెవెన్యూ అధికారులు కూడా క్వారీ నిర్వాహకులకే వత్తాసు పలుకుతుండటంతో ఏజెన్సీ సంపద ఇతర ప్రాంతాలకు త రలిపోతోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి ఏజెన్సీలో లభించే ఖనిజ సంపద ద్వారా ఈ ప్రాంత వాసులు అభివృద్ధి చెందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు.