తొమ్మిది గ్రానైట్ లారీల పట్టివేత
తొమ్మిది గ్రానైట్ లారీల పట్టివేత
Published Fri, Jun 16 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
కర్నూలు: పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి రాయల్టీతో పాటు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు ఆదేశాల మేరకు మొత్తం 9 లారీలను పట్టుకొని కర్నూలు జిల్లా శిరివెళ్ల పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన సుబ్బరావు, నాయుడుతో పాటు మరికొంతమంది కొంత కాలంగా లారీల్లో గ్రానైట్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాడిపత్రికి చెందిన అధికార పార్టీ నేత అండదండలతో యథేచ్ఛగా ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఏపీ 02 టీబీ 0477, ఏపీ 02 టీఈ 2799, ఏపీ 02 టీసీ 0495, ఏపీ 02 టీబీ 9855, ఏపీ 02 టీఈ 2277, ఏపీ 02 టీఈ 2268, ఏపీ 02 టీఈ 2727, ఏపీ 02 టీబీ 6228 నెంబర్లు గల లారీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాక్ గ్రానైట్ తరలిస్తుండగా కాపుకాసి వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
ఇందులో నాలుగు వాహనాలు పూర్తిగా బిల్లులు లేకుండా వెళ్తుండగా.. మరో ఐదు వాహనాలు మూడు మీటర్లకు మాత్రమే బిల్లు చెల్లించి, మిగితా గ్రానైట్‌ను జీరో పైన తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయట పడింది. ఒక్కొక్క లారీలో 15 క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను తరలిస్తుండగా అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. అందులో ఏడు వాహన యజమానుల నుంచి రూ.7 లక్షలు వాణిజ్య పన్ను, రాయల్టీతో పాటు అపరాధ రుసుము వసూలు చేసి శుక్రవారం సాయంత్రం ఏడు వాహనాలను వదిలేశారు. మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై ఆ ప్రాంత అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి తక్కువ మొత్తం అపరాధ రుసుము చెల్లించి వాహనాలను తీసుకెళ్లినట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో కూడా ఈ తరహా వ్యాపారం జోరుగా సాగుతోంది. జొన్నగిరి, ఆస్పరి, డోన్, కృష్ణగిరి ప్రాంతాల నుంచి తాడిపత్రికి భారీ ఎత్తున గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్, గ్రానైట్ అక్రమ రవాణా తదితరాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు వెల్లడించారు.
Advertisement
Advertisement