కొల్లగొట్టుడే..!
గుట్టలను గుల్ల..గుల్ల చేస్తున్న అక్రమార్కులు
► కేశంపేట మండలంలో 20 ఎకరాల విస్తీర్ణంలో 2గుట్టలు
► విచ్చలవిడిగా బ్లాస్టింగ్స్ జరుపుతున్న వ్యాపారులు
► ముగిసిన లెసైన్స్.. అయినా ఆగని తవ్వకాలు
► లోతైన గుంతలు తవ్వడంతో తరచూ ప్రమాదాలు
కేశంపేట: కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి.. అక్రమార్కుల చేతుల్లో నామరూపాల్లేకుండా పోతున్నాయి. విచ్చలవిడిగా బ్లాస్టింగ్‌లతో వాటి ఉనికిలేకుండా చేస్తున్నారు. కేశంపేట మండలం ఇప్పలపల్లి, దత్తాయిపల్లి శివారులోని ప్రభుత్వ భూముల్లో గుట్టలను లీజు పేరుతో కొందరు వ్యక్తులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. రాత్రివేళల్లో గ్రానైట్, పలుగు రాయిని ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లో గుట్టలు సుమారు 20 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. గతంతో వీటిని పెద్దగుట్ట, బోడగుట్ట అని పిలిచేవారు. ప్రస్తుతం అవి కరిగిపోతున్నాయి.
లెసైన్స్‌ల గడువు 2008లోనే ముగిసినా ఇంకా గ్రానైట్‌ను కొల్లగొడుతున్నారని ఇప్పలపల్లి గ్రామస్తులు కొందరు తెలిపారు. ఇక్కడి నుంచి విలువైన గ్రానైట్, పలుగు రాయిని హైదరాబాద్, శంషాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ గుట్టల ప్రాంతంలో ఒకప్పుడు వర్షాలు కురిస్తే పశువులకు మేత విస్తారంగా లభించేది. సమీపంలోనే నీటి వనరులు ఉండడంతో పశువుల మేతకు కొంత సౌకర్యవంతంగా ఉండేది. చూపరులను మైమరిపించే గుట్టలు నేడు బ్లాస్టింగ్‌లతో నెలకొరుగుతున్నాయని ఆ రెండు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. భారీ బ్లాస్టింగ్‌ల శబ్దాలతో దద్దరిల్లడమే కాకుండా బోరుబావులు కూడిపోయి నీళ్లు లేక ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తరచూ ప్రమాదాలు
మైనింగ్‌దారులు తీసిన గోతుల్లో అనేకసార్లు మూగజీవాలు పడిపోయి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాగే గ్రానైట్‌లోడ్‌తో లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో గ్రామాల్లో విపరీతమైన దుమ్మురేగుతోంది. ఇక్కడి నుంచి రాయిని రవాణా చేస్తున్న లారీలకు నంబర్‌ప్లేట్లు సరిగా ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు. అతివేగంగా వస్తున్న లారీలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాపోతున్నారు. ఒకరిద్దరు కూలీలు లారీల కిందపడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి.
అయినప్పటికీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొండలు, గుట్టలను బ్లాస్టింగ్ చేస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించడంపై వారు కన్నెర్రచేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని ప్రకృతి సంపదను కాపాడాలని కోరుతున్నారు
అధికారులు పట్టించుకోవడం లేదు..
నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ లీజుకు తీసుకున్నవారు తీసిన పెద్ద పెద్ద గోతుల్లో మూగజీవాలు పడి చనిపోతున్నాయి. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ప్రమాదకరంగా మారిన గోతులను వెంటనే పూడ్చివేయాలి. - వెంకటేశం గ్రామస్తులు
మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తా
గ్రామంలో జరుగుతున్న మైనింగ్ పనుల గురించి సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్తాం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగితే వారిపై చర్యలు తీసుకుంటాం. మైనింగ్‌దారుల తీరును గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చారు. అనుమతులు ఉన్నాయా? లేదా? అనే విషయాలను పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. - కృష్ణకుమార్, తహసీల్దార్, కేశంపేట