బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు.. | Minister's strategy to take over the lands of Dalits | Sakshi
Sakshi News home page

బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు..

Published Sun, Jan 22 2017 1:24 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు.. - Sakshi

బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు..

 గ్రానైట్‌ కోటలో పాగాకు ప్రత్తిపాటి పక్కా స్కెచ్‌
416 ఎకరాల దళితుల భూములు కొట్టేసేందుకు మంత్రి వ్యూహం
అందులో ఉన్న రూ.2 వేల కోట్ల విలువైన గ్రానైట్‌ ఖనిజంపై కన్ను
వివిధ శాఖల అనుకూల నివేదికలతో పక్కా ప్రణాళిక
పచ్చటి పొలాలను.. పంటలు పండని భూములుగా చూపిన వైనం
అనుచరులు, ఉద్యోగుల ద్వారా మైనింగ్‌కు దరఖాస్తులు
బాధిత రైతుల ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణ


అన్ని విధాలా వెనుకబడిన దళితులను ఆదుకోడానికి 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూములిస్తే.. ఇన్నాళ్లూ వారు చక్కగా పంటలు పండించుకుని జీవనం సాగించారు. అలాంటి భూముల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉందని ఓ ప్రభుత్వ శాఖ నివేదిక ఇచ్చింది. ఇతర శాఖలూ ఇందుకు వంతపాడాయి. అలాంటి భూములు మీకెందుకంటూ ప్రభుత్వం పట్టాలను రద్దు చేసింది. బంగారం పండే భూములను లాక్కోవడం అన్యాయమంటూ పేద దళిత రైతులు లబోదిబోమంటున్నా సర్కారు వినిపించుకోలేదు. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీస్తే ఆ భూముల్లో రూ.2 వేల కోట్ల విలువైన గ్రానైట్‌ రాయి ఉండటమే అని తెలిసింది.

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, అమరావతి :
దళితుల కడుపుకొట్టి వేల కోట్లకు పడగలెత్తేందుకు ఓ అమాత్యుడు చక్కటి వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. వివిధ శాఖల అధికారులను లోబరుచుకుని తనకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకుని చక్రం తిప్పుతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని 250 మంది నిరుపేద దళితులకు సాంఘిక సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 19, 1975లో అప్పటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లుకలాపు లక్షణదాసు, నాటి జిల్లా కలెక్టర్‌ కత్తి చంద్రయ్యలు సర్వే నెంబర్‌ 381లో 416.50 ఎకరాలను కేటాయించారు.

లబ్ధిదారులందరికీ ఏకపట్టాగా ఆ భూమిని అందచేయడంతో వారంతా 1976లో ‘‘యడవల్లి వీకర్స్‌ సెక్షన్‌ ల్యాండ్‌ కాలనైజేషన్‌ సొసైటి లిమిటెడ్‌’’ పేరుతో గ్రూపుగా ఏర్పడ్డారు. ఆ భూములకు సాగునీటిని అందించేందుకు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3.20 కోట్ల వ్యయంతో శ్రీ అరుణోదయ సోమేపల్లి సాంబయ్య ఎత్తిపోతల పథకం ఏర్పాౖటెంది. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా దళిత రైతులు ఏటా పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు.  

చక్రం తిప్పిన ప్రత్తిపాటి
పత్తి వ్యాపారంతో మొదలు పెట్టి కోటాను కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్‌ పరిశ్రమ స్థాపించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రణాళిక రచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన ప్రణాళికను కార్యరూపంలో పెట్టడానికి పావులు కదిపారు. తన చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే వ్యవహారాన్ని నడిపించారు. దళితులు సాగుచేస్తున్న భూముల్లో ఏ మేరకు గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి జియాలజిస్టులను పిలిపించి సర్వే చేయించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ ఉన్నట్టు అంచనాకు వచ్చారు.

ఆ భూమిలో ఉప్ప శాతం ఎక్కువగా ఉన్నందున సాగుకు యోగ్యమైనది కాదని వ్యవసాయ శాఖ, ఆ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని సహకార శాఖ, ఆ భూముల్లో విలువైన గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయని మైనింగ్‌ శాఖ, గ్రానైట్‌ నిక్షిప్తమై ఉన్న భూమిని పారిశ్రామికవేత్తలకు అమ్ముకునేందుకు దళితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విజిలెన్స్‌ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చేలా చేశారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు.

దరఖాస్తుదారుల్లో కొందరి వివరాలు
► వై.శివయ్య తండ్రి బాలకోటయ్య, డోర్‌ నెం 1–130.యడవల్లి గ్రామం. ఇతని భార్య రమాదేవి. యడవల్లి గ్రామ సర్పంచ్‌. టీడీపీ.

► వై.రవీంద్రబాబు, తండ్రి శివయ్య,  డోర్‌ నెం 1–130, యడవల్లి గ్రామం. యడవల్లి గ్రామ సర్పంచ్‌ రమాదేవి కుమారుడు.

► సీహెచ్‌ వెంకటరామిరెడ్డి, తండ్రి సుబ్బరామిరెడ్డి, డోర్‌ నెం 5–285, జాలయ్యకాలనీ, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు కుమార్తె స్వాతి

► పేరున గణపవరం గ్రామంలో ఉన్న స్వాతి ఆయిల్‌ మిల్స్‌లో సూపర్‌వైజరుగా పని చేస్తున్నారు.

► షకీలా సాంబశివరావు, తండ్రి కష్ణమూర్తి, డోర్‌నెం 2–52–2, గణపవరం గ్రామం, నాదెండ్ల మండలం. మంత్రి పుల్లారావుకు చెందిన పత్తిమిల్లులో (టీఎంసీ యూనిట్‌)లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు.

► తాళ్లూరి సుబ్బారావు, తండ్రి రాములు, డోర్‌నెం 3–404,9వ లైన్, పండరీపురం, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు పత్తి మిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు.

► బొమ్మినేని రామారావు, తండ్రి పాపయ్య, గణేశునివారిపాలెం గ్రామం, యడ్లపాడు మండలం. మంత్రి పుల్లారావు పత్తిమిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు.

► ఎం.సుధాకర్‌రెడ్డి, తండ్రి వెంకటరెడ్డి, డోర్‌ నెం 3–104, మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు పత్తిమిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు.

► కొమ్మాలపాటి పూర్ణచంద్రరావు, తండ్రి వెంకటేశ్వర్లు, డోర్‌ నెం.5–46/5–1, మువ్వవారి బజార్, గణపవరం గ్రామం, నాదెండ్ల మండలం.  మంత్రి కంపెనీ శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో టీఎంసీ యూనిట్‌ ఇన్‌చార్జిగా పని చేస్తున్నారు.

► మేడూరి సత్యనారాయణ, తండ్రి పిచ్చయ్య, డోర్‌ నెం. 4–190, కొండ్రువారి వీధి, గణపవరం గ్రామం. నాదెండ్ల మండలం. మంత్రి కంపెనీ శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు.

గ్రానైట్‌ నిక్షేపాల వివరాలు
యడవల్లి గ్రామంలో లభించే గ్రానైట్‌లో ముఖ్యమైనది బ్లాక్‌ పెరల్‌. దీని ధర మీటరు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. సాధారణంగా ఏ క్వారీలోనైనా 6 మీటర్ల లోతు తవ్విన తర్వాతే మంచి మెటీరియల్‌ లభిస్తుంది. అయితే ఇక్కడ 4 మీటర్ల లోతు తవ్వితే మంచి మెటీరియల్‌ దొరుకుతుంది. ఎక్కువ లోతు తవ్వకుండానే నిర్వాహకులకు మంచి లాభాలు వస్తాయి.

సొసైటి రద్దుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ విచారణ   
తమకు జరిగిన నష్టంపై బాధిత దళిత రైతులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ను ఆశ్రయించారు. మంత్రి పుల్లారావు సహా టీడీపీ నాయకుల అక్రమాలను వివరించారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించినప్పటికీ విధుల్లో బిజీగా ఉన్నామంటూ మూడుసార్లు హాజరు కాలేదు. 2016 జూలై 10వ తేదీన బాధితులు మరోసారి అర్జీ ఇచ్చారు. దీనిపై సంబంధిత నివేదికతో హాజరు కావాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, గ్రామానికి చెందిన ఎస్సీలకు నోటీసులు వచ్చాయి. కష్ణా పుష్కరాలు జరుగుతున్నందున ఆ విధుల్లో బిజీగా ఉన్నామని, తర్వాత వస్తామని కమిషన్‌ కు ఉన్నతాధికారుల ద్వారా లేఖ పంపారు. అక్టోబర్‌ 1వ తేదీన కమిషన్‌ నూఢిల్లీలో నిర్వహించిన విచారణకు జిల్లా కో–ఆపరేటివ్‌ అధికారి పాండురంగారావు, డివిజన్‌ సొసైటీ అధికారి పురుషబాబు, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్, చిలకలూరిపేట తహశీల్దార్‌ పీసీహెచ్‌ వెంకయ్యలు హాజరయ్యారు. జనవరి 8వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన విచారణకు అధికారులు హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 8 వ తేదీకి విచారణ వాయిదా వేశారు.  

వాస్తవాలివీ..
పేద దళితులు ప్రభుత్వం నుంచి భూములు పొందినప్పటి నుంచి సొసైటీ సహకారంతో వరి, పత్తి తదితర పంటలు పండించుకున్నారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా పొందారు. ఆయా సంవత్సరాలలో ఏమేరకు పంటలు సాగయ్యాయన్న సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉంది. భూములు ఉప్పు కయ్యలుగా మారడానికి సమీపంలో సముద్రం లేదు. ఈ భూములు మినహా చుట్టుపక్కల ఉన్న భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు తేలలేదు. నిజంగా ఉప్పుశాతం ఎక్కువుగా ఉంటే  పంటలు ఎలా పండుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ రికార్డులు సరిగా లేకపోతే నోటీసు ఇవ్వాలి. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సొసైటీని ఎలా రద్దు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరక్ష్యరాస్యతను ఆసరాగా తీసుకుని రికార్డులు సరిగా నమోదు చేయలేదనడం సరికాదని బాధిత రైతులు వాపోతున్నారు.

25.08.2012 : నరసరావుపేట ఆర్డీవో, మైనింగ్‌ శాఖకు చెందిన అసిస్టెంట్‌ డైరెక్టర్, మండల సర్వేయరు, వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు యడవల్లి భూముల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

04.09.2015 : ఈ భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల సాగుకు యోగ్యమైనవి కావని నరసరావుపేట వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నివేదిక ఇచ్చారు.

02.12.2015 : చిలకలూరిపేట హార్టీకల్చర్‌ అధికారి కూడా ఈ భూములు సాగుకు పనికి రావని నివేదిక ఇచ్చారు.

02.12.2015 : నిబంధనల ప్రకారం యడవల్లి సొసైటీ రికార్డుల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని, ఆసొసైటీని రద్దు చేస్తున్నామని జిల్లా సహకార శాఖ నివేదిక ఇచ్చింది.





దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది మంత్రి బినామీలే
ఒక వైపున సొసైటీని రద్దు చేయించడానికి మంత్రి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపున ఆ భూముల్లోని గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతి కోరుతూ తనకు అనుకూలమైన వ్యక్తులతో మైనింగ్‌ శాఖకు ముందస్తుగానే దరఖాస్తు చేయించారు. ఏడాది కాల వ్యవధిలోనే 39 మంది వ్యక్తులు యడవల్లి భూముల్లోని గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయడం గమనార్హం. మైనింగ్‌ నిబంధనల ప్రకారం తొలి దరఖాస్తుదారుకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ విధంగా మొదటి 20 దరఖాస్తుల్లో మంత్రి అనుచరులు, ఆతని సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారనేది సమాచారం. వీరందరికీ త్వరలో గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతి ఇచ్చేందుకు మైనింగ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయం తెలిసి.. బాధిత దళిత రైతులందరూ మంత్రి పుల్లారావును కలిశారు. తాము ఎప్పటి నుంచో ఆ భూములను సాగు చేసుకుంటున్నామని, ఉన్నఫళంగా తమకు భూములు లేకుండా చేస్తే ఎలా బతకాలని గోడు వెల్లబోసుకున్నా మంత్రి స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement