సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. గులాబీ దళపతి మదిలో ఎవరున్నారు?.. పార్టీ టిక్కెట్ ఎవరికి దక్కనుందనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ముద్దసాని దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ దక్కనుందా లేక బీసీలకే అవకాశం రానుందా? అవసరమనుకుంటే జంప్ జిలానీల వైపు కారు పార్టీ మొగ్గుచూపుతుందా? అంటే, ఎవ్వరికీ అంతుచిక్కడం లేదనే సమాధానం వస్తుంది. అయితే డజన్‌కు పైగా అశావాహులు పోటీలో ఉన్నప్పటికీ.. బీ ఫామ్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనే చర్చ సాగుతోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ గూటికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపిలో చేరడంతో ఉత్పన్నమవుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు టీఆర్ఎస్‌లో ఉండి మంత్రిగా కొనసాగిన ఈటల, రాజీనామా చేసి బీజేపిలో చేరి ఏడో సారి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపి అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు. ఆత్మ గౌరవం పేరుతో బరిలో నిలుస్తున్న ఈటలను ఢీ కొట్టేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి వెతుకులాటలో పడింది. ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈటల బలం, బలహీనతలను బేరీజు వేసుకుంటు రాజకీయంగా దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగా ఈటలపై పోటీ చేసేందుకు అశావాహులు జాబితా రోజురోజుకు పెరుగుతుంది. డజన్‌కు పైగా మంది ఇప్పటికే తమ పేరును పరిశీలించాలని కోరుతున్నప్పటికి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సామాజిక, రాజకీయ అంశాలతోపాటు స్థానికత, యువతను పరిగణనలోకి తీసుకుని ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్, ఇతర పార్టీల నేతల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
టాప్ ఫైవ్‌లో మాత్రం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి లేదా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వేములవాడ టెంపుల్ అథారిటి వైస్ చైర్మెన్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దామోదర్రెడ్డి ఇమేజ్, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, నియోజకవర్గంలోని మామిడాలపల్లికి చెందిన స్థానికుడు, టీఆర్ఎస్ బ్రాండ్ కలిస్తే విజయం సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
పురుషోత్తమ్ రెడ్డికి పరిపాలన పరమైన అనుభవం ఉన్నా, రాజకీయ పరమైన అనుభవం లేదు. ఇక అదే ఇంటి నుంచి దామోదర్ రెడ్డి తనయుడు కాశ్యప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరి పోటీకి సిద్ధమవుతున్నారు. కాశ్యప్ రెడ్డి 2014లో ఈటలపై టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ కుటుంబం నుంచి కాకుంటే కేసీఆర్ రాజకీయంగా ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన కెప్టెన్ కుటుంబంలో వొడితెల రాజేశ్వర్ రావు మనువడు ప్రణవ్ బాబు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ రెండు కుటుంబాలను కాదనుకుంటే బీసీ అయిన ఈటలను మరో బీసీ నేతతో ఢీకొట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. రమణ కాదంటే ఆ స్థాయిలో ఉన్న బీసీ నేత టీసీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ను సైతం పార్టీలోకి అహ్వానించి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పొన్నం ఇమేజ్, విపక్షాలు చేసే విమర్శలకు దీటైన సమాధానం చెప్పే సత్తా ఉన్న నాయకుడిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాలు సామాజిక అంశం ప్రక్కన పెడితే మాజీ ఎంపీ వినోద్, కాంగ్రెస్‌లో ఉన్న ప్రవీణ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్‌లో అమలు చేసే పనిలో గులాబీ దళపతి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సాగర్‌లో రాజకీయ అనుభవం లేని నోముల భగత్ బరిలో నిలిపి, సీఎం స్థాయి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి తీసుకువచ్చారు. అలాంటి పరిస్థితి రాజేందర్‌కు రావాలంటే హుజురాబాద్ ఉపఎన్నికలో రాజకీయంగా అనుభవం లేని వారిని బరిలో నిలిపి విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
చదవండి: Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో?
‘ఈటలకు తొలిరోజే అవమానం’
Comments
Please login to add a commentAdd a comment