Bye Election
-
ఏపీలో 3 రాజ్యసభ సీట్ల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు మంగళవారం షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 20వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం అందులో పేర్కొంది.వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీతో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి కూడా(రాజీనామాలే) ఈ నోటిఫికేషన్ వర్తించనుంది. డిసెంబర్ 20వ తేదీనే పోలింగ్ అయ్యాక సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుందని ఈసీ ఆ షెడ్యూల్లో పేర్కొంది. మిగతా వివరాలు ఈ కింది నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇదీ చదవండి: హాయ్ చెప్తే.. అంత డ్రామా చేస్తారా? -
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ : తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు..పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా బీఆర్ఎస్ పార్టీ తరుఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై న్యాయనిపుణులతో మాట్లాడేందుకు కేటీఆర్‌తో పాటు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణలతో,రాజ్యాంగ నిపుణులతో ఇవాళ సాయంత్రం (ఆగస్ట్ 5న)భేటీ కానున్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నాం. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. -
రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ..
లండన్: బ్రిటన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ త్రుటిలో చావు దెబ్బ తప్పించుకుంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క సీటు గెలుచుకుని మిగిలిన రెండు చోట్ల ఓటమిపాలైంది. అసలే సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా నిలిచాయి. మొత్తం మూడు స్థానాలకుగాను జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని మాత్రం స్వల్ప మెజారిటీతో తిరిగి దక్కించుకుంది. ఒకవేళ ఆ స్థానాన్ని కూడా కోల్పోయి ఉంటే ఒకే రోజు మూడు సీట్లు కోల్పోయిన ప్రధానిగా రిషి సునాక్ చరిత్రలో నిలిచిపోయేవారు. అదృష్టవశాత్తు ఉక్స్ రిడ్జ్, సౌత్ రూస్లిప్ పరిధిలోని వెస్ట్ లండన్ లో గెలిచి ఆయన ఈ ఘోర అవమానం నుండి తప్పించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో సోమర్టన్, ఫ్రోమ్ సీట్ లో 19 వేలు, సెల్బీ.ఎయిన్స్టీ నియోజకవర్గంలో 20 వేలు మెజార్టీతో లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ. సెల్బీ, ఎయిన్స్టీలో గెలిచిన అభ్యర్థి కెయిర్ మాథెర్(25) మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇక్కడివారు అసంతృప్తితో ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. సోమర్టన్, ఫ్రోమ్ లో గెలిచిన లేబర్ పార్టీ అభ్యర్థి సారా డైక్ మాట్లాడుతూ.. ఇది చారిత్రిక విజయం. ఈ ప్రభుత్వం చేతకానితనంతో సర్కస్ చేస్తోందని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలు రిషి సునాక్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ గా మారాయి. గతేడాది మార్చ్ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకోవడం ఆందోళనకరమని చెబుతున్నాయి కన్జర్వేటివ్ పార్టీ వర్గాలు. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే జనం ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే.. -
మాస్కో టూ హైదరాబాద్!
ఓల్గా సే గంగ, గంగా సే ఓల్గా. ప్రాంతం ఏదైనా దేశం ఏదైనా సరే, అసమర్థుల జీవయాత్ర ఒకే రకంగా ఉంటుందని పలుమార్లు రుజువైంది. ఖాతాల్లో ఎన్ని ఘనతలున్నా అవి వారికి ఉపయోగపడవు. కాలక్రమంలో ఆ ఘనతలన్నీ విజేతల ఖాతాల్లోకి బదిలీ అవుతుంటాయి. ఈ వారం రష్యాలో, తెలం గాణలో జరిగిన రెండు పరిణామాలు ఇదే సంగతిని మరోసారి నిర్ధారించాయి. రష్యాలో గోర్బచెవ్ మరణం, హైదరాబాద్ సంస్థాన విలీనాంశం ఈ పరిణామాలు. మిహాయిల్ సెర్గీవిచ్ గోర్బచెవ్ సోవియట్ యూనియన్‌కు చిట్టచివరి అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయ్యవారిని చేయబోతే కోతి తయారైందని మన దగ్గర ఒక సామెత ఉన్నది. ఆయన కూడా ఒక లెనిన్‌ను సృష్టిద్దామనుకున్నాడు. సదరు సృష్టికార్యం వికటించి ఎల్త్సిన్ తయారయ్యాడు. ఎల్త్సిన్ ముదిరి పుతిన్ అవతారమెత్తాడు. జార్ చక్రవర్తుల నిరంకుశ కాలం నాటి రష్యాను ‘జాతుల బందిఖానా’గా లెనిన్ అభివర్ణించాడు. కజకిస్థాన్ వగైరా మధ్యఆసియా దేశాలు, ఆర్మేనియా తదితర కాకేసస్ ప్రాంత రాజ్యాలు, ఉక్రెయిన్, బెలారస్ వంటి తూర్పు యూరప్ జాతులు, బాల్టిక్ తీర జాతులు, ఫిన్లాండ్... రష్యన్ సామ్రా జ్యంలో అంతర్భాగంగా ఉండేవి. భాషాపరంగా, సాంస్కృతికంగా నాన్–రష్యన్ జాతులన్నీ తీవ్రమైన వివక్షకు, అణచివేతకు గురయ్యేవి. విప్లవం విజయ వంతమైన తర్వాత ఏర్పడిన సోవియట్ యూనియన్‌లో ఈ జాతులన్నింటికీ విడిపోయే హక్కుతో సహా సమస్త ప్రజాస్వా మిక హక్కులను కల్పించాలని లెనిన్ సంకల్పించారు. ఆ మేరకు బోల్షివిక్ పార్టీ ఒక ప్రకటన కూడా చేసింది. ఆ వెంటనే ఫిన్లాండ్ చేసిన స్వాతంత్య్ర ప్రకటనను కూడా లెనిన్ అనుమతించారు. మిగిలిన జాతుల సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి స్టాలిన్‌ను ఆ శాఖకు మంత్రిగా నియమించారు. అనతికాలంలోనే లెనిన్ అనారోగ్యానికి గురికావడం, కొద్దిరోజుల్లోనే చనిపోవడంతో పాలనా పగ్గాలు స్టాలిన్ చేతికి చిక్కాయి. స్టాలిన్ స్వయంగా రష్యన్ కాదు. జార్జియన్. అయినప్పటికీ ఇతర జాతులేవీ యూనియన్ నుంచి విడి పోకుండా కమ్యూనిస్టు పార్టీ పెత్తనం ద్వారా జాగ్రత్తపడ్డారు. జారిస్టు రష్యా నాటి వివక్ష, భాషా సంస్కృతుల అణచివేతను అమలు చేయలేదు గానీ జాతుల స్వతంత్ర కాంక్షను మాత్రం ఉక్కుపాదంతో అణచివేశారు. స్టాలిన్ హయాంలో సోవియట్ యూనియన్ ఆర్థికాభివృద్ధికి వేగంగా పునాదులు పడినప్పటికీ, ప్రజాస్వామిక హక్కులు మాత్రం మృగ్యమయ్యాయి. ఏక పార్టీ నియంతృత్వం కొనసాగింది. సొంత పార్టీలో ప్రత్యర్థులను కూడా వెంటాడి వేటాడారు. లెనిన్ వారసుడిగా అధికారంలోకి రావాల్సిన ట్రాట్సీ్క వంటి మేధావిని కూడా ప్రవాసంలోనే మట్టుబెట్టారు. అయితే స్టాలిన్ అటువంటి కఠిన వైఖరి అవలంబించకపోయినట్లయితే సోవియట్ యూనియన్ను బాల్యదశలోనే సామ్రాజ్యవాద శక్తులు కడతేర్చి ఉండేవని స్టాలిన్ అనుకూల వర్గం వాదించింది. స్టాలిన్ మరణానంతరం ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నికటా కృశ్చేవ్ అధికారం లోకి వచ్చారు. అయినా అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో పెద్దగా మార్పు రాలేదు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఉదంతం ప్రచారంలో ఉన్నది. ఒక సమావేశంలో స్టాలిన్‌ను విమర్శిస్తూ కృశ్చేవ్ మాట్లాడుతున్నారట. అప్పుడాయన దగ్గరకు ఒక చీటీని ఎవరో పంపించారు. కృశ్చేవ్ ఆ చీటిని విప్పి చదివారు. ‘స్టాలిన్ జీవించి ఉన్నప్పుడు మీరెందుకు ఈ మాటలన్నీ చెప్పలేద’ని అందులో ఉన్నదట. చదివిన తర్వాత ఆ ‘చీటిని పంపిందెవరో చేయెత్తండ’ని కృశ్చేవ్ అడిగారట. ఎవరూ ఎత్తలేదు. కాసేపు నిరీక్షించిన తర్వాత ‘ఇదిగో ఇందుకే నేను కూడా మాట్లాడలేద’ని కృశ్చేవ్ నవ్వుతూ చెప్పారట! గోర్బచెవ్ చేతికి పార్టీ పగ్గాలొచ్చేనాటికి దేశంలో ప్రజాస్వామ్య ఆకాంక్ష పెరగసాగింది. ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారింది. అఫ్గానిస్తాన్ యుద్ధంతో చేతులు కాల్చుకున్నది. జనంలో అసంతృప్తి వ్యాపించడం మొదలైంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని గోర్బచెవ్ సంక ల్పించారు. ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకడం కోసం రోనాల్డ్ రీగన్, మార్గరెట్ థాచర్‌లతో చర్చలు జరిపారు. వీరిద్దరూ ఆయా దేశాల్లో ఉక్కు మనుషులుగా పేరుగాంచారు. గోర్బచెవ్కు స్వదేశంలో మెతక మనిషనే పేరున్నది. పశ్చిమ దేశాలతో ఒప్పందం మేరకు భారీ సంఖ్యలో అణ్వస్త్రాలను ధ్వంసం చేశారు. అఫ్గానిస్తాన్ నుంచి ఉపసంహరించుకున్నారు. తూర్పు యూరప్ దేశాల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతుంటే ప్రేక్షకపాత్ర పోషించాడే తప్ప సైన్యాన్ని వినియోగించలేదు. బెర్లిన్ గోడ బద్దలవడాన్ని అనుమతించారు. జర్మనీల ఏకీకరణకు పరోక్షంగా సహక రించారు. ఆర్థిక రంగంలో పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), రాజకీయ రంగంలో గ్లాస్‌నోస్త్ (పారదర్శకత) విధానాలను అమలు చేశారు. సంస్కరణలను మరింత వేగవంతం చేయా లన్న ఎల్త్సిన్ తదితర ప్రజాస్వామిక వాదుల ఒత్తిడికి లొంగి ఒకేసారి సోవియట్ వ్యవస్థ తలుపులు, కిటికీలను బార్లా తెరిచేశారు. వీచే గాలుల ఉధ్ధృతికి తనను తాను నిభాయించుకోలేకపోయారు. పరిస్థితులను తన అదుపులో ఉంచుకుంటూ నెమ్మది నెమ్మదిగా తలకెత్తుకోవలసిన సంస్కరణలను ఒక్కసారిగా చేపట్టారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వాదిగా తానే మిగిలిపోవాలన్న దుగ్ధతో సంప్రదాయ కమ్యూని స్టులకు దూరమయ్యారు. ఇటు ప్రజాస్వామికవాదులకు గోర్బచెవ్ కంటే ఎల్త్సిన్లోనే సమర్థుడైన నాయకుడు కనిపిం చాడు. గోర్బచెవ్ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారింది. పశ్చిమ దేశాల్లో శాంతిదూత అనే ఇమేజ్ సంపాదించినప్పటికీ, స్వదేశంలో అసమర్థుడిగా ముద్రపడింది. సోవియట్ యూని యన్ పతనాన్ని ఆయన కోరుకోలేదు. ఆర్థిక పునరుజ్జీవనం కోసం మార్కెట్ శక్తులను ఒక మేరకు అనుమతించాలను కున్నారు. సోషలిస్టు వ్యవస్థలోనే ప్రజాస్వామిక సంప్రదా యాలను పాటించాలనుకున్నారు. కమ్యూనిస్టు పార్టీని సోషల్ డెమోక్రాటిక్ పార్టీగా నడపాలని భావించారు. నిర్వహణా దక్షత లేక అధికారానికి దూరమై ముప్పయ్యేళ్లపాటు పత్రికలకు వ్యాసాలు, పుస్తకాలు రాసుకుంటూ గడిపేశారు. తన చర్యల ఫలితంగా ఎల్త్సిన్లూ, పుతిన్లూ పుట్టుకొచ్చి రాజ్యమేలుతుంటే మౌనంగా గమనించారు. ఇరవయ్యో శతాబ్దంలో చరిత్రను మలుపుతిప్పిన కీలక పరిణామానికి శ్రీకారం చుట్టిన మహా సంస్కరణవాది అంత్యక్రియలకు అధికార లాంఛనాలు కూడా దక్కలేదు. ఈనెల పదిహేడో తేదీ కోసం తెలంగాణలో ఒక రాజకీయ జాతర కార్యక్రమం రూపుదిద్దుకుంటున్నది. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమై 74 సంవత్స రాలైంది. ఇప్పుడు ఏడాది పొడవునా కేంద్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలు జరుపబోతున్నదట! రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పొడుగునా వజ్రోత్సవాలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది. అసదుద్దీన్ ఒవైసీ సూచన మేరకు జాతీయ సమైక్యతా ఉత్సవాలుగా నామకరణం చేసింది. ఇంతకుముందు రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు వచ్చిపోయాయి గానీ, ఇంత హడావిడి గతంలో ఎప్పుడూ లేదు. కాలం గడిచిపోతున్నకొద్దీ ఉత్సవ సంరంభాలు తగ్గుముఖం పడతాయి కానీ పెరగడ మన్నదే ఒక వింత. ఇదే రాజకీయ వింత! విలీనానికి ‘విమోచనం’ అనే పేరుపెట్టి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని రాజకీయ పరిశీలకుల అభి ప్రాయం. స్వాతంత్య్రం రాకముందు దాదాపు 500 సంస్థానాలు బ్రిటీష్ వారి అనుమతితోనే స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. అందులో చాలావరకు చిన్నచిన్న సంస్థానాలు. హైదరాబాద్, కశ్మీర్ మాత్రమే పెద్ద రాజ్యాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయవలసిన అవసరం ఏర్పడింది. విలీనానికి సిద్ధంగా లేని హైదరాబాద్ సంస్థానంపై కేంద్రం ‘పోలీస్ చర్య’ జరిపి విలీనం చేసుకున్నది. ‘విమోచనం’ అనే మాట వచ్చినప్పుడు ఎవరి నుంచి అనే ప్రశ్న వస్తుంది. నిజాం రాజు పరాయి దేశ పాలకుడు కాదు. ఏడెనిమిది తరాలపాటు ఇక్కడే పుట్టి పెరిగిన అసఫ్‌జాహీ వంశస్థుడు. పది తరాలకు ముందు ఇప్పటి ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చిన ఒక పండితుడు షాజహాన్ దగ్గర కొలువులో చేరాడు. క్రమంగా దక్కన్ రాజప్రతినిధులుగా మారి, ఔరంగజేబు మరణం తర్వాత స్వతంత్రరాజులయ్యారు. ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో చెలరేగిన రజాకార్ మూకలను అదుపులో పెట్టడంలో ఆయన విఫలమయ్యారు తప్ప స్వయంగా ఆయన మతసహనం లేనివాడు అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. అనేక దేవాల యాలు కట్టించాడనే పేరు కూడా ఉన్నది. ఆ రోజుల్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకే ఐదు లక్షలు విరాళంగా ఇచ్చి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి మాత్రం పది లక్షలు విరాళ మిచ్చాడు. ఇందులో జనాభానూ, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకున్నాడే తప్ప మతాన్ని ఆయన చూడలేదు. విద్య, వైద్య రంగాల్లో ఆయన వేసిన పునాదులను కూడా విస్మరించలేము. ఒక ఫ్యూడల్ వ్యవస్థకు అధిపతి నిజాం ప్రభువు. ఈ వ్యవస్థ ప్రతినిధులుగా దొరలు, దేశ్‌ముఖ్‌లు గ్రామసీమల్లో చేసిన అరాచకం, దోపిడీ అంతా ఇంతా కాదు. రైతాంగాన్ని పీల్చి పిప్పిచేశారు. దిగువ శూద్రుల్ని వెట్టి బానిసలుగా మార్చివేశారు. ఈ అమానుషత్వానికీ, దోపిడీకీ వ్యతిరేకంగానే కమ్యూనిస్టుల (సంఘం) ఆధ్వర్యంలో రైతుకూలీలు జరిపిన సాయుధ పోరాటం దేశచరిత్రలో సాటిలేని ఒక ఉజ్జ్వల ఘట్టం. హైదరాబాద్‌పై ‘పోలీస్ చర్య’ జరిగేనాటికి సాయుధ రైతాంగ దళాలు మూడువేల గ్రామాలను భూస్వాముల పీడన నుంచి విడిపించాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి ఉంటే ‘విమోచనం’ అనే మాటకు అర్థం ఉండేది. కానీ, ‘పోలీసు చర్య’ తర్వాత యూనియన్ సైన్యాలు భూస్వాములను మళ్లీ గ్రామాల్లో ప్రతిష్ఠించాయి. తీవ్రత తగ్గినా దోపిడీ కొనసాగింది. అధికార బదిలీ మాత్రమే జరిగింది తప్ప ప్రజలకు ఏ రకమైన విముక్తీ లభించలేదని ఈ పరిణామం స్పష్టం చేసింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో కమ్యూనిస్టులూ, మిగిలిన తెలంగాణాతో పాటు మరాఠా, కన్నడ జిల్లాల్లో స్టేట్ కాంగ్రెస్ పార్టీ, ఆర్యసమాజ్‌లు నాడు నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నాయి. ఈ పోరాటాల్లో హిందువులతో పాటు ముస్లింలు కూడా పెద్దయెత్తున పాల్గొ న్నారు. నిజాం ప్రభువు ముస్లిం మతస్థుడు కనుక ‘విమోచనం’ అనే పదాన్ని పదేపదే వాడటం వల్ల భావోద్వేగాలు తలెత్తి రాజకీయంగా వర్కవుట్ కావచ్చన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తున్నది. నిజానికి బీజేపీ కానీ, దాని పూర్వరూపమైన ‘జనసంఘ్’ గానీ పోలీస్ చర్య జరిగేనాటికి పుట్టలేదు. బీజేపీకి దీటుగా ఉత్సవాలను తలకెత్తుకోబోతున్న టీఆర్ఎస్ కూడా అప్పుడు పుట్టలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలివిగా ఈ తాజా ఎజెండాను బీజేపీ తలకెత్తుకున్నది. రాజకీయ పరిశీలకుల అంచనాల మేరకు నెలరోజుల కిందటి వరకు తెలంగాణలో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆ పార్టీకి కూడా కొత్తగా బలం పెరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న దాఖలాలు కూడా లేవు. ఆశ్చర్యకరంగా అనిశ్చిత ఓటర్ల (ఎటూ తేల్చుకోని) సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నదని కొన్ని అనధికార సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ ఓటర్లే ఎక్కువ. ఉపఎన్నిక వాకిట్లో ఉన్న మునుగోడులోనే ఇరవై శాతానికి పైగా అనిశ్చిత ఓటర్లున్నారని అంచనా. కాంగ్రెస్ పార్టీ ఏదైనా అద్భుతాన్ని సృష్టించగలిగితేనే అనిశ్చిత ఓటర్లు అటువైపు మొగ్గుతారు. నిజాం పాలనలో పోరాటాలు జరిపిన కాంగ్రెస్–కామ్రేడ్స్ కళ్లప్పగించి చూస్తుండగానే అదే అంశంపై బీజేపీ – టీఆర్ఎస్లు తలపడటం ఎన్నికల ఎత్తుగడగానే పరిగణించాలి. ‘సెప్టెంబర్ 17’ సాక్షిగా సెమీ ఫైనల్ దశ నుంచి ఫైనల్స్‌లో అడుగు పెట్టా లని బీజేపీ సన్నాహాలు చేస్తున్నది. భావోద్వేగాల ద్వారా అని శ్చిత ఓటర్లను గెలవాలని అది వలవేస్తున్నది. లౌకిక బాణంతో ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా అద్భుతాన్ని సృష్టిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న. అటువంటి అద్భుతం జరగకపోతే మాత్రం కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రయాణాలు అసమర్థుల జీవయాత్రలుగానే మిగిలిపోతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’
సాక్షి,సంస్థాన్ నారాయణపురం: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నెలరోజుల్లో పడిపోతుంది.. సీఎం కేసీఆర్ కుటుంబం దాచుకున్న డబ్బులు బయటకు వస్తాయి’.. అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూసుకుంట్ల, గీసుకుంట్ల కాకుండా దమ్ముంటే సీఎం కేసీఆర్ మునుగోడులో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపఎన్నిక తనది కాదని, మునుగోడు ప్రజల ఎన్నిక.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటికి తులం బంగారం ఇచ్చినా టీఆర్ఎస్ గెలవదని ఆయన స్పష్టం చేశారు. -
మునుగుడా? తేలుడా?
మునుగోడులో కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పెద్ద సభను నిర్వహిస్తే, ఆ మరుసటి రోజు బీజేపీ కూడా పెద్ద సభ జరిపింది. మునుగోడులో కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సందర్భంగా స్వయంగా అమిత్ షా హాజరు కావడం... ఈ ఉప ఎన్నికకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం అవుతోంది. ఎన్నిక ప్రకటన రాకముందే కేసీఆర్ సభ పెట్టడం కూడా దీనికి మరో ఉదాహరణ. ఇక కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు, లక్ష మంది కాళ్లకు మొక్కడం వంటి కార్యక్రమాల ద్వారా తన పట్టు నిలబెట్టుకోవాలని విశ్వయత్నం చేస్తోంది. దీనిని పక్కనబెడితే కేసీఆర్, అమిత్ షా పోటీపోటీ ప్రసంగాలు ప్రజలకు ఏ సందేశాలు ఇచ్చాయో తెలుసుకోవడం ఆసక్తికరం. కేసీఆర్ ఎక్కువగా జాతీయ రాజకీయాలు, దేశంలో ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాల్సిన అవసరం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు వంటి అంశా లపై దృష్టి పెట్టారు. అమిత్ షా పూర్తిగా తెలంగాణ అంశాలకు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావించడానికి పరిమితం అయ్యారు. బీజేపీని గెలిపిస్తే తెలంగాణ ఆగమవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. అమిత్ షా తన ప్రసంగంలో రాజగోపాలరెడ్డి గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం అవుతుందన్నారు. అంటే వచ్చే ఎన్నిక లలో ఓడిస్తామనా, ఇంకేదైనా చేస్తామనా? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అయిందని షా ఆరోపించారు కానీ అదెలా జరిగిందో చెప్పలేదు. పైగా పార్లమెంటులో ఈ ప్రాజెక్టుపై ఆరోప ణలు లేవని చెప్పినా, మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం అవినీతి అంటూ విమర్శలు కురిపించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లే అని కేసీఆర్ చెప్పడం ఒక విధంగా బలహీనత. రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరిస్తున్నప్పుడు మీటర్లు పెడితే వచ్చే నష్టం ఏమిటి? కాకపోతే కేంద్రంపై ఆయన ఆరోపణ చేశారు. నిజానికి దీనిని ప్రతిపాదించిన కేంద్రం ఇప్పటికే వెనక్కి తగ్గింది. మోదీ సర్కారు ఈ అంశంలో ఓట్ల రాజకీయానికి భయపడి మీటర్లు పెట్టాలని తాము చెప్పడం లేదని పేర్కొంది. అమిత్ షా ఈ మీటర్ల వివాదంపై బహిరంగ సభలో చెప్పలేదు గానీ, రైతు నేతల భేటీలో వివరణ ఇచ్చారు. రైతుల పొలాల వద్ద కాకుండా విద్యుత్ సబ్ స్టేషన్ల దగ్గర వీటిని అమర్చాలని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇతర బీజేపీ నేతలు మాత్రం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కూడా ఇదే మాట టీఆర్ఎస్ చెప్పిందనీ, అయినా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారనీ అంటున్నారు. ఏడాదిలోనే ఎన్నికలు ఉండగా ఈ ఉప ఎన్నిక ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు ఉప ఎన్నికలకు కారణమైన టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారదలిస్తే పదవికి రాజీనామా చేయడం మంచి సంప్రదాయమే. దానిని రాజగోపాలరెడ్డి కూడా పాటించారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే భవిష్యత్తు తెలంగాణ రాజకీయం మారిపోతుందనీ, బీజేపీ ముఖ్యమంత్రి వస్తారనీ అమిత్ షా అన్నారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ అధికారాన్ని ఎలా సాధి స్తుందన్నది ప్రశ్న. రాజగోపాలరెడ్డి గెలిస్తే ఏకనాథ్ షిండేలను బీజేపీ తయారు చేస్తుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తుందనీ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనీ కేసీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో రెండు పార్టీలకూ పెద్ద తేడా ఉందని చెప్పజాలం. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో ఎలా విలీనం చేసుకున్నారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో రాజీనామాలు చేయించి బీజేపీ అధి కారాన్ని కైవసం చేసుకుంది. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలను విలీనం చేసుకుంది. అందువల్ల టీఆర్ఎస్, బీజేపీ రెండింటికీ ఈ అంశం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పక తప్పదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ ఒక్క మంచి పని అయినా చేసిందా అని కేసీఆర్ ప్రశ్నించడం కూడా రాజ కీయంలో భాగమే. మరి అలాంటి ప్రభుత్వానికి ఆయా సందర్భాలలో టీఆర్ఎస్ మద్దతు ఎలా ఇచ్చిందని అడిగితే సమాధానం దొరకదు. బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలను కేసీఆర్ మూడు తోకలతో పోల్చారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటివాటితో తనకు పడని పార్టీలను బీజేపీ భయ పెట్టాలని చూస్తోందనీ, కానీ తాను నిజాయితీగా ఉన్నందున తనను ఎవరూ ఏమీ చేయలేరనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు ఆయన గట్టిగానే చెబుతున్నా, ఏదో ఒక మూల కేంద్రంపై ఉన్న అను మానాలే ఆయనతో ఈ మాటలు అనిపిస్తున్నట్లుగా ఉంది. దానికి తగినట్లుగానే కేసీఆర్ కుమార్తె కవితపై బీజేపీ ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‌ను ఆరోపించింది. కవిత ఖండించినా, తర్వాత రోజుల్లో ఏమి అవు తుందో చెప్పలేం. నల్గొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించామనీ, ఎవరు అడ్డుపడ్డా రైతు బంధు ఆగదనీ చెప్పడం ద్వారా కేసీఆర్ ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. హుజూరాబాద్ అనుభవం రీత్యా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లుగా ఉంది. దానికి తోడు రాజ గోపాలరెడ్డి బలమైన అభ్యర్థి అవుతారు కనుక కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఉంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారన్న హామీ ఏమైందని అమిత్ షా అడిగారు. భవిష్యత్తులో కేటీఆర్‌ను చేస్తారు తప్ప, దళితుడిని చేయరని చెప్పారు. దేశంలో పెట్రోల్ ధర లను కేంద్రం తగ్గిస్తే తెలంగాణలో ఎందుకు తగ్గించలేదని అడిగారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న విమోచన దినం నిర్వహిస్తామనీ, మజ్లిస్‌కు టీఆర్ఎస్ భయపడుతోందనీ చెప్పడం ద్వారా అటు తెలంగాణ సెంటి మెంట్‌నూ, ఇటు హిందూ సెంటి మెంట్‌నూ షా ఒకేసారి ప్రయోగించారని అనుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే– కేసీఆర్, అమిత్ షా ఇద్దరూ కూడా కాంగ్రెస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని కేసీఆర్ అంటే, అమిత్ షా కాంగ్రెస్ ఊసే తేలేదు. మరో వైపు ఈ పరిణామాలను గమనిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే లక్షమందికి పాదాభివందనం కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. మరి కాళ్లు మొక్కడం ద్వారా విజయం సాధించగలుగుతారా అన్నది చెప్పలేం. వామపక్షా లైన సీపీఐ, సీపీఎంలను కేసీఆర్ కలుపుకొని వెళ్లడం కొత్త పరిణామం. జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణలో ఆ పార్టీలకు అక్కడ క్కడ ఉన్న బలాన్ని ఆయన వినియోగించదలిచారు. బీజేపీకి వ్యతి రేకంగా ఉండాలని భావించే వామపక్షాలు ఇందుకు సిద్ధం కావడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడైనా సీపీఐ, సీపీఎం నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లి ఆయా సమస్యలపై మాట్లాడగలిగారా? అంటూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పలు ప్రశ్నలు సంధించారు. అవి వామపక్షాలకు ఇబ్బంది కలిగించేవే అయినా, దేశ రాజకీయాలు, తెలంగాణలో పరిస్థితుల రీత్యా, వారికి ఇంతకన్నా గత్యంతరం ఉండకపోవచ్చు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనే టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని సీపీఐ తలపెట్టినప్పటికీ, ఆ సమయంలో ఆర్టీసీ సమ్మె అడ్డం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్తులో కూడా ఈ పార్టీలతో స్నేహం కొనసాగుతుందని ప్రకటించి తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలకు తెరదీశారు. పత్రికాధిపతి రామోజీరావు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికలలో సహకరించాలని ఆయన వీరిని కోరి ఉండవచ్చు. మొత్తం మీద ఈ కబాడి ఆటలో ఎవరు లైన్ టచ్ చేసి విజేతలు అవుతారో, ఎవరు కాళ్లు గుంజివేస్తారో అన్న ఉత్కంఠభరిత సన్నివేశాలకు మునుగోడు వేదిక కాబోతోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు తెలంగాణలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక తేదీ ప్రకటన వెలువడడానికి ముందుగానే రాజకీయ వేడి పెరిగిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ యథాశక్తి ఈ వేడి పెంచడంలో పోటీ పడుతున్నాయి. అందులోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో వైపు రంగంలోకి దిగడంతో ఎవరు విజేత అవుతారన్న ఉత్కంఠ ఏర్పడింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే – కేసీఆర్, అమిత్ షా ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని కేసీఆర్ అంటే, కాంగ్రెస్ ఊసే అమిత్ షా తేలేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్ లక్షమందికి పాదాభివందనం కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించింది. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మునుగోడుకు దూరం
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఝలక్ ఇచ్చారు. ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా ఎప్పుడూ పార్టీ అధిష్టానానికి సంపూర్ణ విధేయత ప్రకటించే ఆయన ఓరకంగా ధిక్కార స్వరాన్నే వినిపించారు. మునుగోడు ఉప ఎన్నికపై సోమవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన కీలక భేటీకి ఆయన గైర్హాజరు అయ్యారు. ఆ తర్వాత ఎందుకు హాజరు కాలేదో వివరిస్తూ సోనియాగాంధీకి లేఖ పంపారు. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లలేనని అందులో స్పష్టం చేశారు. పార్టీ లోని కొందరు తనను అవమానపరుస్తున్నారని, పార్టీ కోసం మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న తనలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వైఖరి తనకు మనస్తాపాన్ని కలిగించిదని పేర్కొన్నారు. కాగా సోనియాగాంధీకి కోమటిరెడ్డి రెండు లేఖలు పంపారని, ఒక లేఖ బహిర్గతం కాగా మరో లేఖను గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. బహిర్గతమైన లేఖలో రేవంత్ వైఖరి కారణంగా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వెంకట్‌రెడ్డి కూలంకషంగా వివరించారని సమాచారం. పార్టీలో పరిణామాలన్నీ అర్థమయ్యే విధంగా రాసిన ఈ లేఖలో.. తెలంగాణ పార్టీలో జరగాల్సిన అంతర్గత మార్పుల గురించి కూడా ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది. బహిర్గతమైన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పార్టీకి విధేయుడిగానే కొనసాగుతాను కానీ.. ‘ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తాను. అయితే కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో పార్టీలోని కొన్ని వర్గాలు కావాలని నన్ను అవమానించడంతో పాటు పనికట్టుకుని దాడులు చేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్న నన్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం మనస్తాపాన్ని కలిగిస్తోంది. పార్టీలో కొత్తగా చేరినప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించారు. నేను పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆయనకు పూర్తి సహకారం అందించడంతో పాటు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. కానీ రేవంత్‌రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులు నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. రోజురోజుకూ నాపై పెరుగుతున్న ఈ దాడులు.. పార్టీపై తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. గతంలో ఆయన నాకు చెప్పిన క్షమాపణలను కూడా నేను అంగీకరించాను. కానీ మళ్లీ నాతో పాటు ఇతర సీనియర్లను అవమానించడం వారికి పరిపాటిగా మారింది. నన్ను హోంగార్డులుతో పోల్చిన ఆయన తనకు తాను డైరెక్ట్ రిక్రూటీ ఐపీఎస్‌గా చెప్పుకున్నారు. నేను పార్టీ విధేయుడిగానే కొనసాగుతాను. కానీ నా పట్ల అవలంబిస్తున్న అవమానపూరిత వైఖరి కారణంగా నేను మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ సమావేశానికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.’ అని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. వాళ్లతోనే ప్రచారం చేయించుకోండి: కోమటిరెడ్డి ఢిల్లీలో భేటీకి గైర్హాజరై హైదరాబాద్ వచ్చిన కోమటిరెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వాళ్లను గుర్తించకుండా నాలుగు పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, తెలంగాణ కోసం కొట్లాడిన తనలాంటి వారిని పట్టించుకోకుండా హడావుడి చేసే వాళ్లను గుర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీ విషయంలో మాణిక్యం ఠాగూర్ దొంగనాటకాలాడుతున్నారని, పార్టీ కార్యకర్తలకు అవమానం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి వైఖరి కారణంగానే తెలంగాణలో పార్టీ సర్వనాశనం అయిందని, దానికి ప్రతిఫలంగానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ప్రచారం చేసిన వాళ్లతోనే మునుగోడులోనూ ప్రచారం చేయించుకోవాలని అన్నారు. మాణిక్యం ఠాగూర్‌ను మార్చాలన్నారు. ఆయన స్థానంలో కమల్‌నాథ్ లాంటి నేతలను రాష్ట్ర పార్టీ ఇన్చార్జులుగా పంపాలనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి వ్యక్తం చేశారు. మరోసారి పార్టీ నేతలందరి అభిప్రాయాలను తీసుకుని కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుందని స్పష్టం చేశారు. -
ఇప్పుడు వీస్తున్న గాలి
ఎన్నికలే గీటురాయిగా నిలిచే ప్రజాస్వామ్యంలో చాలా సందర్భాల్లో ఉప ఎన్నికలను కొంత తేలిగ్గా తీసుకోవడం కద్దు. కానీ, కొన్ని సందర్భాల్లో ఈ ఉప పోరాటాలే తర్వాత రానున్న ప్రధాన ఎన్నికల యుద్ధానికి సూచికలుగా పనికొస్తాయి. అలా చూసినప్పుడు ఆదివారం నాటి ఉపఎన్నికల ఫలితాలు ప్రత్యేకమైనవి. దేశంలోని రెండు రాష్ట్రాల్లో 3 లోక్‌సభా స్థానాలకూ, నాలుగు రాష్ట్రాల్లో 7 శాసనసభా స్థానాలకూ జరిగిన పోరు చిన్నదైనా, ఫలితాలు అనేక అంశాలను చాటి చెబుతున్నాయి. మూడు పార్లమెంట్ స్థానాల్లో రెంటిని బీజేపీ గెలుచుకోవడం విశేషం. త్రిపురలోనూ కాషాయ పార్టీ తన హవా చాటింది. త్రిపురలో సీపీఎం, పంజాబ్‌లో ‘ఆప్’, యూపీలో ఎస్పీ – ఇలా ప్రతిపక్షాలకు చేదు అనుభవం మిగిలింది. త్రిపుర, జార్ఖండ్‌లలో ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్, ఢిల్లీలో ఒక స్థానాన్ని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) దక్కించుకోవడమే ప్రతిపక్షాలకు ఊరట. కేంద్రంలోని అధికారపక్షంపై పోరా టంలో కలిసున్నామని పైకి చెబుతున్నా, ఆచరణలో మాత్రం ప్రతిపక్షాల్లో ఐక్యత, ప్రణాళిక లేవని ఈ ఫలితాలు ఎరుకపరుస్తున్నాయి. పాలక బీజేపీ ప్రతిపక్షానికి అందనంత ఎత్తున ఉందనీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే పెను సవాలు విసురుతోందనీ తేటతెల్లం చేస్తున్నాయి. దేశ రాజ కీయ రణక్షేత్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా తయారైందన్న ఈ సూచన ప్రతిపక్షానికి దుర్వార్తే! మొత్తం 542 సభ్యుల లోక్‌సభకు 80 మంది సభ్యులను పంపుతూ, రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమున్న ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాలనూ బీజేపీయే గెలుచుకుంది. ఇది ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి పెద్ద దెబ్బ. పైపెచ్చు, రామ్‌పూర్, ఆజమ్గఢ్ స్థానాలు రెండూ అగ్ర నేతలైన ఎస్పీ అధినేత ములాయమ్ సింగ్ యాదవ్, ఆజమ్‌ఖాన్‌లు ఖాళీ చేసినవి కావడం గమనార్హం. దాదాపు 50 శాతం పైగా ముస్లిమ్ జనాభా ఉండే రామ్‌పూర్‌లో, 40 శాతం పైన ముస్లిమ్‌లు – యాదవులు ఉండే ఆజమ్‌గఢ్‌లో బీజేపీ గెలవడం మారుతున్న సరళికి సూచన అని విశ్లేషకుల మాట. ‘ప్రధాని మోదీ సారథ్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ మీద ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రొమ్ము విరుస్తుంటే... ‘పోలీసు – అధికార యంత్రాంగ దుర్వినియోగం, ఆజమ్‌గఢ్‌లో బీజేపీ – బీఎస్పీల లోపాయకారీ కూటమి వల్లే రెండు స్థానాల్లో ఓడిపోయాం’ అని ఎస్పీ ఆరోపిస్తోంది. ఆజమ్‌గఢ్‌లో సాక్షాత్తూ ఎస్పీ అధినేత అఖిలేశ్ సమీప బంధువైన ధర్మేంద్ర యాదవ్ పరాజయం పాలవడం విశేషం. కొద్ది నెలల క్రితం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన మరో బీజేపీ వ్యతిరేక పక్షం ‘ఆప్’కు సైతం తాజా ఉప ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తనకు కంచుకోట లాంటి సంగ్రూర్ లోక్‌సభా స్థానాన్ని పోగొట్టుకుంది. ప్రస్తుత పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను గతంలో రెండుసార్లు గెలిపించి, పార్లమెంట్‌కు పంపిన స్థానం అది. తీరా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఆ స్థానాన్ని ప్రతిపక్షానికి కోల్పోయింది. శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ), కాంగ్రెస్, బీజేపీ – ఇలా ప్రత్యర్థులంతా విడివిడిగా బరిలోకి దిగినా, ‘ఆప్’ ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోవడం విచిత్రం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని మబ్బును చూసి ముంత ఒలకబోసుకుంటున్న ‘ఆప్’కు ఇది షాక్. 18 ఏళ్ళుగా లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ, అందరూ కొట్టిపారేసిన అతివాద రాజకీయ నేత, ఎస్ఎడీ (అమృత్సర్) అధ్యక్షుడు సిమ్రన్ జిత్ సింగ్ మాన్ అదే స్థానం నుంచి గెలిచి, ఫీనిక్స్ పక్షిలా పైకి లేవడం ఆశ్చర్యకరం. ఇక మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీయే మళ్ళీ విజయ దుందుభి మోగించింది. ప్రతిపక్షాల కడుపు మంట ఎలా ఉన్నా, అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాతా ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం విశేషం. వైఎస్సార్సీపీకి ప్రజాక్షేత్రంలో ఉన్న అనుకూల వాతావరణానికి అది సూచిక. మొత్తం మీద తాజా ఉప ఎన్నికలు ఎక్కడికక్కడ స్పష్టమైన సూచనలే ఇచ్చాయి. ప్రతి ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని గుర్తు చేశాయి. పార్ట్ టైమ్ రాజకీయాలు చేద్దామనుకుంటే ప్రతిపక్షాలకు మనుగడ లేదని స్పష్టం చేశాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొని, ప్రత్యర్థుల కంచుకోట లను సైతం కైవసం చేసుకొని, ఓటరు పునాదిని విస్తరించుకోవాలనే పట్టుదల, కాంక్ష కీలకం. అది బీజేపీలో ఉన్నంతగా యూపీఏ పక్షాలలో మృగ్యమని మరోసారి రుజువైంది. అలాగే, కేంద్రంలోని అధికార బీజేపీకి దేశంలో అనుకూల వాతావరణం ఉందనే అభిప్రాయాన్ని కల్పించడంలో తాజా ఉప ఎన్నికలు సఫలమయ్యాయి. ఒక రకంగా ఇది అధికార పార్టీ విజయమైతే, అంతకు మించి ప్రతిపక్షాల పూర్తి వైఫల్యం. వరస చూస్తుంటే, వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి కూడా ప్రతిపక్షాలు సరిగ్గా సిద్ధమవుతున్న దాఖలాలు లేవు. మమతా బెనర్జీ నుంచి కేసీఆర్ దాకా జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి సారథ్యానికి పోటీదారులే ఎక్కువ. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి, నిలువరించే ఐక్య కార్యాచరణతో అందరినీ కలుపుకొనిపోయేవారు కనిపించడం లేదన్నది నిష్ఠురసత్యం. తాజా రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం సమైక్యత సాధించలేక పోయిన ప్రతిపక్షాలు సత్వరం ఆత్మపరిశీలనలోకి దిగడం ఉత్తమం. ప్రతిపక్ష సారథి హోదా నుంచి కాంగ్రెస్‌ను కిందకు లాగే పీతలబుట్ట ధోరణి బదులు నిర్దిష్ట అజెండాతో ప్రజలతో మమేకమయ్యే పనిలో నిమగ్నమైతే ఉపయోగం. లేదంటే ఈ బీజేపీ గాలిని అడ్డుకోవడం అసాధ్యమే! -
Huzurabad: ‘సాగర్’ ఫార్మూలాతో ఈటలకు చెక్.. బాస్ ప్లాన్ ఇదేనా?
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. గులాబీ దళపతి మదిలో ఎవరున్నారు?.. పార్టీ టిక్కెట్ ఎవరికి దక్కనుందనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ముద్దసాని దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ దక్కనుందా లేక బీసీలకే అవకాశం రానుందా? అవసరమనుకుంటే జంప్ జిలానీల వైపు కారు పార్టీ మొగ్గుచూపుతుందా? అంటే, ఎవ్వరికీ అంతుచిక్కడం లేదనే సమాధానం వస్తుంది. అయితే డజన్‌కు పైగా అశావాహులు పోటీలో ఉన్నప్పటికీ.. బీ ఫామ్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ గూటికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపిలో చేరడంతో ఉత్పన్నమవుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండి మంత్రిగా కొనసాగిన ఈటల, రాజీనామా చేసి బీజేపిలో చేరి ఏడో సారి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపి అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు. ఆత్మ గౌరవం పేరుతో బరిలో నిలుస్తున్న ఈటలను ఢీ కొట్టేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి వెతుకులాటలో పడింది. ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈటల బలం, బలహీనతలను బేరీజు వేసుకుంటు రాజకీయంగా దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈటలపై పోటీ చేసేందుకు అశావాహులు జాబితా రోజురోజుకు పెరుగుతుంది. డజన్‌కు పైగా మంది ఇప్పటికే తమ పేరును పరిశీలించాలని కోరుతున్నప్పటికి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సామాజిక, రాజకీయ అంశాలతోపాటు స్థానికత, యువతను పరిగణనలోకి తీసుకుని ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్, ఇతర పార్టీల నేతల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ ఫైవ్‌లో మాత్రం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి లేదా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వేములవాడ టెంపుల్ అథారిటి వైస్ చైర్మెన్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దామోదర్‌రెడ్డి ఇమేజ్, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, నియోజకవర్గంలోని మామిడాలపల్లికి చెందిన స్థానికుడు, టీఆర్ఎస్ బ్రాండ్ కలిస్తే విజయం సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పురుషోత్తమ్ రెడ్డికి పరిపాలన పరమైన అనుభవం ఉన్నా, రాజకీయ పరమైన అనుభవం లేదు. ఇక అదే ఇంటి నుంచి దామోదర్ రెడ్డి తనయుడు కాశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరి పోటీకి సిద్ధమవుతున్నారు. కాశ్యప్ రెడ్డి 2014లో ఈటలపై టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ కుటుంబం నుంచి కాకుంటే కేసీఆర్ రాజకీయంగా ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన కెప్టెన్ కుటుంబంలో వొడితెల రాజేశ్వర్ రావు మనువడు ప్రణవ్ బాబు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు కుటుంబాలను కాదనుకుంటే బీసీ అయిన ఈటలను మరో బీసీ నేతతో ఢీకొట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. రమణ కాదంటే ఆ స్థాయిలో ఉన్న బీసీ నేత టీసీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ను సైతం పార్టీలోకి అహ్వానించి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పొన్నం ఇమేజ్, విపక్షాలు చేసే విమర్శలకు దీటైన సమాధానం చెప్పే సత్తా ఉన్న నాయకుడిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాలు సామాజిక అంశం ప్రక్కన పెడితే మాజీ ఎంపీ వినోద్, కాంగ్రెస్‌లో ఉన్న ప్రవీణ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్‌లో అమలు చేసే పనిలో గులాబీ దళపతి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సాగర్‌లో రాజకీయ అనుభవం లేని నోముల భగత్ బరిలో నిలిపి, సీఎం స్థాయి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి తీసుకువచ్చారు. అలాంటి పరిస్థితి రాజేందర్‌కు రావాలంటే హుజురాబాద్ ఉపఎన్నికలో రాజకీయంగా అనుభవం లేని వారిని బరిలో నిలిపి విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చదవండి: Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? ‘ఈటలకు తొలిరోజే అవమానం’ -
‘ఉప’ ఫలితాలతో ఉత్సాహం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా బీజేపీకి, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్ ఫలితాలు బీజేపీని బాగా సంతోషపరిచాయి. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలను చేజిక్కించుకోవడం ఆ రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలనిచ్చింది. ఆ పార్టీ బలం ఒక్కసారిగా 126కి పెరిగింది. కరోనా వైరస్ దేశమంతా అలుముకున్న తొలి దినాల్లో... అంటే మొన్న మార్చిలో అక్కడ రాజకీయ సంక్షోభం రాజుకుని జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌నుంచి బయటికొచ్చారు. దాంతో అప్పటికి 15 నెలలుగా అధికారంలో కమల్‌నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కొనడానికి ముందే రాజీనామా చేసింది. బీజేపీ సీనియర్ నేత శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 107మంది సభ్యుల బలంతో అప్పటినుంచీ అది నెట్టుకొస్తోంది. రాజీనామాలవల్ల, ఇతరత్రా కారణాలతో మొత్తం 28 స్థానాలు ఖాళీ కాగా వాటికి గత నెలలో ఉప ఎన్నికలు జరిగాయి. తగినంత బలం లేకున్నా పాలన సాగించవలసి వస్తోంది గనుక శివరాజ్ సింగ్ చౌహాన్ తరచు తనను తాను ‘తాత్కాలిక సీఎం’గా చెప్పుకునేవారు. 2005 నుంచి 2018 వరకూ పాలించిన చౌహాన్‌కు ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అయితే నెగ్గినవారిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి పార్టీలోకొచ్చిన జ్యోతిరా దిత్య సింథియా అనుయాయులు. వారు పార్టీ కన్నా జ్యోతిరాదిత్యకే విశ్వాసపాత్రులుగా వుంటారు. కనుక చౌహాన్‌పై మున్ముందు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. గతంలో ఆయనది ఏకచ్ఛత్రాధిపత్యం. ఈ ఉప ఎన్నికలు ఇటు జ్యోతిరాదిత్యకూ, అటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌కూ పెద్ద పరీక్షగా మారాయి. తన అనుచర గణాన్ని గెలిపించుకోలేకపోతే బీజేపీలో జ్యోతిరాదిత్య స్థానం బలపడదు. అలాగే ఇన్నాళ్లూ జ్యోతిరాది త్యకు పార్టీ బలమే తప్ప సొంత బలమేమీ లేదని చెబుతూ వస్తున్న కమల్‌నాథ్‌పై దాన్ని నిరూపించ వలసిన భారం పడింది. అందువల్లే ఉప ఎన్నికల ఫలితాలతో ఆయన డీలా పడ్డారు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో తనకు రాజకీయంగా పట్టుందని జ్యోతిరాదిత్య రుజువు చేసుకున్నారు. మరో 9 స్థానాల్లో ఫిరాయింపుదార్లను ఓడించి, విజయం సాధించడమే కాంగ్రెస్‌కు ఉన్నంతలో ఓదార్పు. అచ్చం మధ్యప్రదేశ్ తరహాలోనే గుజరాత్లో కూడా 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఫిరాయించారు. వారిలో అయిదుగురికి ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు లభించాయి. తాజాగా ఈ ఎనిమిదిచోట్లా కాంగ్రెస్ ఓడిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్తెసరు మెజారిటీయే లభించింది. 182మంది సభ్యుల అసెంబ్లీలో 1995 తర్వాత తొలిసారి ఆ పార్టీ బలం 99కి పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘకాలం సీఎంగా పనిచేసిన బీజేపీకి ఇది భంగ పాటే. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలు గెల్చుకుంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేనాటికి సీఎం విజయ్ రూపానీని మార్చే అవకాశం వుందన్న కథనాలు వెలువడుతున్న దశలో అన్ని స్థానా లనూ పార్టీ గెల్చుకోవడం రూపానీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. మణిపూర్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి అయిదుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ నాలుగు గెల్చుకోగా, మరోచోట ఇండిపెండెంట్ అభ్యర్థి నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఆరింటిని బీజేపీ గెల్చుకుంది. ఒక చోట సమాజ్‌వాదీ పార్టీ స్వల్ప ఆధిక్యతతో సీటు నిలబెట్టుకుంది. అత్యాచారం, హత్య కేసుల్లో శిక్ష అను భవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ నేతృత్వంవహించిన బంగార్మవ్ నియోజక వర్గంలో సైతం బీజేపీ అభ్యర్థే విజయం సాధించారు. హథ్రాస్‌లో యువతిపై అత్యాచారం, ఆమె భౌతి కకాయానికి అర్థరాత్రి పోలీసులే అంత్యక్రియలు జరపడం వంటి ఘటనల ప్రభావం ఉప ఎన్నికలపై కనబడకపోవడం గమనించదగ్గది. ఉత్తరప్రదేశ్ ఫలితాలకు విపక్షాల బాధ్యత కూడా వుంది. ఈ ఏడు చోట్లా నేరుగా యోగి ఆదిత్యనాథ్ సభలూ, సమావేశాలూ నిర్వహించారు. మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియింకగాంధీ ఒక్కచోట కూడా ప్రచారానికి వెళ్లలేదు. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక స్థానాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుంది. అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఉన్నంతలో ఛత్తీస్‌గఢ్, హరియాణాల్లో రెండు స్థానాలు, జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి రెండు స్థానాలు గెల్చుకోవడం మాత్రమే కాంగ్రెస్‌కు ఊరట. అయితే జార్ఖండ్‌లో అటు జేఎంఎంకూ, ఇటు కాంగ్రెస్‌కూ గతంలోకన్నా మెజారిటీ బాగా తగ్గడం ఆందోళన కలిగించే అంశమే. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన సాగు బిల్లులపై ఆందోళన జరుగుతున్న హరియాణాలో బరోడా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ–జేజేపీ ఉమ్మడి అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన రెండు ఉప ఎన్ని కల్లోనూ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాలకూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ చాలా వ్యత్యాసం వుంటుంది. సాధా రణంగా ఉప ఎన్నికలు వాటికవే ఒక ధోరణిని ప్రతిబింబించవు. ఎక్కువ సందర్భాల్లో ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వుండే అధికార పక్షాలకు అనుకూలంగా వుండే అవకాశం వున్నా అభ్యర్థి ఎంపిక మొదలుకొని అతి విశ్వాసం వరకూ... స్థానిక సమస్యలతో మొదలుపెట్టి కుల సమీకరణాల వరకూ ఎన్నెన్నో అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాల్లో ఎక్కడ లెక్క తప్పినా పార్టీలకు సమస్యలెదురవుతాయి. అధికారంలో వున్న పక్షం నగుబాటుపాలవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్ని కలో, మరో ఎన్నికలో వచ్చే అవకాశం వుంటే ఈ ఫలితాలను చూపి భవిష్యత్తు తమదేనని శ్రేణులకు చెప్పుకోవడానికి ఏ పార్టీకైనా అవకాశం వుంటుంది. అందుకే అధికారంలో వున్న పార్టీ ఉప ఎన్నికల్లో సర్వశక్తులూ కేంద్రీకరిస్తుంది. మొత్తానికి ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు నిరాశ మిగల్చగా, బీజేపీకి ఉత్సాహాన్నిచ్చాయి. -
దుబ్బాక తీర్పు నేడే
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక విజేతలెవరో నేడు తేలిపోనుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా యి. ఈ నెల 3న పోలింగ్ జరగ్గా మంగళవా రం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది. రసవత్తరంగా పోటీ... అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కూడా దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నిక రెఫరెండంగా ఉంటుం దని రాజకీయ వర్గాలు చెబుతుండగా తెలంగాణలో బలం పుంజుకుంటోందని రుజువు చేసుకొనేందుకు బీజేపీకి, క్షేత్రస్థాయిలో తమ బలం చెక్కు చెదరలేదని చాటేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితం కీలకంగా మారింది. నేతల లెక్కలు.. ఫలితంపై వివిధ ఏజెన్సీలు, రాజకీయ ప్రముఖులు, సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలు అభ్యర్థులతోపాటు రాజకీయ నాయకుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు ముందుగా ఒక రకమైన వాతావరణం ఉండగా పోలింగ్ తర్వాత మరో తీరుగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంకన్నా మెజారిటీ కాస్త తగ్గొచ్చని భావిస్తున్నారు. 15 వేలలోపు మెజారిటీతో గెలుస్తామని టీఆర్ఎస్లోని కీలక నాయకులు పేర్కొనడం గమనార్హం. మరోవైపు సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని తమ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు ఖాయమని కమలదళం నేతలు అంటున్నారు. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓటు బ్యాంకు తమకుందని చెబుతోంది. ముత్యంరెడ్డిపై సానుభూతి అనుకూలించిందని, గతంతో పోలిస్తే మెజారిటీ ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. రెండో స్థానం కీలకమై.. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎంత కీలకమో రెండో స్థానం కూడా అంతే కీలకంగా మారింది. గతంలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2009లో సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరకు 2,640 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై 62,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా మూడు పర్యాయాలు పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. మూడో స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు మెజారిటీ ఓట్లు సాధిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే రెండో స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం కాంగ్రెస్, సత్తా చాటి ముందు వరుసలో ఉండేందుకు బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. -
'దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయం'
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'దుబ్బాక నుంచి నాయకులు ,కార్యకర్తలు ఇచ్చిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ అహంకారాన్ని దెబ్బకొట్టాలనే 81 శాతం ఓటింగ్ పొలైంది. దుబ్బాక లో బీజేపీ విజయం సాధించబోతుంది.ఇన్ని రోజులు అవస్తవాలను వాస్తవాలుగా చిత్రికరిస్తూ టీఆర్ఎస్ అబద్ధాలు చెప్తూ వచ్చింది. అసలు దుబ్బాకలో అభివృద్ధి జరగలేదు. టీఆర్ఎస్ పార్టీ పై ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఓటర్లు ఆలోచించరు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా బీజేపీకి కలిసి వస్తుంది. ఒక కార్యకర్త తెలిసీ తెలియక ఆత్మహత్య చేసుకుంటే మంత్రులు ఏమాత్రం బుద్ధి లేకుండా 'వాడు' అనే మాటలు మాట్లాడుతున్నారు.హోటల్ లో జరిగింది తోపులాట మాత్రమే ఒక శాసన సభ్యుడు ఇలా పిర్యాదు చేయడం మంచిది కాదు. నిన్న జరిగిన ఘటనను టీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నో కుట్రలు,కుతంత్రాలు పాల్పడడంతో పాటు డబ్బులు కూడా విచ్చలవిడిగా పంచారు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో సానుభూతి, సెంటిమెంట్ అబద్ధాలతోనే గెలిచింది. (చదవండి : ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్) దుబ్బాకకు రావాల్సిన నిధులు దారి మళ్లించారు. దుబ్బాక ప్రజలంతా రఘునందన్ రావునే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దుబ్బాక లో ఓటుకు 5వేల నుంచి 10 వేల వరకు టార్గెట్ పెట్టుకొని మరీ పంచినట్లు సమాచారం అందింది. దుబ్బాక ప్రజలు నిజాయితీ పరులు.. వారు ఇచ్చిన డబ్బు తీసుకున్న బీజేపీకే ఓట్లు వేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ప్రత్యేక డాక్టర్ల బృందం శ్రీనివాస్ బతికించడం కోసం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా తెలంగాణ పథకాల్లో సీఎం కేసీఆర్ ఎన్ని అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. గతంలో హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తా అన్నారు. జీహెచ్ఎంసీ పన్నుల విషయంలో ఓల్డ్ సిటీ లో వసూలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ ఆరు సంవత్సరాల్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చారా...? అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. -
రణరంగం ముగిసింది.. తీర్పే మిగిలింది..
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార రణరంగం ముగిసింది. ఓటర్ల తీర్పు మాత్రమే మిగిలివుంది. చెదురుమదురు సంఘటనలు మినహా ఆదివారం సాయంత్రం అయిదు గంటలతో ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగిసింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు జోరుగా సాగిన ప్రచారం, నాయకుల ఉపన్యాసాలు, డప్పు చప్పుళ్లు, ఊరేగింపులు, మైక్ శబ్దాలు, అభ్యర్థుల హామీలు, వాగ్దానాలు మాటల తూటాల ప్రచార పర్వం ముగిసింది . జోరు వాన కురిసి వెలిసినట్లు పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో సమాప్తం అయింది. (చదవండి : రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్) లక్షా 98 వేల ఓటర్లు ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు, స్వతంత్ర పార్టీల అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. తాము గెలుస్తామని ఒకరు, తామే గెలుస్తామని మరొకరు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. తమని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని పరిగెత్తిస్తామని అధికార టీఆర్ఎస్, తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సిద్దిపేట, గజ్వేల్ తరహాలో అభివృద్ధి చేస్తామని బీజేపీ, తమకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని కాంగ్రెస్, ఇలా ఎవరికి వారే ప్రచారం కొనసాగిస్తూ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలను కలియతిరిగారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు, కాంగ్రెస్ తరపున దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలోకి ఉన్నారు. మొత్తం దుబ్బాక బరిలో 23 మంది పోటీ చేస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రధాన నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. దుబ్బాక నియోజక వర్గానికి అధికార పార్టీ చేసిన నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించాయి. (చదవండి : 'బీజేపీ అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తోంది') ఒక రకంగా చెప్పాలంటే దుబ్బాక ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి గెలుపొందాలని రాష్ట్ర,కేంద్ర స్థాయిలోని పార్టీ ముఖ్య నేతలు ప్రచారాన్ని నిర్వహించి ఎవరికి వారే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రచార సరళిని పర్యవేక్షించారు. ఇక బీజేపీ తరఫున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, డీకే అరుణ ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నాం ప్రభాకర్, హనుమంత రావు, గీతరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. (చదవండి : రఘునందన్‌రావు బావమరిది అరెస్ట్) అయితే సిద్దిపేటలో సోమవారం (23వ తేదీ) జరిగిన నోట్ల కట్టల లొల్లి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బీజేపీ– టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.టీఆర్ఎస్ ప్రోద్బలంతో పోలీసులే డబ్బు తెచ్చిపెట్టి తమను ఇరికించే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తే, డబ్బులతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, కపట నాటకాలాడు తోందని టీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆగడాలను అడ్డుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ఆశ్రయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి ఒక ఐఏఎస్ అధికారిని కూడా ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కేవలం తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్‌లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్న విషయం నవంబర్ 10న తేట తెల్లం కానుంది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నిక ప్రచారం సోలిపేట సుజాత (టీఆర్ఎస్) రఘునందన్ రావు (బీజేపీ) చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్) ఎల్లుండి దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్, 10న ఫలితాలు దుబ్బాక ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఎన్నికల విధుల్లో 2వేల మంది పోలీస్ సిబ్బంది ఈనెల 4 వరకు దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలు దుబ్బాక నియోజకవర్గంలో 89 సమస్యాత్మక ప్రాంతాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు ఒక్కో కేంద్రానికి వెయ్యి మంది ఓటర్లు వృద్ధులు, దివ్యాంగులు, కరోనా రోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం -
రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి నేడు(ఆదివారం) ఆఖరిరోజు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడానికి గత 22 రోజులుగా బీజేపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 'దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. గత 22 రోజులుగా ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నిన బీజేపీ చివరికి డబ్బు పంచడానికి కూడా సిద్ధమైంది. ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. తాజగా నేడు దుబ్బాక వెళ్తున్న కోటి రూపాయల నగదును హైదరాబాద్‌లో పట్టుబడ్డాయి. ఈ డబ్బులు ఎవరివి అనేవి పోలీసులు ఇప్పటికే నిర్థారించారు. అంతేకాదు బీజేపీ అభ్యర్థి చేయి విరిగిందని అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. తిమ్మిని బమ్మి చేయడం బీజేపీకి బాగా అలవాటు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఇంట్లోనే డబ్బులు దొరికాయన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయంపై గోబెల్స్ ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆగమాగం చేయాలని చూస్తున్నారు. (చదవండి : బండి సంజయ్ అరెస్ట్.. పెట్రోల్ పోసుకున్న కార్యకర్త) నేడు బీజేపీ కార్యలయం ముందు ఎవరో వ్యక్తి ఆత్మహత్యహత్నం చేసుకున్నాడని ప్రచారం మొదలుపెట్టారు. ఇలా ఉప ఎన్నిక ముగిసేవరకు ప్రగతి భవన్,తెలంగాణ భవన్,డీజీపీ కార్యాలయం లాంటివి ఎంచుకొని ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నారని మాకు విశ్వసనీయ సమాచారం. శాంతి భద్రతల విఘాతం కలిగేలా రక్తపాతం,లాఠీచార్జ్, ఫైరింగ్‌కు బీజేపీ ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను కలవాలని నిర్ణయించాం. ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖను కూడా రాశాము.. అలాగే ఇక్కడ సీఈఓని కూడా కలవనున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10న వెలువడనుంది. (చదవండి : హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం) -
హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో భారీగా హవాలా నగదును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా హవాలా నగదును సీజ్ చేశారు.ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఓ పార్టీకి చెందిన నగదును పోలీసులు ఇలానే పట్టుకున్నారు. కాగా ఇంత పెద్ద మొత్తంలో హవాలా సొమ్మును తరలించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే'
సాక్షి, సిద్దిపేట(దుబ్బాక) : దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు ఖాళీ అవుతోంది. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకొని బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.బీడీ కార్మికులకు 1600 రూపాయలు ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.16 పైసలు బీడీ కార్మికులకు నరేంద్ర మోదీ ఇస్తున్నట్లు ఆధారాలు చూపాలి.గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదు.అబద్ధాలతో అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటే అది ఎండమావే అవుతుంది. యూపీలో వృద్ధులకు,వితంతువులకు 500 రూపాయలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం.. అదే కర్ణాటకలో 400 రూపాయలు పెన్షన్ ఇస్తుంది.తెలంగాణలో మాత్రం మన ప్రభుత్వం రూ. 2 వేలు పెన్షన్‌గా అందిస్తున్నాం. బీజేపీదంతా దోఖేబాజీ మాటలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో రూ. 500 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఎలా విమర్శిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో బోర్లు, బావుల దగ్గర యూనిట్ కు 4 రూపాయలచొప్పున రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కాగా టీఆర్ఎస్ తరపున దుబ్బాక ఉపఎన్నికలో సోలిపేట సుజాత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా దుబ్బాక ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది.. ఉపఎన్నిక ఫలితం నవంబర్ 10న రానుంది. -
దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంప పెట్టు కావాలన్నారు కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న రామలింగారెడ్డి దుబ్బాకలో ఎలాంటి అబివృద్ధి చేయలేదు. భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్తాయికి తీసుకువెల్లింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చేతగాని మాటలు చేప్పి కేసీఆర్ అదికారంలోకి వచ్చాడు. 30 శాతం మంది కౌలు రైతులకు ఎలాంటి లాభం లేదు. రైతులకు రుణమాఫీ జరగలేదు. కేసీఆర్ పాలనలో రైతులకు పంటనష్టం డబ్బులు రాలేదు. నియంత్రిత సాగు చేయించి మొక్కజొన్న, పత్తి రైతులకు అన్యాయం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలను కలవడు వారి బాగోగులు చూడడు. దేశంలో పెద్ద అవినీతి పరుడు కేసీఆర్. మిషన్ భగీరథ.. సాగునీటి ప్రాజెక్టుల అవినీతిలో జైలు పాలు కాకతప్పదు’ అన్నారు. (రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్) -
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముత్యం రెడ్డి 30 ఏళ్లు ప్రజల కోసం బతికితే.. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు రిటర్న్ గిఫ్ట్‌గా అవమానాన్ని ఇచ్చింది అంటూ ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక. దుబ్బాకకు కనీసం బస్సు-నీళ్లు లేని పరిస్థితుల్లో నుంచి ముత్యం రెడ్డి అభివృద్ధి చేశారు. జనాలు పల్లెలు నుంచి పట్నాలకు వెళ్లకుండా.. పట్నాల నుంచి పల్లెలకు రావాలని కలగన్న నేత ముత్యం రెడ్డి. ఐదు మార్కెట్ యార్డ్లు తెచ్చిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది అన్నారు. (చదవండి: కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం) నేతలందరూ రాజకీయం వల్ల ఆస్తులు సంపాదిస్తే.. ఆస్తులను అమ్మి రాజకీయం చేసిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది. రాబోయే ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరవేయ్యాలి. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థినే. నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకుంటాను’ అని తెలిపారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల(మార్చి)12న దీనికి సంబంధించిన నోటిషికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 19 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 20న నామినేషన్ల పరిశీస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఏప్రిల్ 13వ తేదీ రోజు వరకు ఈ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నిక జరుగుతుంది. టీఆర్ఎస్ తరపున ఎన్నికైన భూపతి రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. దీంతో ఆయనపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అనర్హతపై భూపతి రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. చైర్మన్ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. దీంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. -
'అడ్డువస్తే నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారు'
జలాలాబాద్ : పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్ నియోజకవర్గం శిరోమణి అకాలీదల్ పార్టీకీ కంచుకోటలాంటిది. పంజాబ్‌కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్బీర్ సింగ్ బాదల్ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. దీంతో అకాలీదల్ పార్టీకి ఇక్కడ మంచి పట్టుంది. తాజాగా జలాలాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన రమీందర్ ఆవ్లా విజయం సాధించారు. ఈ సందర్భంగా రమీందర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అకాలీదల్‌కు మంచి పట్టున్న జలాలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం తనకు చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. బీజేపీ- అకాలీదల్ పాలనలో ఇక్కడ గూండారాజ్యం కొనసాగిందని, అడ్డు వచ్చిన వారిపై నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారని తెలిపారు. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుందనడానికి తన గెలుపు ఒక కారణమని రమీందర్ వెల్లడించారు. 2017లో సుఖబీర్‌సింగ్ విజయం సాధించినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీ- అకాలీదల్ పాలనలో వారు పెట్టిన నకిలీ కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరించారని గుర్తుచేశారు.దీంతో అకాలీదల్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయాలు ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన సుఖ్బీర్ సింగ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తన బాధ్యతను విస్మరించారు. అందుకే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో అకాలీదల్‌ను కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన జలాలాబాద్ ప్రజలకు రమీందర్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. రైస్ మిల్లర్ వ్యాపారులకు ఆశించినంత మేర వ్యాపారం జరగకపోవడంతో ఎక్కువ మొత్తంలో మిల్లులు మూసివేయడం గుర్తించాను. అలాగే ఈ ప్రాంతంలోని స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడం దారుణం అని వెల్లడించారు. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా బలంగా ఉంది. ఈ సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అలాగే త్వరలోనే ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ని కలిసి నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చిస్తానని తెలిపారు. -
వరంగల్ ఉపపోరుకు మోగిన భేరీ
-
దేవీప్రసాద్‌కు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి
హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవోల అత్యవసర సమావేశం ముగిసింది. మెదక్ ఎంపీ స్థానానికి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ను పోటీ చేయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి దేవీప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని టీఎన్జీవో సంఘం నేతలు కోరనున్నారు. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో మెదక్ స్థానం ఖాళీ అయింది. కాగా, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.