మాస్కో టూ హైదరాబాద్‌! | Special Story On Political Parties Using Telangana Liberation Day For Election | Sakshi
Sakshi News home page

మాస్కో టూ హైదరాబాద్‌!

Published Sun, Sep 4 2022 1:06 AM | Last Updated on Sun, Sep 4 2022 5:44 AM

Special Story On Political Parties Using Telangana Liberation Day For Election - Sakshi

ఓల్గా సే గంగ, గంగా సే ఓల్గా. ప్రాంతం ఏదైనా దేశం ఏదైనా సరే, అసమర్థుల జీవయాత్ర ఒకే రకంగా ఉంటుందని పలుమార్లు రుజువైంది. ఖాతాల్లో ఎన్ని ఘనతలున్నా అవి వారికి ఉపయోగపడవు. కాలక్రమంలో ఆ ఘనతలన్నీ విజేతల ఖాతాల్లోకి బదిలీ అవుతుంటాయి. ఈ వారం రష్యాలో, తెలం గాణలో జరిగిన రెండు పరిణామాలు ఇదే సంగతిని మరోసారి నిర్ధారించాయి. రష్యాలో గోర్బచెవ్‌ మరణం, హైదరాబాద్‌ సంస్థాన విలీనాంశం ఈ పరిణామాలు.

మిహాయిల్‌ సెర్గీవిచ్‌ గోర్బచెవ్‌ సోవియట్‌ యూనియన్‌కు చిట్టచివరి అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయ్యవారిని చేయబోతే కోతి తయారైందని మన దగ్గర ఒక సామెత ఉన్నది. ఆయన కూడా ఒక లెనిన్‌ను సృష్టిద్దామనుకున్నాడు. సదరు సృష్టికార్యం వికటించి ఎల్త్సిన్‌ తయారయ్యాడు. ఎల్త్సిన్‌ ముదిరి పుతిన్‌ అవతారమెత్తాడు. జార్‌ చక్రవర్తుల నిరంకుశ కాలం నాటి రష్యాను ‘జాతుల బందిఖానా’గా లెనిన్‌ అభివర్ణించాడు. కజకిస్థాన్‌ వగైరా మధ్యఆసియా దేశాలు, ఆర్మేనియా తదితర కాకేసస్‌ ప్రాంత రాజ్యాలు, ఉక్రెయిన్, బెలారస్‌ వంటి తూర్పు యూరప్‌ జాతులు, బాల్టిక్‌ తీర జాతులు, ఫిన్లాండ్‌... రష్యన్‌ సామ్రా జ్యంలో అంతర్భాగంగా ఉండేవి. భాషాపరంగా, సాంస్కృతికంగా నాన్‌–రష్యన్‌ జాతులన్నీ తీవ్రమైన వివక్షకు, అణచివేతకు గురయ్యేవి. విప్లవం విజయ వంతమైన తర్వాత ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌లో ఈ జాతులన్నింటికీ విడిపోయే హక్కుతో సహా సమస్త ప్రజాస్వా మిక హక్కులను కల్పించాలని లెనిన్‌ సంకల్పించారు. ఆ మేరకు బోల్షివిక్‌ పార్టీ ఒక ప్రకటన కూడా చేసింది. ఆ వెంటనే ఫిన్లాండ్‌ చేసిన స్వాతంత్య్ర ప్రకటనను కూడా లెనిన్‌ అనుమతించారు. మిగిలిన జాతుల సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి స్టాలిన్‌ను ఆ శాఖకు మంత్రిగా నియమించారు.

అనతికాలంలోనే లెనిన్‌ అనారోగ్యానికి గురికావడం, కొద్దిరోజుల్లోనే చనిపోవడంతో పాలనా పగ్గాలు స్టాలిన్‌ చేతికి చిక్కాయి. స్టాలిన్‌ స్వయంగా రష్యన్‌ కాదు. జార్జియన్‌. అయినప్పటికీ ఇతర జాతులేవీ యూనియన్‌ నుంచి విడి పోకుండా కమ్యూనిస్టు పార్టీ పెత్తనం ద్వారా జాగ్రత్తపడ్డారు. జారిస్టు రష్యా నాటి వివక్ష, భాషా సంస్కృతుల అణచివేతను అమలు చేయలేదు గానీ జాతుల స్వతంత్ర కాంక్షను మాత్రం ఉక్కుపాదంతో అణచివేశారు. స్టాలిన్‌ హయాంలో సోవియట్‌ యూనియన్‌ ఆర్థికాభివృద్ధికి వేగంగా పునాదులు పడినప్పటికీ, ప్రజాస్వామిక హక్కులు మాత్రం మృగ్యమయ్యాయి. ఏక పార్టీ నియంతృత్వం కొనసాగింది. సొంత పార్టీలో ప్రత్యర్థులను కూడా వెంటాడి వేటాడారు. లెనిన్‌ వారసుడిగా అధికారంలోకి రావాల్సిన ట్రాట్సీ్క వంటి మేధావిని కూడా ప్రవాసంలోనే మట్టుబెట్టారు. అయితే స్టాలిన్‌ అటువంటి కఠిన వైఖరి అవలంబించకపోయినట్లయితే సోవియట్‌ యూనియన్‌ను బాల్యదశలోనే సామ్రాజ్యవాద శక్తులు కడతేర్చి ఉండేవని స్టాలిన్‌ అనుకూల వర్గం వాదించింది. స్టాలిన్‌ మరణానంతరం ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నికటా కృశ్చేవ్‌ అధికారం లోకి వచ్చారు. అయినా అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో పెద్దగా మార్పు రాలేదు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఉదంతం ప్రచారంలో ఉన్నది. ఒక సమావేశంలో స్టాలిన్‌ను విమర్శిస్తూ కృశ్చేవ్‌ మాట్లాడుతున్నారట. అప్పుడాయన దగ్గరకు ఒక చీటీని ఎవరో పంపించారు. కృశ్చేవ్‌ ఆ చీటిని విప్పి చదివారు. ‘స్టాలిన్‌ జీవించి ఉన్నప్పుడు మీరెందుకు ఈ మాటలన్నీ చెప్పలేద’ని అందులో ఉన్నదట. చదివిన తర్వాత ఆ ‘చీటిని పంపిందెవరో చేయెత్తండ’ని కృశ్చేవ్‌ అడిగారట. ఎవరూ ఎత్తలేదు. కాసేపు నిరీక్షించిన తర్వాత ‘ఇదిగో ఇందుకే నేను కూడా మాట్లాడలేద’ని కృశ్చేవ్‌ నవ్వుతూ చెప్పారట!

గోర్బచెవ్‌ చేతికి పార్టీ పగ్గాలొచ్చేనాటికి దేశంలో ప్రజాస్వామ్య ఆకాంక్ష పెరగసాగింది. ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారింది. అఫ్గానిస్తాన్‌ యుద్ధంతో చేతులు కాల్చుకున్నది. జనంలో అసంతృప్తి వ్యాపించడం మొదలైంది. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలని గోర్బచెవ్‌ సంక ల్పించారు. ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకడం కోసం రోనాల్డ్‌ రీగన్, మార్గరెట్‌ థాచర్‌లతో చర్చలు జరిపారు. వీరిద్దరూ ఆయా దేశాల్లో ఉక్కు మనుషులుగా పేరుగాంచారు. గోర్బచెవ్‌కు స్వదేశంలో మెతక మనిషనే పేరున్నది. పశ్చిమ దేశాలతో ఒప్పందం మేరకు భారీ సంఖ్యలో అణ్వస్త్రాలను ధ్వంసం చేశారు. అఫ్గానిస్తాన్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. తూర్పు యూరప్‌ దేశాల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతుంటే ప్రేక్షకపాత్ర పోషించాడే తప్ప సైన్యాన్ని వినియోగించలేదు. బెర్లిన్‌ గోడ బద్దలవడాన్ని అనుమతించారు. జర్మనీల ఏకీకరణకు పరోక్షంగా సహక రించారు. ఆర్థిక రంగంలో పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), రాజకీయ రంగంలో గ్లాస్‌నోస్త్‌ (పారదర్శకత) విధానాలను అమలు చేశారు. సంస్కరణలను మరింత వేగవంతం చేయా లన్న ఎల్త్సిన్‌ తదితర ప్రజాస్వామిక వాదుల ఒత్తిడికి లొంగి ఒకేసారి సోవియట్‌ వ్యవస్థ తలుపులు, కిటికీలను బార్లా తెరిచేశారు. వీచే గాలుల ఉధ్ధృతికి తనను తాను నిభాయించుకోలేకపోయారు.

పరిస్థితులను తన అదుపులో ఉంచుకుంటూ నెమ్మది నెమ్మదిగా తలకెత్తుకోవలసిన సంస్కరణలను ఒక్కసారిగా చేపట్టారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వాదిగా తానే మిగిలిపోవాలన్న దుగ్ధతో సంప్రదాయ కమ్యూని స్టులకు దూరమయ్యారు. ఇటు ప్రజాస్వామికవాదులకు గోర్బచెవ్‌ కంటే ఎల్త్సిన్‌లోనే సమర్థుడైన నాయకుడు కనిపిం చాడు. గోర్బచెవ్‌ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారింది. పశ్చిమ దేశాల్లో శాంతిదూత అనే ఇమేజ్‌ సంపాదించినప్పటికీ, స్వదేశంలో అసమర్థుడిగా ముద్రపడింది. సోవియట్‌ యూని యన్‌ పతనాన్ని ఆయన కోరుకోలేదు. ఆర్థిక పునరుజ్జీవనం కోసం మార్కెట్‌ శక్తులను ఒక మేరకు అనుమతించాలను కున్నారు. సోషలిస్టు వ్యవస్థలోనే ప్రజాస్వామిక సంప్రదా యాలను పాటించాలనుకున్నారు. కమ్యూనిస్టు పార్టీని సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీగా నడపాలని భావించారు. నిర్వహణా దక్షత లేక అధికారానికి దూరమై ముప్పయ్యేళ్లపాటు పత్రికలకు వ్యాసాలు, పుస్తకాలు రాసుకుంటూ గడిపేశారు. తన చర్యల ఫలితంగా ఎల్త్సిన్‌లూ, పుతిన్‌లూ పుట్టుకొచ్చి రాజ్యమేలుతుంటే మౌనంగా గమనించారు. ఇరవయ్యో శతాబ్దంలో చరిత్రను మలుపుతిప్పిన కీలక పరిణామానికి శ్రీకారం చుట్టిన మహా సంస్కరణవాది అంత్యక్రియలకు అధికార లాంఛనాలు కూడా దక్కలేదు. 

ఈనెల పదిహేడో తేదీ కోసం తెలంగాణలో ఒక రాజకీయ జాతర కార్యక్రమం రూపుదిద్దుకుంటున్నది. హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమై 74 సంవత్స రాలైంది. ఇప్పుడు ఏడాది పొడవునా కేంద్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలు జరుపబోతున్నదట! రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పొడుగునా వజ్రోత్సవాలు జరపాలని కేబినెట్‌ నిర్ణయించింది. అసదుద్దీన్‌ ఒవైసీ సూచన మేరకు జాతీయ సమైక్యతా ఉత్సవాలుగా నామకరణం చేసింది. ఇంతకుముందు రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు వచ్చిపోయాయి గానీ, ఇంత హడావిడి గతంలో ఎప్పుడూ లేదు. కాలం గడిచిపోతున్నకొద్దీ ఉత్సవ సంరంభాలు తగ్గుముఖం పడతాయి కానీ పెరగడ మన్నదే ఒక వింత. ఇదే రాజకీయ వింత!
విలీనానికి ‘విమోచనం’ అనే పేరుపెట్టి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని రాజకీయ పరిశీలకుల అభి ప్రాయం.

స్వాతంత్య్రం రాకముందు దాదాపు 500 సంస్థానాలు బ్రిటీష్‌ వారి అనుమతితోనే స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. అందులో చాలావరకు చిన్నచిన్న సంస్థానాలు. హైదరాబాద్, కశ్మీర్‌ మాత్రమే పెద్ద రాజ్యాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయవలసిన అవసరం ఏర్పడింది. విలీనానికి సిద్ధంగా లేని హైదరాబాద్‌ సంస్థానంపై కేంద్రం ‘పోలీస్‌ చర్య’ జరిపి విలీనం చేసుకున్నది. ‘విమోచనం’ అనే మాట వచ్చినప్పుడు ఎవరి నుంచి  అనే ప్రశ్న వస్తుంది. నిజాం రాజు పరాయి దేశ పాలకుడు కాదు. ఏడెనిమిది తరాలపాటు ఇక్కడే పుట్టి పెరిగిన అసఫ్‌జాహీ వంశస్థుడు. పది తరాలకు ముందు ఇప్పటి ఉజ్బెకిస్థాన్‌ నుంచి వచ్చిన ఒక పండితుడు షాజహాన్‌ దగ్గర కొలువులో చేరాడు. క్రమంగా దక్కన్‌ రాజప్రతినిధులుగా మారి, ఔరంగజేబు మరణం తర్వాత స్వతంత్రరాజులయ్యారు.

ఏడో నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో చెలరేగిన రజాకార్‌ మూకలను అదుపులో పెట్టడంలో ఆయన విఫలమయ్యారు తప్ప స్వయంగా ఆయన మతసహనం లేనివాడు అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. అనేక దేవాల యాలు కట్టించాడనే పేరు కూడా ఉన్నది. ఆ రోజుల్లో అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకే ఐదు లక్షలు విరాళంగా ఇచ్చి, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి మాత్రం పది లక్షలు విరాళ మిచ్చాడు. ఇందులో జనాభానూ, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకున్నాడే తప్ప మతాన్ని ఆయన చూడలేదు. విద్య, వైద్య రంగాల్లో ఆయన వేసిన పునాదులను కూడా విస్మరించలేము.

ఒక ఫ్యూడల్‌ వ్యవస్థకు అధిపతి నిజాం ప్రభువు. ఈ వ్యవస్థ ప్రతినిధులుగా దొరలు, దేశ్‌ముఖ్‌లు గ్రామసీమల్లో చేసిన అరాచకం, దోపిడీ అంతా ఇంతా కాదు. రైతాంగాన్ని పీల్చి పిప్పిచేశారు. దిగువ శూద్రుల్ని వెట్టి బానిసలుగా మార్చివేశారు. ఈ అమానుషత్వానికీ, దోపిడీకీ వ్యతిరేకంగానే కమ్యూనిస్టుల (సంఘం) ఆధ్వర్యంలో రైతుకూలీలు జరిపిన సాయుధ పోరాటం దేశచరిత్రలో సాటిలేని ఒక ఉజ్జ్వల ఘట్టం. హైదరాబాద్‌పై ‘పోలీస్‌ చర్య’ జరిగేనాటికి సాయుధ రైతాంగ దళాలు మూడువేల గ్రామాలను భూస్వాముల పీడన నుంచి విడిపించాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి ఉంటే ‘విమోచనం’ అనే మాటకు అర్థం ఉండేది. కానీ, ‘పోలీసు చర్య’ తర్వాత యూనియన్‌ సైన్యాలు భూస్వాములను మళ్లీ గ్రామాల్లో ప్రతిష్ఠించాయి. తీవ్రత తగ్గినా దోపిడీ కొనసాగింది. అధికార బదిలీ మాత్రమే జరిగింది తప్ప ప్రజలకు ఏ రకమైన విముక్తీ లభించలేదని ఈ పరిణామం స్పష్టం చేసింది.

నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ ప్రాంతాల్లో కమ్యూనిస్టులూ, మిగిలిన తెలంగాణాతో పాటు మరాఠా, కన్నడ జిల్లాల్లో స్టేట్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆర్యసమాజ్‌లు నాడు నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నాయి. ఈ పోరాటాల్లో హిందువులతో పాటు ముస్లింలు కూడా పెద్దయెత్తున పాల్గొ న్నారు. నిజాం ప్రభువు ముస్లిం మతస్థుడు కనుక ‘విమోచనం’ అనే పదాన్ని పదేపదే వాడటం వల్ల భావోద్వేగాలు తలెత్తి రాజకీయంగా వర్కవుట్‌ కావచ్చన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తున్నది. నిజానికి బీజేపీ కానీ, దాని పూర్వరూపమైన ‘జనసంఘ్‌’ గానీ పోలీస్‌ చర్య జరిగేనాటికి పుట్టలేదు. బీజేపీకి దీటుగా ఉత్సవాలను తలకెత్తుకోబోతున్న టీఆర్‌ఎస్‌ కూడా అప్పుడు పుట్టలేదు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలివిగా ఈ తాజా ఎజెండాను బీజేపీ తలకెత్తుకున్నది. రాజకీయ పరిశీలకుల అంచనాల మేరకు నెలరోజుల కిందటి వరకు తెలంగాణలో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆ పార్టీకి కూడా కొత్తగా బలం పెరగడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటున్న దాఖలాలు కూడా లేవు. ఆశ్చర్యకరంగా అనిశ్చిత ఓటర్ల (ఎటూ తేల్చుకోని) సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నదని కొన్ని అనధికార సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్‌ ఓటర్లే ఎక్కువ.

ఉపఎన్నిక వాకిట్లో ఉన్న మునుగోడులోనే ఇరవై శాతానికి పైగా అనిశ్చిత ఓటర్లున్నారని అంచనా. కాంగ్రెస్‌ పార్టీ ఏదైనా అద్భుతాన్ని సృష్టించగలిగితేనే అనిశ్చిత ఓటర్లు అటువైపు మొగ్గుతారు. నిజాం పాలనలో పోరాటాలు జరిపిన కాంగ్రెస్‌–కామ్రేడ్స్‌ కళ్లప్పగించి చూస్తుండగానే అదే అంశంపై బీజేపీ – టీఆర్‌ఎస్‌లు తలపడటం ఎన్నికల ఎత్తుగడగానే పరిగణించాలి. ‘సెప్టెంబర్‌ 17’ సాక్షిగా సెమీ ఫైనల్‌ దశ నుంచి ఫైనల్స్‌లో అడుగు పెట్టా లని బీజేపీ సన్నాహాలు చేస్తున్నది. భావోద్వేగాల ద్వారా అని శ్చిత ఓటర్లను గెలవాలని అది వలవేస్తున్నది. లౌకిక బాణంతో ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్‌ సమాయత్తమవుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ ఏదైనా అద్భుతాన్ని సృష్టిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు బిలియన్‌ డాలర్ల ప్రశ్న. అటువంటి అద్భుతం జరగకపోతే మాత్రం కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రయాణాలు అసమర్థుల జీవయాత్రలుగానే మిగిలిపోతాయి.

వర్ధెల్లి మురళి 

vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement