ఎన్నికలే గీటురాయిగా నిలిచే ప్రజాస్వామ్యంలో చాలా సందర్భాల్లో ఉప ఎన్నికలను కొంత తేలిగ్గా తీసుకోవడం కద్దు. కానీ, కొన్ని సందర్భాల్లో ఈ ఉప పోరాటాలే తర్వాత రానున్న ప్రధాన ఎన్నికల యుద్ధానికి సూచికలుగా పనికొస్తాయి. అలా చూసినప్పుడు ఆదివారం నాటి ఉపఎన్నికల ఫలితాలు ప్రత్యేకమైనవి. దేశంలోని రెండు రాష్ట్రాల్లో 3 లోక్‌సభా స్థానాలకూ, నాలుగు రాష్ట్రాల్లో 7 శాసనసభా స్థానాలకూ జరిగిన పోరు చిన్నదైనా, ఫలితాలు అనేక అంశాలను చాటి చెబుతున్నాయి. మూడు పార్లమెంట్ స్థానాల్లో రెంటిని బీజేపీ గెలుచుకోవడం విశేషం. త్రిపురలోనూ కాషాయ పార్టీ తన హవా చాటింది.
త్రిపురలో సీపీఎం, పంజాబ్‌లో ‘ఆప్’, యూపీలో ఎస్పీ – ఇలా ప్రతిపక్షాలకు చేదు అనుభవం మిగిలింది. త్రిపుర, జార్ఖండ్‌లలో ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్, ఢిల్లీలో ఒక స్థానాన్ని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) దక్కించుకోవడమే ప్రతిపక్షాలకు ఊరట. కేంద్రంలోని అధికారపక్షంపై పోరా టంలో కలిసున్నామని పైకి చెబుతున్నా, ఆచరణలో మాత్రం ప్రతిపక్షాల్లో ఐక్యత, ప్రణాళిక లేవని ఈ ఫలితాలు ఎరుకపరుస్తున్నాయి. పాలక బీజేపీ ప్రతిపక్షానికి అందనంత ఎత్తున ఉందనీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే పెను సవాలు విసురుతోందనీ తేటతెల్లం చేస్తున్నాయి. దేశ రాజ కీయ రణక్షేత్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా తయారైందన్న ఈ సూచన ప్రతిపక్షానికి దుర్వార్తే!
మొత్తం 542 సభ్యుల లోక్‌సభకు 80 మంది సభ్యులను పంపుతూ, రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమున్న ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాలనూ బీజేపీయే గెలుచుకుంది. ఇది ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి పెద్ద దెబ్బ. పైపెచ్చు, రామ్‌పూర్, ఆజమ్‌గఢ్ స్థానాలు రెండూ అగ్ర నేతలైన ఎస్పీ అధినేత ములాయమ్ సింగ్ యాదవ్, ఆజమ్‌ఖాన్‌లు ఖాళీ చేసినవి కావడం గమనార్హం. దాదాపు 50 శాతం పైగా ముస్లిమ్ జనాభా ఉండే రామ్‌పూర్‌లో, 40 శాతం పైన ముస్లిమ్‌లు – యాదవులు ఉండే ఆజమ్‌గఢ్‌లో బీజేపీ గెలవడం మారుతున్న సరళికి సూచన అని విశ్లేషకుల మాట.
‘ప్రధాని మోదీ సారథ్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ మీద ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రొమ్ము విరుస్తుంటే... ‘పోలీసు – అధికార యంత్రాంగ దుర్వినియోగం, ఆజమ్‌గఢ్‌లో బీజేపీ – బీఎస్పీల లోపాయకారీ కూటమి వల్లే రెండు స్థానాల్లో ఓడిపోయాం’ అని ఎస్పీ ఆరోపిస్తోంది. ఆజమ్‌గఢ్‌లో సాక్షాత్తూ ఎస్పీ అధినేత అఖిలేశ్ సమీప బంధువైన ధర్మేంద్ర యాదవ్ పరాజయం పాలవడం విశేషం.
కొద్ది నెలల క్రితం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన మరో బీజేపీ వ్యతిరేక పక్షం ‘ఆప్’కు సైతం తాజా ఉప ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తనకు కంచుకోట లాంటి సంగ్రూర్ లోక్‌సభా స్థానాన్ని పోగొట్టుకుంది. ప్రస్తుత పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను గతంలో రెండుసార్లు గెలిపించి, పార్లమెంట్‌కు పంపిన స్థానం అది. తీరా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఆ స్థానాన్ని ప్రతిపక్షానికి కోల్పోయింది. శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఏడీ), కాంగ్రెస్, బీజేపీ – ఇలా ప్రత్యర్థులంతా విడివిడిగా బరిలోకి దిగినా, ‘ఆప్’ ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోవడం విచిత్రం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని మబ్బును చూసి ముంత ఒలకబోసుకుంటున్న ‘ఆప్’కు ఇది షాక్. 18 ఏళ్ళుగా లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ, అందరూ కొట్టిపారేసిన అతివాద రాజకీయ నేత, ఎస్‌ఎడీ (అమృత్‌సర్) అధ్యక్షుడు సిమ్రన్ జిత్ సింగ్ మాన్ అదే స్థానం నుంచి గెలిచి, ఫీనిక్స్ పక్షిలా పైకి లేవడం ఆశ్చర్యకరం.
ఇక మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీయే మళ్ళీ విజయ దుందుభి మోగించింది. ప్రతిపక్షాల కడుపు మంట ఎలా ఉన్నా, అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాతా ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం విశేషం. వైఎస్సార్సీపీకి ప్రజాక్షేత్రంలో ఉన్న అనుకూల వాతావరణానికి అది సూచిక. మొత్తం మీద తాజా ఉప ఎన్నికలు ఎక్కడికక్కడ స్పష్టమైన సూచనలే ఇచ్చాయి. ప్రతి ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని గుర్తు చేశాయి. పార్ట్ టైమ్ రాజకీయాలు చేద్దామనుకుంటే ప్రతిపక్షాలకు మనుగడ లేదని స్పష్టం చేశాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొని, ప్రత్యర్థుల కంచుకోట లను సైతం కైవసం చేసుకొని, ఓటరు పునాదిని విస్తరించుకోవాలనే పట్టుదల, కాంక్ష కీలకం. అది బీజేపీలో ఉన్నంతగా యూపీఏ పక్షాలలో మృగ్యమని మరోసారి రుజువైంది.
అలాగే, కేంద్రంలోని అధికార బీజేపీకి దేశంలో అనుకూల వాతావరణం ఉందనే అభిప్రాయాన్ని కల్పించడంలో తాజా ఉప ఎన్నికలు సఫలమయ్యాయి. ఒక రకంగా ఇది అధికార పార్టీ విజయమైతే, అంతకు మించి ప్రతిపక్షాల పూర్తి వైఫల్యం. వరస చూస్తుంటే, వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి కూడా ప్రతిపక్షాలు సరిగ్గా సిద్ధమవుతున్న దాఖలాలు లేవు. మమతా బెనర్జీ నుంచి కేసీఆర్ దాకా జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి సారథ్యానికి పోటీదారులే ఎక్కువ. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి, నిలువరించే ఐక్య కార్యాచరణతో అందరినీ కలుపుకొనిపోయేవారు కనిపించడం లేదన్నది నిష్ఠురసత్యం. తాజా రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం సమైక్యత సాధించలేక పోయిన ప్రతిపక్షాలు సత్వరం ఆత్మపరిశీలనలోకి దిగడం ఉత్తమం. ప్రతిపక్ష సారథి హోదా నుంచి కాంగ్రెస్‌ను కిందకు లాగే పీతలబుట్ట ధోరణి బదులు నిర్దిష్ట అజెండాతో ప్రజలతో మమేకమయ్యే పనిలో నిమగ్నమైతే ఉపయోగం. లేదంటే ఈ బీజేపీ గాలిని అడ్డుకోవడం అసాధ్యమే!
Comments
Please login to add a commentAdd a comment