
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్‌సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది.
‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది.
నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది.
ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్‌లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి.
క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది.
అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్‌లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం.
నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది.
స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.
1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి.
సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది.
దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష.
Comments
Please login to add a commentAdd a comment