సాక్షి, సిద్దిపేట(దుబ్బాక) : దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు ఖాళీ అవుతోంది. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకొని బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.బీడీ కార్మికులకు 1600 రూపాయలు ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.16 పైసలు బీడీ కార్మికులకు నరేంద్ర మోదీ ఇస్తున్నట్లు ఆధారాలు చూపాలి.గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదు.అబద్ధాలతో అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటే అది ఎండమావే అవుతుంది.
యూపీలో వృద్ధులకు,వితంతువులకు 500 రూపాయలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం.. అదే కర్ణాటకలో 400 రూపాయలు పెన్షన్ ఇస్తుంది.తెలంగాణలో మాత్రం మన ప్రభుత్వం రూ. 2 వేలు పెన్షన్‌గా అందిస్తున్నాం. బీజేపీదంతా దోఖేబాజీ మాటలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో రూ. 500 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఎలా విమర్శిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో బోర్లు, బావుల దగ్గర యూనిట్ కు 4 రూపాయలచొప్పున రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కాగా టీఆర్‌ఎస్ తరపున దుబ్బాక ఉపఎన్నికలో సోలిపేట సుజాత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా దుబ్బాక ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది.. ఉపఎన్నిక ఫలితం నవంబర్ 10న రానుంది.
Comments
Please login to add a commentAdd a comment