సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక విజేతలెవరో నేడు తేలిపోనుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా యి. ఈ నెల 3న పోలింగ్ జరగ్గా మంగళవా రం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది.
రసవత్తరంగా పోటీ...
అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కూడా దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నిక రెఫరెండంగా ఉంటుం దని రాజకీయ వర్గాలు చెబుతుండగా తెలంగాణలో బలం పుంజుకుంటోందని రుజువు చేసుకొనేందుకు బీజేపీకి, క్షేత్రస్థాయిలో తమ బలం చెక్కు చెదరలేదని చాటేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితం కీలకంగా మారింది.
నేతల లెక్కలు..
ఫలితంపై వివిధ ఏజెన్సీలు, రాజకీయ ప్రముఖులు, సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలు అభ్యర్థులతోపాటు రాజకీయ నాయకుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు ముందుగా ఒక రకమైన వాతావరణం ఉండగా పోలింగ్ తర్వాత మరో తీరుగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంకన్నా మెజారిటీ కాస్త తగ్గొచ్చని భావిస్తున్నారు.
15 వేలలోపు మెజారిటీతో గెలుస్తామని టీఆర్‌ఎస్‌లోని కీలక నాయకులు పేర్కొనడం గమనార్హం. మరోవైపు సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని తమ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు ఖాయమని కమలదళం నేతలు అంటున్నారు. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓటు బ్యాంకు తమకుందని చెబుతోంది. ముత్యంరెడ్డిపై సానుభూతి అనుకూలించిందని, గతంతో పోలిస్తే మెజారిటీ ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
రెండో స్థానం కీలకమై..
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎంత కీలకమో రెండో స్థానం కూడా అంతే కీలకంగా మారింది. గతంలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2009లో సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరకు 2,640 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి గెలిచారు. 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2018లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై 62,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా మూడు పర్యాయాలు పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. మూడో స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు మెజారిటీ ఓట్లు సాధిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిస్తే రెండో స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం కాంగ్రెస్, సత్తా చాటి ముందు వరుసలో ఉండేందుకు బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment