సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు.
కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్‌ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం.
ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్
హుజురాబాద్‌లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్‌ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు.
కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment