‘‘డార్విన్ పరిణామ సిద్ధాంతమనేది రాజకీయాల్లో తిట్లక్కూడా వర్తిస్తుందేమో నాయనా’’ అంటూ విలక్షణమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు స్వామీ ఎలక్షనానంద అలియాస్ స్వామీ సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలుండేవి. తర్వాత అవి కువిమర్శలయ్యాయి, అటు తర్వాత తిట్లు, ఆపైన బూతులు..తాజాగా ఇప్పుడు బండబూతులు.
అందుకే పరిణామ క్రమం ఒక్క జీవులకే కాదు... తిట్లకూ ఉందనిపిస్తోంది. అంతేనా..‘యథా తిట్లూ... తథా యాడ్స్’ అన్నట్టుగా కొన్ని పార్టీల ప్రకటనలైతే ఎదుటివాడిపై అరుస్తున్నట్టు..ప్రేక్షకుణ్ణి కరుస్తున్నట్టూ ఉన్నాయి నాయనా’’ ‘‘మొదట్లో అరే..ఒరే అని తిట్టుకుంటున్నవాళ్లు కాస్తా..ఈమధ్య అంతకంటే ఘోరంగా ముందుకెళ్తున్నారు.
మొన్న కేటీఆర్ రేవంత్‌ను తిట్టాడనుకో. నిన్న మళ్లీ రేవంత్ కేసీఆర్‌ను తిడతాడు. ‘నీకంటే చాలా పెద్దవాడు కదా..కేసీఆర్‌ను అలా తిట్టడం సబబేనా?’ అని అడిగితే..‘మరి కేటీఆర్‌కూ నాకు మధ్య అంతే ఏజ్ గ్యాప్ ఉంది కదా. అప్పుడు నేను కేసీఆర్‌ను అనడం సమంజసమే కదా’ అంటూ జస్టిఫికేషన్‌లు ఇచ్చుకుంటూ మరీ తిట్టుకుంటున్నారు. ఇక మైనంపల్లి తిట్లయితే..తాజాగా తెగ వైరల్.
పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది స్వామీ’’ అన్నాడు శిష్యుడు దిగులుగా. ‘‘అలనాడెప్పుడో ప్రఖ్యాత సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తాను రాసిన ‘క–రాజు కథలు’ అనే అద్భుత కథాసంపుటిలోని ‘పలుకుబడి’ అనే కథలో ‘తిట్లు మంచివే’ అంటాడు. పైగా తిట్టేవాడెప్పుడూ (సమాజంలో) పై అంతస్తులో ఉంటాడట. తిట్టేవారికే అందరూ మద్దతు పలుకుతారట.
అందుకే (విద్యార్థులు)అందరితోనూ తిట్లు తెగ ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరముందనీ, ఎవరైతే తిట్లలో ప్రావీణ్యం సాధిస్తారో, వారి ‘పలుకుబడే’ రాజ్యంలో ఇంతింతై అన్నట్టుగా పెరుగుతుందని, దాదాపు పాతికేళ్ల కిందటే సెలవిచ్చారు. అదేదో యాడ్‌లో మరక మంచిదే అన్నట్టుగా... సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం ‘తిట్లూ మంచివేనేమో’నంటూ సర్దుకుపోవాల్సిందే నాయనా’’ ‘‘అలా ఎలా అన్నారు సింగీతం వారు..తిట్లు మంచివెలా అవుతాయి స్వామీ?’’ ‘‘ఆ హాస్య కథల్లో వ్యంగ్యంగా అన్నమాట అది.
‘భాష రాకపోయినా సరే..బేరాలాడే సమయంలో సైగలతోనైనా సర్దుకుపోతారు ప్రజలు. కానీ బేరం కుదరక కోపం వచ్చిందనుకో..తిట్టుకుంటారూ, ఆపైన కొట్టుకుంటారు. ఇయ్యరమయ్యర కొట్టుకోవడం కంటే..పొట్టుపొట్టుగా తిట్టుకోవడం బెటరంటారు సింగీతం వారు. అలా తిట్టుకుని తాము సాధించిన ‘పై అంతస్తు’తో ఇగో చల్లారిపోయిందనుకో..దాంతో కొట్టుకోవడం ఆగిపోతే అది మంచిదేగా అని ఉద్బోధిస్తారు నాయనా. మనవాళ్లూ తెగ తిట్టుకుని అక్కడితో అలా ఆగిపోతున్నారుగా. కాబట్టి సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం అది బెటరేగా’’ ‘‘అసలిలా ఇంతగా తిట్టుకోడానికి కారణం ఏమిటంటారు? ‘‘అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా నాయనా.
లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరని. దాని కోసమే ఇలా తిట్టుకుంటున్నట్టుంది. కానీ వీళ్లు గ్రహించాల్సిందేమిటంటే..ఎవడికి వాడు ఇదే లాస్ట్ పంచ్ అనుకుంటాడు తప్ప..ఆ లాస్ట్ అనేది ఎప్పటికీ రాదనీ, అదో చైన్ రియాక్షన్‌లా అలా సాగిపోతూనే ఉంటుందని ఎవరూ గ్రహించడం లేదు.
అయినా పర్లేదులే ఇంకెంత..జస్ట్ రెండు రోజులేగా’’ ‘‘రెండ్రోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి సరే..ముందుంది మొసళ్లపండగ అన్నట్టు..మున్ముందు ఎంపీ ఎలక్షన్లూ, ఆ పైన స్థానిక ఎన్నికలూ, అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలూ..ఇలా ఎలక్షన్లూ, తిట్లూ ఎప్పటికీ ముగిసేవి కాదు స్వామీ.
ఏం జరిగితే అవి ఆగుతాయో తెలియడం లేదు’’ బెంగగా అన్నాడు శిష్యుడు.‘‘అందుకే నాకనిపిస్తోంది నాయనా..బాంబులకు ఉన్నట్టే... బూతులకూ జామర్ కనుగొంటే బాగుండు’’ అంటూ తాను దిగులు పడ్డారు స్వామీ ఎలక్షనానంద.
Comments
Please login to add a commentAdd a comment