ఎన్టీఆర్ జిల్లా దొనబండ క్వారీలో ప్రమాదం
యజమాని నిర్లక్ష్యమే ఘటనకు కారణం
రెండు రోజులుగా వర్షాలు పడుతున్నా ఆగని పనులు
కొరవడిన మైనింగ్ అధికారుల పర్యవేక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కంచికచర్ల/జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ శివారులోని ఓ క్వారీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు సోమవారం ఉదయం డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు దొర్లిపడటంతో వాటికింద చిక్కుకుపోయి దుర్మరణం పాలయ్యారు. మృతుల్ని బత్తుల దుర్గారావు (19), సున్నా బీబీనాయక్ (40), బాగేల్ రాందేవ్ (36)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ నాయకుడు చింతల రామ్మోహనరావుకు చెందిన పవన్ గ్రానైట్ మెటల్ వర్క్స్ రాతి క్వారీలో ఒడిశాకు చెందిన బీబీ నాయక్, బాగేల్ రాందేవ్, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బత్తుల దుర్గారావు బ్లాస్టింగ్ చేసిన బండరాళ్లను తొలగించేందుకు కొండపైకి ఎక్కారు.
ఒడిశాకు చెందిన కుమారి బోలీ దిగువన ఉన్న బండరాళ్లను పగులకొట్టేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైన ఉన్న రాళ్లను తొలగించే క్రమంలో ఒక్కసారిగా భారీ బండరాళ్లు ముగ్గురిపైనా పడటంతో విగతజీవులుగా పడి ఉన్నారు. బోలీ అనే యువకుడు సురక్షితంగానే ఉన్నాడు. మృతదేహాలను 5 గంటలపాటు శ్రమించి జేసీబీల సాయంతో వెలికితీశారు. క్వారీ యజమాని చింతల రామ్మోహనరావు నిర్లక్ష్యమే కార్మికుల పాటి మృత్యుపాశంగా మారింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఆపకుండా పని చేయించటం ముగ్గురు కార్మికులను మృత్యు ఒడికి చేర్చాయి.
ఘటనా స్ధలాన్ని జిల్లా మైనింగ్ ఏడీ వీరాస్వామి, నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ బి.రవికిరణ్, నందిగామ ఆర్డీఓ ఎ.రవీంద్రరావు, నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్, ఇంటెలిజెన్స్ సీఐ యువకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్‌ఐలు పీవీఎస్ సుబ్రహ్మణ్యం, హేమలత, తహసీల్దార్ సుస్వాగతం పరిశీలించారు.
సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలు
ప్రమాదం జరిగిన క్వారీలో మైనింగ్ సేఫ్టీ నిబంధనల్ని క్వారీ యజమాని తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా మైనింగ్ చేయడంతోనే అక్కడ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలో ప్రతి 6 మీటర్లకు బెంచ్ ఫార్మేషన్ చేసుకుని ఎప్పటికప్పుడు లూజును తీసివేయాల్సి ఉండగా.. అక్కడ బెంచ్ ఫార్మేషన్ చేయలేదని గుర్తించారు. మైనింగ్ సేఫ్టీకి సంబంధించి క్వారీలో ఓ మేనేజర్‌ను నియమించాల్సి ఉన్నా అలా చేయలేదు.
రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో కొండ చరియలు విరగటంతోపాటు, అక్కడ ఉన్న లూజు జారి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా బోల్డర్లను డ్రిల్లింగ్ చేయటమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. కాగా.. క్వారీలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 801 సర్వే నంబరులో 99 లీజులు ఉన్నప్పటికీ ఏ క్వారీ యజమాని నిబంధనలు పాటించటం లేదు. క్వారీ యజమానులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోపాటు, అధికారులు సైతం మామూళ్లు తీసుకొని, నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండాపోయింది.
మూడు కుటుంబాల్లో విషాదం
మృతుల్లో ఒకరైన బీబీ నాయక్ 15 సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి వలస వచ్చి జి.కొండూరు మండలం చెవుటూరు బాపూజీ కాలనీలో భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. బాగేల్ రాందేవ్ సైతం ఒడిశా నుంచి 20 ఏళ్ల క్రితం వలస వచ్చి భార్య, కుమార్తెతో చెవు టూరు శివారులోని క్వారీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పొట్ట కూటి కోసం క్వారీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రమాదంలో మృతి చెందిన బత్తుల దుర్గారావు చిన్న వయసులోనే మృత్యువాత పడడంతో చెరువు మాధవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
క్వారీ యజమానిపై కేసు నమోదు
క్వారీ యజమాని చింతల రామ్మోహనరావుపై కేసు నమోదు చేసినట్టు నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్ తెలిపారు. మృతుడు దుర్గారావు తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.8.50 లక్షల చొప్పున క్వారీ యజమాని అందజేశారు.
నా కళ్లెదుటే మరణించారు
బీబీ నాయక్, రాందేవ్, దుర్గారావు కొండపైకి వెళ్లి రాళ్లను తొలగించే క్రమంలో పైనుంచి భారీ బండరాళ్లు వారిపై పడ్డాయి. దీంతో రాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. నా కళ్లెదుటే ముగ్గురూ మరణించారు. – కుమారి బోలీ, సహ కార్మికుడు
భద్రతా చర్యలు చేపట్టకపోవడమే కారణం
సర్వే నంబర్ 801లో రెండు హెక్టార్ల రాతి క్వారీని చింతల రామ్మోహనరావు పదేళ్లపాటు లీజుకు పొందారు. మైనింగ్ ప్లాన్, సేప్టీ మెజర్‌మెంట్స్ లేకపోవటం, బెంచీలు ఏర్పాటు చేయకపోవటం, సిస్టమాటిక్ మెజర్‌మెంట్స్ లేకపోవటం వల్లే ప్రమాదం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.– వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్
Comments
Please login to add a commentAdd a comment