ఈటల రాజేందర్. ఒకప్పుడు గులాబీ పార్టీలో సంచలనం. బాస్ మీదే తిరుగుబాటు చేసిన ఈటల కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సవాల్ చేసి హుజూరాబాద్లో కమలం గుర్తు మీద గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా తుత్తునియలు చేశారు. కానీ ఇప్పుడు మరోసారి గులాబీ బాస్కు టార్గెట్ అయ్యారు. అసలు హుజూరాబాద్లో ఏం జరుగుతోంది?
తెలంగాణ ఉద్యమంలో తొలినుంచీ కేసీఆర్ వెంట ఉన్న ఈటల రాజేందర్.. అనేక రాజకీయ పరిణామాల తర్వాత కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. కాషాయ కండువా కప్పుకుని ఉప ఎన్నికలలో తన సీటును కాపాడుకున్నారు. హుజూరాబాద్లో ఈటలను ఓడించడానికి గులాబీ బాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ ఉప ఎన్నికలోనే దళిత బంధు వంటి ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. బీజేపీలో కూడా అంతర్గత కలహాలతో ఈటల ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం ఇటీవల జరుగుతోంది. ఈటల తిరిగి బీఆర్ఎస్ బాట పడతారా అన్న చర్చకు దారితీసింది. ఈటల మాత్రం కాషాయ పార్టీలోనే ఉండేందుకు సిద్ధమయ్యారు.
బీజేపీలో తనకు దక్కాల్సిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడంలేదనే ఓ భావన ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం బాగుండదనుకున్నారో... ఏమో మొత్తానికి ఈటల బీఆర్ఎస్ కవ్వింపులకైతే పడిపోలేదు. పైగా బీజేపీ నెక్స్ట్ రాష్ట్రాధ్యక్షుల లిస్ట్లో ఈటల పేరు కూడా వినిపిస్తుండటంతో.. మరోసారి గులాబీ బాస్ ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంపైనా.. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్పైనా ఫోకస్ చేసినట్టుగా చర్చ జరుగుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టడంతో పాటు.. దళితబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ అక్కడి జనం మనసుని.. ముఖ్యంగా దళితుల ఓట్లనీ తనవైపు తిప్పుకునేలా ప్లాన్ చేసింది. ఎన్నికల్లో విజయం రాజేందర్‌నే వరించింది. కొంతకాలం పాటు అటువైపు పెద్దగా దృష్టి పెట్టని గులాబీ బాస్ ఇప్పుడీ నియోజకవర్గంపై మళ్లీ ప్రధానంగా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి కారెక్కిన కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించడంతో పాటు.. ఉప ఎన్నికలో ఈటలపై పోటచేసి ఓటమిపాలైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పదవిచ్చారు.
హైదరాబాద్‌లో అంబేడ్కర్ అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకుని.. దానికి ముందు హుజూరాబాద్‌కి అంబేడ్కర్ ముని మనవడైన ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ ను ప్రత్యేక చాపర్ లో పంపించారు. హుజూరాబాద్‌లో అమలవుతున్న దళితబంధు పథకాన్ని.. లబ్దిదారులు ఆయనకు వివరించేలా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ని కూడా అరేంజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. ఈటల పైనా.. ఆయన నియోజకవర్గంపైనా గులాబీ బాస్ ఎప్పుడూ ఓ కన్నేసే ఉంచుతున్నారనిపిస్తోంది.
ఈటల రాజేందర్‌పైన ఎప్పుడూ విరుచుకుపడే కౌషిక్ రెడ్డి.. తన నియోజకవర్గానికి సంబంధం లేకున్నా తన చిరకాల ప్రత్యర్థిలా ఈటలను భావించే మంత్రి గంగుల కమలాకర్ కే ఈ బాధ్యతలను అప్పజెప్పడం వెనుకా గులాబీబాస్ ఆలోచనలు ఏంటన్నది ఇప్పుడో పెద్ద చర్చ. మరి ఇంతగా ఫోకస్ అవుతూ.. ఓ ముఖ్యమంత్రి చూపునే తనవైపు తిప్పుకునేలా చేయడం ఒకవైపు ఈటెలకున్న స్టామినాను చెబుతుంటే... ఇంకోవైపు ఇంతగా ఫోకస్ అవుతూ తానే లక్ష్యంగా జరుగుతున్న ఒత్తిడిని ఈటెల ఏవిధంగా ఎదుర్కొంటారోనన్న ఆసక్తీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్
చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment