
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అమలు చేసే ‘పొలిటికల్ ట్రిక్స్’ అన్నీ తనకు తెలుసని.. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరిస్తారో దగ్గరుండి చూశానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ అడుగడుగునా కోవర్టులను పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని.. ఇటీవల వివిధ పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలు దీనిని రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ సోమవారం హైదరాబాద్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఈటల మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలే ఓడించబోతున్నారన్నారు.
కాంగ్రెస్‌ను అమాంతం మింగేస్తారు
కాంగ్రెస్ పార్టీని ఎలా డీల్ చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసని, గత ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఈటల చెప్పారు. 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్‌పై, అధికార బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై కాంగ్రెస్ పుంజుకుంటున్నదన్న దశలో.. ఆ పార్టీని ఎటూకాకుండా చేసిన తీరును తాను దగ్గరి నుంచి గమనించానని చెప్పారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నాలుకకు కూడా తగలకుండా అమాంతం మింగేస్తారని వ్యాఖ్యానించారు.
నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్, మరే ఇతర పార్టీలో చేరకుండా ఇప్పటిదాకా జరిపిన చర్చల ద్వారా ఆపగలిగానని ఈటల చెప్పారు. తమ చర్చల్లో వారు అనేక అంశాలను ప్రస్తావించడంతోపాటు తనకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని నవ్వుతూ చెప్పారు. వారితో బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతోందన్నారు.
ఖమ్మం జిల్లా సంప్రదాయకంగా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు పట్టున్న జిల్లా అన్న విషయం అందరికీ తెలిసిందేనని.. అయితే బీజేపీలో పొంగులేటి, జూపల్లి చేరడం కష్టమేనని తాను అనని మాటలను అన్నట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ప్రభుత్వం, అధికార పార్టీ రాజకీయాలు, అధికారుల ఒత్తిళ్లను ఎదుర్కొని మరీ ప్రజల అండదండలతో హుజూరాబాద్‌లో గెలవగలిగానన్నారు. కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీచేస్తానని తాను ప్రకటించగానే.. అక్కడా తనకు ప్రజల మద్దతు పెరిగిందని, సోషల్‌మీడియాలో 72 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment