బీఆర్‌ఎస్ యోచన
ఈ నెల 27న హైకోర్టు ముందుకు దానం అనర్హత పిటిషన్
చర్యలు లేనిపక్షంలో దానంతో పాటు మిగతా ఎమ్మెల్యేలపైనా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం
రెండు రోజులుగా ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు చర్చలు
వారాంతంలోగా పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీకి సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న భారత్ రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుంది. ఒకవేళ దానంను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
కేవలం దానం నాగేందర్‌పైనే కాకుండా ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే లు అందరిపైనా వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలయ్యే అనర్హత పిటిషన్‌పై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును బీఆర్‌ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులోని పేరా నంబరు 30, 33 ప్రకారం హైకోర్టు తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ పార్టీ వాదిస్తోంది. దానంతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), సంజయ్ (జగిత్యాల)కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
అధినేత అప్రమత్తం: పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అప్రమత్తమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు కొందరు సీనియర్ నేతలు రెండు రోజులు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాటం చేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతోనూ కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. ఇంకోవైపు కేటీఆర్, హరీశ్‌రావులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో నిరంతరం మాట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా వారితో టచ్‌లోకి వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీలో కొనసాగితే మంచి భవిష్యత్తు: పార్టీలో కొనసాగితే భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత ఉంటుందని కేసీఆర్ భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన తీరు, తర్వాతి కాలంలో వారు రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయిన వైనాన్ని కేసీఆర్ వారికి వివరిస్తున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్సీలను కూడా పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో వారితోనూ బీఆర్‌ఎస్ అధినేత మాట్లాడుతున్నట్లు తెలిసింది. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల్లో భరోసా నింపేందుకు మూడు నాలుగు రోజుల్లో ప్రత్యేక భేటీ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment