సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుండటంతో రెండుసార్లు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో పలువురు బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘సిగ్గుతో తలదించుకోవలసిందే’నని రేవంత్ వ్యాఖ్యానించగా హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపీనాథ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. మీకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలపడంతో సీట్లలో కూర్చున్నారు.
► రేవంత్ ప్రసంగంలో బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శిస్తున్నప్పుడు సభ్యులు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అరుస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.
► రేవంత్ మాటలకు కౌశిక్‌రెడ్డి అడ్డు తగులుతుంటే స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుంటూ ‘కౌశిక్‌రెడ్డి.. కొత్త సభ్యుడివి. సభ నాయకుడు మాట్లాడుతుంటే వినాల్సిందే’అని స్పష్టం చేశారు.
► డ్రగ్స్ మాఫియా గురించి రేవంత్ మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేసేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించగా, ‘వుయ్ సపోర్ట్ యూ’అని పాడి కౌశిక్‌రెడ్డి అరిచారు. దానికి రేవంత్ స్పందిస్తూ ‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన కష్టాలు ఆయనకుంటాయి’అని వ్యాఖ్యానించారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ కట్టడికి సీవీ ఆనంద్ నేతృత్వంలో చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు.
► రేవంత్ మాటలకు కౌశిక్‌రెడ్డి అడ్డు తగిలిన సమయంలో ‘గట్టిగా అరుస్తున్న ఆయన కూడా మేనేజ్‌మెంట్ కోటానే’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment