
కప్పం పేరుతో టీడీపీ కూటమి నేతల బరితెగింపు.. అడ్డగోలుగా ట్యాక్స్ ‘దరువు’
నియోజకవర్గం మీదుగా వెళ్లే గ్రానైట్ లారీలన్నీ కప్పం కట్టాల్సిందేనంటున్న షాడో ఎమ్మెల్యే
మార్కాపురానికి చెందిన లారీ నకరికల్లు వద్ద అడ్డగింత
బిల్లులున్నాయని.. కప్పం ఎందుకు కట్టాలని ప్రశ్నించిన యజమాని
నియోజకవర్గం మీదుగా వెళ్తే చెల్లించాల్సిందేనన్న ‘కే–డీ’ బ్యాచ్
బిల్లులున్నందున తాము అడ్డుకోలేమని చేతులెత్తేసిన పోలీసు, కమర్షియల్ టాక్స్ అధికారులు
వివాదం ముదరడంతో మధ్యవర్తిత్వం నడిపి లారీలను పంపేసిన పోలీసు అధికారి
నిబంధనల ప్రకారం వ్యాపారం చేస్తున్నా ఈ దందా ఏంటని వ్యాపారుల గగ్గోలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీడీపీ కూటమి నేతల వసూళ్ల పర్వానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. అవకాశమున్న ఏ మార్గాన్ని వదిలిపెట్టకుండా నిస్సిగ్గుగా దందాలతో చెలరేగిపోతున్నారు. ఆఖరికి తమ నియోజకవర్గం మీదుగా వెళ్తున్నాయని చెప్పి గ్రానైట్ రవాణా చేస్తున్న లారీలను ఓ షాడో ఎమ్మెల్యే అనుచరులు ఆపి ముక్కుపిండి కప్పం వసూలుచేస్తున్నారు. దీన్నిబట్టి వీరి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. పల్నాడు జిల్లాలో ఈ వసూల్ రాజాల దాదాగిరి కథాకమామిషు చూడండి ఎలా ఉందో..
సత్తెనపల్లి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పేరుపొందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో ‘కే–డీ’ టాక్స్ వసూలుకు ప్రత్యేకంగా ఓ బృందం ఏర్పాటైంది. కొందరు పోలీసులు, కమర్షియల్ టాక్స్ అధికారులు, సిబ్బంది సహకరిస్తుండడంతో ‘కే–డీ’ ట్యాక్స్ వసూలు యథేచ్చగా సాగుతోంది. ముఖ్యంగా నకరికల్లు–పిడుగురాళ్ళ నేషనల్ హైవే, నరసరావుపేట–సత్తెనపల్లి, రాజుపాలెం–కొండమోడు రోడ్లు ఇందుకు కేంద్ర స్థానం. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన కస్టమ్స్, మైనింగ్ ఫీజు చెల్లించినప్పటికీ తమ పరిధి దాటి లారీ వెళ్లాలంటే ‘ట్యాక్స్’ కట్టాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. లేదంటే లారీ ముందుకు కదలదని బెదిరిస్తున్నారు.
బిల్లులున్నా నేనెందుకు కట్టాలి..
ఈ క్రమంలో.. రెండ్రోజుల క్రితం మార్కాపురం నుంచి తెలంగాణకు గ్రానైట్ లోడుతో లారీలు బయల్దేరాయి. నకరికల్లు వద్దకు రాగానే అక్కడే కారులో మాటువేసిన ‘కే–డీ’ ట్యాక్స్ బ్యాచ్ లారీలను అడ్డగించి లారీకి రూ.3,500 చొప్పున కప్పం కట్టాలంటూ రుబాబు చేశారు. కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించామంటూ లారీలో ఉన్న సిబ్బంది బిల్లులు చూపిస్తున్నా అవేమీ తమకు తెలీదని.. లారీ తమ నియోజకవర్గ పరిధిలో నుంచి వెళ్తోంది కాబట్టి చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు.
దీంతో.. లారీ సిబ్బంది విషయాన్ని గ్రానైట్ వ్యాపారికి సమాచారం అందించగా, సదరు వ్యాపారి తనకున్న పరిచయాలను ఉపయోగించినా ఫలితం దక్కలేదు. అప్పటికే లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాటిని సీజ్‌చేసి పెనాల్టీ వేయమని కమర్షియల్ టాక్స్ అధికారులకు ‘కే–డీ’ టాక్స్ బృందం ఆదేశించింది. రంగంలోకి దిగిన మైనింగ్, కస్టమ్స్ శాఖల అధికారులు అన్నీ సక్రమంగా ఉన్నాయని, తాము అడ్డుకోలేమని చెప్పినప్పటికీ ‘పచ్చ’మూకలు ససేమిరా అన్నాయి. సమస్య ముదరడంతో ఓ పోలీసు అధికారి మధ్యవర్తిత్వం నడిపి లారీలను అక్కడి నుంచి పంపేసినట్లు తెలుస్తోంది.
కాదంటే పోలీస్‌స్టేషన్‌కు
తరలింపు..మరోవైపు.. వారం క్రితం ముప్పాళ్ల వైపు నుంచి సత్తెనపల్లి వస్తున్న రెండు గ్రానైట్ లారీలను కూడా ‘కే–డీ’ ట్యాక్స్ బ్యాచ్ ఆదేశాల మేరకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఒక్కో లారీకి రూ.లక్షన్నర చెల్లిస్తే వదిలేస్తామని, లేకుంటే ఇక్కడే ఉంటాయని చెప్పినట్లు సమాచారం. రెండు లారీల్లోని లోడుకు సంబంధించి బిల్లులు కూడా సక్రమంగానే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ పట్టించుకునే వారు లేరు.
ఇదే విధంగా నకరికల్లు పోలీస్‌స్టేషన్‌లోను ఇటీవల మరో మూడు లారీలు నిలిపి తమ పరిధి గుండా లారీలు దాటాలంటే ‘కే–డీ’ ట్యాక్స్ కడితే తప్ప వదిలేదు లేదని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు. దీంతో.. వ్యాపారులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలీక లబోదిబోమంటున్నారు. నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకుంటున్నా ఈ కప్పం గోలేమిటని వారు వాపోతున్నారు.