ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్‌రెడ్డినే కొనసాగించే ఆలోచనలో అధిష్టానం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడెవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ తమ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట అకస్మాత్తుగా బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి కిషన్‌రెడ్డి తాత్కలికంగా బీజేపీ సారథ్య బాధ్యతలు నెట్టుకొస్తున్నారు. అయితే ఫుల్ టైం అధ్యక్షుడిగా రాష్ట్రమంతగా తిరిగి పార్టీని పటిష్టం చేసే నాయకుడికోసం తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం పేరుతో అధిష్టానం బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో పెట్టింది.
అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. కానీ ఇప్పటి వరకు అధ్యక్షుడి నియామకం హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. దానికి ప్రధాన కారణం అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువకావడంతో పాటు, ఒకరిపై ఒకరు పోటాపోటీగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దాంతో అధ్యక్షుడి ఎంపిక బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఒకరికి పదవి ఇస్తే మరొకరు పనిచేయకుండా, సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ ఎంపిక ప్రక్రియను సాగదీస్తోంది.
అయితే, అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు అధిష్టానం పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని తమతమ బలాలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు బలం కాగా, ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. మరో వైపు ధర్మపురి అరవింద్ రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి తన సత్తాను చాటారు. తొలి ప్రయత్నంలోనే కేసీఆర్ కూతరు కవితను ఓడించి అధిష్టానం దృష్టిలో పడ్డ అరవింద్ రెండో సారి కూడా గెలిచి తాను బలమైన నేతనని నిరూపించుకున్నారు.
అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తారని, అందరినీ కలుపుకుపోలేరని ఆయన వ్యతిరేకవర్గం ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల బలాలను, బలహీనతలను అధిష్టానం బేరీజు వేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ బీసీని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈసారి బీసీకే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఫ్లోర్ లీడర్‌గా మహేశ్వర్ రెడ్డిని నియమించిన అధిష్టానం, అధ్యక్ష పదవి బీసీకే అప్పగిస్తామనే సంకేతం పంపింది. ఈ కోణంలో కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లో ఎవరో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్‌రెడ్డిని యథావిధిగా మరికొంత కాలం కొనసాగించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment