యథేచ్ఛగా అక్రమ రవాణా
► చెక్‌పోస్టులు దాటిపోతున్న గ్రానైట్ రాళ్లు
► ప్రభుత్వ ఆదాయానికి గండి
హిందూపురం అర్బన్: గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. అర్థరాత్రి సమయాల్లో కర్ణాటక, జిల్లా సరిహద్దుల నుంచి 10 చక్రాల లారీల్లో భారీ సైజుల్లో గ్రానైట్ రాళ్లు తరలిపోతున్నాయి. జిల్లా సరిహద్దుల నుంచి కర్ణాటకకు అక్రమ మార్గాల్లో రవాణా సాగిస్తున్నారు. క్వారీల నుంచి అర్ధరాత్రి పూట చెక్‌పోస్టు తనిఖీ సిబ్బందికి పైసలు ఇచ్చి కొన్ని, అక్రమ మార్గంలో మరికొన్ని దాటి వచ్చేస్తున్నాయి. దీంతో రూ.లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం నష్టపోతోంది. అంతేకాకుండా క్వారీల్లో ఒక వే బిల్లుతోనే మళ్లీ మళ్లీ రవాణా సాగించి కూడా లబ్ధి పొందుతున్నారు.
చాలాసార్లు గ్రానైట్ వాహనాలు హిందూపురం ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న ఎంవీఐ, పోలీసు అధికారుల కంటపడ్డాయి. వాటిపై చర్యలు తీసుకునే లోపే అధికారపార్టీ నాయకుల నుంచి ఒత్తిడులు తీవ్రతరం కావడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవల ఎంవీఐ అధికారి పది చక్రాల గ్రానైట్ లారీకి ఎలాంటి రికార్డులు లేకపోవడంతో సీజ్ కూడా చేశారు. చిలమత్తూరు మండలంలోని ఫ్యాక్టరీల్లో దాడులు చేసి భారీ మొత్తంలో అపరాధ రుసుం సైతం వసూలు చేశారు. అధికారులు అడపాదడపా తనిఖీలు చేస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
తరలిపోతున్నాయి ఇలా..
మడకశిర సమీపంలోని అగళి, గుడిబండ ప్రాంతాల నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి పూట అధిక టన్నులతో 10, 12 చక్రాల లారీల్లో గ్రానైట్ బండలు తరలిపోతున్నాయి. అనుమతులు లేకపోయినా అక్రమ మార్గంలో వె ళ్తున్నాయి. వేసవికాలంలో గ్రానైట్ బండలకు మంచి డిమాండ్ ఉండడంతో వీటి రవాణా జోరుగా సాగుతోంది. మడకశిర, గుడిబండ ప్రాంతం నుంచి హిందూపురం శివారు మీదుగా వీరాపురం గ్రామంలో నుంచి అదేవిధంగా చిలమత్తూరు మండలం కొడికొండ, కొండూరు గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి కర్ణాటకకు తరలిపోతున్నాయి.
చెక్‌పోస్టు సిబ్బందికి పైసలు ఇచ్చి..
గుడిబండ, అగళి, ఎల్డోడు, గౌరీబిదనూర్, తుమకూరు ప్రాంతాల నుంచి రవాణా సాగుతోంది. అక్కడి చెక్‌పోస్టు సిబ్బందికి పైసలు ఇచ్చి ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సేల్ ట్యాక్స్ శాఖకు భారీగా గండి పడుతోంది. ఒక్కో రాయి రూ.లక్షల్లో ఉంటుంది. అలాగే పాలిషింగ్ చేసిన మూడు, నాలుగు మీటర్ల బండ సుమారు రూ.30 వేల ధర పలుకుతుంది. ఇలాంటివి ఒక్కో ఫ్యాక్టరీ నుంచి 30 నుంచి 40 వరకు రవాణా అవుతుం టాయి. ఈ విధంగా సుమారు వందల సంఖ్యలో లారీల గుండా రవాణా సాగిపోతున్నాయి.