=కొత్త దరఖాస్తులకు {పతిపాదనలు కరువు
=ఎన్‌ఓసీల జారీలో జాప్యం
=పెండింగ్‌లో సుమారు 600 దరఖాస్తులు
సాక్షి, విశాఖపట్నం : గనుల లీజులంటేనే జిల్లా అధికారులు హడలెత్తిపోతున్నారు. బాక్సైట్‌పై ఉద్యమం, ఖనిజ తవ్వకాలపై ఆరోపణల నేపథ్యంలో లీజుల విషయంలో చొరవ చూపడం లేదు. గత ప్రతిపాదనలు తప్ప తాజాగా ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సులు చేయడం లేదు. దీంతో జిల్లాలో సుమారు 600 దరఖాస్తులు ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జిల్లాకు అదనంగా ఆదాయం పెరగడం లేదు. జిల్లాలో బాక్సైట్, క్వార్ట్జ్, కాల్షైట్, లైమ్‌స్టోన్, మైకా, గ్రానైట్‌తో పాటు రోడ్డు, బిల్డింగ్ నిర్మాణ సామగ్రి లభ్యమవుతున్నాయి.
ఏజెన్సీతో పాటు మైదానంలోనూ పలుచోట్ల సహజ సిద్ధంగా ఉన్నాయి. వీటిని లీజుకివ్వడంద్వారా వచ్చే ఆదాయంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో బాక్సైట్ గనులను లీజుకివ్వొద్దని గిరిజనుల ఆందోళన, దేశంలో పలుచోట్ల లీజుకి మించి తవ్వకాలతో ఖనిజాలు లూటీ అవుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి. దీంతో కొత్తగా మైనింగ్ లీజులో కచ్చితత్వం ఉండాలని, సహజ సంపదకు జవాబుదారీ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 2ను జారీ చేసింది.
ఈ క్రమంలో మైనింగ్ లీజు దరఖాస్తును తొలుత తహశీల్దార్‌కు పంపి, సాధ్యాసాధ్యాలపై నివేదిక తెచ్చుకోవాలి. దానిపై ఆర్డీఓ, గనుల శాఖ ఏడీ, డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్ సంయుక్త పరిశీలన చేసిన నివేదిక ఇవ్వాలి. కలెక్టర్ దాన్ని పరిశీలించాక అనుమతులు ఇవ్వడానికి ఇబ్బందుల్లేవని నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వాలి. అనంతరం ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. గతంలో నేరుగా తహశీల్దార్లు ఇచ్చే నివేదిక ఆధారంగా అనుమతులొచ్చేవి.
ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో తహశీల్దార్ స్థాయిలో కొన్ని, ఆర్డీఓ స్థాయిలో కొన్ని, కలెక్టర్ స్థాయిలో కొన్ని పరిశీలన దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 600 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మధ్య నాలుగైదు లీజులు మంజూరైనా అవన్నీ గతంలో ప్రతిపాదించినవే. తాజాగా కొత్తగా ఒక్కటి కూడా ప్రతిపాదించలేదు. జిల్లాలో 450 మైనర్, 40 మేజర్ లీజులున్నాయి. వాటి ద్వారా ఏటా రూ.25 నుంచి 30 కోట్ల ఆదాయం వస్తోంది. కొత్త వాటికి అనుమతులివ్వకపోవడంతో దాదాపు రూ. 10-15 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది.
గ ‘లీజు’లపై హడల్!
Published Tue, Dec 3 2013 12:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement