ప్రభుత్వ ఆదాయంపై ‘బండ’ | Government income 'rock' | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆదాయంపై ‘బండ’

Published Mon, Jan 5 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

ప్రభుత్వ ఆదాయంపై ‘బండ’

ప్రభుత్వ ఆదాయంపై ‘బండ’

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా రవాణాశాఖ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. సక్రమంగా తమకు మామూళ్లు ఇస్తే చాలు ఇష్టం వచ్చినన్ని రాళ్లు తోలుకున్నా పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన అధికారులు స్వయంగా ఓవర్‌లోడ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
 
 నెల్లూరు (దర్గామిట్ట):  మన రాష్ట్రంలో లభించే గ్రానైట్‌కు విదేశాల్లో డిమాండ్ ఉంది. దీంతో కృష్ణపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి ఓడల ద్వారా ఎగుమతి చేస్తారు. దీన్ని ఆసరాగా తీసుకుని జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి సుమారు 200కు పైగా వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళుతుంటాయి.  ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ, గుంటూరు జిల్లా గురిజేపల్లి, కరీంనగర్, వరంగల్, టెక్కలి, వైజాగ్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో గ్రానైట్ రాళ్లను కృష్ణపట్నం, చెన్నై, హొసూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు.

వీటితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అధిక లోడుతో సిమెంట్ వస్తుంది. జిల్లాలో ఇసుక, సిలికా, బొగ్గు తదితర వాటితో నిత్యం చెన్నైకు లారీలు అధిక సంఖ్యలో వెళుతున్నాయి. ఈ వాహనాలన్నీ పరిమితికి మించి అధిక లోడుతో వెళుతున్నా ఆయా శాఖల అధికారులు నెలవారీ మామూళ్లతో మిన్నకుంటున్నారనే ఆరోపణలున్నాయి.  ఆయా సరుకును నాలుగు రకాల వాహనాల్లో చేరవేస్తుంటారు.

ఆరు చక్రాలు కలిగిన వాహనంలో 10 టన్నులు, 14 చక్రాలు కలిగిన వాహనంలో 35 టన్నులు, 18 చక్రాలు కలిగిన లారీలో 40 టన్నులు, 22 చక్రాలు కలిగిన లారీలో 49 టన్నులు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ఆరు చక్రాల వాహనంలో 15 టన్నులు, 14 చక్రాల లారీలో 60 నుంచి 70 టన్నులు, 22 చక్రాల లారీలో 100 టన్నులకు పైగా లోడ్ వేసుకుని రవాణా చేస్తుంటాయి.

పరిమితికి మించితే ప్రతి టన్నుకు రూ.1000 జరిమాన విధించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఓనర్ ఫెనాల్టీ కింద రూ.2 వేలు జరిమానా విధిస్తారు. ఈ విషయం అధికారులకు తెలిసినా మామూళ్లు ముడుతుండడంతో మిన్నకుంటున్నారు. ప్రభుత్వాదాయానికి కోట్లల్లో గండి పడుతున్నా వీరికి ఏ మాత్రం పట్టదు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉమ్మడి తనిఖీ కేంద్రంలోనూ అధిక లోడు వాహనాలకు పచ్చ జెండా ఊపుతున్నారు.  

 రవాణాశాఖకు రూ.కోటి
 నెల్లూరు ఉపరవాణా కమిషనర్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 36 మంది రవాణా అధికారులు ఉన్నారు. వీరితో పాటు పోలీసు, విజిలెన్స్ అధికారులకు కలిపి చెన్నై వరకు మామూళ్లు రూపంలో దాదాపు రూ. 55 వేలు అవుతుందని వాహనదారులే బహిరంగంగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 15 మంది, నెల్లూరులో 21 మంది విధులు నిర్వహిస్తుంటారు.

అధిక లోడ్‌తో వెళుతున్న ఒక్కో వాహనానికి ఒక్కో ఎంవీఐకి రూ. 1000 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్క రవాణాశాఖకు సంబంధించి ఒక్కో వాహనం నుంచి రూ. 36వేలు మామూళ్లు రూపంలో అందుతున్నాయి. ఈ లెక్కన 200 గ్రానైట్ వాహనాలకు సంబంధించి మొత్తం రూ. 12 లక్షలు మూమూళ్లు ఇస్తున్నారు. వీటితో పాటు సిమెంట్, ఇసుక, సిలికా, బొగ్గు తదితర వాటి నుంచి మరో రూ. 28 లక్షలు మామూళ్ల రూపంలో వస్తున్నాయి. అన్నింటితో కలిపి రవాణాశాఖకు దాదాపు రూ.కోటి అందుతోంది.

 ఉమ్మడి తనిఖీ కేంద్రంలో పచ్చజెండా
 అధికలోడుతో ఇతర ప్రాంతాలకు వెళుతున్న వాహనాలకు జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఆయా శాఖాధికారులు పచ్చ జెండా ఊపుతున్నారు. ఒక్కో వాహనం నుంచి రవాణాశాఖ అధికారులు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. కొన్ని రకాల వాహనాల నుంచి రోజువారీ మామూళ్లు తీసుకుంటున్నార్న ఆరోపణలున్నాయి. వీరితో పాటు మైనింగ్, వాణిజ్యశాఖ అధికారులకు కూడా ఆయా వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్టు తెలిసింది.

 పోలీసుశాఖకు..
 అధికలోడుతో వెళుతున్న వాహనాలు పోలీసులకు సైతం మామూళ్లు ఇస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న పోలీసు స్టేషన్‌లో ఉన్న అధికారులుకు ప్రతినెలా మామూళ్లు సమర్పించుకోవాల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు. వాస్తవంగా ఓవర్‌లోడ్‌కు సంబంధించి కేసు నమోదు చేసేందుకు పోలీస్ అధికారులకు సంబంధం లేదు. అధిక బరువు ఉన్న వాహనాన్ని ఆపి రవాణా అధికారులకు పంపిస్తారు. ఈ భయం కారణంగానే వాహనదారులు పొలీసులకు మామూళ్లు ఇస్తున్నారు.

ఒంగోలు నుంచి తడ వరకు పోలీసుస్టేషన్ల వారీగా మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. ఈ లెక్కన ఒక్కో లారీకి సంబంధించి పోలీసుశాఖకు ప్రతి నెలా దాదాపు రూ.12వేలు ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. దాదాపు 200 గ్రానైట్ లారీల నుంచి  రూ. 24 లక్షలు మామూళ్లు అందుతున్నాయి. ఇవిగాక జిల్లా నుంచి వెళుతున్న సిమెంట్, ఇసుక, సిలికా, బొగ్గు, బియ్యం, క్వార్ట్జ్ తదితర ఖనిజాలకు సంబంధించి రవాణా చేస్తున్న వాహనాల నుంచి సుమారు మరో రూ.2లక్షల వరకు మామూళ్లు ఇస్తున్నట్టు వాహనదారులు చెబుతున్నారు.

 విజిలెన్స్ శాఖకు..
 ఇతర శాఖల అధికారుల అవినీతిని ప్రశ్నించాల్సిన విజిలెన్స్ అధికారులకు కూడా అధిక లోడ్‌తో వెళుతున్న వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయి. గ్రానైట్ రాళ్లతో వెళుతున్న ఒక్కో వాహనం నుంచి దాదాపు రూ. 4,500 మామూళ్లు ఇస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.

 మంత్రి ఇలాకా నుంచే..
 రవాణాశాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం నుంచే ఎక్కువగా అధిక లోడు వాహనాలు వెళుతున్నాయి. చీమకుర్తి నుంచి దాదాపు 100కు పైగా వాహనాలు నిత్యం ఇతర ప్రాంతాలకు పోతున్నాయి. మంత్రికే స్వయంగా గ్రానైట్ క్వారీ ఉండడంతో ఆ వాహనాలకు కేసులు నమోదు చేసేందుకు రవాణా అధికారులు జంకుతున్నారు. ఇటీవల కొంతమంది అధికారులను తన వద్దకు పిలిపించుకుని గ్రానైట్ రాళ్లతో వెళుతున్న వాహనాలను చూసీచూడనట్టు పొమ్మని సూచించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement