నిలిచిపోయిన ఆర్సీ, లైసెన్స్ స్మార్ట్ కార్డుల సరఫరా
చార్జీలు చెల్లించకపోవటంతో బట్వాడా నిలిపేసిన పోస్టల్ శాఖ
ఆర్టీఏ కార్యాలయాల్లో పేరుకుపోయిన 2 లక్షల కార్డులు
15 నెలలుగా పోస్టల్ చార్జీలు చెల్లించని రవాణాశాఖ
వాహనదారుల నుంచి చార్జీలు వసూలు చేసి సొంత ఖాతాలోకి..
తపాలా శాఖకు రూ.2 కోట్ల బకాయి ఉన్నట్లు సమాచారం
కార్డులు రాక కష్టాలు పడుతున్న వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు
వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది.
రూ.4 కోట్లు వసూలు చేసినా..
గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.
ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్‌లైన్‌లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది.
తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు.
Comments
Please login to add a commentAdd a comment