‘స్మార్ట్’ వ్యథ!
► డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీలో నిర్లక్ష్యం
► వాహనదారులకు చేరవేయడంలో విఫలం
► ఆర్టీఏ, పోస్టల్ శాఖల మధ్య సమన్వయ లోపం
► నెలలు గడిచినా అందని స్మార్ట్‌కార్డులు
► వాహనదారులపై ఈ చలాన్ ల మోత
సాక్షి, సిటీబ్యూరో
బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన నారాయణరావు మూడు నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. నిబంధనల మేరకు ఆన్ లైన్ స్లాట్ నమోదు చేసుకొని, ఈ సేవ ద్వారా ఫీజులు చెల్లించి, స్మార్ట్ కార్డు ఇంటికి స్పీడ్ పోస్టు చేసేందుకు అయ్యే రుసుము కూడా ఈ సేవా ద్వారానే చెల్లించి అధికారుల వద్దకు వెళ్లాడు. డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ ప్రక్రియను ముగించిన అధికారులు.. మరో వారంలో స్మార్ట్‌కార్డు పోస్టులో నేరుగా ఇంటికే వస్తుందన్నారు.
♦ గతేడాది నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు ఆయన అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 3 నెలల క్రితమే కార్డు పోస్టు చేశామని చెప్పారు ఆర్టీఏ ఉద్యోగులు.
♦ ఇప్పుడు ఆ స్మార్ట్‌కార్డు సంబంధిత వినియోగదారుడు పేర్కొన్న చిరునామాకు చేరలేదు. అలాగని వెనక్కి తిరిగి రాలేదు. రవాణా అధికారుల వద్దకు తిరిగి రాకుండా, వాహనదారుడి చిరునామాకు చేరుకోకుండా ఆ విలువైన డ్రైవింగ్ లైసెన్సు స్మార్ట్ కార్డు ఏమైనట్లు...
♦ ఇది ఒక్క నారాయణరావు సమస్య మాత్రమే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు వందలాది వినియోగదారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య.
♦ డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ ల కోసం వందల రూపాయల ఫీజులు చెల్లించినప్పటికీ సకాలంలో అందక అనేక మంది వినియోగదారులు ఆర్టీ ఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు.
బాధ్యతారాహిత్యం...
గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3500 మంది వరకు వాహనాల రిజిస్ట్రేషన్ లు, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవలను పొందుతారు. ఈ వినియోగదారులందరికీ స్పీడ్ పోస్టు ద్వారా స్మార్ట్‌కార్డులను అందజేయవలసి ఉంటుంది. గతంలో వినియోగదారులకే ప్రత్యక్షంగా అందజేసే పద్ధతికి స్వస్తి చెప్పి స్పీడ్ పోస్టును ప్రవేశపెట్టారు. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పద్ధతిలో వినియోగదారుల చిరునామా ధృవీకరణ ప్రధానమైన అంశం.
కానీ ఆచరణలో మాత్రం లక్ష్యం నీరుగారుతోంది. కొన్నిసార్లు వినియోగదారులే సరైన చిరునామా నమోదు చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతుండగా చాలా సార్లు పోస్టల్ శాఖ బాధ్యతారాహిత్యం, రవాణా అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో స్మార్ట్‌కార్డులు వినియోగదారులకు చేరడం లేదు. కొన్ని స్మార్ట్‌కార్డులపై పోస్టల్ సిబ్బంది ‘డోర్‌లాక్’ అని ముద్ర వేసి వెనక్కి పంపుతుండగా, చాలా వరకు నెలలు దాటినా ఇటు ఆర్టీఏకు వెనక్కి తిరిగి రాక, అటు వినియోగదారుడికి చేరకుండా మధ్యలోనే బుట్టదాఖలా అవుతున్నాయి. ఇలాంటి వాటిపై రెండు శాఖల్లో ఎలాంటి సమన్వయం, నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం.
ఇదేం స్పీడ్‌పోస్ట్?
♦ ప్రతి రోజు గ్రేటర్ పరిధిలో సుమారు 3500 స్మార్ట్ కార్డులు బట్వాడా చేయవలసి ఉంటుంది. వివిధ కారణాల వల్ల వాటిలో 35 శాతం కార్డులు పెండింగ్‌లో పెట్టేస్తారు.
♦ బట్వాడా చేసిన 65 శాతం కార్డులలో కనీసం 15 శాతం కార్డులు వినియోగదారులకు చేరడం లేదు.
♦ మొత్తంగా రోజుకు 500 నుంచి 600 స్మార్ట్‌కార్డులు వినియోగదారులకు బట్వాడా కావడం లేదు.
♦ స్పీడ్ పోస్టు అంటే కనీసం 48 గంటల్లోనైనా వినియోగదారుడికి ఆ పోస్టు అందాలి. కానీ ఆర్టీఏ బట్వాడా చేసే కార్డులు వినియోగదారుడికి చేరేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 15 రోజులు కూడా దాటుతోంది.
♦ ఇక నెలలు దాటినా పౌరసేవలను అందుకోలేకపోతున్న సగటు వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.