Smart cards
-
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
ఇక వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లూ షోరూంలలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ తాజాగా కసరత్తు చేపట్టింది. వాహన యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విధానం ఏపీలో విజయవంతంగా అమలవుతుండటంతో ఇక్కడ సైతం అదే పద్ధతిని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజా్ఙనం తదితర అంశాలపై ఈ కసరత్తు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్‌లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు... కేంద్రం ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలి్పంచే అనేక అంశాలను పొందుపరిచింది. వాహనాల రిజి్రస్టేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతోపాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది. గ్రేటర్లో భారీగా వాహనాల అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు 2,500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1,600కుపైగా ద్విచక్ర వాహనాలుకాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు వందల సంఖ్యలో శాశ్వత రిజి్రస్టేషన్ల వల్ల వాహనాల రద్దీతోపాటు అందరి సమయం వృథా అవుతోంది. అలాగే ఆన్లైన్లో స్లాట్ నమోదు మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. షోరూం రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తే దళారుల అక్రమ దందాకు తెరపడనుంది. -
18 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ చకచకా కొనసాగుతోంది. మొత్తం మీద 1.42 కోట్ల కార్డులను పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 18,06,084 కార్డులను గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన కార్డులను కూడా శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అలాగే 2019కి ముందు 1,059గా ఉన్న ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచింది. ఈ నేపథ్యంలో పెరిగిన ప్రయోజనాలతో కూడిన కొత్త కార్డులను ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. అంతేకాకుండా వాటిపైన అవగాహన కల్పిస్తోంది. ఒక్కో వారం నియోజకవర్గంలో నాలుగు వరకు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన, ప్రచారం, కార్డుల పంపిణీ కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. మరింత సులభంగా వైద్య సేవలు పొందేలా.. సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రతి కార్డులో కుటుంబ యజమాని పేరు, జిల్లా, మండలం, గ్రామ/వార్డు సచివాలయం వివరాలతో పాటు, సంబంధిత కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు, వారి పేర్లు, ఇతర వివరాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్, యూనిక్ హెల్త్ ఐడెంటిటీ నంబర్ (యూహెచ్ఐడీ) కూడా పొందుపరుస్తున్నారు. వైద్యం కోసం నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆరోగ్యమిత్ర, వైద్యులు సులువుగా రిజి్రస్టేషన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. దీంతో మరింత వేగంగా, సులభంగా ప్రజలు వైద్య సేవలు పొందొచ్చు. యాప్ ద్వారా సేవలు.. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్య సేవలు పొందడం ఎలాగో ప్రజలకు సులువుగా అర్థం కావడానికి ప్రత్యేకంగా బ్రోచర్లను కూడా వైద్య సిబ్బంది అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రచార కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల మొబైల్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. యాప్‌ను ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 64,15,515 ఆరోగ్యశ్రీ కార్డుదారులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, అందులో లాగిన్ అయ్యారు. వంద శాతం లబ్ధిదారులకు యాప్ సేవలను చేరువ చేసేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఈ యాప్ ఫోన్లో ఉంటే అరచేతిలో ఆరోగ్యశ్రీ ఉన్నట్టే అనే చందంగా ప్రభుత్వం యాప్‌లో ఫీచర్లను పొందుపరిచింది. పథకం కింద అందే వైద్య సేవలు, రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల ఉండే నెట్వర్క్ ఆస్పత్రులు, వాటిల్లో ఏ ప్రొసీజర్స్‌కు వైద్యం చేస్తారనే సమాచారం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఏ ఆస్పత్రి ఉందో తెలుసుకుని, అక్కడకు చేరుకోవడానికి ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక గతంలో పథకం ద్వారా పొందిన చికిత్సలు, రిపోర్ట్‌లను సైతం ఒక్క క్లిక్‌తో పొందడానికి వీలుంది. -
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ : పేదలకు ఆరోగ్యమస్తు
సాక్షి, అమరావతి: వైద్యం కోసం పేదలు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేశామని, ఇది ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమని, గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వ వైద్య రంగం స్వరూపాన్ని మార్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వ్యయం పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే సిబ్బంది ఉండరనే దుస్థితిని మన ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందన్నారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 53,126 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ లాంటి వైద్య సిబ్బందిని నియమించి మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో కేవలం 3.96 శాతం మాత్రమే ఉందని, ఈ కొరతను కూడా అధిగమించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇక జాతీయ స్థాయిలో నర్సుల కొరత 27 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా అని తెలిపారు. జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత 33 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా స్థాయికి తెచ్చామని, నూటికి నూరు శాతం పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు పొందడానికి ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్లాలి? చికిత్స వ్యయం ఎంతవరకు వర్తిస్తుంది? తదితర సందేహాలను సంపూర్ణంగా నివృత్తి చేస్తూ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను లబ్ధిదారులకు అందజేసి విస్తృత అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, స్మార్ట్ కార్డుల పంపిణీ, లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాలను సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ.. 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరింత మందికి ఆరోగ్యశ్రీ అందించాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని పథకం పరిధిలోకి తెచ్చాం. దీంతో 1.48 కోట్ల కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. తద్వారా 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా కల్పించాం. 2019 నాటికి ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2,300 వరకు కొత్తగా పథకం పరిధిలోకి తెచ్చాం. అనంతరం మరికొన్ని చేర్చి ఇవాళ 3,257 ప్రొసీజర్లతో ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన సందర్భాల్లో ఏ ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. గత సర్కారు హయాంలో అరకొర సేవలతో కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితమైంది. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కలిపి 2,513 ఆస్పత్రులకు సేవలను విస్తరించాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోనూ 204 కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తున్నాం. ఆరోగ్య సంరక్షణకు రూ.14,439 కోట్లు గత సర్కారు ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కోసం కేవలం రూ.5,171 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ.1,034 కోట్లు మాత్రమే వెచ్చించిన దుస్థితి. 2014–19 మధ్య 108, 104 సేవల కోసం రూ.729 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏడాదికి సగటున రూ.4,100 కోట్లు వ్యయం చేస్తున్నాం. దీనికి అదనంగా ఏటా మరో రూ.300 కోట్లు 104, 108 సేవల కోసం ఖర్చు పెడుతున్నాం. ఆరోగ్యశ్రీ, 104, 108 కోసం గత సర్కారు రూ.5,900 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా మనం ఏటా ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే రూ.14,439 కోట్లు వెచ్చించాం. గత సర్కారు హయాంలో 22.32 లక్షల చికిత్సలు అందించగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీతో 53 లక్షల చికిత్సలు అందించగలిగాం. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ నాడు – నేడు ద్వారా పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రి వరకూ అన్ని స్థాయిల్లో సదుపాయాలు కల్పించాం. 2019కు ముందు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా ఇవాళ కొత్తగా మరో 17 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతున్నాం. గతంలో 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి. నాడు 108 వాహనాలు కేవలం 336 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు మొత్తం 2,204 వాహనాలను అందుబాటులో ఉంచాం. చికిత్సానంతరం ఆసరా.. ఆరోగ్యశ్రీ కింద పేదవాడికి ఉచిత వైద్యం అందించడమే కాకుండా చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున, రెండు నెలలు అయితే రూ.10 వేలు పేదవాడి చేతిలో పెట్టి మరీ ఇంటికి పంపుతున్నాం. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,309 కోట్లు అందించాం. లక్షలు ఖర్చయ్యే ప్రాణాంతక వ్యాధులకూ.. గతంలో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్స ఖర్చు రూ.5 లక్షలు దాటితే ఇచ్చేవారు కాదు. కీమోథెరపీ లాంటిది ప్రారంభిస్తే కేవలం రెండు మూడు డోసులకే రూ.5 లక్షలు ఖర్చు అయిపోతాయి. దీంతో ఇక ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేమని వెనక్కు పంపడం లేదంటే నామమాత్రంగా చికిత్స చేసేవారు. 6 నెలలు తర్వాత ఆ పేషెంట్‌కు మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టడంతో వైద్యం అందక చనిపోయిన దుస్థితి ఉండేది. ఇప్పుడు చికిత్స వ్యయంతో పని లేకుండా పూర్తిస్థాయిలో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నాం. రూ.12 లక్షల ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు రెండు చెవులకూ చేయిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల్లో రూ.11 లక్షలు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయిస్తున్నాం. రూ.11 లక్షలయ్యే గుండె మార్పిడి చికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డ 1,82,732 మందికి ఆరోగ్యశ్రీతో ఉచితంగా చికిత్స అందించి తోడుగా నిలబడ్డాం. ఒక్క క్యాన్సర్ చికిత్సకే ఏకంగా రూ.1,900 కోట్లు ఖర్చు చేశాం. 60.27 లక్షల మందికి ఫేజ్ 1లో వైద్య సేవలు ఫేజ్ 1 ఆరోగ్య సురక్షను 50 రోజుల పాటు నిర్వహించాం. 60,27,843 మంది వైద్య సేవలు అందుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పంపిణీ చేసే ప్రతి ఔషధం డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నాం. 562 రకాల మందులను అందుబాటులోకి తెచ్చాం. ప్రివెంటివ్ కేర్‌తో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి వైద్యం అందిస్తూ అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశంలో తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా తెచ్చాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతి పీహెచ్‌సీలోనూ ఇద్దరు డాక్టర్లు చొప్పున నలుగురు వైద్యులను అందుబాటులోకి తెచ్చాం. పాల్గొన్న ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ, ఎంఏయూడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రచార కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు పొందటాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియచేసే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. మంగళవారం నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల్లో వీటిని ప్రారంభిస్తారు. ఇలా ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పున కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో ఏఎన్ఎంలు, సీహెచ్‌వోలు ఒక బృందంగా, మరో బృందంలో ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపేవారు పాలు పంచుకుంటారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరించాలి. ఇంట్లో కనీసం ఒకరి మొబైల్ ఫోన్లోనైనా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించాలి. మహిళా పోలీసులు కూడా ఇందులో పాల్గొని దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. ఆరోగ్యశ్రీ సేవలపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన 6 నిమిషాల వీడియో సందేశాన్ని ఆయా కుటుంబాలకు చూపించాలి. వారి ఫోన్లలో కూడా ఈ వీడియోను ఉంచండి. సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ కార్డుల్లో సరికొత్త ఫీచర్లున్నాయి. ఇవి స్మార్ట్ కార్డులు. ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. పేషెంట్లకు సంబంధించిన అన్ని వివరాలూ నిక్షిప్తం అవుతాయి. దీంతో వైద్యులు సులభంగా వైద్యం అందించడానికి వీలవుతుంది. ఇది ఈ కార్డులో విశిష్టత. వీటిని ప్రతి ఇంట్లో చక్కగా వివరించాలి. వైద్య రంగంలో అద్భుతాలు ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉండాలన్న గొప్ప ఆలోచనతో అత్యున్నత స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తూ సీఎం జగన్ వినూత్న సంస్కరణలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. నాడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రాణం పోస్తే నేడు సీఎం జగన్ మరింత విస్తరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా జగనన్న ప్రభుత్వం వైద్య శాఖలో 53 వేలకుపైగా నియామకాలు చేపట్టిన ఘనత దక్కించుకుంది. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా, గుమ్మం వద్దకే ఫ్యామిలీ డాక్టర్, పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారు. వైద్యులు రోగిని కాపాడి మిరాకిల్స్ చేస్తారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జనవరి 1 నుంచి ‘సురక్ష’ ఫేజ్–2 జనవరి 1వతేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక గ్రామంలో సురక్ష శిబిరం నిర్వహిస్తారు. మండలాన్ని రెండుగా విభజించి ఒక డివిజన్లో మంగళవారం, మరో డివిజన్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. ఉచితంగా మందులు కూడా డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పటికే ట్రైల్ రన్ ప్రారంభించాం. జనవరి ఒకటో తేదీ నుంచి మందులు ఉచితంగా డోర్ డెలివరీ ద్వారా అందుతాయి. రిఫరెల్ కేసుల వివరాలు తెలుసుకుని డాక్టర్ వద్దకు పంపించే కార్యక్రమం విలేజ్ క్లినిక్స్ ద్వారా జరుగుతుంది. రోగులకు ప్రయాణ ఖర్చుల కింద రూ.300 ప్రభుత్వమే అందిస్తుంది. వీటిని జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా చేపడతారు. -
ప్రతీ ఇంటా ఆ రెండు యాప్‌లు ఉండాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రాంభించారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని.. అందుకే దాని పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారాయన. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం. వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నాం. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం. విప్లవాత్మక మార్పులు ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుంది. క్యూఆర్ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఆరోగ్య వివరాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ మార్పులు.. విప్లవాత్మకమైన మార్పులు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యం. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం. పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం. ప్రతీ ఇంట తప్పనిసరి ప్రతీ ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌లు ఉండాలి. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో పేషెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ వివరాలు అన్నీ డాక్టర్లకు తెలుస్తాయి. ఆరోగ్య శ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు. ఇప్పటికే డోర్ డెలివరీకి సంబంధించి ట్రయల్ రన్ స్టార్ట్ చేశాం. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తాం. గత ప్రభుత్వంతో పోలిస్తే.. రాష్ట్రంలో ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాం. కాన్సర్‌లాంటి వ్యాధులకు సైతం ఆరోగ్య శ్రీ వర్తింపజేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 104,108 వాహనాలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఇవాళ ఏకంగా 104 ,108 కింద 2,200 వాహనాలు తిరుగుతున్నాయి. గతంలో మండలానికి ఒక 104,108 కూడా లేని పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా డాక్టర్లు కూడా లేని పరిస్థితి. ఇవాళ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4వేల 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం. గత ప్రభుత్వం రూ.5 లక్షలు కూడా ఇచ్చేది కాదు. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61శాతం ఉంటే.. రాష్ట్రంలో 3.3శాతం మాత్రమే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది. వీటినికూడా ఖాళీలు లేకుండా చూసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం’’ అని సీఎం జగన్ చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుంది. ఎప్పుడూ కూడా లేని విధంగా మార్పులు తీసుకు వస్తూ ముందడుగు వేస్తున్నాం. ఆరోగ్య శ్రీని వినియోగించుకోవడంపై ప్రతీ సందేహాన్ని తీరుస్తూ ఆరోగ్య శ్రీకార్డులు ఇస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వచ్చాం. 1059 చికిత్సలకు మాత్రమే గతంలో ఆరోగ్య శ్రీ వర్తించేంది. ఇప్పుడు ఆ సంఖ్యను 3,257 చికిత్సలకు పెంచాం. పేదవాళ్లు అప్పులు పాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్‌లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్య శ్రీని వర్తింపు చేశాం. చికిత్సల సంఖ్యను పెంచడం, ఆరోగ్య శ్రీ సేవలను ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం వరకూ ఉన్నవారికి వర్తింపు చేయడం, అలాగే రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని వర్తింపు చేయడం ఇవన్నీ కీలక మార్పులు. చికిత్స తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకునేవారికి నెలకు రూ.5వేల చొప్పున ఆరోగ్య ఆసరా ఇచ్చాం. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,310 కోట్లు చెల్లించాం. ఆరోగ్య శ్రీ కింద ఈ ప్రభుత్వంలో 53,02,816 మంది చికిత్స తీసుకున్నారు. పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లను ఉచితంగా చికిత్సలు అందించాం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ.1,897 కోట్లు ఖర్చు చేశాం. ఎప్పుడూ చూడని విధంగా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. జాతీయస్థాయిలో నర్సుల కొరత 27 శాతం అయితే, మన రాష్ట్రంలో సున్నా. జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత 33 శాతం అయితే మన రాష్ట్రంలో వీరి కొరత సున్నా స్థాయికి తీసుకు వచ్చాం. నూటికి నూరుశాతం భర్తీచేశాం. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లోకి వెళ్తే మందులు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారాయన. అలాంటి పరిస్థితులను మారుస్తూ ప్రభుత్వం పంపిణీ చేసే ప్రతి మందుకూడా డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు మాత్రమే ఉండేట్టుగా అడుగులు వేశామన్నారాయన. ప్రజలకు 562 రకాల మందులు అందుబాటులోకి తీసుకు వచ్చాం. ప్రివెంటివ్ కేర్‌ను విప్లవాత్మకంగా తీసుకురావడం జరిగింది. ప్రివెంటివ్ కేర్‌లో భాగంగా 10,032 విలేజ్ క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 24 గంటల సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడ్డాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను కూడా తీసుకు రావడం జరిగింది. మండలానికి నలుగురు డాక్టర్లను తీసుకురావడం జరిగింది. ఇద్దరు పీహెచ్‌సీల్లో ఉంటే, మరో ఇద్దరు ఫ్యామిలీ డాక్టర్ సేవలకు వెళ్తున్నారు. విలేజ్ క్లినిక్స్‌తో వీరు అనుసంధానం అయ్యారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ నాడు – నేడు కింద కార్యక్రమాలు చేపట్టాం. అని అన్నారాయన. ఆరోగ్యశ్రీ కోసం వివరంగా చెప్పే కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం రేపటినుంచి నియోజకవర్గంలో 5 గ్రామాల్లో ఆరోగ్య శ్రీ కార్డులు, అలాగే ఆరోగ్య శ్రీపై ప్రచారం కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. దీని తర్వాత ప్రతి ఇంటికీ ఆరోగ్య శ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా, ఇచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ కింద సేవలు ఎలా పొందాలన్నదానిపై వివరాలు చెప్పాలి. కనీసం ఒకరి ఫోన్లోనైనా ఆరోగ్య శ్రీయాప్ను డౌన్లో చేయించి, రిజిస్ట్రేషన్ చేయించాలి. దీని తర్వాత ప్రతివారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున కార్డుల పంపిణీ, ప్రచారం కార్యక్రమం జరుగుతుంది. ఏఎన్ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవాళ్లు, ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేకునేవాళ్లుకూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఎలాగూ ఈకార్యక్రమం జరుగుతుంది కాబట్టి, మహిళా పోలీసులుకూడా ఇందులో పాల్గొని దిశ యాప్‌ను కూడా డౌన్లోడ్ చేయాలి. ప్రతి ఇంట్లో మహిళల ఫోన్లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. ఈ రెండూ కచ్చితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమం గుర్తించిన రోగులకు సంబంధించి వారిని డేటా బేస్‌లోకి తీసుకు వచ్చి, వారికి సరిగ్గా చేయూత నిస్తున్నారా? లేదా? అని చూడాలి. డాక్టర్ రిఫరెల్, అంతేకాక వారికి కావాల్సిన మందులు అందుతున్నాయా? లేవా? అనే దానిపై సమీక్ష చేయాలి. ఉచితంగా మందులు కూడా డోర్‌డెలివరీ చేస్తున్నాం. జనవరి -1 నుంచి కూడా వారికి ఉచితంగా డోర్‌డెలివరీ ద్వారా అందుతాయి. ఆరోగ్య సిబ్బంది నుంచి ఇండెంట్ పంపితే వెంటనే సెంట్రల్ డ్రగ్ స్టోరీ నుంచి వారికి మందులు పోస్టుల్ సర్వీసుద్వారా విలేజ్ క్లినిక్‌కు అందుతాయి. అక్కడనుంచి ఆరోగ్య సిబ్బంది వారికి మందులను అందిస్తారు. రిఫరెల్ కేసులకు సంబంధించి ప్రయాణ ఖర్చుల కింద రూ.300లను ప్రభుత్వమే అందిస్తుంది. ఇవన్నీకూడా జగనన్న ఆరోగ్య సురక్ష-2లో భాగంగా చేపడతారు. జనవరి 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక గ్రామంలో హెల్త్ క్యాంపు జరుగుతుంది. ఈ పద్ధతిలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు రిపీట్ అవుతుంది. ప్రతివారం మంగళవారం, శుక్రవారం ఈ క్యాంపులు జరుగుతాయి. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ప్రతి బుధవారం జరుగుతాయి: ఆరోగ్య సురక్ష ఫేజ్-1ను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాం. దాదాపుగా 60.27 లక్షల మంది సేవలు పొందారు. 2.4 లక్షల మందికి బీపీ లక్షణాలు కనిపిస్తే వారికి తిరిగి నిర్ధారణ చేశాం: 1.48 లక్షల మందికి సుగర్ ఉన్నట్టుగా కనిపిస్తే, నిర్ధారణ పరీక్షలు చేశాం. వీరికి మందులు కూడా ఇచ్చాం. నిర్ధారణ పరీక్షలు జనవరి 1 నాటికి పూర్తవుతాయి. ఇదికూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై 6 నిమిషాల వీడియో కూడా మీ అందరి ఫోన్లకు పంపిస్తున్నాం. దీన్ని కుటుంబాలన్నింటికీ చూపించండి. వారిఫోన్లలో కూడా వీడియోను ఉంచండి అని సీఎం జగన్ ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖకు, అధికారులకు సూచించారు. -
CM Jagan: మరింత ‘స్మార్ట్’గా ఆరోగ్యశ్రీ
CM YS Jagan Launch Mega Aarogyasri Awareness Programme Updates సీఎం జగన్ మాట్లాడుతున్నారు.. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ క్యూఆర్ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఇతర వివరాలు ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలి ఆరోగ్యశ్రీ మార్పులు.. విప్లవాత్మకమైన మార్పులు ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యం రాష్ట్రంలోని 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4వేల 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం గతంలో రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదు రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం తాడేపల్లి కార్యక్రమంలో.. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ ► సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం. పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సంబంధిత శాఖ అధికారులు ► కాసేపట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ► ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ.25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు. ► పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం. ► దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది. కొత్త కార్డుల్లో ఏముంటాయంటే.. క్యూఆర్ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ క్యూఆర్ కోడ్‌తో లాగిన్ ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలు రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం అవగాహన అందరికీ.. ► ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ద్వారా.. లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో డౌన్లోడ్ చేయించాలి ► యాప్ ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తిచేసే కార్యక్రమం ఇది ► అలాగే కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా ప్రతీ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలి ఇదీ చదవండి: జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 జనవరి 1 నుంచి.. -
ఇక రూ.25లక్షల వరకు ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుడుతున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దుతూ దానిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమంతోపాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల జారీని కూడా ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. అలాగే, లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో డౌన్లోడ్ చేయించడం.. దాని ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తిచేసే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇక కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా ప్రతీ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా చూస్తారు. తద్వారా 1.48 కోట్ల కుటుంబాలకు, 4.25 కోట్ల మంది లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పిస్తారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 ఇక జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి ప్రతీవారం గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో ప్రతీవారం ఒక వార్డు పరిధిలో సురక్ష శిబిరాలు నిర్వహిస్తారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు మందులు చేరవేసి అక్కడి నుంచి ఏఎన్ఎంల ద్వారా సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు నేరుగా ఇంటివద్దనే డబ్యుహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలుగల మందులు ఉచితంగా అందిస్తారు. ♦ ఈ మందులు అయిపోయిన తరువాత వాటి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేకుండా విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌తో అనుసంధానం చేసి డోర్ డెలివరీ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. కొత్త కార్డుల ఫీచర్లు ఇవే.. ♦ ప్రతీ కార్డులో క్యూఆర్ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ ఉంటుంది. ♦ ఈ క్యూఆర్ కోడ్‌తో లాగిన్ అవడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు. ♦ అలాగే, ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలుంది. ♦ దీని ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన.. మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం కానుంది. -
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్‌లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
Telangana: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఇక చిప్ లేకుండానే జారీ కాబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి చిప్ లేని కార్డులను రవాణాశాఖ జారీచేయనుంది. గతంలో విచ్చలవిడిగా నకిలీ కార్డులు రావడంతో వాటిని అడ్డుకునే క్రమంలో రవాణాశాఖ చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. కానీ 40 రోజులుగా చిప్‌ల కొరతతో కార్డుల జారీ నిలిచిపోయింది. ఆరు లక్షల వరకు కార్డుల జారీ పేరుకుపోయింది. విదేశాల నుంచి చిప్‌ల దిగుమతి నిలిచిపోవటంతో తప్పనిస్థితిలో మళ్లీ పాతపద్ధతిలో కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. కార్డులు లేకపోవటంతో తనిఖీల్లో పోలీసులు చలానాలు రాస్తుండటం, రాష్ట్ర సరిహద్దుల్లో సమస్యలు ఎదురవుతుండటంతో గందరగోళంగా మారింది. ఈ మొత్తం పరిస్థితిని వారం కిందట ‘తైవాన్ చిప్ ఆగింది.. కార్డుల జారీ నిలిచింది’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో నిలిచిపోయిన కార్డులన్నింటినీ చిప్‌లు లేకుండా వెంటనే జారీ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. చిప్ లేని కార్డుల జారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకుంది. మళ్లీ రెండుమూడు నెలల్లో చిప్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్న రవాణాశాఖ.. అప్పటి వరకు చిప్ లేకుండానే కార్డులను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చిప్ ఉన్నా రీడర్లు లేవు.. వాహనం, దాని యజమానికి సంబంధించిన వివరాలను చిప్‌లో నిక్షిప్తం చేసి దాన్ని స్మార్ట్‌కార్డులో పొందుపరుస్తారు. పోలీసులు తనిఖీ సమయంలో కార్డును చిప్ రీడర్ పరికరం ముందు ఉంచగానే ఆ వివరాలు ఆ రీడర్లో కనిపిస్తాయి. కానీ మన అధికారుల వద్ద పరిమితంగానే చిప్ రీడర్లు ఉన్నాయి. దీంతో చిప్‌ఉన్నా దాని ఆధారంగా వివరాలు స్కాన్ చేసే వీలు లేకుండాపోయింది. ఇప్పుడు చిప్ లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదన్న భావనతో చిప్ లేని కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఇప్పుడు చిప్ లేని కార్డుల జారీ మొదలైతే మళ్లీ నకిలీ కార్డులతో కేటుగాళ్లు దందా చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరలో చిప్‌లు తెప్పించి మళ్లీ చిప్ ఉండే కార్డులను జారీచేస్తామని రవాణాశాఖ చెబుతోంది. గతంలో చైనా, ఉక్రెయిన్, తైవాన్ దేశాల నుంచి చిప్‌లు దిగుమతి అయ్యేవి. చైనా నుంచి దిగుమతిని కేంద్రం నిషేధించగా, యుద్ధంతో ఉక్రెయిన్ చిప్‌లు రావడంలేదు. స్థానికంగా వినియోగం పెరగడంతో తైవాన్ కూడా ఆపేసింది. -
ఆర్సీలు, లైసెన్సులు రావట్లే!
సాక్షి, హైదరాబాద్: సుధీర్ నెల క్రితం కొత్త వాహనం కొన్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తయింది. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డు మాత్రం అతనికి అందలేదు. కర్నూలుకు వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఫోన్లో ఉన్న ఆర్సీని చూపాడు. కానీ స్మార్ట్ కార్డు కావాల్సిందేనని పట్టుబట్టిన అధికారులు, రూ.4 వేల ఫైన్ వసూలు చేశారు. కార్డు సిద్ధమైనా బట్వాడా జరగకపోవడమే ఇందుకు కారణం. ఒక్క ఆర్సీ కార్డులే కాదు.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యువల్స్, డూప్లికేట్లు సంబంధిత స్మార్ట్ కార్డులు తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రోజుకు దాదాపు 15 వేలకు పైగా కార్డులు సిద్ధమవుతాయి. వీటిని స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారులకు పంపాలి. బట్వాడా చేసే బాధ్యత తపాలాశాఖది. కానీ గత రెండు నెలలుగా తపాలాశాఖ ఆ బట్వాడా జరపటం లేదు. దీంతో కార్డులన్నీ కార్యాలయాల్లోనే ఉండిపోతున్నాయి. బట్వాడా ఎందుకు నిలిచింది? ఏ స్మార్ట్ కార్డునైనా ఆ ప్రక్రియ పూర్తయిన వారం రోజుల్లో వాహనదారులకు పంపాలి. స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు బట్వాడా చేసినందుకు ప్రతి కార్డుకు రూ.17 చొప్పున పోస్టల్ చార్జీ కింద తపాలా శాఖకు రవాణా శాఖ చెల్లిస్తుంది. అయితే దాదాపు ఏడాది కాలంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఏకంగా రూ.నాలుగైదు కోట్ల మొత్తాన్ని రవాణా శాఖ బకాయి పడింది. ఆ బకాయిల కోసం అడిగీఅడిగీ విసిగిపోయిన తపాలా శాఖ రెండు నెలల క్రితం బట్వాడా నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజల దగ్గర రెట్టింపు వసూలు చేస్తున్నా.. వాహనదారులు ఆయా సేవల కోసం రవాణా శాఖలో దరఖాస్తు చేసినప్పుడే, నిర్ధారిత ఫీజుతో పాటు సంబంధిత స్మార్ట్ కార్డు ఇంటికి పంపేందుకు గాను పోస్టల్ చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తుంది. వాహనదారుల నుంచి రూ.35 వసూలు చేస్తున్నా.. తపాలా శాఖకు మాత్రం రూ.17 మాత్రమే చెల్లిస్తోంది. అంటే జనం నుంచి రెట్టింపు మొత్తం రవాణాశాఖ వసూలు చేస్తోందన్నమాట. అయినా సదరు చార్జీలు తపాలా శాఖకు చెల్లించకుండా బకాయి పడింది. ప్రభుత్వం నుంచి రవాణా శాఖకు నిర్వహణ ఖర్చుల కోసం నిధులు విడుదల కావాల్సి ఉండగా, ఆ మొత్తం అందక పోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఆడిట్ అభ్యంతరంతో.. తపాలాశాఖ ‘బుక్ నౌ.. పే లేటర్’అన్న నినాదాన్ని అవలంబిస్తోంది. చార్జీలు ముందుగా చెల్లించకున్నా సేవలు అందిస్తుంది. ఇలా ఏడాదిగా రవాణా శాఖ చెల్లించకున్నా సేవలు కొనసాగించింది. కానీ రెండు నెలల క్రితం అంతర్గత ఆడిట్ విభాగం దీన్ని తప్పుబట్టింది. రవాణా శాఖ దరఖాస్తుదారుల నుంచి చార్జీలు వసూలు చేసి కూడా పోస్టల్‌కు చెల్లించకపోవడం సరికాదని, అలాంటప్పుడు సేవలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ బట్వాడా నిలిపివేసింది. వాహనదారులు కార్డు అందలేదని కార్యాలయాలకు వచ్చి నిలదీస్తే రవాణా శాఖ సిబ్బంది అప్పటికప్పుడు వెతికి ఇస్తున్నారు. మిగతావారు ఎదురుచూపుల్లోనే గడుపుతున్నారు. మొత్తం మీద అన్ని రుసుములు చెల్లించిన తర్వాత కూడా, కార్డుల బట్వాడాలో రవాణా శాఖ వైఫల్యం కారణంగా వాహనదారులు తనిఖీల సమయంలో జరిమానాలు కట్టాల్సి వస్తోంది. -
అనాథలకు స్మార్ట్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్, వెంగళరావునగర్: రాష్ట్రంలోని అనాథలను సంరక్షించేందుకు దేశం గర్వించేలా సమగ్ర చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో శనివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, వినోద్‌కుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో దేశానికి దిక్సూచిలా ఉన్న తెలంగాణ అనాథల విషయంలో తల్లిదండ్రులుగా మరో అద్భుత విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో అనాథలు ఉండొద్దనే సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తామన్నారు. అనాథల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్యనందించి జీవితంలో స్థిరపడేలా ప్రత్యేక రక్షణ కల్పిస్తామన్నారు. సబ్ కమిటీ సమావేశం అనంతరం స్టేట్ హోం ప్రాంగణంలో రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రిగార్డెన్ను కేటీఆర్ సందర్శించి కమిషనర్‌ను అభినందించారు. సబ్ కమిటీ సూచనలు... ♦అనాథ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ చట్టం పెట్టి భవిష్యత్‌లో ఎవరూ ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందించాలి. ♦అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడంతోపాటు వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలి. ఈ కార్డులు ఉంటే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర సర్టిఫికెట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ముస్లింలలో అనాథలను చేరదీసే విధంగా నిర్వహిస్తున్న యతీమ్ఖానాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలా అండగా నిలబడాలి. ♦ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ చానల్లో పెట్టాలి. ఆ ఏడాది నిధులు ఖర్చుకాకపోతే వచ్చే ఏడాది ఉపయోగించుకొనే విధానం పెడితే వారికి శాశ్వత ఆర్థిక భద్రత లభిస్తుంది. ♦ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ హోమ్స్‌లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. -
డ్రైవింగ్ లైసెన్స్.. తప్పదు వెయిటింగ్!
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ కార్డులు గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. కార్డుల కొరత కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షకు పైగా వినియోగదారులు స్మార్ట్‌కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొని, డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సకాలంలో స్మార్ట్ కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రూ.వేలల్లో జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. రవాణాశాఖ నిబంధనల మేరకు వినియోగదారులు ఎలాంటి పౌర సేవల కోసమైనా ముందే ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లిస్తారు. సర్వీస్ చార్జీలతో పాటు, పోస్టల్ చార్జీలను కూడా ఆర్టీఏ ఖాతాలో జమ చేస్తారు. ఇలా సర్వీసు చార్జీల రూపంలోనే ఒక్క హైదరాబాద్ నుంచి ఏటా రూ.100 కోట్ల మేర ప్రజలు చెల్లిస్తారు. కానీ రవాణాశాఖ అందజేసే పౌరసేవల్లో మాత్రం పారదర్శకత లోపించడం గమనార్హం. స్మార్టు కార్డులను తయారు చేసి, అందజేసే కాంట్రాక్ట్ సంస్థలకు సుమారు రూ.18 కోట్ల మేర బకాయీలు చెల్లించకపోవడం వల్లనే 2 నెలలుగా కార్డుల ప్రింటింగ్, పంపిణీని ఆ సంస్థలు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో రవాణాశాఖ అధికారులు తాజాగా మరో సంస్థతో ఒప్పందానికి చర్యలు చేపట్టారు. కానీ ఈ ఒప్పందం ఏర్పడి కార్డులు తయారు చేసి అందజేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇప్పటికిప్పుడు పంపిణీ చేపట్టినా వినియోగదారులకు చేరేందుకు మరో 15 రోజులకు పైగా సమయం పట్టవచ్చునని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. (పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?) సందట్లో సడేమియా.. గత 3 సంవత్సరాలుగా స్మార్ట్‌కార్డుల కొరత వెంటాడుతూనే ఉంది. వాహనదారులు నెలలతరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో కార్డులు పరిమితంగా ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రూ.200 నుంచి రూ.300లకు కార్డు చొప్పున విక్రయిస్తున్నారు. కార్డుల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘నిబంధనల ప్రకారం అన్ని రకాల ఫీజులు, పోస్టల్ చార్జీలు చెల్లించిన తరువాత కూడా ఆర్టీఏ సిబ్బందికి డబ్బులిస్తే తప్ప కార్డులు రావడం లేదని’ టోలిచౌకికి చెందిన అనిల్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది దళారులే కార్డుల కొరతను సాకుగా చూపుతూ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఇదే ఒక దందాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) -
మళ్లీ మొదటికి..!
సాక్షి, సిటీబ్యూరో: రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. ఏడాది కాలంగా కొరత సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అప్పటికప్పుడు ఏవో కొన్ని కార్డులను దిగుమతి చేసుకొని డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ పత్రాలను ముద్రించి వాహనదారులకు అందజేస్తున్నారు. కానీ రెండు, మూడు నెలల్లోనే కొరత సమస్య తిరిగి తలెత్తుత్తోంది. స్మార్టు కార్డులను..వాటిలో వివరాలను ముద్రించేందుకు అవసరమయ్యే రిబ్బన్లను ఆర్టీఏకు విక్రయించే సంస్థలకుకోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండడం వల్లనే తరచుగా ఈ సమస్య తలెత్తుతోంది. పౌరసేవల పేరిట వినియోగదారుల నుంచి ఏటా రూ.కోట్లల్లో వసూలు చేస్తున్నప్పటికీ స్మార్ట్‌కార్డుల తయారీకయ్యే ఖర్చులను సకాలంలో చెల్లించడంలో మాత్రం రవాణాశాఖ జాప్యం చేస్తోంది. దీంతో అన్ని రకాల ఫీజులు, స్పీడ్ పోస్టు చార్జీలు కూడా చెల్లించిన వినియోగదారులు తాము కోరుకొనే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులను మాత్రం పొందలేకపోతున్నారు. గత 2 నెలలుగా సుమారు లక్షకు పైగా స్మార్ట్‌కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఒకవైపు కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ వాహనదారులు ఎంతో బాధ్యతగా అన్ని రకాల ఫీజులు చెల్లించి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అలాగే డ్రైవింగ్ పరీక్షలకు హాజరవుతున్నారు. నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సులను, ఆర్సీ పత్రాలను రెన్యూవల్ చేసుకుంటున్నారు. కానీ రవాణాశాఖ మాత్రం పౌరసేవల్లో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది. లక్షకు పైగా పెండింగ్... గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉప్పల్, నాగోల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, కొండాపూర్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో గత 2 నెలలుగా స్మార్ట్‌కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 250 నుంచి 300 వరకు స్మార్ట్‌కార్డుల డిమాండ్ ఉంటుంది. ఖైరతాబాద్‌లోని సెంట్రల్ కార్యాలయంలో మరో వారం రోజులకు సరిపడా కార్డులు మాత్రమే ఉన్నాయి. మేడ్చల్‌లో ఆర్సీ కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ఉప్పల్‌లో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం లేదు. ప్రతి రోజు సుమారు 300 మందికి డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి స్పీడ్ పోస్టు ద్వారా స్మార్ట్ కార్డులను వినియోగదారులకు పంపించే నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో కొరత తీవ్రంగా ఉండడంతో ఇటీవల ఖైరతాబాద్ నుంచి 5 వేల కార్డులను తెప్పించి అందజేశారు. ఇప్పటికే 2 నెలలుగా సుమారు లక్షలకు పైగా కార్డుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా స్మార్ట్ కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఒకవేళ ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినా ఇప్పుడు ఆర్టీఏ పౌరసేవల కోసం దరఖాస్తు చేసుకొనేవారు వాటిని స్మార్ట్ కార్డుల రూపంలో పొందేందుకు మరో 2నెలలు ఆగాల్సిందే. చెల్లించిన ఫీజులు ఏమైనట్లు.... డ్రైవింగ్ లైసెన్సు అయినా, ఆర్సీ అయినా స్మార్ట్‌కార్డు రూపంలో ఉంటేనే వాహనదారుడికి గుర్తింపు లభిస్తుంది. ఇందుకోసం రవాణాశాఖ విధించే నిబంధనలన్నింటినీ పాటిస్తారు. డ్రైవింగ్ లైసెన్సు కోసం రూ.1550 ఆన్లైన్లో ముందే చెల్లించవలసి ఉంటుంది. ఇక వాహనాలు కొనుగోలు చేసిన సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు, వాటి శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌తో సహా అన్ని ఫీజులను షోరూమ్‌లో చెల్లిస్తారు. స్మార్ట్‌కార్డులను వినియోగదారుల ఇంటికి పంపించేందుకు అయ్యే స్పీడ్ పోస్టు చార్జీ రూ.35 లు కూడా ఆర్టీఏ ఖాతాలో ముందుగానే జమ చేయవలసి ఉంటుంది. దీంతో పాటు సేవా రుసుము పేరిట రూ.250 వసూలు చేస్తారు.ఇలా ఫీజుల రూపంలోనే రవాణాశాఖ వినియోగదారుల నుంచి ప్రతి సంవత్సరం రూ.వందల కోట్లు వసూలు చేస్తుంది. బకాయిల చెల్లింపుల్లోనే జాప్యం.... గతంలో పూనేకు చెందిన కొన్ని ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలు స్మార్టు కార్డులను తయారు చేసి ఇచ్చేవి. కానీ రవాణాశాఖ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు చేతులెత్తేశాయి. ఏకంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. దాంతో హైదరాబాద్‌కే చెందిన సీఎంఎస్, ఎంటెక్,తదితర సంస్థలతో గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను అందజేయడం ఈ సంస్థల బాధ్యత.ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ బిల్లులను చెల్లించకపోవడంతో ఆ సంస్థలు కార్డుల పంపిణీ నిలిపివేసినట్లు తెలిసింది. సకాలంలో కార్డులు లభించకపోవడం వల్ల తమ వద్ద ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు రశీదులు ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తున్నారని వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
కార్డుల్లేవ్!
షాద్‌నగర్‌టౌన్: వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న తర్వాత స్మార్ట్ ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డును వాహనదారులకు జారీ చేసే ప్రక్రియ పలుచోట్ల నిలిచిపోయింది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కార్డులు అందడం లేదు. లైసెన్స్‌లు పొందినా కార్డులు లేకపోవడంతో వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేకుండా వాహనాలను నడిపేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొండాపూర్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ ప్రాంతాలకు సంబంధించిన సుమారు 50 వేల ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు పెండింగ్‌లో ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆరు నెలలుగా స్మార్టు కార్డుల ముద్రణ ప్రక్రియ సరిగా జరగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్మార్టు కార్డులు అందుబాటులో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయాల్లో కార్టుల ప్రింటింగ్ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. షాద్‌నగర్‌లో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయంలో కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, కడ్తాల్, ఆమనగల్లు మండలాలకు చెందిన వారు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. ఈ కార్యాలయంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు మంజూరైనా వాటికి సంబంధించిన కార్డులు మాత్రం ఆరు నెలల నుంచి జారీ కావడం లేదు. దీంతో 2,804 ఆర్సీ కార్డులు, 1,225 డ్రైవింగ్ లైసెన్సుకార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్సీ కార్డులోనే వివరాలు వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్సీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి. ఆర్సీ కార్డులు లేకపోవడంతో వాహనదారులు తమ వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. కొందరైతే నెలల తరబడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. మరి కొందరు సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాల్లో వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో వాహనం కొనుగోలు చేసినా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసినా కార్డులు లేకపోవడంతో వాటిని తిప్పలేకపోతున్నామంటున్నారు. ఇతర రాష్ట్రాలకు వాహనాలను తీసుకెళ్లినప్పుడు అక్కడి పోలీసు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని, లేదంటే.. వాహనాన్ని వదిలి పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రింటర్లు పనిచేయకపోవడంతోనే.. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు జారీచేసేందుకు రవాణా శాఖ వద్ద ప్రత్యేకమైన ప్రింటర్లు ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తున్నాడు. వాహనదారుడి వివరాలను కార్డుపై ముద్రించి ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సును పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో పాటు రూ.250 సేవా రుసుము ముందే చెల్లిస్తారు. అయితే, షాద్‌నగర్ రవాణా శాఖ కార్యాలయంలో కార్డుల ప్రింటింగ్‌కు సంబంధించిన యంత్రం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అత్తాపూర్‌లో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో షాద్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన కార్డులను ప్రింటింగ్ చేయాల్సి వస్తుంది. అత్తాపూర్ కార్యాలయంలో ఉన్న ప్రింటింగ్ కూడా సరిగా పని చేయకపోవడంతో అత్తాపూర్ పరిధిలోకి వచ్చే మండలాలకు సంబంధించిన కార్డుల జారీ ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. ఆరు నెలలుగా నిలిచిపోయాయి కార్టులు జారీ ప్రక్రియ నిలిచిపోయి సుమారు ఆరు నెలలు కావస్తోంది. వాహనదారులు తమ సమస్యలను ఆర్టీఏ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పోలీసు అధికారుల తనిఖీల్లో వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ చూస్తున్నారని, అయితే కార్డులు లేకపోవడంతో వారు జరిమానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఎం వాలెట్ పద్ధతి ద్వారా స్మార్ట్ ఫోన్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు చూసుకునే అవకాశం ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది స్మార్టు ఫోన్లు లేకపోవడం, ఎం వాలెట్ విధానం గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వెంటనే కార్డులు జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వెంటనే జారీ చేయాలి డ్రైవింగ్ లైసెన్సు కోసం సుమారు మూడు నెలల కింద దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు డ్రైవింగ్ లైసెన్సు కార్డు పోస్టు ద్వారా వస్తుందని చెప్పారు. కానీ నేటి వరకు రాలేదు. వాహనాన్ని బయటికి తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారని భయమేస్తోంది. డ్రైవింగ్ లైసెన్సు కార్డు ఉంటే ఇబ్బందులు ఎదురుకావు. కార్డులను జారీ చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. – సాయికుమార్, విఠ్యాల, ఫరూఖ్‌నగర్ -
‘స్మార్ట్’కు సారీ...ఆగిన లైసెన్సుల జారీ
కరీంనగర్‌కు చెందిన భూమయ్య తన కొత్త వాహనంలో శబరిమల వెళ్లాడు. ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసినా స్మార్ట్‌కార్డు రాకపోవడంతో ఏపీ, తమిళనాడు, కేరళలలో పలుచోట్ల చలానాలు చెల్లించాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఓ ప్రముఖ క్యాబ్ సంస్థలో ఉద్యోగి. అక్టోబరులో తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నా ఇంత వరకూ అందలేదు. ఈ కారణంతో ఆ కంపెనీ ఇతనికి డ్యూటీలు ఇవ్వడం మానేసింది. ఇది ఒక్క భూమయ్య, శ్రీకాంత్ పరిస్థితే కాదు. ఇటీవల ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఎదురుచూస్తోన్న వేలాదిమంది వాహనదారుల దుస్థితి. వీరంతా కొత్త వాహనాలు కొన్నారు. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ టెస్టులు పూర్తి చేసుకున్నారు. ఇంతవరకూ వీరికి ఆర్సీ (రిజిస్ట్రేషన్ కార్డు), డ్రైవింగ్ లైసెన్సులు అందలేదు. మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం.. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ టెస్టు, రెన్యువల్ పూర్తయిన 15 రోజుల్లోగా పోస్టులో ఇంటికి కార్డులు అందాలి. కానీ, వేలాదిమంది వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తయినా.. ఇంతవరకూ కార్డులు అందలేదు. కారణం ఏంటి? స్మార్ట్‌కార్డుల ముద్రణకు రిబ్బన్ల కొరత 2017, అక్టోబరులోనే ఏర్పడింది. వీటి ముద్రణకు కావాల్సిన కార్డులు, రిబ్బన్లకు ఐటీ విభాగం టెండర్లు పిలుస్తుంది. మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టరు తెలంగాణ రవాణాశాఖకు రిబ్బన్ల సప్లయి చేసే కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అతనికి రూ. 8 కోట్లు చెల్లించాలి. కేవలం రూ. 4 కోట్లే చెల్లించారు. మిగిలిన బకాయిలు అలాగే ఉండిపోయాయి. దీంతో రిబ్బన్ల సరఫరాను సదరు కాంట్రాక్టరు నిలిపివేశాడు. దీంతో ఆర్సీ కార్డులతోపాటు డ్రైవింగ్ లైసెన్సుల ముద్రణ కూడా నిలిచిపోయింది. సర్క్యులర్ విడుదల చేయరా? గ్రేటర్ పరిధిలో ప్రతీరోజు 1500 కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. గ్రేటర్లో 11, తెలంగాణ వ్యాప్తంగా 70 వరకు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు ఒక్కో కార్యాలయానికి 300 వరకు వాహనాలు వస్తుంటాయి. 3నెలలుగా వీరందరికి కార్డులు జారీకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో కలిపి 2 లక్షలకుపైగా కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అయినా ఆ శాఖ అధికారులు ఆర్సీలు లేవన్న సాకుతో జరిమానాలు, కేసులు బుక్ చేస్తుండటం గమనార్హం. వీటిపై సర్క్యులర్ జారీ చేయక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లు.. ఆర్టీసీ, ప్రైవేటు రంగం, రక్షణ రంగంలోని పలువురు డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ కాకపోవడంతో వారికి డ్యూటీలు వేయడం లేదు. నగరంలో క్యాబ్‌లు నడిపే చాలా మంది డ్రైవర్లకు లైసెన్సు ఈ కారణం గా 4నెలలుగా పలు కంపెనీలు డ్యూటీలు వేయడం లేదు. దీంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. తాత్కాలిక ఆర్సీ 15 రోజులే వ్యాలిడిటీ. ఆ తరువాత ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ పోలీసులు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. – దయానంద్, తెలంగాణ ఆటో అండ్ మోటార్ వెల్ఫేర్ యూనియన్ కార్డులకు కొరత లేదు.. రిబ్బన్లకు ఎక్కడా కొరత లేదు. గతంలో కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ, ఇపుడు లేదు. రిబ్బన్లు వచ్చాయి. అందరికీ కార్డులు జారీ చేస్తున్నాం. – రమేశ్, జేటీసీ, ఆర్టీఏ -
ఓఆర్ఆర్పై ‘స్మార్ట్’ జర్నీ..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను వినియోగించే వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ మార్గం ద్వారా గతేడాది డిసెంబర్ వరకు 75వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, అక్టోబర్‌లో వాటి సంఖ్య 1.30లక్షలకు చేరుకుంది. నగరానికి వచ్చే వాహనాలతో పాటు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్ఆర్ను ఎంచుకోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రయాణం సాఫీగా సాగేందుకు ‘స్మార్ట్ కార్డు’ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. కార్డు టచ్ చేయగానే టోల్గేట్లు వాటంతటవే తెరుచుకొని ముందుకెళ్లడం ప్రయాణించిన దూరాన్ని బట్టి డబ్బులు ఆటోమెటిక్‌గా బదిలీ అవుతాయని, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)సేవలను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఏళ్లుగా చెబుతూ వస్తున్న అధికారులు ఈసారి వాటిని కార్యరూపం దాల్చేలా అడుగులు వేస్తున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్‌గా డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మార్ట్ కార్డు సేవలపై తరచూ ఓఆర్ఆర్ విభాగం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తొలివిడతగా నానక్‌రామ్‌గూడ, శంషాబాద్, మేడ్చల్, ఘటేకేసర్, పటాన్చెరు టోల్‌ప్లాజాల వద్ద స్మార్డ్ కార్డుల విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మరో వారం రోజుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఓఆర్ఆర్ సీజీఎం ఇమామ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్డుల వినియోగం వల్ల ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడమేగాక, కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. ట్రాన్సిట్ కార్డు సేవలిలా... ఓఆర్ఆర్పైకి ఎక్కేందుకు.. దిగేందుకు వీలుగా ఉన్న 19 ఇంటర్ ఛేంజ్ల్లో టోల్ ఛార్జీలను వసూలు చేసేందుకు 180 టోల్ లేన్లను ఏర్పాటు చేశారు. వాహనం ఔటర్‌పైకి ఎక్కే ముందు కంప్యూటర్లో వివరాలను నమోదు చేసి.. ఓ స్లిప్‌ను వాహనదారుడికి ఇవ్వాలి. ఎగ్జిట్ పాయింట్ వద్దనున్న కౌంటర్లో ఆ స్లిప్‌ను ఇస్తే సిబ్బంది ప్రయాణించిన దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతారు. దీనివల్ల ముఖ్యంగా సెలవుదినాల్లో టోల్ ఛార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ టోల్ మేనేజ్మెంట్ సిస్టం(టీఎంఎస్)ను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో వాహనదారుడు ఔటర్‌పైకి ఎక్కగానే టోల్ లేన్ దగ్గర క్షణం ఆలస్యం చేయకుండా ఓ స్మార్ట్ కార్డును సిబ్బంది అందజేస్తారు. ఆ కార్డు దిగే వద్ద అందజేస్తే స్కాన్ చేసి ఎంత చెల్లించాలో చెబుతారు. రోజువచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారి కోసం ఎక్కువగా ఈ ప్రీపెయిడ్ కార్డులు ఉపయోగపడతాయి. స్మార్ట్ కార్డుతో సాఫీ జర్నీ... ఓఆర్ఆర్పై 19 టోల్‌ప్లాజాల వద్ద వాహనదారుల సమయాన్ని ఆదా చేసేందుకు ‘టచ్ అండ్ గో’(స్మార్ట్) కార్డులను పరిచయం చేస్తున్నారు. ‘ఈ కార్డును తీసుకున్న వాహనదారుడు 157 మ్యాన్యువుల్, టంచ్ అండ్ గో లేన్స్‌లో వెళ్లవచ్చు. తమ కార్డును టోల్‌ప్లాజా వద్ద ఉండే స్క్రీన్కు చూపించి ముందుకెళ్లాలి. అలా చూపడం వల్ల ఆ కార్డులో ఉండే నగదును ఆ సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌తో ఆటోమేటిక్... ఇది కూడా టచ్ అండ్ గో మాదిరిగానే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) కార్డు పనిచేస్తుంది. జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడీ ఈటీసీ కార్డులున్న వాహనాలను 23 లేన్లలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ లేన్‌లోకి ఎంట్రీ అయ్యే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటుచేసిన తొలి యాంటీనా కార్డు వ్యాలీడా కాదా అని స్క్రీన్ చేస్తుంది. కారు కోసమా, లారీ కోసమా, మరే ఏ ఇతర వాహనం కోసం రీచార్జ్ చేసిన కార్డునే వినియోగిస్తున్నారని పసిగడుతుంది. ఒకవేళ లారీ కోసం రీచార్జ్ చేసుకుని కారుకు వాడాలనుకుంటే ఇది సున్నితంగా తిరస్కరిస్తుంది. అయితే అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్ దానంతట అదే తెరుచుకుంటుంది. ఆ తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్ఆర్ ఎక్కిందని రికార్డు చేసుకుంటుంది. అది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్‌బూత్ నుంచి నిష్క్రమించగానే ఆ కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్‌గా డిడెక్ట్ చేసుకుంటుంది. దీంతో వాహనదారుల ప్రయాణ సమయం ఆదా కానుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు... నానక్‌రామ్ గూడ, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్, పటాన్చెరు టోల్ ప్లాజాల వద్ద వచ్చే వారం నుంచి ఆర్ఎఫ్ఐడీ ఫాస్ట్‌టాగ్, టచ్ అండ్ గో కార్డులను విక్రయించనున్నారు. మొదటి విడతగా 2 లక్షల వాహనాలు, కార్లు/జీపులు తదితర చిన్నతరహా వాహనాల కేటగిరీలోని వాహనాలకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే ఫాస్ట్ ట్యాగ్‌లను జారీ చేయనున్నారు. రూ.500 వరకు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాస్ట్ ట్యాగ్ల్లోనూ తరుచూ ప్రయాణించే ప్రయాణీకులకు నెలసరి పాసులు అందుబాటులో ఉంటాయి. నెలలో 50 సార్లు ప్రయాణించే వారికి ఇది చెల్లుబాటు కానుంది. నెలవారీ పాసు కొనుగోలు చేసిన వారికి 24 గంటల్లో తిరుగు ప్రయాణంలో రాయితీ కూడా లభిస్తుంది. దాదాపు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 అందుబాటులోకి తీసుకురానున్న టచ్ అండ్ గో కార్డులో టోల్‌ప్లాజాలో వద్ద ఏర్పాటుచేసే పీవోసీలో రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంది. లేదా ఆన్‌లైన్‌లోనూ రీచార్జ్ చేసుకునేసౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. -
కొత్త వాహనదారులకు ఊరట
తిరుపతి మంగళం: కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి కాస్త ఊరట లభించింది. ఆరు నెలలుగా రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్డులు(స్మార్ట్ కార్డులు)లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు ఆర్టీఏ కార్యాలయాలకు కొంత మేరకు స్మార్ట్‌కార్డులు చేరాయి. లక్ష కార్డులకు 20 వేలు ఇచ్చారు జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో సు మారు లక్ష స్మార్ట్ కార్డులు అవసరం ఉంది. అయితే రాష్ట్ర రవాణాశాఖ నుంచి జిల్లాకు 20వేల కార్డులు మాత్రమే వచ్చాయి. అందులో ప్రధానంగా తిరుపతికి 8వేలు కార్డులు,చిత్తూరుకు 7వేలు కార్డులు చొప్పున రవాణాశాఖ కార్యాలయాలకు చేరాయి. మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, పుత్తూరు వంటి ప్రాంతాలన్నింటికీ కలిపి 5 వేల కార్డులు మాత్రమే చేరాయి. రోజుకు 300 నుంచి 500 కార్డుల మాత్రమే ప్రింటింగ్ అవుతున్నాయి. దీంతో జిల్లాకు వచ్చిన కార్డులను వాహనదారుని పేరుపైన ప్రింట్చేసి ఇవ్వడానికే 20 రోజులు పడుతుంది. మిగిలిన కార్డులు జిల్లాకు వచ్చి వాహనదారునికి పూర్తి స్థాయిలో అందించేందుకు రవాణా శాఖకు కనీసం అంటే మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నా తప్పని జరిమానా కొనుగోలు చేసిన వాహనాలను రిజిస్ట్రేషన్ చే యించుకున్నా ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ కార్డులు సకా లంలో అందించలేదు. దీంతో పోలీసులు, అధి కారులు హైవేలపై తనిఖీలు నిర్వహించేటప్పు డు ఆర్సీ లేకున్నా రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్డుల పంపిణీ జరగకపోవడంలో ఆర్టీఏ నిర్లక్ష్యం ఉన్నప్పటికీ జరిమానాలు తప్పడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై రవాణా శాఖ, పోలీసులు చర్చించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న రసీదులనే ఆర్సీగా పరిగణించాలని వాహనదారులు కోరుతున్నారు. -
‘స్మార్ట్’ వ్యథ!
► డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీలో నిర్లక్ష్యం ► వాహనదారులకు చేరవేయడంలో విఫలం ► ఆర్టీఏ, పోస్టల్ శాఖల మధ్య సమన్వయ లోపం ► నెలలు గడిచినా అందని స్మార్ట్‌కార్డులు ► వాహనదారులపై ఈ చలాన్ ల మోత సాక్షి, సిటీబ్యూరో బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన నారాయణరావు మూడు నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. నిబంధనల మేరకు ఆన్ లైన్ స్లాట్ నమోదు చేసుకొని, ఈ సేవ ద్వారా ఫీజులు చెల్లించి, స్మార్ట్ కార్డు ఇంటికి స్పీడ్ పోస్టు చేసేందుకు అయ్యే రుసుము కూడా ఈ సేవా ద్వారానే చెల్లించి అధికారుల వద్దకు వెళ్లాడు. డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ ప్రక్రియను ముగించిన అధికారులు.. మరో వారంలో స్మార్ట్‌కార్డు పోస్టులో నేరుగా ఇంటికే వస్తుందన్నారు. ♦ గతేడాది నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు ఆయన అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 3 నెలల క్రితమే కార్డు పోస్టు చేశామని చెప్పారు ఆర్టీఏ ఉద్యోగులు. ♦ ఇప్పుడు ఆ స్మార్ట్‌కార్డు సంబంధిత వినియోగదారుడు పేర్కొన్న చిరునామాకు చేరలేదు. అలాగని వెనక్కి తిరిగి రాలేదు. రవాణా అధికారుల వద్దకు తిరిగి రాకుండా, వాహనదారుడి చిరునామాకు చేరుకోకుండా ఆ విలువైన డ్రైవింగ్ లైసెన్సు స్మార్ట్ కార్డు ఏమైనట్లు... ♦ ఇది ఒక్క నారాయణరావు సమస్య మాత్రమే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు వందలాది వినియోగదారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య. ♦ డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ ల కోసం వందల రూపాయల ఫీజులు చెల్లించినప్పటికీ సకాలంలో అందక అనేక మంది వినియోగదారులు ఆర్టీ ఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. బాధ్యతారాహిత్యం... గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3500 మంది వరకు వాహనాల రిజిస్ట్రేషన్ లు, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవలను పొందుతారు. ఈ వినియోగదారులందరికీ స్పీడ్ పోస్టు ద్వారా స్మార్ట్‌కార్డులను అందజేయవలసి ఉంటుంది. గతంలో వినియోగదారులకే ప్రత్యక్షంగా అందజేసే పద్ధతికి స్వస్తి చెప్పి స్పీడ్ పోస్టును ప్రవేశపెట్టారు. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పద్ధతిలో వినియోగదారుల చిరునామా ధృవీకరణ ప్రధానమైన అంశం. కానీ ఆచరణలో మాత్రం లక్ష్యం నీరుగారుతోంది. కొన్నిసార్లు వినియోగదారులే సరైన చిరునామా నమోదు చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతుండగా చాలా సార్లు పోస్టల్ శాఖ బాధ్యతారాహిత్యం, రవాణా అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో స్మార్ట్‌కార్డులు వినియోగదారులకు చేరడం లేదు. కొన్ని స్మార్ట్‌కార్డులపై పోస్టల్ సిబ్బంది ‘డోర్‌లాక్’ అని ముద్ర వేసి వెనక్కి పంపుతుండగా, చాలా వరకు నెలలు దాటినా ఇటు ఆర్టీఏకు వెనక్కి తిరిగి రాక, అటు వినియోగదారుడికి చేరకుండా మధ్యలోనే బుట్టదాఖలా అవుతున్నాయి. ఇలాంటి వాటిపై రెండు శాఖల్లో ఎలాంటి సమన్వయం, నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. ఇదేం స్పీడ్‌పోస్ట్? ♦ ప్రతి రోజు గ్రేటర్ పరిధిలో సుమారు 3500 స్మార్ట్ కార్డులు బట్వాడా చేయవలసి ఉంటుంది. వివిధ కారణాల వల్ల వాటిలో 35 శాతం కార్డులు పెండింగ్‌లో పెట్టేస్తారు. ♦ బట్వాడా చేసిన 65 శాతం కార్డులలో కనీసం 15 శాతం కార్డులు వినియోగదారులకు చేరడం లేదు. ♦ మొత్తంగా రోజుకు 500 నుంచి 600 స్మార్ట్‌కార్డులు వినియోగదారులకు బట్వాడా కావడం లేదు. ♦ స్పీడ్ పోస్టు అంటే కనీసం 48 గంటల్లోనైనా వినియోగదారుడికి ఆ పోస్టు అందాలి. కానీ ఆర్టీఏ బట్వాడా చేసే కార్డులు వినియోగదారుడికి చేరేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 15 రోజులు కూడా దాటుతోంది. ♦ ఇక నెలలు దాటినా పౌరసేవలను అందుకోలేకపోతున్న సగటు వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. -
స్మార్ట్‌కార్డుకు ‘రిబ్బన్’ ఎఫెక్ట్
రవాణాశాఖలో నెలరోజులుగా సమస్య నిలిచిపోయిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ సాక్షి, సిటీబ్యూరో: ‘స్మార్ట్‌కార్డు’.. రవాణాశాఖలో నూతన అధ్యాయం.. డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయిన అనందరం వినియోగదారుల, వాహనాల వివరాలు ముద్రించి అందించాలి. కానీ నెలరోజులుగా ఈ కారులు సంబందిత వాహనదారుకులకు మాత్రం అందడం లేదు. కొద్ది రోజుల క్రితం ఆర్టీఏ కార్యాలయాలకు తెలుపు (వైట్) కార్డులు అందాయి. కానీ వాటిపై అక్షరాలను ముద్రించే రిబ్బన్ మాత్రం సరఫరా కాలేదు. దీందో స్మార్ట్‌కార్డుల పంపిణీ సాధ్యపడలేదు. నెలరోజులుగా ఇదే సమస్య కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్మార్డుకార్డులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ పరీక్షలు ముగించుకొని లైసెన్సులు పొందాల్సినవారు, వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసినప్పటికీ స్మార్డ్ కార్డులు చేతికి రాక వాహనదారులు ఎదురు చూస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాలతో పాటు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సకాలంలో స్మార్ట్‌కార్డులు అందక వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్డులు ప్రింట్ చేసేందుకు కావలసిన రిబ్బన్ సింగపూర్ నుంచి దిగుమతి కావాల్సి ఉండగా, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ (టీఎస్టీఎస్) విభాగం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటిదాకా డిమాండ్‌కు తగిన స్థాయిలో రిబ్బన్ అందలేదు. దీనివల్ల కార్డుల ప్రింటింగ్, పంపిణీలో జాప్యం జరుగుతోందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నెల నుంచి ప్రతిష్టంభన.. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలను వాహనదారులకు కొంతకాలంగా స్మార్ట్‌కార్డుల రూపంలో అందజేస్తున్నారు. కార్డులోనే వాహనదారుడికి, వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రింట్ చేస్తారు. వాహనదారుడి చిరునామా, డ్రైవింగ్ లైసెన్సు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెల్లుబాటులో ఉంటుంది.. తదితర వివరాలన్నీరుంటాయి. రిజిస్ట్రేషన్ స్మార్టుకార్డుల్లోనూ వాహనం మోడల్, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్, చిరునామా ప్రింట్ చేస్తారు. ఇలా ప్రింట్ అయిన కార్డులను వారం రోజుల్లోపు వినియోగదారుడికి పోస్టులో చేరాలి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రోజుకు సుమారు 5000 మంది డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం హాజరవుతుండగా, తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో ఈ సంఖ్య 7 వేల నుంచి 8 వేల వరకు ఉంటుంది. అయితే, నెల రోజుల నుంచి కార్డుల ప్రింటింగ్ నిలిచిపోయింది. ఈనెల రోజుల్లో లక్షకు పైగా కార్డుల ముద్రణ, పంపిణీ ఆగిపోవడంతో వాహనదారులకు సమస్యలు తప్పడం లేదు. నిలిచిపోయిన రిబ్బన్ దిగుమతి.. రవాణాశాఖకు సరఫరా చేసే స్మార్టు కార్డులను తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ సరఫరా చేస్తోంది. కార్డుల తయారీని కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టారు. నెలక్రితం సదరు కాంట్రాక్టర్ గడువు ముగియడం, సింగపూర్ నుంచి దిగుమతి కావలసిన రిబ్బన్ సైతం ఆగిపోవడంతో ఆకస్మాత్తుగా సమస్య తలెత్తింది. కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకు పాత కాంట్రాక్టర్ వ్యవస్థనే కొనసాగిస్తూ వారం క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సుమారు 50 వేల వరకు కార్డులు రవాణాశాఖకు అందాయి. మరో 50 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సైతం అక్షరాలు ప్రింట్ చేసేందుకు కావలసిన రిబ్బన్ లేదు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో 7000 కార్డులు పెండింగ్‌లో ఉండగా 5000 మాత్రం పంపిణీ చేశారు. ఇక్కడ 10 రిబ్బన్లు అవసరముండగా 5 మాత్రమే అందాయి. మరోవైపు ఇప్పటికిప్పుడు వాహనదారుల డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొంత మేరకు స్మార్ట్‌కార్డులు అందుబాటులో ఉన్నా వాటిపైన వివరాలను ముద్రించేందుకు కావలసిన రిబ్బన్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు అధికారులు చెబుతున్నారు. -
రైలు ప్రయాణికుల కొత్త టెక్నిక్
ముంబై: మొన్నటి వరకు చిన్ననోట్ల భారమైన ప్రయాణికులకు ఇప్పుడు రద్దు చేసిన పెద్ద నోట్లు తలనొప్పి తెప్పిస్తున్నాయి. దీంతో లోకల్ రైలు ప్రయాణికులు సాధ్యమైనంత తరకు వాటి పీడ వదిలించుకునేందుకు తమ తెలివి తేటలు ఉపయోగిస్తున్నారు. ఇదివరకు ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనుల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగించే వారు మాస, త్రైమాసిక సీజన్ పాస్‌లు పొందేందుకు ఆసక్తి కనబర్చేవారు. ఇప్పుడు ఏకంగా ఆరు నెలలు, సంవత్సరం సీజన్ పాస్‌లు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా లోకల్ రైల్వే టికెట్ల కౌంటర్ల వద్ద క్యూలను తగ్గించేందుకు స్మార్ట్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మొన్నటివరకు అప్పుడప్పుడు ప్రయాణించే వారు (తమ అవసరాన్ని బట్టి) రూ.50 లేదా రూ.100 స్మార్ట్ కార్డులు రీచార్జ్ చేయించుకునేవారు. ఇప్పుడు అదే సామాన్య ప్రజలు రూ.500 లేదా రూ.1000 చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు రీచార్జ్ చేసుకుంటున్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే, స్మార్ట్ కార్డులు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను రైల్వే టికెట్ల కౌంటర్ల వద్ద స్వీకరిస్తుండడంతో ప్రజల దృష్టి ఇటువైపు మళ్లింది. దీంతో పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని రద్దయిన రెండు, మూడు రోజుల్లోనే రైల్వేకు భారీ ఆదాయం వచ్చింది. రద్దయిన నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే బదులుగా రైల్వే టికెట్ల కౌంటర్లను ఆశ్రయిస్తున్నారు. పైగా రూ.100 రీచార్జ్ చేసుకుంటే 5 శాతం బోనస్‌గా లభిస్తుంది. అంటే ఐదు రూపాయల ప్రయాణం ఉచితంగా చేయవచ్చు. రూ.10,000 రీచార్జ్ చేసుకుంటే రూ.500 బోనస్ లభిస్తుంది. దీంతో ప్రయాణికులు స్మార్ట్ కార్డు కొనుగోలుకు ఎగబడుతున్నారు. అందులో రీచార్జ్ చేసుకున్న డబ్బులు ఎటూ పోవు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు పెద్ద నోట్ల బెడదను వదిలించుకునేందుకు లోకల్ రైల్వే టిక్కెట్ కౌంటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. -
రిలయన్స్ బంకులన్నీ ఈ ఏడాదే మళ్లీ షురూ
-
రిలయన్స్ బంకులన్నీ ఈ ఏడాదే మళ్లీ షురూ
న్యూఢిల్లీ: డీజిల్ ధరల నియంత్రణ ఎత్తివేసిన నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఈ ఆర్థిక సంవత్సరంలో పునఃప్రారంభించనుంది. మొత్తం 1,400 పెట్రోల్ పంపులు 320 రిటైల్ అవుట్లెట్లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆర్ఐఎల్ ఈ విషయాలు వెల్లడించింది. భారీ రవాణా సంస్థల ట్రక్కుల ఇంధనావసరాల కోసం నగదు లావాదేవీల ప్రమేయం ఉండని విధంగా.. స్మార్ట్‌కార్డులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఆర్ఐఎల్తో పాటు మరో ప్రైవేట్ రిఫైనరీ సంస్థ ఎస్సార్ ఆయిల్‌కి 2006 నాటికి దేశీయంగా డీజిల్‌కి సంబంధించి 17 శాతం, పెట్రోల్‌కి సంబంధించి 10 శాతం మార్కెట్ వాటా ఉండేది. అప్పట్లో అన్ని సంస్థల బంకులతో పోల్చి చూస్తే రిలయన్స్‌వి 4 శాతం బంకులే ఉన్నప్పటికీ గణనీయంగానే మార్కెట్ వాటా ఉండేది. 2006లో డీజిల్ మార్కెట్లో ఆర్‌ఐఎల్‌కి 14.3 శాతం, పెట్రోల్ మార్కెట్లో 7.2 శాతం వాటా ఉండేది. అయితే, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు సబ్సిడీ రేట్లతో ఇంధనాన్ని విక్రయిస్తుండటంతో ప్రైవేట్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. భారీ నష్టాలు రావడంతో 2008 మార్చి నాటికి రిలయన్స్‌కి చెందిన 1,432 పెట్రోల్ పంపులు మూతబడ్డాయి. 2010 జూన్‌లో ప్రభుత్వం పెట్రోల్ రేట్లపై నియంత్రణ ఎత్తివేశాక ఎస్సార్ మళ్లీ తమ 1,400 అవుట్లెట్లలో పెట్రోల్‌ను విక్రయించడం మొదలుపెట్టింది. ఇక డీజిల్‌పై గతేడాది కేంద్రం నియంత్రణ ఎత్తివేశాక.. ఎస్సార్ కూడా తమ బంకుల్లో డీజిల్ విక్రయాలు ప్రారంభించింది. బంకుల సంఖ్యను 1,600కి పెంచుకుంది. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్యను 2,500కి పెంచుకోనుంది. -
కార్మికులకు స్మార్ట్‌కార్డులు
కొరుక్కుపేట: కార్మికుల భద్రతకు భరోసా ఇచ్చేలా స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండా రు దత్తాత్రేయ పేర్కొన్నారు. చెన్నైలోని కేకేనగర్‌లో ఉన్న ఈఎస్ఐసీ ఆస్పత్రిలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కార్మికుల భద్రతకు భరోసా కల్పించే విధంగా ఆధార్, బ్యాంకు ఖాతాను అనుసంధానిస్తూ స్మార్ట్‌కార్డులు అందించనున్నామన్నారు. దేశవ్యాప్తంగా 422, 48558 ఈపీఎఫ్ సబ్‌స్కైబర్స్‌కు యూనివర్సల్ అకౌంట్ నంబర్( యూఏఎన్)లను జారీ చేశామన్నారు. అదే విధంగా లేబర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఎల్‌ఐఎన్)లను సైతం 7,40,850 మందికి జారీ చేసినట్లు వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ శ్రమేవ్ జయతీ కార్యక్రమాన్ని గతేడాది ప్రారంభించారని అన్నారు. దీని ద్వారా కార్మికులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. డి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్‌తో దేశవ్యాప్తంగా తమ శాఖను మరింతగా అభివృద్ధి పరచనున్నామని అన్నారు. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ పేరుతో స్మార్ట్‌కార్డులు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రీయ స్వాస్తీ బీమా యోజన్, ఆమ్ ఆద్మీ బీమా యోజన్ స్కీమ్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. తమిళనాడులో కొత్తగా తూత్తుకుడి, కన్యాకుమారి, శ్రీ పెరంబదూర్, తిరుపూర్ల్లో ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వంద బెడ్ల సదుపాయంతో ఒక్కో ఆస్పత్రిని రూ.70 నుంచి రూ.80 కోట్లతో నిర్మించనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు, స్కిల్స్‌ను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నామన్నారు. నేషనల్ వర్కర్స్ ఒకేషనల్ యూనివర్సిటీని తీసుకు వచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. వంద మెడికల్ కెరీర్ సెంటర్లను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని ఆస్పత్రులనూ ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్లు ఆగమాగం..
సాక్షి, హైదరాబాద్: ‘సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 31.67 లక్షల మందికి ప్రభుత్వం ప్రయోజనం క ల్పించింది. అయితే ఆయా యూనిట్ కార్యాలయాల్లో రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు మార్చి 2013 వరకు అందిన దరఖాస్తుల సంఖ్య, అందులో ఆమోదించిన, తిరస్కరించిన వాటి వివరాల్లో స్పష్టత లేదు. మంజూరులో జాప్యానికి, తిరస్కరణకు గల కారణాలను కూడా సరిగా పేర్కొనలేదు..’ అని కాగ్ తమ నివేదికలో స్పష్టం చేసింది. పింఛన్ చెల్లింపుల్లో స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రారంభించి ఐదేళ్లు దాటినా 66 శాతానికి మించి లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు అందించలేదని, దీంతో చెల్లింపుల్లో పార దర్శకత సాధించే లక్ష్యం పూర్తిస్తాయిలో నేరవేరలేదని కాగ్ పేర్కొంది. క్షేత్రస్థాయిలో చెల్లింపు కాని నిధులను ప్రభుత్వానికి జమ చేయకపోవడం, పథకాన్ని అమలు చేసే సంస్థలు వినియోగ ధ్రువపత్రాలను అందజేయకపోవడం వంటి ఆర్థిక లోపాలను కాగ్ బహిర్గతం చేసింది. రికార్డుల నిర్వహణ పేలవంగానూ, అంతర్గత నిర్వహణ బలహీనంగానూ ఉందని... ఫలితంగా నిర్వహణ వ్యవస్థలో లోపాలకు, నష్టభయానికి అవకాశమిస్తున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. మగవారికి వితంతు పింఛన్లు.. మగవారికీ, భర్త జీవించి ఉన్న మహిళలకు వితంతు పింఛన్లు ఇచ్చినట్లు తమ పరిశీలనలో వెల్లడైనట్లు కాగ్ పేర్కొంది. వయస్సు నిర్ధారణ పత్రాలు లేకుండానే వృద్ధాప్య పింఛన్లు, ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ పింఛన్లు ఇచ్చినట్లు తేలిందని.. అర్హతలేనివారికి పింఛన్లు, దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం చేసిన సందర్భాల్లో అధికారులు రిమార్కులు రాయకపోవడం వం టి లోపాలు బయటపడ్డాయని తెలిపింది. సామాజిక పింఛన్ల డేటాబేస్ ప్రక్షాళన నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేందుకు తగిన ప్రాధాన్య త ఇవ్వాలని, అనర్హుల తొలగింపుతో పాటు అర్హుల ఎంపికను సరిచూసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. -
ప్రతిఒక్కరికీ స్మార్ట్ కార్డు!
పాలమూరు: ఇకనుంచి ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డుల తరహాలోనే స్మార్ట్‌కార్డులు రానున్నాయి. వీటిని బహుళ ప్రయోజనాలకు ఉపయోగించేవిధంగా రూపొందించనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం జిల్లాలో 9.85 లక్షల కుటుం బాలు, 42లక్షల జనాభా ఉన్నట్లుగా గుర్తించారు. సామాజిక జీవన స్థితిగతులను అంచనా వేసేం దుకు, సంక్షేమపథకాల అమలులో పారదర్శకత కోసం రాష్ట్రసర్కారు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ (విశిష్ట గుర్తింపు కార్డు) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పౌరుడికీ విశిష్ట ప్రయోజనాలున్న సరికొత్త స్మార్ట్ కార్డు ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలుచేసే రేషన్ సరుకుల పంపిణీ మొదలు సామాజిక పింఛన్లు, విద్యార్థుల ఆర్థిక సాయం తదితర సంక్షేమ పథకాల ఫలాలను ఈ కార్డు ఆధారంగానే అందించేదిశగా చర్యలు తీసుకునేదిశగా అడుగులు వేస్తోంది. ప్రతి వ్యక్తికీ కార్డు.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ రేషన్‌కార్డుల ఆధారంగా కొనసాగుతున్నాయి. కొత్తగా సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చే క్రమంలోనూ రేషన్‌కార్డుల గణాంకాలే కీలకం. కానీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు సంక్షేమఫలాలు చేరడంలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అక్రమాలను అరికట్టి కేవలం లబ్ధిదారుడికి మాత్రమే ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం కుటుంబానికి ఒక రేషన్‌కార్డు ఉండగా.. ఈ స్థానంలో ఇకపై ప్రతి వ్యక్తికి స్మార్ట్‌కార్డు ఇవ్వనున్నారు. దాదాపు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ తరహాలోనే ఈ స్మార్ట్ కార్డులు జారీచేయనున్నారు. జిల్లా యంత్రాం గంతో ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లకు సంబంధించి జిల్లా అధికారులు పలు సందేహాలను ప్రస్తావించగా.. ఆయన కొత్త స్మార్ట్‌కార్డుల అంశాన్ని వివరించారు. ఆధార్‌తో అనుసంధానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్‌కార్డులతో బ్యాంకు ఖాతా నంబర్లు అనుసంధానమై ఉన్నాయి. దీంతో లబ్ధిదారుడికి చేరాల్సిన సంక్షేమ ఫలాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా నేరుగా ఖాతాలోకి చేరుతాయి. ఈ క్రమం లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్‌కార్డులు సైతం ఆధార్ కార్డుతో అనుసంధానమవుతాయి. స్మార్ట్‌కార్డులో ఆధార్ నంబర్‌తో పాటు సంబంధిత వ్యక్తి వివరాలను నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిం డర్ రాయితీకి ఆధార్‌ను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే అన్ని సంక్షేమ పథకాలు స్మార్ట్ కార్డులు, ఆధార్ కార్డుల ద్వారా అమలైతే అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ స్మార్ట్ కార్డుల అంశానికి సంబంధించి మరింత స్పష్టత రానుంది.