కార్మికులకు స్మార్ట్‌కార్డులు
కొరుక్కుపేట: కార్మికుల భద్రతకు భరోసా ఇచ్చేలా స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండా రు దత్తాత్రేయ పేర్కొన్నారు. చెన్నైలోని కేకేనగర్‌లో ఉన్న ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కార్మికుల భద్రతకు భరోసా కల్పించే విధంగా ఆధార్, బ్యాంకు ఖాతాను అనుసంధానిస్తూ స్మార్ట్‌కార్డులు అందించనున్నామన్నారు. దేశవ్యాప్తంగా 422, 48558 ఈపీఎఫ్ సబ్‌స్కైబర్స్‌కు యూనివర్సల్ అకౌంట్ నంబర్( యూఏఎన్)లను జారీ చేశామన్నారు. అదే విధంగా లేబర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఎల్‌ఐఎన్)లను సైతం 7,40,850 మందికి జారీ చేసినట్లు వివరించారు.
ప్రధాని నరేంద్రమోదీ శ్రమేవ్ జయతీ కార్యక్రమాన్ని గతేడాది ప్రారంభించారని అన్నారు. దీని ద్వారా కార్మికులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. డి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్‌తో దేశవ్యాప్తంగా తమ శాఖను మరింతగా అభివృద్ధి పరచనున్నామని అన్నారు. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ పేరుతో స్మార్ట్‌కార్డులు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రీయ స్వాస్తీ బీమా యోజన్, ఆమ్ ఆద్మీ బీమా యోజన్ స్కీమ్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. తమిళనాడులో కొత్తగా తూత్తుకుడి, కన్యాకుమారి, శ్రీ పెరంబదూర్, తిరుపూర్‌ల్లో ఈఎస్‌ఐసీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వంద బెడ్‌ల సదుపాయంతో ఒక్కో ఆస్పత్రిని రూ.70 నుంచి రూ.80 కోట్లతో నిర్మించనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు, స్కిల్స్‌ను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నామన్నారు. నేషనల్ వర్కర్స్ ఒకేషనల్ యూనివర్సిటీని తీసుకు వచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. వంద మెడికల్ కెరీర్ సెంటర్‌లను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని ఆస్పత్రులనూ ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.