ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి సెగ్మెంట్లలో ఓటర్ల ఏరివేతపై విచారణ | An extension of the deadline for registration of votes | Sakshi
Sakshi News home page

ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి సెగ్మెంట్లలో ఓటర్ల ఏరివేతపై విచారణ

Published Sat, Dec 7 2013 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

An extension of the deadline for registration of votes

 ఉద్దేశపూర్వకంగా తొలగిస్తే చర్యలు తప్పవు
 = ప్రత్యేక అధికారులతో ఫిర్యాదుల పరిశీలన
 =ఓటర్ల జాబితాలో తప్పులుంటే సరిదిద్దుతాం
 = కొత్తవారికి జనవరి 25న ‘స్మార్ట్’కార్డులు
 =ఓట్ల నమోదుకు గడువు పొడిగింపు
 =రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్

 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఓటర్ల తొలగింపులో పొరపాట్లు జరిగితే సరిదిద్దుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా జాబితా నుంచి ఓటర్లను గల్లంతు చేసినట్లు తేలితే.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో దురుద్దేశంతో ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఫిర్యాదులందాయని, వీటిపై విచారణ జరిపేందుకు డి ప్యూటీ కలెక్టర్ల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణ తీరుపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి భన్వర్‌లాల్ మాట్లాడారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై అభ్యంతరాలుంటే తెలపాలని రాజకీయ పార్టీలకు లేఖలు రాసినప్పటికీ, ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయపక్షాలు చొరవ చూపితే ఈ సమస్య ఉత్పన్నం కాదన్నారు.  

ప్రతి ఓటరు విధిగా జాబితా పరిశీలించి తమ పేరు ఉందా? లేదా? అనేది గమనించాలన్నారు. పేరు లేకున్నా, నమోదు కాకున్నా, మార్పులు, చేర్పులు కావాల్సివున్నా సంబంధిత బూత్‌స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10, 15 తేదీల్లో స్థానిక పోలింగ్ కేంద్రాల్లో, వార్డు కార్యాలయం/ చౌక ధరల దుకాణంలో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అంతేగాకుండా వెబ్‌సైట్‌లోనూ జాబితాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. రాష్ర్టంలో చోటుచేసుకున్న తుపాన్లు, ఇతర కారణాలతో ఓటర్ల నమోదు గడువును ఈ నెల 17వ తేదీవరకు పొడగించినట్లు భన్వర్‌లాల్ వెల్లడించారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
 
గ్రేటర్‌లో 1.50 లక్షల మంది డూప్లికేట్లు

డూప్లికేట్ ఓటర్ల ఏరివేత కార్యక్రమం చురుగ్గా సాగుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,50,802 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా ఒకే పేరుతో వివిధ చోట్ల నమోదైన డూప్లికేట్  ఓటర్లను ఏరివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాజాగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో  6 లక్షల ఓటర్లను ఏరివేసినట్లు చెప్పారు. చనిపోయిన 54,179, పలుచోట్ల నమోదైన 1,58,914 మందితోపాటు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో నమోదైన 4,08,946 పేర్లను తొలగించినట్లు పేర్కొన్నారు.
 
 సరి‘కొత్త’ కార్డులు


 ఓటరు గుర్తింపు కార్డుల(ఎపిక్) డిజైన్‌ను మార్చుతున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. పాత కార్డుల స్థానే ‘స్మార్ట్’ కార్డులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తొలి దశలో కొత్త ఓటర్లకు వీటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 25న వీటిని ఓటర్లకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సవరణలు జరిగిన పాత ఓటర్లకు కూడా వీటిని ఇవ్వనున్నట్లు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement