ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ : పేదలకు ఆరోగ్యమస్తు | Arogyasree treatment limit increased to Rs 25 lakh | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ : పేదలకు ఆరోగ్యమస్తు

Published Tue, Dec 19 2023 4:16 AM | Last Updated on Tue, Dec 19 2023 4:52 PM

Arogyasree treatment limit increased to Rs 25 lakh - Sakshi

సాక్షి, అమరావతి:  వైద్యం కోసం పేదలు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేశామని, ఇది ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమని, గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వ వైద్య రంగం స్వరూపాన్ని మార్చామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వ్యయం పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే సిబ్బంది ఉండరనే దుస్థితిని మన ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందన్నారు.

ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 53,126 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్‌ లాంటి వైద్య సిబ్బందిని నియమించి మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో కేవలం 3.96 శాతం మాత్రమే ఉందని, ఈ కొరతను కూడా అధిగమించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇక జాతీయ స్థాయిలో నర్సుల కొరత 27 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా అని తెలిపారు. జాతీయ స్థాయిలో ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత 33 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా స్థాయికి తెచ్చామని, నూటికి నూరు శాతం పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు పొందడానికి ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్లాలి? చికిత్స వ్యయం ఎంతవరకు వర్తిస్తుంది? తదితర సందేహాలను సంపూర్ణంగా నివృత్తి చేస్తూ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను లబ్ధిదారులకు అందజేసి విస్తృత అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, స్మార్ట్‌ కార్డుల పంపిణీ, లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాలను సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ..  

4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా 
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరింత మందికి ఆరోగ్యశ్రీ అందించాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని పథకం పరిధిలోకి తెచ్చాం. దీంతో 1.48 కోట్ల కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. తద్వారా 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా కల్పించాం. 2019 నాటికి ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2,300 వరకు కొత్తగా పథకం పరిధిలోకి తెచ్చాం.

అనంతరం మరికొన్ని చేర్చి ఇవాళ 3,257 ప్రొసీజర్లతో ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన సందర్భాల్లో ఏ ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. గత సర్కారు హయాంలో అరకొర సేవలతో కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితమైంది. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కలిపి 2,513 ఆస్పత్రులకు సేవలను విస్తరించాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోనూ 204 కార్పొరేట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తున్నాం.
 
ఆరోగ్య సంరక్షణకు రూ.14,439 కోట్లు 
గత సర్కారు ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ  కోసం కేవలం రూ.5,171 కోట్లు ఖర్చు చేసింది. అంటే  ఏడాదికి రూ.1,034 కోట్లు మాత్రమే వెచ్చించిన దుస్థితి. 2014–19 మధ్య 108, 104 సేవల కోసం రూ.729 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏడాదికి సగటున రూ.4,100 కోట్లు వ్యయం చేస్తున్నాం. దీనికి అదనంగా ఏటా మరో రూ.300 కోట్లు 104, 108 సేవల కోసం ఖర్చు పెడుతున్నాం.

ఆరోగ్యశ్రీ, 104, 108 కోసం గత సర్కారు రూ.5,900 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా మనం ఏటా ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే రూ.14,439 కోట్లు వెచ్చించాం. గత సర్కారు హయాంలో 22.32 లక్షల చికిత్సలు అందించగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీతో 53 లక్షల చికిత్సలు అందించగలిగాం. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ నాడు – నేడు ద్వారా పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రి వరకూ అన్ని స్థాయిల్లో సదుపాయాలు కల్పించాం.

2019కు ముందు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా ఇవాళ కొత్తగా మరో 17 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతున్నాం. గతంలో 104, 108  వాహనాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి. నాడు 108 వాహనాలు కేవలం 336 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు మొత్తం 2,204 వాహనాలను అందుబాటులో ఉంచాం.  

చికిత్సానంతరం ఆసరా.. 
ఆరోగ్యశ్రీ కింద పేదవాడికి ఉచిత వైద్యం అందించడమే కాకుండా చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున, రెండు నెలలు అయితే రూ.10 వేలు పేదవాడి చేతిలో పెట్టి మరీ ఇంటికి పంపుతున్నాం. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,309 కోట్లు అందించాం.   

లక్షలు ఖర్చయ్యే ప్రాణాంతక వ్యాధులకూ.. 
గతంలో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌ లాంటి రోగాలకు చికిత్స ఖర్చు రూ.5 లక్షలు దాటితే ఇచ్చేవారు కాదు. కీమోథెరపీ లాంటిది ప్రారంభిస్తే కేవలం రెండు మూడు డోసులకే రూ.5 లక్షలు ఖర్చు అయిపోతాయి. దీంతో ఇక ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేమని వెనక్కు పంపడం లేదంటే నామమాత్రంగా చికిత్స చేసేవారు. 6 నెలలు తర్వాత ఆ పేషెంట్‌కు మళ్లీ క్యాన్సర్‌ తిరగబెట్టడంతో వైద్యం అందక చనిపోయిన దుస్థితి ఉండేది. ఇప్పుడు చికిత్స వ్యయంతో పని లేకుండా పూర్తిస్థాయిలో క్యాన్సర్‌ చికిత్స అందిస్తున్నాం.

రూ.12 లక్షల ఖరీదైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు రెండు చెవులకూ చేయిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల్లో రూ.11 లక్షలు ఖర్చయ్యే బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేయిస్తున్నాం. రూ.11 లక్షలయ్యే గుండె మార్పిడి చికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డ 1,82,732 మందికి ఆరోగ్యశ్రీతో ఉచితంగా చికిత్స అందించి తోడుగా నిలబడ్డాం. ఒక్క క్యాన్సర్‌ చికిత్సకే ఏకంగా రూ.1,900 కోట్లు ఖర్చు చేశాం.   

60.27 లక్షల మందికి ఫేజ్‌ 1లో వైద్య సేవలు 
ఫేజ్‌ 1 ఆరోగ్య సురక్షను 50 రోజుల పాటు నిర్వహించాం. 60,27,843  మంది వైద్య సేవలు అందుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పంపిణీ చేసే ప్రతి ఔషధం డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నాం. 562 రకాల మందులను అందుబాటులోకి తెచ్చాం. ప్రివెంటివ్‌ కేర్‌తో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి వైద్యం అందిస్తూ అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశంలో తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని కూడా తెచ్చాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతి పీహెచ్‌సీలోనూ ఇద్దరు డాక్టర్లు చొప్పున  నలుగురు వైద్యులను అందుబాటులోకి తెచ్చాం.  

పాల్గొన్న ఉన్నతాధికారులు.. 
కార్యక్రమంలో సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ నివాస్, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ, ఎంఏయూడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

నేటి నుంచి ప్రచార కార్యక్రమాలు
ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు పొందటాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియచేసే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. మంగళవారం నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఐదు  గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల్లో వీటిని ప్రారంభిస్తారు. ఇలా ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పున కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఒక బృందంగా, మరో బృందంలో ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపేవారు పాలు పంచుకుంటారు.

ప్రతి ఇంటికి వెళ్లి  ఆయా కుటుంబాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరించాలి. ఇంట్లో కనీసం ఒకరి మొబైల్‌ ఫోన్‌లోనైనా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి రిజిస్ట్రేషన్‌ చేయించాలి. మహిళా పోలీసులు కూడా ఇందులో పాల్గొని దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి. ఆరోగ్యశ్రీ సేవలపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన 6 నిమిషాల వీడియో సందేశాన్ని ఆయా కుటుంబాలకు చూపించాలి. వారి ఫోన్లలో కూడా ఈ వీడియోను ఉంచండి.  

సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ కార్డులు
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ కార్డుల్లో సరికొత్త ఫీచర్లున్నాయి. ఇవి స్మార్ట్‌ కార్డులు. ఇందులో క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది.  పేషెంట్లకు సంబంధించిన అన్ని వివరాలూ నిక్షిప్తం అవుతాయి. దీంతో వైద్యులు సులభంగా వైద్యం అందించడానికి వీలవుతుంది. ఇది ఈ కార్డులో విశిష్టత. వీటిని ప్రతి ఇంట్లో చక్కగా వివరించాలి.  

వైద్య రంగంలో అద్భుతాలు
ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉండాలన్న గొప్ప ఆలోచనతో అత్యున్నత స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తూ సీఎం జగన్‌ వినూత్న సంస్కరణలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. నాడు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రాణం పోస్తే నేడు సీఎం జగన్‌ మరింత విస్తరించారు.

దేశ చరిత్రలోనే మొదటిసారిగా జగనన్న ప్రభుత్వం వైద్య శాఖలో 53 వేలకుపైగా నియామకాలు చేపట్టిన ఘనత దక్కించుకుంది. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా, గుమ్మం వద్దకే ఫ్యామిలీ డాక్టర్, పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారు. వైద్యులు రోగిని కాపాడి మిరాకిల్స్‌ చేస్తారు. సీఎం జగన్‌ వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు చేస్తున్నారు.  – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి   

జనవరి 1 నుంచి ‘సురక్ష’ ఫేజ్‌–2
జనవరి 1వతేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్‌–2 ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక గ్రామంలో సురక్ష శిబిరం నిర్వహిస్తారు. మండలాన్ని రెండుగా విభజించి ఒక డివిజన్‌లో మంగళవారం, మరో డివిజన్‌లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. ఉచితంగా మందులు కూడా డోర్‌ డెలివరీ చేస్తున్నాం.

ఇప్పటికే ట్రైల్‌ రన్‌ ప్రారంభించాం. జనవరి ఒకటో తేదీ నుంచి మందులు ఉచితంగా డోర్‌ డెలివరీ ద్వారా అందుతాయి. రిఫరెల్‌ కేసుల వివరాలు తెలుసుకుని డాక్టర్‌ వద్దకు పంపించే కార్యక్రమం విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా జరుగుతుంది. రోగులకు ప్రయాణ ఖర్చుల కింద రూ.300 ప్రభుత్వమే అందిస్తుంది. వీటిని జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా చేపడతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement