జనం మధ్యే పథకాల అమలు కనిపించడం లేదా రామోజీ?
ప్రతి పథకం అమలులో ప్రజలతో మమేకం
ఏ జిల్లాకు వెళ్లినా నిస్సహాయులకు తక్షణ భరోసా
24 గంటలు తిరగకముందే కలెక్టర్ల ద్వారా ఆర్థిక సాయం
జిల్లాల పర్యటనలో 699 మంది ఆర్తులకు సాంత్వన
సీఎం జగన్ ఏ జిల్లాకు వెళ్లినా ప్రజా స్వాగతం
చంద్రబాబులా గిమ్మిక్కులు తెలియవు.. నాడు ప్రత్యేక విమానాలకు బాబు ఖర్చు రూ.100 కోట్లు
ప్రతీ నెలా ఒకటో తేదీ సుప్రభాత వేళ.. పేదింటి అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు అందే పింఛన్ సంతోషంలో జగన్ కనిపిస్తారు.. రైతుభరోసా సాయంలో రైతులకు ఆయన నవ్వు మోమే కనిపిస్తుంది.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది రూపాయల ఖరీదైన చికిత్స ఉచితంగా పొందే పేదల ఆరోగ్యంలోజగన్ రూపమే కనిపిస్తుంది.. ఇలా ప్రతీ పథకం లబ్ధిలోనూ రాష్ట్రమంతటికీ సీఎం జగన్ సంక్షేమాశయమే వేర్వేరు రూపాల్లో ప్రత్యక్షమవుతోంది ఒక్క రామోజీకి తప్ప.
కనిపించకూడదని కళ్లు మూసుకుంటాడాయన. నిత్యం జనంతో మమేకమై వారి సమస్యలే తనవిగా తపించే నేత సీఎం జగన్.. జనానికి చిన్నపాటి అసౌకర్యమూ కలగరాదని ఆరాటపడే నాయకుడాయన. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ తక్షణ సాయం అందాల్సిన పేదలను దగ్గరకు తీసుకుని, ఆత్మీయ పరిష్వంగంతో తక్షణ భరోసా ఇస్తారాయన.
ఆ భరోసాకు తగ్గట్టుగా 24 గంటలు తిరగక ముందే ఆర్థిక సాయాన్ని కలెక్టర్లే అందించేలా చూస్తున్న మానవతావాది. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా ఎన్నికల వేళ జగన్‌కు రాష్ట్ర ప్రజల నుంచి లభిస్తున్న అఖండ స్వాగతాన్ని జీర్ణించుకోలేక తత్తరపాటు, బిత్తరపాటుతో రామోజీ తొట్రుపాటు రాతలు రాస్తున్నారు.
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఇన్ని రోజులూ పరదాల చాటున ఉన్నట్లు.. ఎన్నికలున్నందున ఇప్పుడే ప్రజల దగ్గరకు వెళ్తున్నట్లు అజ్ఞానంతో ఈనాడు రామోజీ సీఎం జగన్‌పై విషం కక్కారు. జగన్ అంటే జనం..జనం అంటే జగన్ అనే విషయం రాష్ట్రంలో ఎవరినడిగినా చెబుతారు. ఈనాడు రామోజీకీ ఆ విషయం తెలుసు...ఆయినా నిలువునా జగన్ వ్యతిరేకతతో అక్షర కుట్రలు, కూహకాలతో ఆయనకు ప్రతీ రోజూ తెల్లారుతోంది. పథకాల అమలు సందర్భంగా సాయం అందించే క్రమంలో ఏ జిల్లాకు జగన్ వెళ్లినా నిస్సహాయులైన పేదలను స్వయంగా కలిసి, వారికి ఒక అన్నలా..తమ్ముడిలా...కొడుకులా..వారి వేదనను నివేదనను ఎంతో శ్రద్ధాసక్తులతో ఆలకిస్తారు.
వారి కష్టాలను 24 గంటల్లోనే పరిష్కరిస్తారు. ఇదంతా రామోజీ ఈనాడులో రాస్తూనే ఉంటారు. జనానికి జగన్ చేస్తున్న మేలేమిటో తెలిసినా, తెలియనట్లే నటిస్తూ... ఎన్నికలు కనుక జగన్ జనంలోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. జగన్ తొలి నుంచీ జనంతో ఉండటానికే ఇష్టపడతారు తప్ప చంద్రబాబు మాదిరిగా బడా వ్యాపార వేత్తలు, పలుకుబడి గల వారితో అంటకాగడానికి ఇష్టపడరనే విషయం జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడల్లా రహదారులకు ఇరు వైపులా జనం పూలతో స్వాగతించడం, ఆయన నవ్వులు చిందిస్తూ, ఆత్మీయంగా జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగడం రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తోంది.
ఒక్క ఈనాడు రామోజీకి మాత్రం ఈ ముచ్చటైన దృశ్యాన్ని చూడడానికి అబద్ధాల పరదాలు అడ్డొస్తున్నాయి. వాస్తవానికి పరదాలు, తెరచాటు వ్యవహారాలు మీ చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది రామోజీ. ముఖ్యమంత్రి జగన్ పథకాల అమలుకు జిల్లాలకు వెళ్లిన సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నిస్సహాయులై అనారోగ్యంతో బాధపడే పేదలను, లేదా ఇతర ఆర్దిక సమస్యల్లో సతమతమవుతున్న పేదలను కలిసి వారి సమస్యలను శ్రద్ధగా వినడమే కాకుండా కొంత మందికి 24 గంటలు తిరగకుండానే జిల్లా కలెక్టర్ల చేత ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయిస్తున్నారు.
కాలేయ మార్పిడితో పాటు గుండె, కేన్సర్ వంటి పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి భారీ ఆర్దిక సాయాన్నీ ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో జగన్‌ను కలిసిన ఆర్తుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సీఎంఓ కార్యాలయంలో ఒక బృందమే పనిచేస్తోంది. జిల్లాల పర్యటనల సందర్భంగా ఇప్పటివరకు 699 మంది పేదలను స్వయంగా కలిసి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు వైద్యానికి, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం అందేలా జగన్ చర్యలు తీసుకున్నారు. జనం అంటే ఈ 699 మంది పేదలు కాదా ఈనాడు రామోజీ..జనంలోకి వెళ్లడం అంటే నీ అర్థం ఏంటో మరి!
ఊరికో సచివాలయం.. సమస్యల పరిష్కారాలయం..
గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా, వారికి ప్రభుత్వ సేవలు అక్కడే అందేలా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఈ సీఎం ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నిత్యం ప్రజల మధ్యే సీఎం జగన్ పాలన కొనసాగింది. మీ చంద్రబాబులా ప్రచార యావ కోసం జిమ్మిక్కులు చేయడం జగన్‌కు ఇష్టం ఉండదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లిన ఘనత మీ బాబుకే దక్కుతుంది.
చంద్రబాబు 13 దేశాలకు 23 సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. నిత్యం హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలతో చంద్రబాబు విహరించినప్పుడు మీకు తప్పనిపించలేదా రామోజీ?. రాష్ట్ర ఖజానా నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానాలకు రూ.100 కోట్లకు పైగా వ్యయం చేశారు. ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటారా?. ఎన్నికల వేళ జనంలోకి అంటూ ఈనాడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండానే ప్రాంతాల వారీగా నాలుగు సిద్ధం సభలను నిర్వహించారు. ప్రజలకిచ్చిన హామీల అమలు గురించిన ఆలోచనతో జగన్ పాలన సాగించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ఎన్నుకున్న ప్రజల దగ్గరకే ప్రజాప్రతినిధులను ధైర్యంగా పంపించింది దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్.జగన్. చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ మళ్లీ వైఎస్సార్‌సీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి ధైర్యంగా ఆయన జనంలోకి వెళ్తుంటే దాన్నీ తప్పుపట్టే స్థాయికి రామోజీ దిగజారారు. ప్రజలకు ఏ కష్టం, ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆదుకోవడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన కొనసాగింది. బాబు తరహాలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి. ఏదైనా ఆపద వస్తే దాన్ని ప్రచారానికి వినియోగించుకోవడం ఆయన నైజం కాదు.
Comments
Please login to add a commentAdd a comment