దేశంలో సగటున కార్పొరేట్ ఆస్పత్రుల్లో బెడ్ ఛార్జీ రూ.50 వేలు
ఐసీఆర్‌ఏ అధ్యయనంలో వెల్లడి
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం
పేదలపై వైద్యం భారం పడకుండా సీఎం జగన్ ప్రభుత్వం భరోసా
ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు.. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా టెరిషరీ కేర్ అభివృద్ధి
ఒక ఇంటి ఆరోగ్యం వల్ల సమాజమే ఆరోగ్యవంతమవుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బృహత్తర ఆలోచనే సీఎం జగన్‌ను వైద్య రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా చేయించింది. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న లక్ష్యంతో వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు.
రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇదే బాటలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలినన్ని మందులు, వైద్య పరీక్షలు, సరిపడా వైద్య సిబ్బందితో ఆత్మీయంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందే అద్భుత వరాన్ని సీఎం జగన్ మాత్రమే అందిస్తున్నారు. అందుకే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం.
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలో సగటున కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగటున బెడ్ చార్జీ రూ.50 వేల పైమాటే. అంత సొమ్ము వెచ్చించి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందాలంటే సాధ్యమయ్యే పనేనా? కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తోంది. దేశంలో సగటున బెడ్ ఛార్జ్ రూ.50 వేలు అవుతుందనే అంశాన్ని ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ర్యాకింగ్ ఏజెన్సీ (ఐసీఆర్‌ఏ) ఓ అధ్యయనంలో వెల్లడించింది. తొమ్మిది ప్రముఖ చైన్ ఆస్పత్రుల్లో రెవెన్యూపై ఐసీఆర్‌ఏ అధ్యయనం చేపట్టింది.
ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు జబ్బు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలంటే అప్పులపాలవ్వక తప్పదు. అప్పులు పుట్టని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాలను సీఎం జగన్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటోంది. ఈ వర్గాలు వైద్య పరంగా ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాలకు భరోసాగా ఉంటోంది. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేసినా ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో, అటు ప్రైవేట్‌లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించి బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడుతోంది.
టెరిషరీ కేర్ అభివృద్ధితో రెట్టింపు భరోసా
ఓ వైపు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమాన్నీ సీఎం జగన్ చేపట్టారు. వైద్య రంగంలో కీలకమైన టెరిషరీ కేర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెరిషరీ కేర్‌లో పేదలకు ఆధారమైన పెద్దాస్పత్రుల్లో మానవ వనరులను పూర్తి స్థాయిలో సమకూర్చడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తూ రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో అప్పటి వరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు ఉన్న చోట నిపుణులైన వైద్యులతో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో బోధనాస్పత్రిలో 600 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 10 చోట్ల కొత్తగా బోధనాస్పత్రులు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన ఏడు చోట్ల వచ్చే ఏడాది బోధనాస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు చేరువ అవుతున్నాయి.
95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ‘రక్ష’
దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో ఏకంగా 95 శాతం కుటుంబాలకు సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పథకం రక్షణగా నిలుస్తోంది. ఏకంగా రూ.25 లక్షల వరకూ విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. రాష్ట్రంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 2,331 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో 3,257 ప్రొసీజర్‌లలో లబ్దిదారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి.
అన్ని రకాల క్యాన్సర్‌లతో పాటు, గుండె మార్పిడి, కార్డియాలజీ, న్యూరో సంబంధిత ఖరీదైన చికిత్సలన్ని పథకం పరిధిలో ఉంటున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ 44,78,319 మందికి ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఇక్కడితో ఆగకుండా చికిత్స అనంతరం బాధితులకు అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతి రూపంలో ఆర్థికంగా చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ 23 లక్షల మంది రోగులకు ఏకంగా రూ.1366 కోట్ల మేర సాయాన్ని అందించారు.
గతంలో ఎన్నడూ ఎక్కడా లేనంతగా లబ్ధి
ప్రస్తుతం నిరుపేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే సాధ్యపడని పరిస్థితి. దురదృష్టవశాత్తూ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో డబ్బు కట్టాల్సిందే.
ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించి ప్రజలకు భరోసాగా నిలవడం శుభపరిణామం. గతంలో కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు. రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలు వైద్యానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ ఉచితంగా వైద్యం లభించడం గొప్ప మార్పు. – డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment