సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ చకచకా కొనసాగుతోంది. మొత్తం మీద 1.42 కోట్ల కార్డులను పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 18,06,084 కార్డులను గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన కార్డులను కూడా శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే.
అలాగే 2019కి ముందు 1,059గా ఉన్న ప్రొసీజర్‌లను ఏకంగా 3,257కి పెంచింది. ఈ నేపథ్యంలో పెరిగిన ప్రయోజనాలతో కూడిన కొత్త కార్డులను ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. అంతేకాకుండా వాటిపైన అవగాహన కల్పిస్తోంది. ఒక్కో వారం నియోజకవర్గంలో నాలుగు వరకు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన, ప్రచారం, కార్డుల పంపిణీ కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు.
మరింత సులభంగా వైద్య సేవలు పొందేలా..
సరికొత్త ఫీచర్‌లతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రతి కార్డులో కుటుంబ యజమాని పేరు, జిల్లా, మండలం, గ్రామ/వార్డు సచివాలయం వివరాలతో పాటు, సంబంధిత కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు, వారి పేర్లు, ఇతర వివరాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్, యూనిక్ హెల్త్ ఐడెంటిటీ నంబర్ (యూహెచ్‌ఐడీ) కూడా పొందుపరుస్తున్నారు. వైద్యం కోసం నెట్‌వర్క్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆరోగ్యమిత్ర, వైద్యులు సులువుగా రిజి్రస్టేషన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. దీంతో మరింత వేగంగా, సులభంగా ప్రజలు వైద్య సేవలు పొందొచ్చు.
యాప్ ద్వారా సేవలు..
రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్య సేవలు పొందడం ఎలాగో ప్రజలకు సులువుగా అర్థం కావడానికి ప్రత్యేకంగా బ్రోచర్‌లను కూడా వైద్య సిబ్బంది అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రచార కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల మొబైల్ ఫోన్‌లలో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. యాప్‌ను ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 64,15,515 ఆరోగ్యశ్రీ కార్డుదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో లాగిన్ అయ్యారు.
వంద శాతం లబ్ధిదారులకు యాప్ సేవలను చేరువ చేసేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఈ యాప్ ఫోన్‌లో ఉంటే అరచేతిలో ఆరోగ్యశ్రీ ఉన్నట్టే అనే చందంగా ప్రభుత్వం యాప్‌లో ఫీచర్‌లను పొందుపరిచింది. పథకం కింద అందే వైద్య సేవలు, రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల ఉండే నెట్‌వర్క్ ఆస్పత్రులు, వాటిల్లో ఏ ప్రొసీజర్స్‌కు వైద్యం చేస్తారనే సమాచారం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఏ ఆస్పత్రి ఉందో తెలుసుకుని, అక్కడకు చేరుకోవడానికి ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక గతంలో పథకం ద్వారా పొందిన చికిత్సలు, రిపోర్ట్‌లను సైతం ఒక్క క్లిక్‌తో పొందడానికి వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment