
ఫిట్స్ వచ్చిన కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించి డబ్బుల కోసం తండ్రి అవస్థలు
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో అందని ఉచిత వైద్యం
రూ.5వేలు బాడుగ కోసం ఇసుక తీసుకువెళ్లిన ట్రాక్టర్ పట్టుకున్న పోలీసులు
ఆవేదనతో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ట్రాక్టర్ డ్రైవర్
ఆళ్లగడ్డ/ఎర్రగుంట్ల: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం పేదలకు పెను శాపంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.3,500 కోట్లను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పెట్టింది. దీంతో పేదలకు ఎక్కడా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలిసిపోయే దుస్థితి నెలకొంది. తన కుమారుడికి ఫిట్స్ రావడంతో ఉచితంగా వైద్యం అందక ఓ తండ్రి తల్లడిల్లిపోయాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేశాడు.
ఇంకా డబ్బులు అవసరం కావడంతో తన కొడుకును కాపాడుకునేందుకు బాడుగకు ఇసుక తోలితే కిరాయి డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. కానీ అతని ఆశలకు పోలీసులు గండికొట్టారు. రూ.5వేలు బాడుగ కోసం ట్రాక్టర్‌లో ఇసుక తీసుకువెళ్లిన ఆయన్ను పోలీసులు పట్టుకుని రూ.20వేలు లంచం అడగడంతో దిక్కుతోచక విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వైఎస్సార్ జిల్లాలో శనివారం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ఉచిత వైద్యం అందక పేదలు పడుతున్న కష్టాలు... ఇసుక ఉచితమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా పేదలు ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా తీసుకువెళ్లలేని దుస్థితికి నిదర్శనంగా నిలిచింది.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లి గ్రామానికి చెందిన ఎన్.రవీంద్ర ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుక్కుని జీవిస్తున్నాడు. అతని కుమారుడికి ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా, పెన్నానది నుంచి ట్రాక్టర్‌లో ఇసుక తీసుకుని సమీపంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వెళ్లి విక్రయిస్తే బాడుగ డబ్బులు రూ.5వేల వరకు వస్తాయని ఆశించాడు. శుక్రవారం పోట్లదుర్తి వద్ద పెన్నా నది నుంచి ఇసుకను ట్రాక్టర్‌లో తీసుకువెళుతుండగా... చాగలమర్రి టోల్‌గేట్ వద్ద ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐ హరిప్రసాద్ ఆపి పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించారు.
ట్రాక్టర్ వదిలేయాలంటే రూ.20 వేలు ఇవ్వాలని ఆయన వెంట ఉన్న హోంగార్డు ద్వారా చెప్పించారు. ఇసుక ట్రాక్టర్‌ను ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్‌కు తరలించారు. రూ.10వేలు ఎస్‌ఐ చెప్పిన నంబర్‌కు ఫోన్ పే చేసినా వదల్లేదు. దీంతో రవీంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన ఆవేదనను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ఆయన శనివారం విషం డబ్బా తీసుకుని పోట్లదుర్తి గ్రామంలో పెన్నానది వద్దకు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు వెంటనే వచ్చి పెన్నానది ప్రాంతంలో వెదికారు.
అప్పటికే విషం తాగి నది వద్ద పడి ఉన్న రవీంద్రను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం వందలాది లారీల్లో ఇసు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకోని పోలీసులు ఒక పేదవాడు ట్రాక్టర్ ఇసుక తీసుకువెళితే వేధించడంపై ప్రజలు మండిపడుతున్నారు.