fits
-
బిడ్డ మరణం తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): కళ్ల ముందే కన్న కూతురు మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగిపోయింది. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న కుమార్తె, భార్య నిముషాల వ్యవధిలో ప్రాణాలు విడవడంతో వారి మృతదేహాల వద్ద కన్నీటిపర్యంతమైన భర్తను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఈ హృదయ విదారక ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం ద్వారకానగర్‌కు చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు మూడేళ్ల కిందట దేవరాపల్లికి బతుకు తెరువు కోసం వచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలోని అపార్టుమెంట్లో భార్య ఉషారాణి (51), మానసిక దివ్యాంగురాలైన కుమార్తె సాయి మేఘన (18)తో నివాసం ఉంటున్నారు. సాయి మేఘన తరచూ ఫిట్స్‌తో బాధపడుతుండేది. ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఉదయం సాయి మేఘనకు ఫిట్స్ రావడంతో ఇంటిలో పడిపోయింది. తల్లిదండ్రులు ఆమెను ఎంత లేపినా లేవకపోవడంతో అనుమానం వచ్చి అదే అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చిచూసి సాయి మేఘన మృతి చెందినట్లు చెప్పారు. అప్పటి వరకు బాగానే ఉన్న తన కుమార్తె చనిపోయిందన్న విషయం తెలిసి ఆ మాతృమూర్తి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కూతురు మరణవార్తను బంధువులకు ఫోన్లో చెబుతూనే ఉషారాణి గుండెపోటుకు గురై పక్కనే ఉన్న సోఫాలో కుప్పకూలిపోయింది. ఈ హటాత్ఫరిణామాన్ని చూసిన వారంతా ఆమె స్పృహ తప్పి పడిపోయిందని భావించి ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఆమె ఎంతకీ లేవకపోవడంతో అనుమానం వచ్చి మరలా వైద్యుడ్ని పిలిచారు. ఆయన వచ్చి చూసి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య, కుమార్తె తనను ఒంటరి చేసి వెళ్లిపోయారని, తాను ఎవరి కోసం బతకాలని నిమ్మకాయల శ్రీనివాసరావు వారి మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి హృదయాలను కలిచివేసింది. నిముషాల వ్యవధిలోనే తల్లీ కుమార్తె మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం సాయ ంత్రం తల్లీ కూతుళ్లకు అంత్యక్రియలు నిర్వహించారు. -
ఊహించని రీతిలో కబళించిన మృత్యువు
క్రైమ్: చక్కగా చదువుకునే అమ్మాయిని ఆమెకున్న ఆరోగ్య సమస్య హఠాత్తుగా బలిగొంది. అదీ ఎవరూ ఊహించని రీతిలో!. రోజూలాగే స్కూల్‌కు వెళ్తున్న ఆమె ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న చెరువులో పడి కన్నుమూసింది. సీతానగరం మండలం ఆవాలవలసకు చెందిన శ్రావణి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. సత్యం-పార్వతిలకు ఆమె ఏకైక సంతానం. గాదెలవలసలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సైకిల్ మీద వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో ఫిట్స్ వచ్చింది. దీంతో బ్యాలెన్స్ ఆగక పక్కనే ఉన్న చెరువులో పడింది. అది గమనించిన తోటి విద్యార్థులు చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించారు. అయితే.. అప్పటికే ఆలస్యమైంది. సైకిల్ మీద పడి ఆమె బుదరలో కూరుకుపోవడంతో కన్నుమూసిందామె. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: నితిన్ తన మాట వినడం లేదంటూ.. -
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. ఉన్నట్టుండి కిందపడిపోయి
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్లుండి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండటం మనలో చాలా మంది గమనించి ఉంటాం. ఇలా కింద పడి ఉన్న వ్యక్తుల చేతిలో తాళం చెవులు పెడితే కాసేపటికి తేరుకుని మళ్లీ ఏమీ జరగనట్లు వెళ్లిపోతూ ఉంటారు. దీనినే వాడుకభాషలో వాయి అని పిలుస్తారు. వ్యవహారికభాషలో మాత్రం మూర్చగా పేర్కొంటారు. వైద్యపరిభాషలో ఫిట్స్ లేదా ఎపిలెప్సీగా చెబుతారు. నవంబర్ 17న జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజీ విభాగానికి ప్రతి వారంలో సోమ, గురువారాల్లో రెండు రోజులు ఓపీ నిర్వహిస్తారు. ఇక్కడికి ప్రతి ఓపీ రోజున 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఈ లెక్కన నెలకు సగటున 2వేల మంది, ఏడాదికి 24వేల మంది ఓపీలో వైద్యం తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒక ప్రొఫెసర్ డాక్టర్ సి. శ్రీనివాసులు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్యామసుందర్ సేవలందిస్తున్నారు. వచ్చిన రోగుల్లో 20 శాతానికి పైగా మూర్ఛవ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. జనాభాలో ఒక శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల అంచనా. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45 వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు అంచనా. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ప్రస్తుతం ఐపీ సేవలతో పాటు ఈఈజీ మిషన్ సేవలు కూడా లభిస్తున్నాయి. ఏడాదికి 15 వేల మందికి ఈఈజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటుగా ఈ పరీక్ష చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి రూ.2వేలు ఖర్చవుతుంది. అవసరమైన వారికి ఎంఆర్ఐ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఈఎంజీ, ఐసీయూ ఏర్పాటైతే ఈ విభాగానికి అవసరమైన పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోని న్యూరాలజిస్టులు మరో 15 మంది దాకా ఉన్నారు. వీరి వద్ద కూడా నెలకు మరో 900 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఇక నాటు మందులను ఆశ్రయించే వారు వీరికి రెట్టింపు సంఖ్యలో ఉంటారు. మూర్ఛల్లో రకాలు–లక్షణాలు సాధారణ మూర్చలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్ క్లోనిక్‌లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్ లేక సెటిల్ మాలో మూర్ఛలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు. మయోక్లోనిక్ మూర్ఛలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి. ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్ మూర్ఛలో ఆకస్మిక విచి్ఛన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లలో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు. సంక్లిష్ట ఫోకల్ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు. రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతుల్లో, కాళ్లలో తరచూ లాగుతుంది. మూర్ఛ వ్యాధికి కారణాలు వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూర్ఛ వస్తుంది. మూర్చ(ఫిట్స్) అంటే.. మూర్చ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటీ అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్ లేదా ఎపిలెప్టిక్ ఫిట్స్‌గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికైనా రావచ్చు. మూర్ఛవ్యాధి నిర్ధారణ మూర్ఛకు గురైన వారు వైద్యుని వద్దకు వచ్చిన వెంటనే అతని పక్కన ఉన్న వ్యక్తితో జరిగిన సంఘటన గురించి వైద్యులు ఆరా తీసి అది మూర్ఛనా కాదా తెలుసుకుంటారు. నిర్ధారణ కోసం అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఈఈజీ పరీక్షలు చేయిస్తారు. కొన్నిసార్లు వీడియో ఈఈజీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు. వీటి ద్వారా మెదడులోని ఏ భాగంలో దెబ్బతినడం వల్ల మూర్చ వస్తుందో గుర్తిస్తారు. మందులు వాడితే తగ్గిపోతుంది మూర్ఛ వ్యాధిగ్రస్తులను దాదాపు 75 శాతం మందిని మందులతోనే పూర్తిగా నయం చేయవచ్చు. కేవలం 25 శాతం మందికి మాత్రమే ఆపరేషన్ అవసరమవుతుంది. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్ఛ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. మా విభాగానికి వచ్చిన మూర్ఛ రోగులకు ఉచితంగా మందులు, చికిత్స, వైద్యపరీక్షలు చేయిస్తున్నాం. అయితే వైద్యుల సూచన మేరకు ఇంటి వద్ద మందులు వాడితేనే చికిత్సకు వ్యాధి లొంగుతుంది. – డాక్టర్ సి.శ్రీనివాసులు, న్యూరాలజీ విభాగం హెచ్ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొన్న కారు.. వరుడు సహా..
సాక్షి, హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నూతన వరుడు, మరో ఇద్దరు తీవ్రంగా, వధువు, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్‌కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరవల్లి పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని పిప్పరలో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అంపాపురం సమీపంలోని పతంజలి పామాయిల్ ఫ్యాక్టరీ సమీపంలో కారు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో కారు అదుపుతప్పి వేగంగా రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. వరుడు కె.శివకుమార్, ఆయన తల్లి సీతారావమ్మ, డ్రైవర్ సుమంత్ తీవ్రంగా గాయపడ్డారు. వధువు రేణుక, మరో బంధువు గాయత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు, హైవే రోడ్ సేఫ్టీ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి) -
ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి..
ఒంగోలు: ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు ఫిట్స్‌తో అక్కడ అకస్మాత్తుగా మృతిచెందాడు. కొడుకులిద్దరు, భర్తను ఒకరి తర్వాత ఒకర్ని కోల్పోయిన ఆ ఇల్లాలి వేదన చూపరులను కంట తడిపెట్టిస్తోంది. వివరాలివీ.. నగరంలోని కొప్పోలుకు చెందిన దొండపాటి కార్తీక్ (26) బీటెక్ వరకు ఒంగోలులోనే చదివాడు. రెండు నెలల క్రితం ఎంఎస్ డేటాసైన్స్ చదువు కోసం అమెరికాలోని చికాగో స్టేట్ లెవిస్ యూనివర్శిటీకి వెళ్లాడు. ఇప్పటికే చిన్న కుమారుడు, భర్త మృతిచెందడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ మీదే ఆశలు పెట్టుకున్న తల్లి శోభారాణి అంతదూరం వద్దంటున్నా కార్తీక్ వినిపించుకోలేదు. చదువు పూర్తికాగానే రెండేళ్లలో వచ్చేస్తానంటూ వెళ్లాడు. కానీ, భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉ.7 గంటల సమయంలో కార్తీక్ మూర్ఛవ్యాధి (ఫిట్స్)కి బలయ్యాడు. వెళ్లిన రెండు నెలల్లోనే కొడుకు కన్నుమూయడంతో ఆ తల్లి ఆవేదన వర్ణణాతీతంగా మారింది. 15ఏళ్ల క్రితం ఇదే రోజు చిన్నకొడుకు మృతి 15 సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు శ్రీరామనవమి పండుగ రోజే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ దంపతులు తమ ఆశలన్నీ కార్తీక్‌పైనే పెట్టుకున్నారు. ఏడేళ్ల క్రితం శోభారాణి భర్త రత్తయ్య కూడా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో.. మిగిలిన ఒక్క కొడుకూఅమెరికా వెళ్లి మృతిచెందడంతో ఆ తల్లి హృదయం విలవిల్లాడుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. మరోవైపు.. కార్తీక్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. చికాగో అధికారులతో వారు చర్చిస్తున్నారు. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. -
ఫిట్స్ వచ్చినప్పుడు నురగ ఎందుకు వస్తుందంటే?
ఫిట్స్ వచ్చినప్పుడు నోటి నుంచి నురుగ రావడాన్ని గమనించవచ్చు. చూసేవారికిది చాలా భయాన్ని గొలుపుతుంది కూడా. నిజానికి ఇది చాలా నిరపాయకరమైన లక్షణం. ఫిట్స్ వచ్చినప్పుడు నురగ ఎందుకు వస్తుందో చూద్దాం. ఫిట్స్ వచ్చినప్పుడు మింగడం ప్రక్రియ ఆగిపోతుంది. కానీ నోట్లో ఊరే లాలాజలం మాత్రం యథావిధిగా ఊరుతూనే ఉంటుంది. సాధారణంగా నోట్లో ఊరే ఈ లాలాజలం నిత్యం గుటక వేయడం వల్ల కడుపులోకి వెళ్తుంది. మనకు తెలియకుండానే మనం ఇలా ఎప్పటికప్పుడు గుటక వేస్తూనే ఉంటాం. అయితే ఫిట్స్ వచ్చినవారిలో గుటక వేయనందున ఆ లాలాజలం నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో ఊపిరితిత్తుల్లోంచి వచ్చే గాలి ఈ లాలాజలంలో బుడగలను సృష్టిస్తుంది. అందుకే ఫిట్స్ వచ్చినప్పుడు ఈ బుడగలతో కూడిన లాలాజలం కారణంగా... నోట్లోంచి నురగ వస్తున్నట్లు అనిపిస్తుంది. నిజానికి ముందు చెప్పినట్లుగా ఇదేమీ ప్రమాదకరమైన లక్షణం కాదు. అంతేకాదు... దీన్ని ఫిట్స్ తీవ్రతకు లక్షణంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఆ నురగను చూసి ఆందోళన చెందకుండా రోగిని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చాలి. చదవండి: తెమడ రంగును బట్టి జబ్బును ఊహించవచ్చు! పుట్టుమచ్చలా... ఈ ‘ఏ, బీ, సీ, డీ’లు గుర్తుంచుకోండి! -
పెళ్లి బృందంతో బస్సు.. డ్రైవర్‌కి ఫిట్స్
భైంసాటౌన్ (ముథోల్): పెళ్లి బృందంతో వస్తున్న బస్సు అదుపు తప్పి చేలలోకి వెళ్లిన ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రెంజల్ నుంచి భైంసాకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పెళ్లి బృందం వస్తున్నారు. ఈ క్రమంలో భైంసా శివారులోని హరియాలి పెట్రోల్ పంపు వద్దకు రాగానే డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో డ్రైవర్ చాకచాక్యంగా బస్సును చేలల్లోకి మళ్లించాడు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఘోరం: డ్రైవింగ్‌లో ఉండగా ఫిట్స్!
సాక్షి, దుండిగల్: వేగంగా కారు నడుపుతున్న వ్యక్తికి ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి ప్రహరీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపల్ పరిధి డీపోచంపల్లికి చెందిన అక్బర్ ఖాన్(38) ఎలక్ట్రీషియన్ శనివారం రాత్రి ఔటర్ నుంచి దుండిగల్ వైపు వర్నా కారులో వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిట్స్ రావడంతో కారు పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్ గోడను ఢీకొంది. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్న! బతకాలనిలేదు అందుకే దూకేస్తున్నా..
సాక్షి, సిర్పూర్ : ఒక్కగానొక్క కుమారుడు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎప్పుడూ వెంటే పెట్టుకుని తిరిగారు. అంతలోనే ఆ బాలుడికి ఫిట్స్ ఉందని తెల్సింది. అప్పటినుంచి అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఆ బాలుడికి ఏమనిపించిందో ఏమో.. తండ్రి ఎదుటే జలపాతంలో దూకాడు. ఈ సంఘటన సిర్పూర్ (యూ) మండలం పంగిడి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. 20 గంటల అనంతరం ఆ బాలుడు విగతజీవిగా కనిపించాడు. స్థానికులు, ఏఎస్సై అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేశ్ముఖ జైరాం, పార్వతికి దేశ్‌ముఖ్ శివ్‌దాస్(15) ఏకైక సంతానం. జైనూర్ మండలం పోచంలొద్ది ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా ఫిట్స్ వస్తుండడంతో ఇంటి వద్ద నుంచే పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం శివ్‌దాస్ పాఠశాలకు వెళ్లలేదు. దీంతో తండ్రి గ్రామ శివారులోని పంట చేనుకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో తండ్రి ఇంటికి అన్నం తినేందుకు వెళ్లగా.. శివ్‌దాస్ అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తండ్రికి ఫోన్ చేసి గ్రామ సమీపంలోని కుండై జలపాతం వద్ద ఉన్నానని, త్వరగా రావాలి అంటూ ఫోన్ పెట్టేశాడు. కంగారుపడిన తండ్రి తనతోపాటు మరో నలుగురు గ్రామస్తులను తీసుకుని వెంటనే జలపాతం వద్దకు బయల్దేరాడు. వారిని చూసిన శివ్‌దాస్ తనవద్ద ఉన్న సెల్‌ఫోన్ కిందపెట్టి జలపాతంలోకి దూకాడు. తండ్రి దూకొద్దంటూ కేకలు వేసినప్పటికీ వినిపించుకోలేదు. అప్పటికే చీకటి పడటంతో శివ్‌దాస్ ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం ఆసిఫాబాద్ నుంచి ఈతగాళ్లను రప్పించి వెతికించగా.. విగతజీవిగా కనిపించాడు. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భవనంపై నుంచి పడి వృద్ధురాలు మృతి
సాక్షి, మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నెం కోటయ్య భార్య విష్ణుప్రియ (65) తన ఇంటి పైనుంచి కిందపడి మృతిచెందింది. పై అంతస్తుకు వెళ్లిన ఆమె అక్కడినుంచి జారి కింద పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో గమనించిన కింది పోర్షన్లో అద్దెకు ఉండేవాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. బంధువులను పిలిపించి కేసు నమోదు చేశారు. ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని మృతురాలి కొడుకు తెలిపాడు. -
చెత్త తగులబెడుతూ మంటల్లో పడిపోయిన రైతు
నూజెండ్ల: పొలంలో ఉన్న చెత్తను తగులబెట్టేందుకు యత్నించిన ఓ రైతు మూర్ఛ రావటంతో మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం పెద్దారం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కామసాని అమరలింగయ్య(35)కు అప్పుడప్పుడు మూర్ఛ వస్తుంటుంది. శనివారం పొలాన్ని సాగుకు సిద్ధం చేసుకునే క్రమంలో అందులో ఉన్న కందికట్టెకు నిప్పుపెట్టాడు. అయితే, అక్కడే నిలబడి నిప్పు ఎగదోస్తున్న క్రమంలో అమరలింగయ్యకు ఫిట్స్ వచ్చాయి. దీంతో అకస్మాత్తుగా మంటల్లో పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అక్కడికి చేరుకుని మంటల్లో నుంచి బయటకు లాగారు. అయితే, అప్పటికే అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు 108కు ఫోన్ చేసి వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
డ్రైవింగ్ సీట్లోనే బస్సు డ్రైవర్ మృతి
హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్ డ్రైవింగ్ సీట్లోనే మృతిచెందాడు. బీవీఆర్ఐటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు శుక్రవారం ఉదయం విద్యార్థులను తీసుకొని కళాశాలకు వెళ్తుండగా.. నారాయణగూడ చౌరస్తా వద్దకు రాగానే బస్సులో డీజిల్ అయిపోయింది. బస్సులో ఉన్న కళాశాల ఫ్యాకల్టీ డీజిల్ తేవడానికి వెళ్లిన సమయంలో బస్సు డ్రైవర్ రసూల్‌కు ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. రసూల్ గత రెండు రోజులగా మాత్రమే డ్రైవింగ్ చేస్తున్నాడని.. పర్మనెంట్ డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో.. దినసరి కూలి లెక్కన బస్సు నడపడానికి వచ్చాడని కాలేజి యాజమాన్యం తెలిపింది. -
ఫిట్స్‌తో గురుకుల పాఠశాల విద్యార్థి మృతి
నరసాపురం : మండలంలోని ఎల్బీచర్ల గురుకుల పాఠశాల విద్యార్థి కాటూరి ఆనంద్(17) ఫిట్స్ వల్ల శుక్రవారం ఉదయం మరణించాడు. అతనికి సకాలంలో వైద్యం అందకే మరణించాడని ఆరోపిస్తూ.. నరసాపురం ప్రభుత్వాసుపత్రి వద్ద దళితసంఘాల నేతలు ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, పాఠశాల ప్రిన్సిపాల్ బి.హెచ్ఆర్.కె.మూర్తి కథనం ప్రకారం.. చింతలపూడికి చెందిన ఆనంద్ రెండేళ్లుగా గురుకుల పాఠశాలలో ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తరచూ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు లైట్లు వేయగానే, ఆనంద్ లైట్లు ఆర్పాలని పెద్దగా కేకలు వేశాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లి చూసేసరికే ఫిట్స్‌తో కొట్టుకుంటూ కోమాలోకి వెళ్లాడు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే సరికి అతను మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆనంద్‌కు సకాలంలో వైద్యం అందలేదని, అందుకే మృతి చెందాడని ఆరోపిస్తూ దళిత సంఘాల నేతలు దొండపాటి స్వాములు, ఇంజేటి జాన్‌కెనడీ, అడిదల శరత్, నక్కా ఆనంద్, ముస్కూడి రవి, బత్తుల దుర్గారావు తదితరులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. దీనికి స్పందించిన ప్రిన్సిపాల్ ఆనంద్‌కు ఫిట్స్ వస్తుంటాయని, పాఠశాలలో చేర్చుకున్నప్పుడే అతని తల్లిదండ్రులు తమకు అఫిడవిట్, లేఖ ఇచ్చారని చెప్పారు. మొత్తానికి ఆందోళనకారులకు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల అసోసియేషన్‌కు మధ్య చర్చలు జరగడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆనంద్ తండ్రి తిరుపతిరావు కూలిపనులు చేస్తుంటారు. తల్లి మరియమ్మ గృహిణి. ఒక్కగానొక్క కొడుకు మృతితో వారిద్దరూ బోరున విలపిస్తున్నారు. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వేణ్ణీళ్లతో వచ్చే ఫిట్స్ ఇవి...!
మెడిక్షనరీ తల మీద వేణ్ణీళ్లు పడితేనే కొందరికి ఫిట్స్ వస్తాయి. ఈ రకం జబ్బు చాలా అరుదైనది. దీన్ని ‘హాట్ వాటర్ ఎపిలెప్సీ’ (హెచ్డబ్ల్యూఈ) అంటారు. ఈ తరహా ఎపిలెప్సీ సాధారణంగా పిల్లల్లో కనిపిస్తుంది. నీళ్లలో ఉండే ఉష్ణోగ్రతకు చర్మం ప్రతిస్పందించే తీరు పట్ల ఇది వస్తుంది. హాట్ వాటర్ ఎపిలెప్సీ అనేది ఏమాత్రం హాని చేయని (బినైన్) రుగ్మత. తొలి చికిత్సగా తల స్నానం చేయించాల్సిన నీళ్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. అప్పటికి లొంగకపోతేనే మందులతో చికిత్స చేస్తారు. -
కాళ్లు ఊపే జబ్బు...!
మెడిక్షనరీ కొంతమంది కాళ్లు అదేపనిగా ఊపుతుంటారు. ఈ కండిషన్‌ను ‘రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్’ అంటారు. ఇదొక నరాల జబ్బు. ఇది నిద్రకూ అంతరాయం కలిగిస్తుంటుంది. కాబట్టి దీన్ని నిద్రసంబంధమైన రుగ్మత (స్లీప్ డిజార్డర్)గా కూడా పరిగణిస్తుంటారు. ఇక కొంతమంది మహిళల్లో ఇది గర్భధారణ తర్వాత కనిపిస్తుంది. ఇంకొందరిలో ఆస్తమా అలర్జీలకు వాడే మందులు, యాంటీడిప్రెసెంట్ తీసుకున్నప్పుడూ రావచ్చు. ఆల్కహాల్, నిద్రలేమి సైతం ఈ జబ్బుకు కారణాలు కావచ్చు. దీన్ని తగ్గించడం కోసం సాధారణంగా వ్యాయామాలు, నిద్రను క్రమబద్దీకరించడం, కాఫీ, ఆల్కహాల్, పొగాకు వాడకాన్ని తగ్గించడం తోడ్పడతాయి. ఇలా మందులు వాడకుండానే అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక చాలా కొద్దిమందిలో మెదడులో స్రవించే ఒక రకమైన రసాయనాన్ని పెంచే డోపమినర్జిక్ మందులు, ఫిట్స్‌ను తగ్గించే మందులు వాడాల్సి రావచ్చు. -
గర్భవతులకు అది నిజంగానే ‘తలనొప్పి’!
పరిపరి శోధన గర్భవతుల్లో వచ్చే తలనొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా నాలుగు నుంచి ఆరు నెలలు, ఏడు నుంచి తొమ్మిది నెలల గర్భం (సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్) సమయంలో వచ్చే తలనొప్పులను ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఇక ఒకవేళ గర్భంతో ఉన్నవారికి రక్తపోటు గనక పెరిగితే దాన్ని ఆ విషయాన్ని కాస్తంత తీవ్రంగానే పరిగణించాలంటున్నారు నిపుణులు. గతంలో తలనొప్పిగానీ, హైబీపీగాని లేని మహిళల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తే అది గర్భవతుల్లో ఫిట్స్ (కన్వల్షన్స్)కు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో తమ అధ్యయనాన్ని ప్రచురించారు. ఈ తలనొప్పుల్లో చాలావరకు మైగ్రేన్ కావచ్చనీ, అయితే 51 శాతం మందిలో గర్భధారణకు సంబంధించిన కాంప్లికేషన్స్తో వచ్చిన తలనొప్పిగా గుర్తించినట్లు వివరించారు. గర్భం ధరించిన వారిలో కనిపించే హైబీపీ, మూత్రంలో అధికప్రోటీన్ (ప్రీ-ఎక్లాంప్సియా) వల్ల వచ్చే తలనొప్పి కూడా కావచ్చనీ, అందుకే నిర్లక్ష్యం కూడదని హెచ్చరిస్తున్నారు. -
సంగీతం వింటే ఫిట్స్ వచ్చే జబ్బు!
మెడి క్షనరీ నిజానికి సంగీతం అంటే పిల్లలూ, పెద్దలతో పాటు మూగజీవాలూ పరవశిస్తాయని అంటారు. కానీ ఈ జబ్బు ఉన్నవాళ్లు సంగీతం వినగానే ఫిట్స్ వచ్చి పడిపోతారు. ఇలా వచ్చే ఫిట్స్‌ను ‘మ్యూజిక్ ఇండ్యూస్డ్ సీజర్స్’ అని పిలుస్తారు. అలాగే ఫిట్స్ ఇలాంటివే మరికొన్ని చిత్రమైన కారణాలతోనూ రావచ్చు. కొందరికి వేడినీళ్లు ఒంటి మీద పడ్డా ఫిట్స్ రావచ్చు మరికొందరిలో టీవీ తెరపై కనిపించే వెలుగులు లేదా మానిటర్ నుంచి వచ్చే కాంతితోనూ రావచ్చు. వేడినీళ్లు తలమీద గుమ్మరించుకోవడం వల్ల వచ్చే ఫిట్స్‌ను ‘హాట్‌వాటర్ ఎపిలెప్సీ’ అంటారు. టీవీ నుంచి లేదా వీడియోగేమ్స్ ఆడేటప్పుడు కనిపించే కాంతి వల్ల వచ్చే ఫిట్స్‌ను ఫొటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. కొన్ని పెద్ద పెద్ద వేదికలపై కాంతిపుంజాలు కదిలేలా అమర్చే లైట్లు వెదజల్లే ఫ్లాష్ లైట్లతోనూ కొందరికి ఫిట్స్ రావచ్చు. చిన్నారులు, టీనేజీ పిల్లల్లో ఈ తరహా ఫిట్స్ ఎక్కువ. కొందరు బాణాసంచా వెలుగులను తట్టుకోలేక కూడా ఫిట్స్‌కు గురికావచ్చు. ఈ తరహా ఫిట్స్‌ను ఫొటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ న్యూరోఫిజీషియన్లు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) అనే పరీక్ష నిర్వహించి, వ్యాధి నిర్ధారణ చేసి, తగిన చికిత్స అందిస్తారు. -
ఫిట్స్‌తో ఖైదీ మృతి
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య(40) అనే ఖైదీ ఆదివారం మృతిచెందాడు. అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న లింగయ్య శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఫిట్స్ రావడంతో జైలు అధికారులు హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. తూప్రాన్ మండలం పోతరాజ్ పల్లి గ్రామానికి చెందిన లింగయ్య నాలుగో పెళ్లి చేసుకోవడంతో గత ఆగస్టులో రెండో భార్య తూప్రాన్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగయ్యపై నిర్భయ కేసు నమోదు చేసి జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నాడు. -
బెంచ్ పై నుంచి పడి చిన్నారి మృతి
స్కూల్ బెంచ్ పై నుంచి కిందపడి ఓ చిన్నారి మృతి చెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం రేగళ్ల గ్రామానికి చెందిన దరావత్ ఇంద్రజ(5) ఎల్ కేజీ చదువుతోంది. అయితే శుక్రవారం ప్రమాద వశాత్తు స్కూల్ బెంచ్ పై నుంచి కిందపడింది. ఆమెకు ఫిట్స్ రావడంతో స్కూల్ యాజమాన్యం స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో.. చిన్నారిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ.. ఇవాళ మృతి చెందింది. ముద్దులోలికే చిన్నారి మరణంతో కుటుంబం విషాదంలో నెలకొంది. -
ఫిట్స్ టు ఫిట్నెస్
ఎపిలెప్సీ (మూర్ఛ) అది ప్రాణాంతకం కాదు. కానీ ప్రాణాంతకమైన పరిస్థితులు తీసుకురావచ్చు. అందుకే ప్రాణాంతకం కాకపోయినా ఆ వ్యాధి అంటే అందరికీ అంతభయం. దాని పేరే మూర్ఛ. ఇంగ్లిష్‌లో ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధికి గురైనప్పుడు రోగి ఈదుతుంటేనో, డ్రైవింగ్ చేస్తుంటేనో, రోడ్డు లేదా రైల్వేట్రాక్ దాటుతుంటేనో, వంటచేస్తుంటేనో ఎంత ప్రమాదమో ఊహించుకుంటేనే గుండె జలదరిస్తుంది. అందుకే ఈ వ్యాధి పట్ల అందరూ ఆందోళన చెందుతుంటారు. ప్రజల్లోనూ దీనిపై ఎన్నో అపోహలు. వాస్తవానికి రెండు నుంచి ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే, ఈ వ్యాధికి గురైన వారు పూర్తిగా కోలుకుని మళ్లీ మామూలు మనిషిగా మారేందుకు అవకాశం ఉంది. అందుకే గతంలో తెలియని ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకుని, అపోహలు తొలగించుకునేందుకు ఈ ప్రత్యేక కథనం. వివిధ అవయవాలకు మన మెదడు నుంచి వెలువడే ఆదేశాలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలో నరాల ద్వారా ఆయా అవయవాలకు చేరతాయి. అవి క్రమబద్ధంగా ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఆ విద్యుత్ సంకేతాల్లో క్రమబద్ధత లోపించి అదేపనిగా సంకేతాలు వెలువడటమో జరిగితే రోగి శరీరం భయంగొలిపే రీతిలో కొట్టుకుంటుంది. ఒక్కోసారి ఈ విద్యుత్ వ్యవస్థలో అవ్యవస్థత వల్ల రోగి కదలికల్లో, ప్రవర్తనలో, జ్ఞానేంద్రియాల పనితీరులో, తానున్నాననే ఉనికి పట్ల... ఇలా అన్నింటి విషయంలో మార్పులు వస్తాయి. రోగి కొట్టుకుంటూ తన మూత్ర, మల విసర్జన వ్యవస్థపై అదుపు కోల్పోవచ్చు. ఒక్కోసారి ఈ ఫిట్స్ చాలా త్వరత్వరగా వస్తుండవచ్చు. మరో సందర్భాల్లో ఎప్పుడో చాలా రోజుల తర్వాతో లేదా ఏళ్ల తర్వాతో కనిపించవచ్చు. ఎప్పుడు విద్యుత్ వ్యవస్థలో తేడా జరుగుతుందో, అప్పుడు మనమేం చేస్తామో అన్న సురక్షితమైన ఫీలింగ్ ఉండదు కాబట్టే మనకు ఫిట్స్ / సీజర్స్ / ఎపిలెప్సీ అనే ఈ వ్యాధి అంటే అంత భయం. కానీ నిజానికి అంత భయం అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితకాలంలో కనీసం తమకు తెలియకుండానే ఒకసారైనా ఈ పరిస్థితికి గురికావచ్చు. ఈ సమాచారంతో భయందోళనలు పడనక్కర్లేదు. ఇదెంత సాధారణమో చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. మెదడులోని విద్యుత్ వ్యవస్థలోని అవ్యవస్థత అదేపనిగా కొనసాగితేనే ఇబ్బంది. ఈ విషయం తెలియనందువల్లనే మన సమాజంలో మూర్ఛ రోగుల పట్ల తీవ్రమైన సామాజిక వివక్షలూ, అపోహలూ కొనసాగుతున్నాయి. మూర్ఛ గురించి విపులంగా తెలుసుకుంటే అవన్నీ దూరమై ఆ రోగుల పట్ల వివక్ష తొలగిపోవాలనేదే ఈ ప్రత్యేక కథనం ఉద్దేశం. కారణాలు మెదడులో కలిగే విద్యుదలజడి సీజర్స్‌కు కారణం. ఈ సీజర్స్ కలగడాన్ని ఎపిలెప్సీ అని పేర్కొంటారు. కొందరిలో ఎపిలెప్పీ ఎందుకు వస్తుందనేందుకు కారణాలు తెలియవు. మరికొందరిలో మెదడులో ఏవైనా గాయాలైతే అది ఎపిలెప్సీకి దారితీయవచ్చు. అన్ని వయసుల వారిలోనూ ఇది కనిపించినా... ముఖ్యంగా ఎపిలెప్సీ రోగుల్లో 30 శాతం మంది చిన్నారులై ఉంటారు. ఆ తర్వాతి స్థానంలో వయసు పైబడ్డవారిలో ఎపిలెప్సీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నిర్దిష్టంగా ఎపిలెప్సీకి కారణాలు కనిపించే సందర్భాలివి... ► పుట్టుక సమయంలో బిడ్డకు ఆక్సిజన్ చాలా తక్కువగా అందడం. ► పెద్దవాళ్లలో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు తలకు గాయం కావడం. ► మెదడులో కణుతులు / గడ్డలు. ► కొందరిలో స్క్లిరోసిస్ అన్న కండిషన్ వంశపారంపర్యంగా కొనసాగడం. ► మెనింజైటిస్ లేదా ఎన్కెఫలైటిస్ అనే మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు రావడం. ► పక్షవాతం లేదా మెదడులో తీవ్రమైన ప్రమాదం (డ్యామేజ్) జరగడం. ► శరీరంలో సోడియమ్ లేదా చక్కెర పాళ్లు అనూహ్యంగా పరిమితికి మించి పెరగడం. అయితే దాదాపు 70 శాతం కేసుల్లో ఎపిలెప్సీకి నిర్దిష్టంగా కారణాలు తెలియవు. ► ఒక్కోసారి నిర్దిష్ట కారణాలు తెలియకపోయినా... కొన్ని పరిస్థితులు మూర్ఛకు దారితీస్తాయి. ఈ పరిస్థితులను మనం ప్రయత్నపూర్వకంగా నివారించగలం. అవి... ► మనకు సూచించిన మందులను డాక్టర్ చెప్పిన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో తీసుకోవడం. ► మితిమీరిన పాళ్లలో ఆల్కహాల్ తీసుకోవడం. ► కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకోవడం. ► తగినంతగా నిద్రపోకపోవడం. ► సీజర్స్ కోసం మందులు తీసుకుంటున్న సమయంలోనే వాటిని నిర్వీర్యం చేసే ఇతర మందులు వాడటం. రకాలు మెదడులో జరిగే కార్యకలాపాలు, ప్రవర్తన ఆధారంగా సీజర్స్‌ను రెండు ప్రధాన విభాగాలుగా పేర్కొనవచ్చు. అవి 1) జనరలైజ్డ్; 2) పార్షియల్. వీటినే మొదటిదాన్ని లోకల్ అని రెండోదాన్ని ఫోకల్ అని కూడా అంటారు. జనరలైజ్డ్ సీజర్స్‌లో రోగిలో ఎలక్ట్రిక్ తరంగాలు మెదడులోని అన్ని భాగాలనుంచి ఉద్భవిస్తాయి. అదే పార్షియల్ సీజర్స్‌లో రోగి మెదడులోని కొన్ని ప్రాంతాల నుంచే ఆవిర్భవిస్తాయి. నిర్దిష్టంగా కొద్ది భాగం నుంచి ఉద్భవించినందుకే వీటిని ఫోకల్ అని కూడా అంటారు. ఇవిగాక జనరలైజ్డ్ సీజర్స్‌లో ఆరు రకాలుంటాయి. అవి... అందులో మొదటిది అందరికీ తెలిసిన, రోగి స్పృహతప్పిపోయే కన్వల్షన్స్. వీటినే గ్రాండ్ మాల్-సీజర్ అని కూడా అంటారు. ఈ రకం సీజర్స్‌లో రోగి స్పృహతప్పి కుప్పకూలిపోతాడు. ఆ తర్వాత ఒళ్లంతా కర్రలా బిర్రబిగుసుకుపోతుంది. ఈ స్థితిని ‘టోనిక్’ కండిషన్ అంటారు. ఈ స్థితి సాధారణంగా 30 నుంచి 60 సెకన్లు ఉంటుంది. ఆ తర్వాత ఒళ్లు గిలగిలా కొట్టుకునే స్థితి వస్తుంది. ఈ జెర్కింగ్ పరిస్థితిని ‘క్లోనిక్’ కండిషన్ అంటారు. ఇది కూడా 30 నుంచి 60 సెకన్ల వరకు ఉంటుంది. ఈ టోనిక్, క్లోనిక్ కండిషన్ల తర్వాత రోగి చాలాసేపు గాఢంగా నిద్రపోతాడు. ఈ గాఢనిద్రాస్థితిని ‘పోస్టికల్’ కండిషన్ లేదా సీజర్స్ అనంతర స్థితి అని కూడా అంటారు. ఈ గ్రాండ్-మాల్సీజర్స్ అన్నది ఏదైనా యాక్సిడెంట్ వల్ల మెదడుకు అయిన గాయం కారణంగా కావచ్చు. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి రోగి తన నాలుకను తానే కొరుక్కోవచ్చు. లేదా మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవచ్చు. కొన్నిసార్లు కొందరు పిల్లల్లో ఈ సీజర్స్ ఏవీ కనిపించకుండానే వారు కొన్ని సెకన్ల పాటు స్పృహలో లేనట్లుగా ఉండిపోతారు. వాళ్లకు సీజర్స్ వచ్చినట్లుగా కూడా తెలియదు. ఇక మయోక్లోనిక్ సీజర్స్‌లో రోగి శరీరంలో ఇరువైపులా బిగుసుకుపోయినట్లుగా జెర్క్‌లు వస్తాయి. అవి ఎలక్ట్రిక్ షాక్‌లా వచ్చినట్లుగా తమకు అనిపించినట్లు రోగులు వర్ణిస్తుంటారు. కొన్నిసార్లు రోగులు తమ చేతిలో ఉన్న వస్తువులను వదిలేయడమో, బలంగా విసిరేయడమో చేస్తుంటారు. క్లోనిక్ సీజర్స్‌లో రోగి శరీరం ఇరువైపులా ఒక క్రమబద్ధమైన జెర్క్లకు లోనవుతూ ఉంటుంది. టోనిక్ సీజర్స్‌లో రోగి శరీరంలోని కండరాలన్నీ బిగుసుకుపోతాయి.అటోనిక్ సీజర్స్ అనే రకం ఫిట్స్‌లో రోగి అకస్మాత్తుగా తన కాళ్లూ, చేతుల్లో సత్తువను పూర్తిగా కోల్పోయి అచేతనమై పడిపోతాడు. పిల్లలూ... యుక్త వయస్కులలో... పిల్లల మెదడులో కోటానుకోట్ల మెదడు కణాలు (న్యూరాన్లు) ఉంటాయి. వీటినుంచి వివిధ అవయవాలకు ఆదేశాలు విద్యుత్ స్పందనల (ఎలక్ట్రిక్ ఇంపల్సెస్) రూపంలో వెలువడుతుంటాయి. ఏకకాలంలో అనేక విద్యుత్ స్పందనలు లెక్కకు మీరి వెలువడుతున్నప్పుడు కండరాలు బిగుసుకుపోవడం, స్పృహకోల్పోవడం, విచిత్రంగా ప్రవర్తించడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈ తరహా విద్యుత్ స్పందనలు ఎందుకు ఉద్భవిస్తున్నాయనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈఈజీ పరీక్షలో అది చూపే గ్రాఫ్‌ల ప్రకారం వివిధ రకాల సీజర్స్ సమయంలో వెలువడే వేర్వేరు రకాల స్పందనలను డాక్టర్లు చూస్తారు. దాన్ని బట్టి వాటిని కేటగిరీలుగా విభజించి, నిర్దిష్టంగా వాటికి అనుసరించాల్సిన చికిత్సా మార్గాన్ని నిర్ణయిస్తారు. పిల్లల్లో సీజర్స్‌ను నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టం. ఎందుకంటే అది వచ్చిన సమయంలో డాక్టర్ దగ్గరకు బయల్దేరినా... వైద్యుడి వద్దకు చేరే సమయానికి సీజర్స్ ఆగిపోవచ్చు. ఒక్కోసారి మనకు సీజర్స్లా అనిపించిన లక్షణం సీజర్స్ కాకపోవచ్చు. అది రక్తంలో చక్కెరపాళ్లు ఎక్కువ కావడమో లేదా గుండె స్పందనల్లో లయతప్పడమో లేదా ఉద్వేగానికి లోనై ఒత్తిడికి గురికావడం అనే లక్షణాల వల్ల అచ్చం సీజర్స్ లాంటి లక్షణాలే ఉత్పన్నం కావచ్చు. సీజర్స్ ఉన్న పిల్లలూ... వాళ్ల తల్లిదండ్రుల్లో ఉద్వేగాలు సీజర్స్ ఉన్న పిల్లలకు అందరు పిల్లల్లాగే సాధారణ తెలివితేటలు ఉంటాయి. ఎపిలెప్సీ ఉండటం లేదా ఫిట్స్ రావడం అనే అంశం వారి తెలివితేటలకూ, సృజనకూ ఏ విధంగానూ ప్రతిబంధకం కాదు. అయినప్పటికీ పిల్లలకు ఫిట్స్ ఉంటే ఆ పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ తీవ్రమైన ఉద్వేగభరితమైన ఒత్తిడికి (ఎమోషనల్ స్ట్రెస్‌కు) గురవుతారు. ఆత్మన్యూతనకూ, డిప్రెషన్‌కూ లోనవుతారు. అందుకే పిల్లలకు ఫిట్స్ ఉన్నప్పుడు చిన్నారులకు చికిత్సతో పాటూ పెద్దలకు నిపుణలచేత కౌన్సెలింగ్ కూడా అవసరమవుతుంది. పిల్లలకు తమకు ఉన్న సమస్య చాలా సాధారణమైనదనీ, కాలక్రమాన తగ్గిపోతుందనే ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. తల్లిదండ్రులూ ఆ విషయాన్ని మనసావాచా నమ్ముతూ వాళ్లలోని సృజనకు అడ్డంకిగా పరిణమించకుండా వాళ్లకు ఏరంగంలో ఆసక్తి ఉందో అందులో ప్రోత్సహించాలి. మహిళలూ - మూర్ఛ నిజానికి సీజర్స్ వ్యాధికి మహిళలూ, పురుషులూ అన్న వివక్ష ఏమీ లేదు. ఈ ఇద్దరికీ మూర్ఛ వ్యాధి వస్తుంటుంది. కానీ ఈ వ్యాధి వల్ల అన్నివిధాలా వివక్షకు గురయ్యేది మాత్రం మహిళలే. ఫిట్స్ అందరిలోనూ సామాన్యమే అయినప్పటికీ మహిళలు మాత్రం సామాజికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకే మహిళల్లో సీజర్స్‌ను అన్నివిధాలా కాస్త వేరుగా చూడాల్సి ఉంటుంది. మహిళల్లో ఎపిలెప్సీ... హార్మోన్లలో మార్పులు కొందరు మహిళల్లో ఎపిలెప్సీ వారి హార్మోన్ల క్రమంలో మార్పులు తీసుకొస్తుంది. ఇది జీవితాంతం వారిలో ప్రభావం చూపిస్తుంది. మహిళల్లో ప్రధానంగా రెండు రకాల సెక్స్ హార్లోన్లు ఉంటాయి. అవి 1) ఈస్ట్రోజెన్, 2) ప్రోజెస్టెరాన్. ఇటీవలి పరిశోధనల ప్రకారం తేలిందేమిటంటే... ఈస్ట్రోజెన్ హార్మోన్ మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రోజెస్టెరాన్ హార్మోన్ మెదడు కణాలను జోకొడుతుంది. దీన్ని బట్టి తేలే విషయమేమిటంటే... శరీరంలో ఈస్ట్రోజెన్ పాళ్లు, ప్రోజెస్టెరాన్ పాళ్లు పెరగడం, తగ్గడం అనే అంశం మీద నరాల వ్యవస్థ ఉత్తేజితం కావడం ఆధారపడి ఉంటుందన్నమాట. హార్మోన్లలోని మార్పులు యువతుల్లో సీజర్స్‌ను ప్రేరేపిస్తాయి. అందుకే యువతుల్లో మొట్టమొదటిసారి ఫిట్స్ రావడం అన్నది వారిలో మొదటిసారి రుతుక్రమం మొదలైనప్పుడు ప్రారంభమవుతుండటం చాలా సాధారణమైన అంశం. అయితే అందరు యువతుల్లోనూ ఇదే అంశం కనిపించదు. కాబట్టి డాక్టర్లు, పరిశోధకులు హార్మోన్లు, సీజర్స్‌పై వాటి ప్రభావం పై ఇంకా లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. మహిళల్లో ఎపిలెప్సీ... రుతుక్రమంపై ప్రభావం కొందరు యువతుల్లో ‘కెటామినియల్ ఎపిలెప్సీ’ అనే రకం కనిపిస్తుంది. దాదాపుగా 10 శాతం నుంచి 12 శాతం వరకు కెటామినియల్ ఎపిలెప్సీ ఉంటోందని తెలుస్తోంది. అయితే ఈ కెటామినియల్ ఎపిలెప్సీకి నిర్దిష్ట కారణమేమిటన్నది ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఇక కొందరు మహిళల్లో అండం ఏర్పడే ‘ఓవ్యులేషన్’ దశలో (ఈ దశలో మహిళల శరీరాల్లో ఈస్ట్రోజెన్ ఎక్కువ) మొదటిసారి సీజర్స్ కనిపిస్తాయి. ఇక మరికొందరిలో అండం ఏర్పడే దశ తర్వాత అది తగ్గిపోతూ రాలిపోయే సమయంలో అంటే ప్రోజెస్టెరాన్ ఎక్కువగా స్రవించే సమయంలో సీజర్స్ వస్తాయి. మహిళలు... ఎపిలెప్సీ... గర్భధారణ మహిళలకు ఎపిలెప్సీ ఉన్నప్పటికీ అది వారి గర్భధారణపైనా, ప్రసూతిపైనా ఎలాంటి ప్రభావం చూపదు. వాళ్లలో ఎపిలెప్సీ ఉన్నా... ఆరోగ్యకరమైన పండంటి బిడ్డకు జన్మనిస్తారు. అయితే కేవలం 10 శాతం మంది విషయంలో కొద్దిపాటి రిస్క్ ఉంటే ఉండవచ్చుగానీ... డాక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రసూతిని నిర్వహిస్తే... అది కూడా ఎంతమాత్రమూ రిస్క్ కాబోదు. ఒక మహిళకు ఎపిలెప్సీ ఉందని తెలిసి, ఆమె గర్భాన్ని దాల్చాలని కోరుకుంటున్నప్పుడు ఆమె తప్పనిసరిగా అబ్స్టెట్రీషియన్తో పాటు, న్యూరాలజిస్ట్‌నూ సంప్రదించాలి. అలాంటప్పుడు ఆ నిపుణులిద్దరూ గర్భవతిలోని అన్ని దశలతో పాటు ప్రసూతినీ దగ్గరుండి పర్యవేక్షించి, ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చేలా చేస్తారు. మహిళల్లో ఎపిలెప్సీ... గర్భనిరోధక సాధనాలు ఒకవేళ మహిళకు ఎపిలెప్సీ ఉండి, ఆమె గర్భనిరోధక సాధనాలను ఉపయోగించదలచుకుంటే, వారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం మేలు. అవి... సాధారణంగా అన్ని రకాల గర్భనిరోధక సాధనాలూ ఆమెకు సురక్షితమే అయినప్పటికీ చాలా అరుదుగా కొందరిలో కొన్ని గర్భనిరోధక సాధనాలు అంత ప్రభావితంగా ఉండకపోవచ్చు. పైగా వారు వాడే యాంటీ-సీజర్ మందులతో ఈ మందులు చర్యజరపడం వల్ల కొందరిలో అవాంఛిత గర్భధారణ జరగడంతో పాటు పిల్లల్లో కొన్ని పుట్టుకతో వచ్చే ఆరోగ్యసమస్యలూ రావచ్చు. అందుకే ఎపిలెప్సీ ఉన్న మహిళలు గర్భనిరోధక సాధనాలు వాడాల్సి వచ్చినా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా ముందుగా అబ్స్టెట్రీషియన్తో పాటు న్యూరాలజిస్ట్‌నూ సంప్రదించాలి. సరికొత్త మాతృమూర్తి... ఎపిలెప్సీ... కొత్తగా తల్లి అయిన ఎపిలెప్సీ వ్యాధిగ్రస్తురాలు అడిగే ప్రశ్న. ‘నేను వాడే యాంటీ ఎపిలెప్సీ మందులతో... నేను చనుబాలు పట్టించడం వల్ల బిడ్డపై ఏవైనా దుష్ర్పభావం పడుతుందా?’ అని. ఈ విషయంలో ప్రతి తల్లీ తమ డాక్టర్‌ను విధిగా సంప్రదించి, తాను చనుబాలు ఇచ్చినప్పటికీ బిడ్డపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపని యాంటీ-ఎపిలెప్సీ మందులను తనకు సూచించాల’ని డాక్టర్‌ను అడగాలి. చికిత్స చాలారకాల ఎపిలెప్సీలకు మందులతోనే చికిత్స చేస్తారు. వీటిని యాంటీ కన్వల్సెంట్ డ్రగ్స్ అంటారు. ఈ తరహా మందులను సూచించే విషయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సీజర్స్ తీవ్రత ఎంత ఉంది, ఎన్నాళ్లుగా అవి వస్తున్నాయి, రోగి వయసు, అతడి పూర్తి ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, ఏ తరహా సీజర్స్... వంటి ఎన్నో అంశాల ఆధారంగా మందులనూ, మోతాదులనూ నిర్ణయిస్తారు. పిల్లల్లోనూ, వయసు పైబడ్డ పెద్దల్లోనూ 70 శాతం మందిలో ఈ మందులతోనే విజయవంతంగా వ్యాధి నయమవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్: నిజానికి ఈ మందుల వల్ల కొద్దిపాటి దుష్ర్పభావాలు ఉంటాయి. అవి... ఒకే వస్తువు రెండుగా కనిపించడం, అలసట, నీరసం, నిస్సత్తువ, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లుగా అనిపించడం, నిలకడగా ఉండలేకపోవడం, కడుపులో ఇబ్బంది, చర్మంపై రాష్, రక్తకణాల సంఖ్య తగ్గడం, కాలేయ సమస్యలు, జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటివి. ఇలాంటి దుష్ర్పభావాలు కనిపించినప్పుడు మందులను మార్చాల్సి ఉంటుంది. అందుకే సీజర్స్ చికిత్స విషయంలో డాక్టర్లు ఓ నియమాన్ని అనుసరిస్తుంటారు. వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ చికిత్స వేగస్ నర్వ్ అనేది తలలోంచి ఆవిర్భవించే పన్నెండు జతల నరాల్లో అత్యంత కీలకమైనది. సాధారణంగా 70 శాతం కేసుల్లో మందులతోనే ఎపిలెప్సీ నయమవుతుంది. అప్పటికీ నయం కానివారిలో డాక్టర్లు వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ (వీఎన్ఎస్) చికిత్సకు ప్రాధాన్యమిస్తారు. ఇందులో శస్త్రచికిత్స ద్వారా ఈ నరానికి పేస్ మేకర్ వంటి సాధనాన్ని అమరుస్తారు. మెదడులో అనియంత్రితంగా వెలువడే విద్యుత్తరంగాలతోనే సీజర్స్ వస్తాయి కాబట్టి ఈ వేగస్ నరం ద్వారా పేస్‌మేకర్ ద్వారా వాటికి విరుగుడుగా పనిచేసే విద్యుత్ తరంగాలను పంపి, వాటిని నియంత్రిస్తారు. అయితే వేగస్ నర్వ్ స్టిమ్యూలేషన్ చికిత్స వల్ల సీజర్స్ పూర్తిగా తగ్గిపోతాయని చెప్పేందుకు అవకాశం లేదు. కాకపోతే వాటి తీవ్రత తగ్గుతుంది. జాగ్రత్తలు రోగికి ఫిట్స్ / సీజర్స్ రాగానే ఆసుపత్రికి తీసుకువచ్చేలోపు అతడి పట్ల కొన్ని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలి.పడిపోయి తలకు గాయం కాకుండా చూడాలి. తలను మెత్తటి తలగడపై ఉంచాలి. మెడ దగ్గర బటన్ విప్పి... గాలి బాగా ఆడేలా చూడాలి. అతడి తలను ఒక పక్కకు ఒరిగి ఉండేలా చూడాలి. నోట్లో పళ్ల మధ్య ఏ విధమైన వస్తువునూ ఉంచకూడదు. వీటితో పాటు అతడికి వచ్చిన ఫిట్స్ ఎంతసేపు కొనసాగాయి, అతడి కదలికలు ఎలా ఉన్నాయి, తలనూ, కళ్లనూ ఎలా తిప్పుతున్నాడు అన్న అంశాలను గమనించి ఆ తర్వాత డాక్టర్‌కు వివరించాలి. నివారణ కారణం లేకుండా వచ్చే ఫిట్స్ / సీజర్స్‌ను నివారించడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలేమీ లేవు. అయితే ఒకసారి ఫిట్స్ వచ్చినవారికి రెండోసారి రాకుండా నివారించేందుకు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు అకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి తలకు గాయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా జాగ్రత్త పడాలి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌కు వచ్చే ఇన్ఫెక్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి తక్షణ చికిత్స తీసుకోవాలి. చివరగా ఒక్క విషయం... సీజర్స్వల్ల తెలివితేటలకూ, సృజనకూ ఎలాంటి అవరోధం ఉండదు. అది అంటువ్యాధి కాదు. కాబట్టి ఆ వ్యాధిగ్రస్తుల పట్ల ఎలాంటి వివక్షా చూపవద్దు. సాటి వ్యక్తుల సహకారంతోనే వారు మరింతగా రాణిస్తారు. - నిర్వహణ: యాసీన్ -
అయ్యో.. పాపం
ఫిట్స్‌తో తల్లి మృతి: కూతురు అదృశ్యం మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చున్న ఏడాది బాబు నాగోలు: భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మహిళకు ఫిట్స్ వచ్చి కిందపడి మృతి చెందింది. తల్లి మృతదేహం పక్కనే ఏడాదిన్నర బాలుడు ఏడుస్తూ ఉండటం పలువురిని కంటతడి పెట్టించింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... బేగంపేట పోలీస్‌లైన్‌కు చెందిన ఐలేని రాజేశ్వరి (24), మహేష్ భార్యాభర్తలు. వీరు నాచారం మల్లాపూర్‌లోని నర్సింహ్మనగర్ కాలనీలో ఉంటున్నారు. భర్త పెయింటర్. శివాని (5), కార్తీక్ ( ఏడాదిన్నర )వీరి సంతానం. ఈనెల 24న భర్తతో గొడవపడిన రాజేశ్వరి ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఆదివారం రాత్రి ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి ఎదురుగా సులభ్ కాంప్లెక్స్ వద్ద కార్తీక్‌తో కలిసి నడుచుకూంటూ వెళ్తూ కిందపడి చేతులు, కాళ్లు కొట్టుకోవడంతో స్థానికులు ఫిట్స్ వచ్చిందని గమనించి తాళంచెవులు చేతిలో పెట్టి 108కు తెలిపారు. 108 వాహనం వచ్చేసరికి రాజేశ్వరి చనిపోయింది. పక్కనే ఉన్న బాబు కార్తీక్ తల్లి మృతి చెందిన విషయం తెలియక మీదపడి రోదించాడు. ఎల్బీనగర్ పోలీసులు.. రాజేశ్వరి వద్ద లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. భర్త మహేష్ మాత్రం రాజేశ్వరికి ఇంతకు ముందు ఎప్పుడూ ఫిట్స్ రాలేదని, విషం తాగి మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. కూతురు అదృశ్యం.. రాజేశ్వరి వెంట వచ్చిన కూతురు శివాని అదృశ్యమైంది. దీంతో భర్త మహేష్, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల ముందు నాచారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. -
వైద్యులేనా!
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన జోత్స్న(3)కు ఫిట్స్ రావడంతో మంగళవారం ఉదయం జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. వైద్యులు నిరసనలో ఉన్న విషయం తెలియక వారు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యంకోసం తిరిగారు. ఎక్కడా వారికి వైద్యం అందలేదు. చివరికి వారి తల్లిదండ్రులు బాలికను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే బాలిక ప్రాణాలు వదిలింది. నగర సమీపంలోని ముబాకర్ నగర్ వద్ద తారక్ న గర్‌కు చెందిన శ్రీనివాస్(38) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆ స్పత్రిలో వైద్య సహాయం అందకపోవడంతో మంగళ వారం రాత్రి 11.30గంటలకు మృతి చెందాడు. ప్రైవే టు ఆస్పత్రులు మూసి ఉన్నందున శ్రీనివాస్ అనారో గ్యంతో సోమవారం నాడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరా డు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే శ్రీని వాస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రైవేట్ వైద్యులు సేవలను నిలిపివేయడంపై మంగళవారం జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న స్పందించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి గోవింద్‌వాగ్‌మోరే, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ భీంసింగ్‌లతో సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేసి వాటిలో సౌకర్యాలు, ఓపీ, ఐపీ సేవల వివరాలు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సేవల నిలుపుదలపై గంటలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న వారు ఆస్పత్రి ైవైద్యులతో కూడిన టాస్క్‌పోర్సును ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అందుకు నిరాకరించారు. తాము కేవలం వైద్యసేవలు మాత్రమే అందిస్తామని, తనిఖీలు చేయబోమంటూ స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆరోగ్యశాఖాధికారి, సూపరింటెండెంట్ కలెక్టర్‌కు ఉన్న పరిస్థితిని విరించారు. దీంతో కలెక్టర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులను ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి వైద్యసేవలు అందించాలని సూచించారు. నేటి నుంచి రిలే దీక్షలు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులకు నిరసనగా వైద్యుల ఆందోళన కొనసాగుతుందని అప్నా అధ్యక్షుడు డాక్టర్ శివరాజ్ తెలిపారు. బుధవారం రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఇటీవల నిజామాబాద్, బోధన్‌లోని ఆస్పత్రులపై దాడి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర సంఘంతో మాట్లాడి తమ ఆందోళనను రాష్ట్ర వ్యాప్తం చేస్తామన్నారు. కిక్కిరిసిన జిల్లా ఆస్పత్రి ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో నాలుగు రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. స్పెషలిస్టు వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో ఓపీ కేసులు 350 నమోదు కాగా, మంగళవారం 560 పైగా నమోదయ్యాయి. ప్రభుత్వ వైద్యులపై చర్యలు ప్రైవేట్ వైద్యుల నిరసనకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు సోమవారం చేపట్టిన ధర్నాపై జిల్లా కలెక్టర్ ఆగ్రహించారు. ప్రభుత్వ వైద్యులు ఈ నిరసనలో ఎందుకు పాల్గొన్నారని, తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్ ఆస్పత్రి అధికారులను ప్రశ్నించారు.దీంతో ఎంత మంది వైద్యులు నిరసనలో పాల్గొన్నారో వివరాలను అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. వీరిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాల తరపున నియమించబడిన వైద్యులపై డీఎంఈ వివరణ కోరారు. నిరసనలో పాల్గొన్న వైద్యుల వివరాలు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరారు. ఆస్పత్రిపై దాడిచేసిన ఆరుగురి అరెస్టు నిజామాబాద్ క్రైం : నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా లో గల బాంబే నర్సింగ్ హోంపై ఈ నెల 22న రాత్రి దాడిచేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు నాల్గవ టౌన్ రెండవ ఎస్సై రామనాయుడు తెలిపారు. ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యంతోనే వినాయక్‌నగర్ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన సుమలత అనే యువతి మృతి చెందినదన్న కోపంతో ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడిచేసినట్లు ఎస్సై తెలిపారు. ఆస్పత్రి వైద్యుడు నరేంద్ర ఫిర్యాదు మేరకు నిందితులైన రవీందర్, పండరి, సురేశ్, కిషన్, రాజబాబు, శ్రీనివాస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. -
ఫిట్స్... మూర్ఛాభిప్రాయాల నుంచి తేరుకోండి!
మనం మూర్ఛ అని పిలుచుకునే ఫిట్స్ అంటే అందరికీ భయమే. వ్యాధిగా అది ప్రాణాంతకం కాకపోయినా... ప్రమాదానికి గురిచేసే పరిస్థితులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఫిట్స్ రోగి ఏ రైలు పట్టాలు దాటే సమయంలోనో, ఏ ఈతకొట్టే సమయంలోనో మూర్ఛకు గురైతే అది ప్రాణాంతకమే కదా. అయితే నిర్దిష్టంగా నిర్ణీతకాలం పాటు చికిత్స తీసుకుంటే పూర్తిగా అదుపులో ఉండే వ్యాధి ఇది. అందుకే ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అని పిలిచే మూర్ఛపై అవగాహన పెంచుకోవాలి. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. మీకు తెలుసా? పుట్టిన ప్రతి ఒక్కరికీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారిలోనూ ఫిట్స్ రాకుండా అడ్డుకునే ఒక యంత్రాంగం ఉంటుంది. దీన్నే థ్రెష్‌హోల్డ్ అని డాక్టర్లు అభివర్ణిస్తుంటారు. మనకు ఫిట్స్ రావడం లేదంటే అందుకు అడ్డుపడుతున్న మన గడప (థ్రెష్‌హోల్డ్) ఎత్తు ఎక్కువగా ఉందన్నమాట. ఎవరిలోనైతే ఈ థ్రెష్‌హోల్డ్ తక్కువగా ఉందో, వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఫిట్స్ అన్నది పుట్టిన నాటినుంచి మరణం వరకు ఏ దశలోనైనా కనిపించవచ్చు. ప్రధానంగా పల్లెప్రాంతాల్లో ఎక్కు వ. ఫిట్స్ గురించి విన్నా, చూసినా భయంకరంగా అనిపిస్తుంది గాని, నిజానికి ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి కాదు. కాకపోతే దీనిగురించి అనేక అపోహలు ఉండటంతో చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువే. ఒక అంచనా ప్రకారం 60 శాతం మంది రోగులు చికిత్సకు దూరంగా ఉన్నారు. ఈ వ్యాధి పట్ల వివక్ష కూడా ఇందుకు ఒక కారణం. ఫిట్స్‌కు కారణాలు : ఫిట్స్‌కు గురైనవారిలో 70 శాతం మందికి నిర్దిష్టంగా కారణం ఏమిటన్నది తెలియదు. కేవలం 30 శాతం మందిలోనే కారణాన్ని కనుగొనవచ్చు. అనువంశీకంగా కనిపించడం, పక్షవాతం, తలకు దెబ్బతగలడం, మెదడులో గడ్డలు, ఏదైనా ఇన్ఫెక్షన్కు గురికావడం వంటివి ఫిట్స్‌కు ప్రధాన కారణాలు. ఫిట్స్‌ను ప్రేరేపించే అంశాలు: మితిమీరి ఆల్కహాల్ సేవిం చడం, అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేయడం, నిద్రసరిగా లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వెలుగుతూ, ఆరుతూ ఉండే లైట్ల మధ్య ఉండాల్సి రావడం, రుతుక్రమం... వంటివి ఫిట్స్‌ను ప్రేరేపించవచ్చు. ఫిట్స్‌లో రకాలు: మూర్ఛలో దాదాపు 40 రకాలున్నాయి. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ఉండటం, కనుపాపలు పైవైపునకు తిరుగుతూ ఉండటం వంటి లక్షణాలుండే ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువసేపు ఉంటుంది. కొందరిలో కేవలం స్పృహ కోల్పోవడం మాత్రమే జరుగుతుంది. కొందరిలో కేవలం చేతులు మాత్రమే ఉలిక్కిపడ్డట్లు (ఒక జర్క్)గా కదులుతాయి. ఆ తర్వాత మళ్లీ వాళ్లు మామూలైపోతారు. కొందరు స్పృహ కోల్పోరు గాని, కాసేపు అచేతనంగా ఉండిపోతారు. ఇక కొందరిలోనైతే వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వస్తే అవి మెదడుకు హానిచేయవు గానీ ఆ పరిస్థితిలో కొందరు నాలుకను బలం గా కొరుక్కుంటారు. మరికొందరిలో పంటివరసకు గాయాలు కావడం, భుజం ఎముక స్థానం తప్పడం లేదా విరగడం, తలకు గాయం కావడం వంటివి కూడా జరగవచ్చు. నిర్ధారణ పరీక్షలివి: ఫిట్స్‌ను గుర్తించి, నిర్ధారణ చేయడం ఎంతో ప్రధానం. ఎందుకంటే కొన్నిసార్లు రక్తంలో చక్కెరపాళ్లు, సోడియం, క్యాల్షియమ్ వంటివి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. ఇలాంటి రోగులకు చాలాకాలం పాటు మందులు వాడవలసిన అవసరం ఉండదు. కానీ ఫిట్స్ మళ్లీ రాకుండా ఉండటానికి చికిత్స తీసుకోవాలి. ఇక ఫిట్స్‌కు కారణం, నిర్ధారణ కోసం సీటీ స్కాన్ లేదా ఎమ్మారై బ్రెయిన్, ఈఈజీ వంటి పరీక్షలు చేయించాలి. చికిత్స: ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నా యి. రోగి శరీరం బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకసారి ఫిట్స్ కనిపించాక ఇక అతడు కనీసం రెండేళ్లపాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో కొంతకాలం మందులు వాడాక కొంతకాలం పాటు ఫిట్స్ కనిపించవు. దాంతో చాలామంది మందులు ఆపేస్తుంటారు. ఫలితంగా ఫిట్స్ మళ్లీ కనిపించే అవకాశముంది. ఇలా మాటిమాటికీ ఫిట్స్ కనిపించకుండా ఉండాలంటే పూర్తికోర్సు మందులు వాడాల్సిందే. ఇక తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయించే ఈ రోగుల్లో దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో ఇవి నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలోనే... అంటే మరో 10 శాతం మంది రోగుల్లో రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి ఉంటుంది. 70 శాతం రోగుల్లో రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. అయితే దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వస్తారు. ఇక మరో 10 శాతం మంది రోగుల్లో నాలుగు రకాల మందులు వాడినా ఫిట్స్ పునరావృతమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ ఫిట్స్‌కు కారణం ఏమిటి, అవి మెదడులో ఎక్కడ ఆవిర్భవిస్తున్నాయి వంటి అంశాలను ఎమ్మారై బ్రెయిన్ ఎపిలెప్సీ ప్రోటోకాల్, వీడియో ఈఈజీ, స్పెక్ట్, పెట్ వంటి పరీక్షలతో నిర్ధారణ చేసి, ఆ ప్రాంతాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడంతో వాటిని అరికట్టవచ్చు లేదా వాటి తీవ్రతను, వచ్చే ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. ఇలాంటి పది శాతం మినహాయిస్తే ఫిట్స్ రోగులందరిలోనూ దాదాపు ఇవి పూర్తిగా అదుపులో ఉంటాయి. ఫిట్స్‌ను నియంత్రించేందుకు ఇప్పుడు కొత్తగా మరికొన్ని మార్గా లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ద్వారా ఫిట్స్‌ను నియంత్రించవచ్చు. కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్‌ను అదుపు చేస్తున్నారు. ఇక మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని ప్రేరేపించడం ద్వారా కూడా చికిత్స చేస్తున్నారు. మూర్ఛ... వివాహబంధంపై దాని ప్రభావం: ఫిట్స్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు... అంటే స్పృహకోల్పోవడం, కాళ్లుచేతులు కొట్టుకోవడం, నోట్లోంచి లాలాజలం కారడం, ఎక్కడ పడుతున్నారో అన్న ధ్యాస లేకుండా పడిపోవడం వంటి లక్షణాల కారణంగా ఈ వ్యాధి వచ్చిన వారిపట్ల మన సమాజంలో చాలా వివక్ష ఉంటుంది. కానీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని, ఎవరూ ఇందుకు అతీతులు కారనీ, కేవలం అదృష్టవశాత్తు మన థ్రెష్‌హోల్డ్ అనుమతించకపోవడంతోనే మనకింకా ఫిట్స్ రాలేదని గుర్తిస్తే, ఫిట్స్ రోగుల పట్ల మన వివక్ష తగ్గుతుంది. ఈ సామాజిక వివక్ష కారణంగానే ఫిట్స్ వచ్చిన వారిని వివాహం చేసుకోవడం అనే విషయంలోనూ వివక్ష కొనసాగుతోంది. ఇక పెళ్లయ్యాక మహిళకు ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో ఆ వివాహం విచ్ఛిన్నమైన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఫిట్స్ రావడం అన్నది చాలా సాధారణంగా జరిగేదే. ఇది ప్రమాదకరమైన వ్యాధి కానే కాదు. పైగా మందులతో పూర్తిగా అదుపులో ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు... అనే భావనలు అందరిలోనూ కలిగితే ఈ వ్యాధి పట్ల ఉన్న అపోహలు తొలగిపోతాయి. దాంతో వివాహానికి ఇది ప్రతిబంధకం కానేకాదని అర్థమవుతుంది. ఫిట్స్ వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటే వాళ్లకు పిల్లలు పుట్టరనే అపోహ చాలామందిలో ఉంది. ఇది అపోహ మాత్రమే. అలాగే ఫిట్స్ వచ్చే మహిళలు మందులు వాడుతూ ఉన్నప్పుడు గర్భధారణకు ప్లాన్ చేసుకున్నా లేదా గర్భం ధరించాలని అనుకుంటున్నా, వారి డాక్టర్‌ను సంప్రదించి, ఒకవేళ వారు వాల్‌ప్రోయేట్ అనే మందును వాడుతుంటే, దానికి బదులు మరో మందు మార్పించుకోవాలంతే. ఒకవేళ వారు ఆ మందు వాడకుండా ఇతర రకాలు వాడుతుంటే ఇక కేవలం మిగతా అందరు గర్భధారణ కోరుతుండే మహిళల్లాగానే ఫోలిక్ యాసిడ్- 5ఎం.జీ. మాత్రలు వాడాలి. దీనివల్ల గర్భధారణ సమయంలో పిండదశలో కలిగే అనేక అనర్థాలను నివారించినట్లవుతుంది. అందుకే గతంలో ఫిట్స్ వచ్చిన మహిళలు లేదా ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్న యువతులు గర్భధారణను కోరుకుంటున్నప్పుడు తమ డాక్టర్‌ను కలిసి తప్పనిసరిగా తగు సలహా, అవసరాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. డ్రైవింగ్‌పై ఫిట్స్ ప్రభావం: ఫిట్స్ వచ్చినవారు అవి పూర్తిగా అదుపులోకి వచ్చాయనే నిర్ధారణ జరిగేవరకు వాహనాన్ని నడపకపోవడం అన్నివిధాలా మేలు. దీనివల్ల రోగుల ప్రాణాలతో పాటు, ఎదుటివారి ప్రాణాలనూ కాపాడినవారవుతారు. అలాగే ఈత నుంచి కూడా దూరంగా ఉండాలి. ప్రమాదభరితంగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. వైద్యశాస్త్రవిజ్ఞానం ఇంతగా పురోగమించిన ఈ రోజుల్లోై ఫిట్స్‌పై దురభిప్రాయాలు తొలగిపోవడం ఎంతో అవసరం. - నిర్వహణ: యాసీన్ ఫిట్స్ రోగిని చూడగానే చేయవలసిన సహాయం మన సమాజంలో ఫిట్స్ రోగిని చూసినప్పుడు చాలామంది వాళ్లకు తాళంచెవులు అందించడం, చేతిలో ఏదైనా లోహపు వస్తువు పెట్టడం వంటివి చేస్తుంటారు. నిజానికి ఇలాంటిపనులు చేయకూడదు. ఫిట్స్ వచ్చిన రోగిని చూసినప్పుడు చేయాల్సినవి... అతడిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కానీ ఎక్కువగా కదిలించకూడదు నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు రోగి ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి రోగి కాళ్లు, చేతులు కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో రోగి తనంతట తానే మామూలు స్థితిలోకి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.