ఫిట్స్ టు ఫిట్‌నెస్ | Fits to fitness | Sakshi
Sakshi News home page

ఫిట్స్ టు ఫిట్‌నెస్

Published Mon, Feb 9 2015 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

ఫిట్స్  టు ఫిట్‌నెస్

ఫిట్స్ టు ఫిట్‌నెస్

ఎపిలెప్సీ (మూర్ఛ)
 
 
అది ప్రాణాంతకం కాదు. కానీ ప్రాణాంతకమైన పరిస్థితులు తీసుకురావచ్చు. అందుకే ప్రాణాంతకం కాకపోయినా ఆ వ్యాధి అంటే అందరికీ అంతభయం. దాని పేరే మూర్ఛ. ఇంగ్లిష్‌లో ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధికి గురైనప్పుడు రోగి ఈదుతుంటేనో, డ్రైవింగ్ చేస్తుంటేనో, రోడ్డు లేదా రైల్వేట్రాక్ దాటుతుంటేనో, వంటచేస్తుంటేనో ఎంత ప్రమాదమో ఊహించుకుంటేనే గుండె జలదరిస్తుంది. అందుకే ఈ వ్యాధి పట్ల అందరూ ఆందోళన చెందుతుంటారు. ప్రజల్లోనూ దీనిపై ఎన్నో అపోహలు. వాస్తవానికి రెండు నుంచి ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే, ఈ వ్యాధికి గురైన వారు పూర్తిగా కోలుకుని మళ్లీ మామూలు మనిషిగా మారేందుకు అవకాశం ఉంది. అందుకే గతంలో తెలియని ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకుని, అపోహలు తొలగించుకునేందుకు ఈ ప్రత్యేక కథనం.
 
వివిధ అవయవాలకు మన మెదడు నుంచి వెలువడే ఆదేశాలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలో నరాల ద్వారా ఆయా అవయవాలకు చేరతాయి. అవి క్రమబద్ధంగా ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఆ విద్యుత్ సంకేతాల్లో క్రమబద్ధత లోపించి అదేపనిగా సంకేతాలు వెలువడటమో జరిగితే రోగి శరీరం భయంగొలిపే రీతిలో కొట్టుకుంటుంది. ఒక్కోసారి ఈ విద్యుత్ వ్యవస్థలో అవ్యవస్థత వల్ల రోగి కదలికల్లో, ప్రవర్తనలో, జ్ఞానేంద్రియాల పనితీరులో, తానున్నాననే ఉనికి పట్ల... ఇలా అన్నింటి విషయంలో మార్పులు వస్తాయి. రోగి కొట్టుకుంటూ తన మూత్ర, మల విసర్జన వ్యవస్థపై అదుపు కోల్పోవచ్చు. ఒక్కోసారి ఈ ఫిట్స్ చాలా త్వరత్వరగా వస్తుండవచ్చు. మరో సందర్భాల్లో ఎప్పుడో చాలా రోజుల తర్వాతో లేదా ఏళ్ల తర్వాతో కనిపించవచ్చు. ఎప్పుడు విద్యుత్ వ్యవస్థలో తేడా జరుగుతుందో, అప్పుడు మనమేం చేస్తామో అన్న సురక్షితమైన ఫీలింగ్ ఉండదు కాబట్టే మనకు ఫిట్స్ / సీజర్స్ / ఎపిలెప్సీ అనే ఈ వ్యాధి అంటే అంత భయం. కానీ నిజానికి అంత భయం అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితకాలంలో కనీసం తమకు తెలియకుండానే ఒకసారైనా ఈ పరిస్థితికి గురికావచ్చు. ఈ సమాచారంతో భయందోళనలు పడనక్కర్లేదు. ఇదెంత సాధారణమో చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. మెదడులోని విద్యుత్ వ్యవస్థలోని అవ్యవస్థత అదేపనిగా కొనసాగితేనే ఇబ్బంది. ఈ విషయం తెలియనందువల్లనే మన సమాజంలో మూర్ఛ రోగుల పట్ల తీవ్రమైన సామాజిక వివక్షలూ, అపోహలూ కొనసాగుతున్నాయి. మూర్ఛ గురించి విపులంగా తెలుసుకుంటే అవన్నీ దూరమై ఆ రోగుల పట్ల వివక్ష తొలగిపోవాలనేదే ఈ ప్రత్యేక కథనం ఉద్దేశం.
 
కారణాలు

 
మెదడులో కలిగే విద్యుదలజడి సీజర్స్‌కు కారణం. ఈ సీజర్స్ కలగడాన్ని ఎపిలెప్సీ అని పేర్కొంటారు. కొందరిలో ఎపిలెప్పీ ఎందుకు వస్తుందనేందుకు కారణాలు తెలియవు. మరికొందరిలో మెదడులో ఏవైనా గాయాలైతే అది ఎపిలెప్సీకి దారితీయవచ్చు. అన్ని వయసుల వారిలోనూ ఇది కనిపించినా... ముఖ్యంగా ఎపిలెప్సీ రోగుల్లో 30 శాతం మంది చిన్నారులై ఉంటారు. ఆ తర్వాతి స్థానంలో వయసు పైబడ్డవారిలో ఎపిలెప్సీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నిర్దిష్టంగా ఎపిలెప్సీకి కారణాలు కనిపించే సందర్భాలివి...
  
►  పుట్టుక సమయంలో బిడ్డకు ఆక్సిజన్ చాలా తక్కువగా అందడం.
►  పెద్దవాళ్లలో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు తలకు గాయం కావడం.
►  మెదడులో కణుతులు / గడ్డలు.
►   కొందరిలో స్క్లిరోసిస్ అన్న కండిషన్ వంశపారంపర్యంగా  కొనసాగడం.
►   మెనింజైటిస్ లేదా ఎన్‌కెఫలైటిస్ అనే మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు రావడం.
►   పక్షవాతం లేదా మెదడులో తీవ్రమైన ప్రమాదం (డ్యామేజ్)  జరగడం.
►  శరీరంలో సోడియమ్ లేదా చక్కెర పాళ్లు అనూహ్యంగా పరిమితికి మించి పెరగడం. అయితే దాదాపు 70 శాతం కేసుల్లో ఎపిలెప్సీకి నిర్దిష్టంగా కారణాలు తెలియవు.
► ఒక్కోసారి నిర్దిష్ట కారణాలు తెలియకపోయినా... కొన్ని పరిస్థితులు  మూర్ఛకు దారితీస్తాయి. ఈ పరిస్థితులను మనం ప్రయత్నపూర్వకంగా నివారించగలం. అవి...
►   మనకు సూచించిన మందులను డాక్టర్ చెప్పిన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో తీసుకోవడం.
►   మితిమీరిన పాళ్లలో ఆల్కహాల్ తీసుకోవడం.
►   కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకోవడం.
►   తగినంతగా నిద్రపోకపోవడం.
►   సీజర్స్ కోసం మందులు తీసుకుంటున్న సమయంలోనే వాటిని నిర్వీర్యం చేసే ఇతర మందులు వాడటం.
 
రకాలు
 
మెదడులో జరిగే కార్యకలాపాలు, ప్రవర్తన ఆధారంగా సీజర్స్‌ను రెండు ప్రధాన విభాగాలుగా పేర్కొనవచ్చు. అవి 1) జనరలైజ్‌డ్; 2) పార్షియల్. వీటినే మొదటిదాన్ని లోకల్ అని రెండోదాన్ని ఫోకల్ అని కూడా అంటారు. జనరలైజ్‌డ్ సీజర్స్‌లో రోగిలో ఎలక్ట్రిక్ తరంగాలు మెదడులోని అన్ని భాగాలనుంచి ఉద్భవిస్తాయి. అదే పార్షియల్ సీజర్స్‌లో రోగి మెదడులోని కొన్ని ప్రాంతాల నుంచే ఆవిర్భవిస్తాయి. నిర్దిష్టంగా కొద్ది భాగం నుంచి ఉద్భవించినందుకే వీటిని ఫోకల్ అని కూడా అంటారు.

ఇవిగాక జనరలైజ్‌డ్ సీజర్స్‌లో ఆరు రకాలుంటాయి. అవి... అందులో మొదటిది అందరికీ తెలిసిన, రోగి స్పృహతప్పిపోయే కన్వల్షన్స్. వీటినే గ్రాండ్ మాల్-సీజర్ అని కూడా అంటారు. ఈ రకం సీజర్స్‌లో రోగి స్పృహతప్పి కుప్పకూలిపోతాడు. ఆ తర్వాత ఒళ్లంతా కర్రలా బిర్రబిగుసుకుపోతుంది. ఈ స్థితిని ‘టోనిక్’ కండిషన్ అంటారు. ఈ స్థితి సాధారణంగా 30 నుంచి 60 సెకన్లు ఉంటుంది. ఆ తర్వాత ఒళ్లు గిలగిలా కొట్టుకునే స్థితి వస్తుంది. ఈ జెర్కింగ్ పరిస్థితిని ‘క్లోనిక్’ కండిషన్ అంటారు. ఇది కూడా 30 నుంచి 60 సెకన్ల వరకు ఉంటుంది. ఈ టోనిక్, క్లోనిక్ కండిషన్ల తర్వాత రోగి చాలాసేపు గాఢంగా నిద్రపోతాడు. ఈ గాఢనిద్రాస్థితిని ‘పోస్టికల్’ కండిషన్ లేదా సీజర్స్ అనంతర స్థితి అని కూడా అంటారు. ఈ గ్రాండ్-మాల్‌సీజర్స్ అన్నది ఏదైనా యాక్సిడెంట్ వల్ల మెదడుకు అయిన గాయం కారణంగా కావచ్చు. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి రోగి తన నాలుకను తానే కొరుక్కోవచ్చు. లేదా మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవచ్చు.  కొన్నిసార్లు కొందరు పిల్లల్లో ఈ సీజర్స్ ఏవీ కనిపించకుండానే వారు కొన్ని సెకన్ల పాటు స్పృహలో లేనట్లుగా ఉండిపోతారు. వాళ్లకు సీజర్స్ వచ్చినట్లుగా కూడా తెలియదు.  

 ఇక మయోక్లోనిక్ సీజర్స్‌లో రోగి శరీరంలో ఇరువైపులా బిగుసుకుపోయినట్లుగా జెర్క్‌లు వస్తాయి. అవి ఎలక్ట్రిక్ షాక్‌లా వచ్చినట్లుగా తమకు అనిపించినట్లు రోగులు వర్ణిస్తుంటారు. కొన్నిసార్లు రోగులు తమ చేతిలో ఉన్న వస్తువులను వదిలేయడమో, బలంగా విసిరేయడమో చేస్తుంటారు.  క్లోనిక్ సీజర్స్‌లో రోగి శరీరం ఇరువైపులా ఒక క్రమబద్ధమైన జెర్క్‌లకు లోనవుతూ ఉంటుంది. టోనిక్ సీజర్స్‌లో రోగి శరీరంలోని కండరాలన్నీ బిగుసుకుపోతాయి.అటోనిక్ సీజర్స్ అనే రకం ఫిట్స్‌లో రోగి అకస్మాత్తుగా తన కాళ్లూ, చేతుల్లో సత్తువను పూర్తిగా కోల్పోయి అచేతనమై పడిపోతాడు.
 
పిల్లలూ...  యుక్త వయస్కులలో...
 
పిల్లల మెదడులో కోటానుకోట్ల మెదడు కణాలు (న్యూరాన్లు) ఉంటాయి. వీటినుంచి వివిధ అవయవాలకు ఆదేశాలు విద్యుత్ స్పందనల (ఎలక్ట్రిక్ ఇంపల్సెస్) రూపంలో వెలువడుతుంటాయి. ఏకకాలంలో అనేక విద్యుత్ స్పందనలు లెక్కకు మీరి వెలువడుతున్నప్పుడు కండరాలు బిగుసుకుపోవడం, స్పృహకోల్పోవడం, విచిత్రంగా ప్రవర్తించడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈ తరహా విద్యుత్ స్పందనలు ఎందుకు ఉద్భవిస్తున్నాయనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈఈజీ పరీక్షలో అది చూపే గ్రాఫ్‌ల ప్రకారం వివిధ రకాల సీజర్స్ సమయంలో వెలువడే వేర్వేరు రకాల స్పందనలను డాక్టర్లు చూస్తారు. దాన్ని బట్టి వాటిని కేటగిరీలుగా విభజించి, నిర్దిష్టంగా వాటికి అనుసరించాల్సిన చికిత్సా మార్గాన్ని నిర్ణయిస్తారు. పిల్లల్లో సీజర్స్‌ను నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టం. ఎందుకంటే అది వచ్చిన సమయంలో డాక్టర్ దగ్గరకు బయల్దేరినా... వైద్యుడి వద్దకు చేరే సమయానికి సీజర్స్ ఆగిపోవచ్చు. ఒక్కోసారి మనకు సీజర్స్‌లా అనిపించిన లక్షణం సీజర్స్ కాకపోవచ్చు. అది రక్తంలో చక్కెరపాళ్లు ఎక్కువ కావడమో లేదా గుండె స్పందనల్లో లయతప్పడమో లేదా ఉద్వేగానికి లోనై ఒత్తిడికి గురికావడం అనే లక్షణాల వల్ల అచ్చం సీజర్స్ లాంటి లక్షణాలే ఉత్పన్నం కావచ్చు.
 
సీజర్స్ ఉన్న పిల్లలూ... వాళ్ల తల్లిదండ్రుల్లో ఉద్వేగాలు


సీజర్స్ ఉన్న పిల్లలకు అందరు పిల్లల్లాగే సాధారణ తెలివితేటలు ఉంటాయి. ఎపిలెప్సీ ఉండటం లేదా ఫిట్స్ రావడం అనే అంశం వారి తెలివితేటలకూ, సృజనకూ ఏ విధంగానూ ప్రతిబంధకం కాదు. అయినప్పటికీ పిల్లలకు ఫిట్స్ ఉంటే ఆ పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ తీవ్రమైన ఉద్వేగభరితమైన ఒత్తిడికి (ఎమోషనల్ స్ట్రెస్‌కు) గురవుతారు. ఆత్మన్యూతనకూ, డిప్రెషన్‌కూ లోనవుతారు. అందుకే పిల్లలకు ఫిట్స్ ఉన్నప్పుడు చిన్నారులకు చికిత్సతో పాటూ పెద్దలకు నిపుణలచేత కౌన్సెలింగ్ కూడా అవసరమవుతుంది. పిల్లలకు తమకు ఉన్న సమస్య చాలా సాధారణమైనదనీ, కాలక్రమాన తగ్గిపోతుందనే ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. తల్లిదండ్రులూ ఆ విషయాన్ని మనసావాచా నమ్ముతూ వాళ్లలోని సృజనకు అడ్డంకిగా పరిణమించకుండా వాళ్లకు ఏరంగంలో ఆసక్తి ఉందో అందులో ప్రోత్సహించాలి.
 
మహిళలూ - మూర్ఛ
 
నిజానికి సీజర్స్ వ్యాధికి మహిళలూ, పురుషులూ అన్న వివక్ష ఏమీ లేదు. ఈ ఇద్దరికీ మూర్ఛ వ్యాధి వస్తుంటుంది. కానీ ఈ వ్యాధి వల్ల అన్నివిధాలా వివక్షకు గురయ్యేది మాత్రం మహిళలే. ఫిట్స్ అందరిలోనూ సామాన్యమే అయినప్పటికీ మహిళలు మాత్రం సామాజికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకే మహిళల్లో సీజర్స్‌ను అన్నివిధాలా కాస్త వేరుగా చూడాల్సి ఉంటుంది.
 
మహిళల్లో ఎపిలెప్సీ... హార్మోన్లలో మార్పులు

కొందరు మహిళల్లో ఎపిలెప్సీ వారి హార్మోన్ల క్రమంలో మార్పులు తీసుకొస్తుంది. ఇది జీవితాంతం వారిలో ప్రభావం చూపిస్తుంది. మహిళల్లో ప్రధానంగా రెండు రకాల సెక్స్ హార్లోన్లు ఉంటాయి. అవి 1) ఈస్ట్రోజెన్, 2) ప్రోజెస్టెరాన్. ఇటీవలి పరిశోధనల ప్రకారం తేలిందేమిటంటే... ఈస్ట్రోజెన్ హార్మోన్ మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రోజెస్టెరాన్ హార్మోన్ మెదడు కణాలను జోకొడుతుంది. దీన్ని బట్టి తేలే విషయమేమిటంటే... శరీరంలో ఈస్ట్రోజెన్ పాళ్లు, ప్రోజెస్టెరాన్ పాళ్లు పెరగడం, తగ్గడం అనే అంశం మీద నరాల వ్యవస్థ ఉత్తేజితం కావడం ఆధారపడి ఉంటుందన్నమాట. హార్మోన్లలోని మార్పులు యువతుల్లో సీజర్స్‌ను ప్రేరేపిస్తాయి. అందుకే యువతుల్లో మొట్టమొదటిసారి ఫిట్స్ రావడం అన్నది వారిలో మొదటిసారి రుతుక్రమం మొదలైనప్పుడు ప్రారంభమవుతుండటం చాలా సాధారణమైన అంశం. అయితే అందరు యువతుల్లోనూ ఇదే అంశం కనిపించదు. కాబట్టి డాక్టర్లు, పరిశోధకులు హార్మోన్లు, సీజర్స్‌పై వాటి ప్రభావం పై ఇంకా లోతుగా పరిశోధనలు చేస్తున్నారు.
 
మహిళల్లో ఎపిలెప్సీ... రుతుక్రమంపై ప్రభావం


కొందరు యువతుల్లో ‘కెటామినియల్ ఎపిలెప్సీ’ అనే రకం కనిపిస్తుంది. దాదాపుగా 10 శాతం నుంచి 12 శాతం వరకు కెటామినియల్ ఎపిలెప్సీ ఉంటోందని తెలుస్తోంది. అయితే ఈ కెటామినియల్ ఎపిలెప్సీకి నిర్దిష్ట కారణమేమిటన్నది ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఇక కొందరు మహిళల్లో అండం ఏర్పడే ‘ఓవ్యులేషన్’ దశలో (ఈ దశలో మహిళల శరీరాల్లో ఈస్ట్రోజెన్ ఎక్కువ) మొదటిసారి సీజర్స్ కనిపిస్తాయి. ఇక మరికొందరిలో అండం ఏర్పడే దశ తర్వాత అది తగ్గిపోతూ రాలిపోయే సమయంలో అంటే ప్రోజెస్టెరాన్ ఎక్కువగా స్రవించే సమయంలో సీజర్స్ వస్తాయి.

మహిళలు... ఎపిలెప్సీ... గర్భధారణ

మహిళలకు ఎపిలెప్సీ ఉన్నప్పటికీ అది వారి గర్భధారణపైనా, ప్రసూతిపైనా ఎలాంటి ప్రభావం చూపదు. వాళ్లలో ఎపిలెప్సీ ఉన్నా... ఆరోగ్యకరమైన పండంటి బిడ్డకు జన్మనిస్తారు. అయితే కేవలం 10 శాతం మంది విషయంలో కొద్దిపాటి రిస్క్ ఉంటే ఉండవచ్చుగానీ... డాక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రసూతిని నిర్వహిస్తే... అది కూడా ఎంతమాత్రమూ రిస్క్ కాబోదు. ఒక మహిళకు ఎపిలెప్సీ ఉందని తెలిసి, ఆమె గర్భాన్ని దాల్చాలని కోరుకుంటున్నప్పుడు ఆమె తప్పనిసరిగా అబ్‌స్టెట్రీషియన్‌తో పాటు, న్యూరాలజిస్ట్‌నూ సంప్రదించాలి. అలాంటప్పుడు ఆ నిపుణులిద్దరూ గర్భవతిలోని అన్ని దశలతో పాటు ప్రసూతినీ దగ్గరుండి పర్యవేక్షించి, ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చేలా చేస్తారు.

మహిళల్లో ఎపిలెప్సీ... గర్భనిరోధక సాధనాలు

ఒకవేళ మహిళకు ఎపిలెప్సీ ఉండి, ఆమె గర్భనిరోధక సాధనాలను ఉపయోగించదలచుకుంటే, వారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం మేలు. అవి... సాధారణంగా అన్ని రకాల గర్భనిరోధక సాధనాలూ ఆమెకు సురక్షితమే అయినప్పటికీ చాలా అరుదుగా కొందరిలో కొన్ని గర్భనిరోధక సాధనాలు అంత ప్రభావితంగా ఉండకపోవచ్చు. పైగా వారు వాడే యాంటీ-సీజర్ మందులతో ఈ మందులు చర్యజరపడం వల్ల కొందరిలో అవాంఛిత గర్భధారణ జరగడంతో పాటు పిల్లల్లో కొన్ని పుట్టుకతో వచ్చే ఆరోగ్యసమస్యలూ రావచ్చు. అందుకే ఎపిలెప్సీ ఉన్న మహిళలు గర్భనిరోధక సాధనాలు వాడాల్సి వచ్చినా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా ముందుగా అబ్‌స్టెట్రీషియన్‌తో పాటు న్యూరాలజిస్ట్‌నూ సంప్రదించాలి.

సరికొత్త మాతృమూర్తి... ఎపిలెప్సీ...

కొత్తగా తల్లి అయిన ఎపిలెప్సీ వ్యాధిగ్రస్తురాలు అడిగే ప్రశ్న. ‘నేను వాడే యాంటీ ఎపిలెప్సీ మందులతో... నేను చనుబాలు పట్టించడం వల్ల బిడ్డపై ఏవైనా దుష్ర్పభావం పడుతుందా?’ అని. ఈ విషయంలో ప్రతి తల్లీ తమ డాక్టర్‌ను విధిగా సంప్రదించి, తాను చనుబాలు ఇచ్చినప్పటికీ బిడ్డపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపని యాంటీ-ఎపిలెప్సీ మందులను తనకు సూచించాల’ని డాక్టర్‌ను అడగాలి.
 
చికిత్స
 
చాలారకాల ఎపిలెప్సీలకు మందులతోనే చికిత్స చేస్తారు. వీటిని యాంటీ కన్వల్సెంట్ డ్రగ్స్ అంటారు. ఈ తరహా మందులను సూచించే విషయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సీజర్స్ తీవ్రత ఎంత ఉంది, ఎన్నాళ్లుగా అవి వస్తున్నాయి, రోగి వయసు, అతడి పూర్తి ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, ఏ తరహా సీజర్స్... వంటి ఎన్నో అంశాల ఆధారంగా మందులనూ, మోతాదులనూ నిర్ణయిస్తారు. పిల్లల్లోనూ, వయసు పైబడ్డ పెద్దల్లోనూ 70 శాతం మందిలో ఈ మందులతోనే విజయవంతంగా వ్యాధి నయమవుతుంది.

సైడ్ ఎఫెక్ట్స్: నిజానికి ఈ మందుల వల్ల కొద్దిపాటి దుష్ర్పభావాలు ఉంటాయి. అవి... ఒకే వస్తువు రెండుగా కనిపించడం, అలసట, నీరసం, నిస్సత్తువ, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లుగా అనిపించడం, నిలకడగా ఉండలేకపోవడం, కడుపులో ఇబ్బంది, చర్మంపై రాష్, రక్తకణాల సంఖ్య తగ్గడం, కాలేయ సమస్యలు, జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటివి. ఇలాంటి దుష్ర్పభావాలు కనిపించినప్పుడు మందులను మార్చాల్సి ఉంటుంది. అందుకే సీజర్స్ చికిత్స విషయంలో డాక్టర్లు ఓ నియమాన్ని అనుసరిస్తుంటారు.

వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ చికిత్స

వేగస్ నర్వ్ అనేది తలలోంచి ఆవిర్భవించే పన్నెండు జతల నరాల్లో అత్యంత కీలకమైనది. సాధారణంగా 70 శాతం కేసుల్లో మందులతోనే ఎపిలెప్సీ నయమవుతుంది. అప్పటికీ నయం కానివారిలో డాక్టర్లు వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ (వీఎన్‌ఎస్) చికిత్సకు ప్రాధాన్యమిస్తారు. ఇందులో శస్త్రచికిత్స ద్వారా ఈ నరానికి పేస్ మేకర్ వంటి సాధనాన్ని అమరుస్తారు. మెదడులో అనియంత్రితంగా వెలువడే విద్యుత్‌తరంగాలతోనే సీజర్స్ వస్తాయి కాబట్టి ఈ వేగస్ నరం ద్వారా పేస్‌మేకర్ ద్వారా వాటికి విరుగుడుగా పనిచేసే విద్యుత్ తరంగాలను పంపి, వాటిని నియంత్రిస్తారు. అయితే వేగస్ నర్వ్ స్టిమ్యూలేషన్ చికిత్స వల్ల సీజర్స్ పూర్తిగా తగ్గిపోతాయని చెప్పేందుకు అవకాశం లేదు. కాకపోతే వాటి తీవ్రత తగ్గుతుంది.
 
జాగ్రత్తలు
 
రోగికి ఫిట్స్ / సీజర్స్ రాగానే ఆసుపత్రికి తీసుకువచ్చేలోపు అతడి పట్ల కొన్ని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలి.పడిపోయి తలకు గాయం కాకుండా చూడాలి. తలను మెత్తటి తలగడపై ఉంచాలి.  మెడ దగ్గర బటన్ విప్పి... గాలి బాగా ఆడేలా చూడాలి.  అతడి తలను ఒక పక్కకు ఒరిగి ఉండేలా చూడాలి.  నోట్లో పళ్ల మధ్య ఏ విధమైన వస్తువునూ ఉంచకూడదు. వీటితో పాటు అతడికి వచ్చిన ఫిట్స్ ఎంతసేపు కొనసాగాయి, అతడి కదలికలు ఎలా ఉన్నాయి, తలనూ, కళ్లనూ ఎలా తిప్పుతున్నాడు అన్న అంశాలను గమనించి ఆ తర్వాత డాక్టర్‌కు వివరించాలి.
 
నివారణ

 కారణం లేకుండా వచ్చే ఫిట్స్ / సీజర్స్‌ను నివారించడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలేమీ లేవు. అయితే ఒకసారి ఫిట్స్ వచ్చినవారికి రెండోసారి రాకుండా నివారించేందుకు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు అకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి తలకు గాయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా జాగ్రత్త పడాలి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌కు వచ్చే ఇన్ఫెక్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి తక్షణ చికిత్స తీసుకోవాలి.
 
చివరగా ఒక్క విషయం...


సీజర్స్‌వల్ల తెలివితేటలకూ, సృజనకూ ఎలాంటి అవరోధం ఉండదు. అది అంటువ్యాధి కాదు. కాబట్టి ఆ వ్యాధిగ్రస్తుల పట్ల ఎలాంటి వివక్షా చూపవద్దు. సాటి వ్యక్తుల సహకారంతోనే వారు మరింతగా రాణిస్తారు.
 - నిర్వహణ: యాసీన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement