
డాక్టర్ గారూ, నేను డిగ్రీ చదివి కానిస్టేబుల్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాను. నాకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం. ఒక సంవత్సరం క్రితం మా ఊర్లో ఉన్న ఒక ఫేమస్ జిమ్‌లో చేరాను. తొందరగా బాడీ పెరగడం కోసం ‘టెర్మిన్’ అనే ఇంజక్షన్ ఉంటుంది అని, అక్కడ పని చేసే ట్రెయినర్ ఒకతను చెబితే అది తీసుకోవడం మొదలు పెట్టాను. మొదట్లో చాలా బాగా అనిపించింది. జిమ్‌లో ఎంతసేపు వర్కవుట్స్ చేసినా అలసట వచ్చేది కాదు. నిద్రలేకపోయినా చాలా హుషారుగా ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు ఇక ఇంజక్షన్ సరిపోయేది కాదు. రెండు నుంచి మూడు ఇంజక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టాను. దానివల్లేనేమో, ఆకలి బాగా తగ్గిపోయింది. బరువు తగ్గాను. బాగా చికాకుగా ఉంటోంది. ఇంజక్షన్ తీసుకోకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. చెవిలో వింతవింత శబ్దాలు కూడా వినపడుతున్నాయి. ఎవరో నన్ను గమనిస్తున్నట్లు, నన్ను చంపడం కోసం వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ భయంతో ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నా జీవితాన్ని నేను చేతులారా నాశనం చేసుకున్నానేమో అనిపిస్తుంది. దయచేసి నన్ను ఈ సమస్య నుంచి ఎలాగైనా బయట పడెయ్యండి. – రమేష్, విశాఖపట్నం
ముందుగా మీ తప్పు మీరు తెలుసుకుని మారాలి అని అనుకుంటున్నందుకు మీకు నా అభినందనలు. మీరు పంచుకున్న ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. మన దేశంలో ఇటీవల చాలామంది యువత ఇలాంటి ఇంజెక్షన్స్‌కి అడిక్ట్ అయి బాధపడుతున్నారు. తమ అభిమాన నటుడు ఎవరో సిక్స్ ప్యాక్ శరీరం పెంచారని, తాము కూడా అలా పెంచుకోవాలి అనే యావలో లేదా ఎవరినయినా ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశ్యంతో జిమ్‌లలో చేరడం తొందరగా బాడీ పెంచాలనే ఉద్దేశ్యంతో అడ్డదారులైన ఇలాంటి ఇంజెక్షన్లను ఎంచు కుంటున్నారు. మీరు తీసుకున్న టెర్మిన్ ఇంజక్షన్ సైకోస్టిమ్యులెంట్ డ్రగ్ కిందకు వస్తుంది.
ఈ మందు మెదడులో సెరటోనిన్, డోపమైన్, నార్ అడ్రినలిన్ అనే రసాయనాలను ఎక్కువ మోతాదులో విడుదల అయ్యేలా చేస్తుంది. దానివల్ల వారికి అమితమైన బలం వచ్చినట్లు అనిపిస్తుంది. ఎంత పని చేసినా అలసట రాదు. దాంతో గంటలు గంటలు జిమ్‌లో వర్కవుట్స్ చేయగలుగుతారు. అయితే క్రమేణా కొంతకాలానికి శరీరం చల్లబడటం, బీపీ తగ్గిపోవడం, బాగా అలసటగా అనిపించడం జరుగుతుంది. బీపీ విపరీతంగా పెరగడం, ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవడం, వెంట్రుకలు ఊడిపోవడం లాంటి దుష్ప్రభావాలు కనపడతాయి. ఒక్కోసారి గుండెలయలో మార్పులు వచ్చి ప్రాణం మీదికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొంతమందిలో చెవిలో మాటలు వినపడటం, విపరీతమైన మూడ్ స్వింగ్స్ రావడం చూస్తుంటాము. దీనినే సైకోపిన్ అంటారు. మీరు వీలైనంత తొందరగా ఒకసారి మానసిక వైద్యుడిని సంప్రదిస్తే ఈ సైకోసిస్ లక్షణాలను తగ్గించేలా సరైన వైద్యం చేసి తర్వాత అవసరమైతే కొంతకాలం పాటు మిమ్మల్ని రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచి కౌన్సెలింగ్, యోగ, ఇతరత్రా వైద్యవిధానాల ద్వారా పూర్తిగా ఈ అడిక్షన్ సమస్య నుంచి బయటకి తీసుకు రావచ్చు. ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్టులను సంప్రదిస్తే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. గుడ్‌లక్.
-డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment