బ్రెయిన్ అనేది రహస్యాల గని. భావోద్వేగాల ఫ్యాక్టరీ.‘ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తోంది ‘ఐబీఆర్‌వో’ అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్త అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐబీఆర్‌వో) అధ్యక్షురాలిగా ప్రముఖ శాస్త్రవేత్త శుభ టోలే నియమితురాలైంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యున్నత స్థానానికి ఎంపికైన తొలి శాస్త్రవేత్తగా ప్రత్యేకత సాధించింది...
ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలు, ఫెడరేషన్‌లకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఐబీఆరోవో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన ‘ఐబీఆర్‌వో’ నినాదం: ప్రొవైడింగ్ ఈక్వల్ యాక్సెస్ టు గ్లోబల్ న్యూరోసైన్స్ గతంలో ‘ఐబీఆర్‌వో’ అధ్యక్షులుగా యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్‌వో’కు సంబంధించి అతిపెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభ టోలేకు వచ్చింది.
‘అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్‌మెంట్‌లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటుంది శుభ.
శుభ ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ–టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్‌గా పనిచేస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘ఉమెన్ ఇన్ సైన్స్’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసింది. విద్యావంతుల కుటుంబంలో ముంబైలో జన్మించింది శుభ. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ చేసింది. చికాగో యూనివర్శిటీలో పోస్ట్–డాక్టోరల్ రీసెర్చి చేసింది.
వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి స్వర్ణజయంతి ఫెలోషిప్ తీసుకొంది. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి జాతీయ మహిళా బయోసైంటిస్ట్ అవార్డ్, సొసైటీ ఫర్ న్యూరోసైన్స్, యూఎస్ నుంచి రీసెర్చ్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూరోసైన్సెస్ అవార్డ్ అందుకుంది.
కథక్ డ్యాన్సర్ కూడా
శుభ టోలే శాస్త్రవేత్తే కాదు కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్ ఏంజిల్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్ దగ్గర కథక్ నేర్చుకుంది. ‘కథక్ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేను, నా పెద్ద కొడుకు కథక్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలాప్రాక్టీస్ చేస్తుంటారు’ అంటుంది శుభ.
శుభ భర్త సందీప్ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్‌కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారనేది అపోహ మాత్రమే. పెయింటింగ్ నుంచి మ్యూజిక్ వరకు ఎన్నో కళల గురించి మాట్లాడుకుంటారు. ‘సైన్స్ అనేది ఒక సృజనాత్మక వృత్తి’ అంటుంది శుభ.
Comments
Please login to add a commentAdd a comment