ఊరికే కూర్చోకు భయపడకు | Woman-owned cafe in Indonesia | Sakshi
Sakshi News home page

ఊరికే కూర్చోకు భయపడకు

Published Fri, Nov 22 2024 1:01 AM | Last Updated on Fri, Nov 22 2024 1:01 AM

Woman-owned cafe in Indonesia

దట్టమైన పొగ, ధారాళమైన దుర్భాషలతో నిండి ఉండే మగ రూప కాఫీ రెస్టారెంట్‌లే ఈ ప్రపంచం నిండా! ఇండోనేషియా కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. అయితే అక్కడి ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణమైన బాందా ఏసాలో ఒక మహిళ పొగలు కక్కే మంచి కాఫీని తప్ప.. సిగరెట్‌ పొగలకు, చెత్త మాటలకు స్థానం లేని కేఫ్‌ను నడుపుతున్నారు! 

అది పూర్తిగా ఆడవాళ్ల అడ్డా. అక్కడ వాళ్లు కాఫీ తాగొచ్చు. కబుర్లు చెప్పుకోవచ్చు. చర్చలు పెట్టుకోవచ్చు. మగవాళ్లు కూడా వచ్చి కాఫీ తాగి వెళ్లిపోవచ్చు కానీ, అక్కడ కూర్చోటానికి లేదు. ఆ కాఫీ కేఫ్‌ పేరు ‘మార్నింగ్‌ మామా’. ఆ కేఫ్‌ యజమాని ఖుర్రేటా అయుని. 28 ఏళ్ల ముస్లిం యువతి. ఆమె దగ్గర పనిచేసే నలుగురు ‘బరిస్టా’లు (కాఫీ తయారు చేసి, సర్వ్‌ చేసేవారు) కూడా మహిళలే. 

పూర్తిగా మహిళలే నడిపే ‘మార్నింగ్‌ మామా’ వంటి కాఫీ కేఫ్‌లు ఏ దేశంలో అయినా ఉండేవే. అందులో కొత్తేమీ లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉండే ఇండోనేషియాలో కూడా ‘ఓన్లీ ఉమన్ ’ కాఫీ కేఫ్‌లు అరకొరగానైనా లేకుండాపోవు. అయితే ఏసా ప్రావిన్సులో ఒక మహిళ బయటికి రావటం, బిజినెస్‌ చేయటం అన్నది కలకలం రేపే విషయం. కొరడా దెబ్బలకు దారి తీసే సాహసం.

 ఇండోనేషియాలోని మొత్తం 38ప్రావిన్సులలో ఏసాప్రావిన్సు ఒక్కటే ఇప్పటికీ మారకుండా నియమాల శిలలా ఉండిపోయింది. మహిళల పట్ల నేటికీ కఠినమైన ఆంక్షలు, సంప్రదాయాలు కొనసాగుతున్న ప్రదేశం అది. అలాంటి చోట కాఫీ కేఫ్‌ తెరిచారు ఖుర్రేటా! అయితే అందుకోసం ఆమె సంప్రదాయాలను ధిక్కరించలేదు. ఆంక్షల్ని కాస్త సడలింపజేసుకుని, హిజాబ్‌ను ధరించి, ఇతర మతపరమైన కట్టుబాట్లకు లోబడి కేఫ్‌ను నిర్వహిస్తున్నారు. 

ఖుర్రేటా కాఫీ కేఫ్‌ప్రారంభించిన ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణం బాందా ఏసాకు ‘1001 కాఫీ షాపులున్న పట్టణం’గా పేరు. వాటికి ఇప్పుడు ‘మార్నింగ్‌ మామా’కూడా జత కలిసింది. ఆడవాళ్లు బయటికి వచ్చి మగవాళ్లలా పని చేయటం అనే ‘దైవ దూషణ వంటి’ ఆ ధిక్కారాన్ని చూసి మొదట్లో కన్నెర్ర చేసిన స్థానిక పురుషులు.. మెల్లమెల్లగా ఇప్పుడు ఆమె కేఫ్‌కే ప్రత్యేకమైన నురగలు కక్కే చిక్కని పాల శాంగర్‌ ‘లాటే’ కాఫీకి అలవాటు పడుతున్నారు. పొగ, శబ్దం లేకుండా హాయిగా, ప్రశాంతంగా ఉండే అక్కడి వాతావరణాన్ని మరింతగా ఇష్టపడుతున్నారు. 

‘మహిళలు సైతం సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. నిర్ణయాలు తీసుకోవచ్చు. నాయకత్వం వహించవచ్చు’ అని ఖుర్రేటా ఇస్తున్న స్టేట్‌మెంట్‌కు ప్రతీక ఆమె కాఫీ కేఫ్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement