
మానవ పునరుత్పత్తి ప్రక్రియలో ప్రాణికోటికి అత్యంత కీలకమైంది గర్భధారణ. ఈ సహజక్రియకు పవిత్రతను ఆపాదించే విషయాన్ని పక్కనపెడితే.. స్త్రీల శారీరక సహజ హక్కులు శతాబ్దాలుగా ప్రశ్నార్థకంగా మారుతూనే ఉన్నాయి. స్త్రీల పునరుత్పత్తినే కాదు, స్త్రీల దేహాలకు సంబంధించిన సహజ ప్రకృతి చర్యలన్నింటినీ సమాజం ఒక వైకల్యంగానే చూస్తూనే ఉంది. రుతుక్రమం, గర్భధారణ, ప్రసవం ఇవన్నీ కూడా ఆమెను సమాజం నుంచి వేరు చేసి చూసేవే!
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఎంతో అభివృద్ధిని సాధించామనుకుంటున్న, అసామాన్య విజయాలను కైవసం చేసుకొంటోన్న ఈ అత్యాధునిక ప్రపంచంలో కూడా ఇంకా గర్భిణీలను వేరుగా చూసే ధోరణి కొనసాగుతోండడం స్త్రీజాతి మనుగడనే సవాల్ చేస్తోంది. లింగ అసమానతలను ఛేదించుకొని, సరిహద్దులను చెరిపేసుకొని ఆకాశంలోకి దూసుకెళుతోన్న మహిళా వ్యోమగాములూ, యుద్ధవైమానిక దళసారథులూ అయిన స్త్రీలను ఓ పక్కన ఉంచుకొని ఇండోనేషియాలాంటి దేశాలు ఏకంగా మహిళల గర్భధారణను అసాధారణ విషయంగా, లేక అసహజమైన, వైకల్యంతో కూడిన విషయంగా చూసిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఎక్కడ మొదలైంది?
ఇండోనేషియా ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. పౌరసేవా విభాగానికి వివిధ శాఖల నుంచి 2 లక్షల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్న ఈ ఉద్యోగావకాశాలకు సంబంధించిన ప్రకటనలో మహిళల సహజ హక్కులను కించపరిచే, వివక్షాపూరితమైన అంశాన్ని చేర్చింది! ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు గర్భిణీలను, ట్రాన్స్‌జెండర్లను, అంగవైకల్యంతో ఉన్న వారిని ఈ రెండు లక్షల ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అనర్హులు అనే నిబంధన విధించింది. దీనిపై ఇండోనేషియా అంబుడ్స్‌మన్ కమిషనర్ నినిక్ రహయూ స్పందిస్తూ దేశంలో రక్షణ, వాణిజ్య మంత్రిత్వ శాఖలతో పాటు అటార్నీ జనరల్ కార్యాలయం (ఎజీఓ) ఉద్యోగ ప్రకటనలు వివక్షాపూరితంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓన్లీ నార్మల్?
పైగా ఈ ప్రకటనలో గర్భవతులనీ, శారీరక వైకల్యం కలిగిన వారినీ, ఎల్జీబీటీ వర్గాలనూ అసాధారణమైన పౌరులుగా భావిస్తూ, ఈ ఉద్యోగాలకి మేం సాధారణ పౌరులను మాత్రమే అంగీకరిస్తాం (వియ్ ఓన్లీ యాక్సెప్ట్ నార్మల్ పీపుల్) అని నొక్కి చెప్పడం సామాజిక కార్యకర్తలనూ, మానవహక్కుల నేతలనూ కలవరపెట్టింది. వీరిలోని అసాధారణత్వం ఏమిటో తెలియక ప్రపంచం విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్‌జెండర్ అనో, లేక గర్భం ధరించడం వల్లనో, లేక శారీరక వైకల్యం కారణంగానో ఇండోనేషియా ప్రభుత్వం ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా తీవ్రంగా తప్పుపట్టింది.
ఇది విద్వేషపూరిత ప్రకటన అనీ, ఇండోనేషియా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదనీ, ప్రపంచ మానవహక్కుల చట్టానికి వ్యతిరేకమైనదనీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండోనేషియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉస్మాన్ హమీద్ వ్యాఖ్యానించారు, తక్షణమే ఇండోనేషియా మంత్రిత్వశాఖలు ఈ వివక్షాపూరిత ప్రకటనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూడాలి.. ఇలాంటి నిబంధనల్లోని బుద్ధి వైకల్యాన్ని ప్రభుత్వాలు ఎప్పటికి మార్చుకుంటాయో!!
– అరుణ అత్తలూరి
Comments
Please login to add a commentAdd a comment