ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం సాధారణంగా జరిగేదే. గర్భధారణ సమయంలో మహిళలు 8 నుంచి 10 కిలోల బరువు వరకు పెరుగుతారు. అయితే ఎవరెవరు ఏ మేరకు, ఎంతెంత బరువు పెరగడం ఆరోగ్యకరం అన్నది... గర్భం దాల్చక ముందు వారెంత బరువున్నారన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు ఎంత బరువున్నారు, అది ఆరోగ్యకరమైన పరిమితేనా అన్నది... వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) మీద ఆధారపడి ఉంటుంది. బరువును కేజీల్లో తీసుకుని, దాన్ని మీటర్లలో వారి ఎత్తు స్క్వేర్‌తో భాగిస్తే వచ్చే సంఖ్యను ‘బీఎంఐ’ అంటారు. (కిలోగ్రామ్స్/ మీటర్స్ స్కే్కర్). ఇలా లెక్కవేయగా వచ్చిన ఈ సంఖ్య 18 కంటే తక్కువగా ఉంటే... వారిని తక్కువ బరువువారిగా(అండర్‌వెయిట్‌గా) వర్గీకరించవచ్చు.
అలాగే ఈ సంఖ్య 18.5 నుంచి 24.9 వరకు ఉంటే వారిని సాధారణ బరువు ఉన్నవారిగా చెప్పవచ్చు. అదే 25 నుంచి 29.9 వరకు ఉంటే వారిని ఎక్కువ బరువు ఉన్నవారిగానూ (ఓవర్ వెయిట్), 30 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయులుగానూ (ఓబేస్‌గా) చెప్పవచ్చు. వీరిలో బరువు తక్కువగా ఉన్నవారు ప్రెగ్నెన్సీ టైమ్‌లో 15 కిలోల వరకు పెరిగినా పర్లేదు. కానీ స్థూలకాయులు మాత్రం తమ బరువు పెరుగుదలను 5 నుంచి 9 కిలలో లోపే పరిమితం చేసుకోవడం మంచిది. సగటున చూస్తే గర్భంతో ఉన్నప్పుడు మహిళలు సాధారణంగా వారానికి 200 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు. ఇక వేవిళ్లతో బాధపడుతూ తరచూ వాంతులు చేసుకునేవారు 20 వారాలలోపు ఒక్కోసారి అసలు బరువే పెరగకపోవచ్చు.ఇలా బరువు పెరగకపోవడం కూడా వారి సాధారణ ఆరోగ్యానికి లేదా ఆరోగ్యకరమైన గర్భధారణకూ (హెల్దీ ప్రెగ్నెన్సీకి) అవరోధమేమీ కాదు.
గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అంటే సాధారణ ఆహారంతో పాటు పాలు, గుడ్లు, పండ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవడం మంచిది. మాంసాహారం తినేవారైతే చికెన్, చేపలు తినవచ్చు. శాకాహారులు తమ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గర్భవతులు ఇద్దరికోసం తినాలంటూ చాలామంది వారిని ఒత్తిడి చేస్తుంటారు. నిజానికి కడుపులోని బిడ్డ తన ఆహారాన్ని తల్లినుంచి ఎలాగైనా గ్రహిస్తుంటాడు. కాబట్టి సాధారణ బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు మామూలుగానే తింటే సరిపోతుంది. అంటే బరువు తక్కువగా ఉన్నవారు మినహా మిగతా వారంతా ఇద్దరి కోసం తినడం అన్నది సరికాదని గ్రహించాలి. ఇది బరువును పెంచి, ముప్పునూ పెంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment