అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..! | People Who Develop Diabetes After Pregnancy | Sakshi
Sakshi News home page

అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!

Published Tue, Feb 11 2025 10:26 AM | Last Updated on Tue, Feb 11 2025 10:26 AM

People Who Develop Diabetes After Pregnancy

ఈ రోజుల్లో మధుమేహం (డయాబెటిస్‌) చాలా సాధారణం. మామూలుగానే నియంత్రణలేని డయాబెటిస్‌ ఆరోగ్యపరంగా ఎన్నోఅనర్థాలు తెచ్చిపెడుతుంది. అదే ఒకవేళ గర్భిణిలో ఆ సమస్య ఉండి, వాళ్లకు చక్కెర నియంత్రణలో లేకపోతే అదికాబోయే తల్లికీ, కడుపులోనిబిడ్డకూ చేటు తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. మామూలుగా కొందరు మహిళలకు గర్భధారణకు ముందునుంచే డయాబెటిస్‌ ఉండి ఉండవచ్చు. మరికొందరికి గర్భం వచ్చాక కనిపించవచ్చు. దీన్నే జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు రక్తంలో
చక్కెర నియంత్రణలో లేకపోతే ఇటు తల్లికీ, అటు బిడ్డకూ...అలాగే ఇటు కాన్పు సమయంలో, అటు కాన్పు తర్వాతా... ఇలా ఎవరిలోనైనా, ఏ దశలోనైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఆ సమస్యలేమిటీ, వాటి పరిష్కారాలేమిటి వంటి అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.

మహిళకు... తనకు గర్భం రాకముందునుంచే డయాబెటిస్‌ ఉండి, గర్భం వచ్చాక రక్తంలోని చక్కెర నియంత్రణలో లేకుండా తీవ్రత ఎక్కువైతే దాన్ని ‘ప్రీ–జెస్టేషనల్‌ డయాబెటిస్‌’ అంటారు. మళ్లీ ఇందులోనూ ఆమెకు ‘టైప్‌–1 డయాబెటిస్‌’, ‘టైప్‌–2 డయాబెటిస్‌’ అనే రెండు రకాల డయాబెటిస్‌లలో ఏదో ఒకటి ఉండే అవకాశముంది.

‘టైప్‌–1 డయాబెటిస్‌’ చిన్నవయసులోనే వస్తుంది. ఇందులో సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రాంక్రియాస్‌ గ్రంథిలోని కణాలపై దాడి చేయడం వల్ల, ఆ గ్రంథిలోంచి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సులిన్‌ హార్మోన్‌ స్రవించడం ఆగిపోవడం వల్ల వచ్చేదే టైప్‌–1 డయాబెటిస్‌. దీని ప్రభావం ఇతర అవయవాలపైనా ఉంటుంది. 

ఇక ‘టైప్‌–2 డయాబెటిస్‌’ అనేది పెద్దయ్యాక వచ్చే మధుమేహం. మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో;  సాధారణంగా 35 ఏళ్లు పైబడిన వారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో ఇన్సులిన్‌ ప్రభావానికిలోనై శరీరంలోని కణాలు స్పందించకపోవడంతో రక్తంలో చక్కెర నియంత్రణ జరగదు. దాంతో ఈ రకమైన డయాబెటిస్‌ కనిపిస్తుంది. 

ఇది చాలామందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటే... ఈ కండిషన్‌ మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే కనిపించి, కాన్పు తర్వాత డయాబెటిస్‌ కనిపించకుండా పోతుంది. (అయితే ఇలాంటి కొందరిలో ఆ తర్వాత కొంతకాలానికి డయాబెటిస్‌ కనిపించే అవకాశాలుంటాయి.) 

డయాబెటిస్‌కు కారణాలు
ప్రాంక్రియాస్‌ గ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్‌ హార్మోను... రక్తంలోని చక్కెరను నియంత్రిస్తూ అవసరమైనప్పుడు శక్తి కోసం చక్కెర విడుదలయ్యేలా, అవసరం లేనప్పుడు తగ్గి΄ోయేలా... ఎప్పుడూ ఓ నార్మల్‌ విలువ మెయింటైన్‌ అయ్యేలా చూస్తుంది. ఇలా జరగనప్పుడు డయాబెటిస్‌ కనిపిస్తుంది. 

ఆ కారణాలేమిటంటే... ∙గర్భిణుల్లో విడుదలయ్యే కార్టిసా ప్రొజెస్టరాన్, ప్రోలాక్టిన్, హ్యూమన్‌ ప్లాసెంటల్‌ లాక్టోజెన్‌ లాంటి హార్మోన్లు ఇన్సులిన్‌ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ∙కొందరు గర్భిణుల్లో బరువు ఎక్కువగా పెరిగేవారు ఆహారాన్ని తీసుకునేటప్పుడు, శరీర తత్వాన్ని బట్టి నెలలు నిండే కొద్దీ ఒక్కోసారి ఇన్సులిన్‌ పని తీరు క్రమంగా తగ్గుతుండటం వల్ల, రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలో లేక΄ోవడంతో డయాబెటిస్‌ కనిపిస్తుంది. 

కాన్పు తర్వాత మళ్లీ హార్మోన్లు సాధారణ స్థాయికి రావడంతో ఇన్సులిన్‌ పనితీరు మళ్లీ మునుపటిలాగానే ఉండి, చక్కెరను నియంత్రిస్తుండటం వల్ల కాన్పు తర్వాత  చాలామంది మహిళల్లో జెస్టేషనల్‌ డయాబెటిస్‌ తగ్గుతుంది. గర్భవతి కాకముందునుంచే డయాబెటిస్‌ ఉండేవారిలో గర్భంతో ఉన్నప్పుడు చక్కెర మోతాదులు పెరుగుతాయి. కాన్పు తర్వాత ఆ చక్కెర మోతాదులు మళ్లీ గర్భంరాకముందు ఉన్న స్థాయికి పడిపోతాయి. 

గర్భిణుల్లో డయాబెటిస్‌ముప్పు ఎవరిలో ఎక్కువంటే...  

  • గర్భధారణ 30 ఏళ్లు పైబడిన తర్వాత జరిగిన వారిలో 

  • తమ ఎత్తుకంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో 

  • కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటిస్‌ ఉన్న చరిత్ర ఉన్నవారిలో. 

  • ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారిలో 

  • క్రితం కాన్పులో బిడ్డ కడుపులో చనిపోవడం లేదా పుట్టాక చనిపోవడం, బిడ్డ సైజు పెద్దగా ఉన్నవారిలో 

  • ముందు పుట్టిన బిడ్డకు అంగవైకల్యాలు ఉన్న సందర్భాల్లో.

నిర్ధారణ...
ఇక్కడ చెప్పిన రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఉన్నవారు మొదటిసారి చెకప్‌కు వచ్చినప్పుడే డాక్టర్‌కు తమకు సంబంధించిన ఆరోగ్య చరిత్ర, ఇతరత్రా విషయాలను దాపరికం లేకుండా చెప్పి, రక్తంలో చక్కెర మోతాదు తెలిపే పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత ఆరో నెలలో మళ్లీ షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి. మొదట రాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ చేయించుకోవాలి. 

అందులో విలువలు 150 ఎంజీ/డీఎల్‌ కంటే ఎక్కువ ఉన్నా లేదా ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ 110 కంటే ఎక్కువగా ఉన్నా లేదా తిన్న రెండు గంటల తర్వాత షుగర్‌ విలువలు 140 కంటే ఎక్కువగా ఉన్నా, రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నా గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (జీటీటీ) చేయించాలి. ఇందులో తిండితో సంబంధం లేకుండా 50 గ్రా. గ్లూకోజ్‌ తాగిస్తారు. 

ఒక గంట తర్వాత రక్తంలో షుగర్‌ మోతాదులు  ఎంత ఉన్నాయో పరీక్షిస్తారు. ఒకవేళ ఇది 140 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే వారిలో డయాబెటిస్‌ అవకాశాలు ఎక్కువ అని అర్థం. వ్యాధి పూర్తి నిర్ధారణ కోసం ఓరల్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (ఓజీటీటీ) చేయించాలి. 

ఇందులో ఏమీ తినకుండా ఒకసారి, మొదట 100 గ్రా. గ్లూకోజ్‌ తాగించి గంట తర్వాత ఒకసారీ, రెండు గంటల తర్వాత మరోసారీ, మూడు గంటల తర్వాత ఇంకోసారీ... ఇలా నాలుగుసార్లు రక్తపరీక్ష చేస్తారు. ఈ కొలతలు 95, 180, 155, 140 కంటే ఎక్కువగా ఉంటే షుగర్‌ ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. 

డయాబెటిస్‌ ఉన్నప్పుడు వచ్చే సమస్యలివి...

తల్లిలో...గర్భస్రావాలు : ముందునుంచే డయాబెటిస్‌ ఉన్నవారిలో, చక్కెర అదుపులో లేనివాళ్లలో అబార్షన్లు అయ్యే అవకాశాలెక్కువ.  
హైబీపీ : డయాబెటిస్‌ ఉన్న గర్భిణుల్లో సాధారణ గర్భిణుల కంటే హైబీపీకి అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి నెలలు నిండకముందే కాన్పు చేయాల్సి రావచ్చు. 

గర్భిణుల్లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల, ఉమ్మనీరు ఎక్కువగా ఊరుతుంది.  ఉమ్మనీరు అధికంగా ఉండటం వల్ల పొట్ట పెద్దగా కనిపిస్తూ, తల్లికి ఆయాసంగా ఉండటం, నెలలు నిండకముందే ఉమ్మనీరు ΄ోవడం, నెలలు నిండకముందే కాన్పు అయ్యే ప్రమాదాలు ఉండవచ్చు 

వీళ్లలో మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, యోనిలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలెక్కువ ∙గర్భిణులూ ఎక్కువ బరువుండటం, అలాగే కడుపులో బిడ్డకూడా అధిక బరువు ఉండటం వల్ల ఆపరేషన్‌ ద్వారా కాన్పు చేయాల్సి రావచ్చు 

ప్రీ–జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉన్నవారిలో కొన్నిసార్లు చక్కెర మరీ అధికం అయి΄ోయి కీటో ఎసిడోసిస్‌ అనే కండిషన్‌కు వెళ్లవచ్చు 

కొంతమందిలో డయాబెటిస్‌ కోసం తీసుకునే మందుల మోతాదు ఎక్కువై, చక్కెర మరీ తగ్గడం వల్ల కళ్లు తిరిగి పడి΄ోవచ్చు ∙రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో రక్తసరఫరా సరిగా జరగక΄ోవడంతో కళ్లు, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. 

గర్భంలోని శిశువుకి... 
అవయవ లోపాలు :  గర్భధారణలోని మొదటి మూడు నెలల్లో (ఫస్ట్‌ ట్రైమిస్టర్‌లో) తల్లిలో చక్కెర ఎక్కువగా ఉండటం, చక్కెర మోతాదులు అదుపులో లేనప్పుడు అవి గర్భంలోని పిండంలోకి ప్రవేశించి, శిశువులో అవయవలో΄ాలు (ముఖ్యంగా వెన్నుపూస, గుండెకు సంబంధించినవి) కలిగించే ముప్పు.

బిడ్డ సైజు విషయంలో అనర్థాలు... తల్లిలో ఎక్కువగా ఉండే ఆ గ్లూకోజ్‌ మోతాదులు మాయ (ప్లాసెంటా) ద్వారా బిడ్డకు చేరుతాయి. దాంతో బిడ్డలో ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. బిడ్డ రక్తంలో గ్లూకోజ్‌ మోతాదులు పెరగడం వల్ల బిడ్డ నార్మల్‌ కంటే పెద్దగా పెరుగుతుంది. దీనివల్ల పుట్టబోయే చిన్నారులు నార్మల్‌ కంటే పెద్దగా, ఎక్కువ బరువుతో నీరుపట్టినట్లుగా, ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. తల్లికీ ప్రసవం కష్టమయ్యే అవకాశాలెక్కువ.  

గర్భంలో చనిపోవడం : బిడ్డ మరీ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఎనిమిది, తొమ్మిది నెలల్లో బిడ్డకు సరిపడ ఆక్సిజన్‌ అందక కడుపులోనే చనిపోయే అవకాశం.

జాగ్రత్తలు / చికిత్సలు
డయాబెటిస్‌ ఉందని నిర్ధారణ అయిన తర్వాత గర్భిణులు తమ గైనకాలజిస్ట్, ఫిజీషియన్‌ లేదా డయాబెటాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్‌ వంటి నిపుణుల పర్యవేక్షణలో వారు చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తూ, తగిన చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. 

  • తల్లి రక్తంలో చక్కెరను తరచూ గమనించుకుంటూ / పరీక్షిస్తూ ఉండాలి. 

  • శిశువు ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. 

  • డాక్టర్లు సూచించిన విధంగా సరైన సమయంలో ప్రసవం చేయించాలి.  

  • బిడ్డ పుట్టాక... చిన్నారిని కొద్ది రోజులపాటు పిల్లల డాక్టర్‌ (పీడియాట్రీషన్‌) పర్యవేక్షణలో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండాలి.  

పుట్టిన బిడ్డకు 
గర్భంలో ఉన్న శిశువుకి, తల్లి మాయ (ప్లాసెంటా) నుంచి గ్లూకోజ్‌ ఎక్కువగా అందుతుంటుంది. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి వచ్చే చక్కెర అకస్మాత్తుగా ఆగిపోవడంతో బిడ్డలో చక్కెర మోతాదులు హఠాత్తుగా పడిపోతాయి. ఫలితంగా బిడ్డ కండరాలలో శక్తి అకస్మాత్తుగా తగ్గిపోవడం, చిన్నారి చల్లబడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, ఫిట్స్‌ రావడం, సకాలంలో గమనించకపోతే బిడ్డ మృతిచెందే అవకాశాలెక్కువ. 

కొన్నిసార్లు నెలలు నిండకుండా అయ్యే కాన్పు వల్ల బిడ్డకి ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందక΄ోవడం, దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇలాంటి పిల్లల్లో క్యాల్షియమ్, మెగ్నిషియం వంటివి తక్కువ మోతాదులో ఉండటం వల్ల కండరాలు బలహీనత రావచ్చు 

ఇలాంటి పిల్లలకు కామెర్లు వచ్చే అవకాశాలెక్కువ ∙బిడ్డ గుండె గోడలు అవసరమైనదానికంటే ఎక్కువగా పెరగవచ్చు. (కార్డియోమయోపతి) ∙బిడ్డ పెద్దయ్యాక స్థూలకాయం, టైప్‌–2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలెక్కువ. డయాబెటిస్‌ లేని గర్భవతితో పోలిస్తే... ఈ సమస్య ఉన్న గర్భిణికి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 2–5 శాతం ఎక్కువ.

మరికొన్ని వైద్య పరీక్షలు
గర్భిణికి వ్యాధి నిర్ధారణ జరిగాక, షుగర్‌ మోతాదులను బట్టి వారానికోసారి లేదా రెండు వారాలకొకసారి, తినకుండా ఒకసారి, భోజనం చేశాక, రెండు గంటల తర్వాత మరోసారి రక్తపరీక్ష చేయిస్తూ ఉండాలి. ఇందులో మొదటిది 105 ఎండీడీఎల్‌. కంటే తక్కువగానూ, రెండోది 120 ఎంజీడీఎల్‌ కంటే తక్కువగానూ ఉందేమో చూసుకుంటూ ఉండాలి. అలా ఉండేలా డాక్టర్లు ప్లాన్‌ చేస్తారు. 

మూత్రపరీక్ష : గర్భిణుల్లో సాధారణంగా కిడ్నీ పనితీరులో మార్పు వల్ల మూత్రంలో చక్కెర పోతూ ఉంటుంది. దీన్నిబట్టి డయాబెటిస్‌ ఉందని నిర్ధారణకు రావడం సరికాదు. ఇది చాలా సాధారణం. ఇంకా ఈ పరీక్షలో ఇన్ఫెక్షన్‌ ఏమైనా ఉన్నా, ప్రోటీన్లు ఏమైనాపోతున్నాయేమో తెలుసుకొని, ఆ సమస్యలకు చికిత్స అందించాల్సి రావచ్చు. 

హెచ్‌బీఏ1సీ: ఈ పరీక్ష ద్వారా మూడు నెలల సగటు చక్కెర మోతాదులు తెలుస్తాయి. దీంతో గత మూడు నెలల వ్యవధిలో చక్కెర నియంత్రణలో ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. 

గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారం
గర్భిణుల రక్తంలో చక్కెర మోతాదులు కొద్దిగానే ఎక్కువ ఉంటే, డాక్టర్‌ సూచనలకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకుని షుగర్‌ నియంత్రణలో ఉండేలా   జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలతో చక్కెర మోతాదులు నియంత్రణలోకి రాక΄ోయినా లేదా షుగర్‌ మరీ ఎక్కువగా ఉన్నా... మందులు, లేదా ఇన్సులిన్‌ ద్వారా చికిత్స అందించాలి. 

డయాబెటిస్‌ ఉన్నప్పుడు... గర్భిణుల బరువును బట్టి, వారు చేసే పనిని బట్టి, వారి రక్తంలోని షుగర్‌ మోతాదులను బట్టి ఎన్ని క్యాలరీల ఆహారం, ఎలా తీసుకోవాలనే విషయాలను వారి ఫిజీషియన్‌ లేదా న్యూట్రిషనిస్ట్‌ నిర్ణయిస్తారు. వీరు ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి.చక్కెర మోతాదులు తక్కువగానూ, కొవ్వు తక్కువగానూ, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అంటే అన్నం తక్కువగా తింటూ కూరలు ఎక్కువగా తీసుకోవాలి. 

వీలైనంతవరకు చక్కెర, తేనె, బెల్లం, స్వీట్స్, బేకరీ ఫుడ్, అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడిపండు, పనస, నెయ్యి, డ్రైఫ్రూట్స్, నూనె వస్తువులు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. మిగతా పండ్లను కూడా జ్యూస్‌గా కంటే పండ్ల రూపంలోనే కొరికి తింటుండటం మంచిది. ఒకవేళ జ్యూస్‌ రూపంలో తీసుకున్నా, అందులో చక్కెర కలుపుకోకుండా తాగడం మేలు. 

వ్యాయామాలు : గర్భిణులు అంతగా శ్రమ కలిగించని, నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండటం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. దాంతో చక్కెర కారణంగా కనిపించే  దుష్పరిణామాలు తగ్గుతాయి. 
ఇన్సులిన్‌ ఉపయోగం ఎప్పుడంటే... ఆహార నియమాలు, వ్యాయామాలతో రక్తంలో చక్కెర మోతాదులు నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్‌ ద్వారా చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. 

ఇది ఇంజెక్షన్‌ ద్వారా చర్మం కిందనుండే కొవ్వు పొరల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఇన్సులిన్‌ నేరుగా రక్తంలో కలిసి వృథా అయి΄ోకుండా, మెల్లమెల్లగా రక్తంలో కలుస్తూ, అందులోని చక్కెర మోతాదులను ఓ క్రమపద్ధతిలో నియంత్రిస్తుంది. ఈ ఇన్సులిన్‌ ఎంత మోతాదులో, ఎన్నిసార్లు ఇవ్వాలన్నది  వైద్యనిపుణులు నిర్ధారణ చేస్తారు. 

మెట్‌ఫార్మిన్‌ మాత్రలు : ఇటీవలి కొన్ని పరిశోధనలలో ఇన్సులిన్‌ ఇంజెక్షన్స్‌ బదులు మెట్‌ఫార్మిన్‌ మాత్రలు గర్భిణుల్లో సురక్షితంగా వాడవచ్చని తేలింది.

  • గర్భం దాల్చిన రెండు మూడు నెలల్లో స్కానింగ్‌ చేయించడం వల్ల గర్భంలో ఒకే శిశువు ఉందా, లేదా రెండు ఉన్నాయా, పిండానికి ఎన్ని వారాల వయసు, గుండె స్పందనలు సరిగా ఉన్నాయా వంటి విషయాలు తెలుస్తాయి 

  • ఐదు, ఆరు నెలల మధ్యన టిఫా స్కానింగ్, అవసరముంటే ఫీటల్‌ టూ–డీ ఎకో పరీక్ష చేయించడం వల్ల బిడ్డలో అవయవలోపాలు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది 

  • ఏడో నెల తర్వాత అవసరాన్ని బట్టి నెలనెలా చేయిస్తే, బిడ్డ సైజు మరీ ఎక్కువగా ఉందా, ఉమ్మనీరు మరీ ఎక్కువగా ఉందా... వంటి విషయాలు తెలుస్తాయి 

  • ప్రీ–జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉండేవాళ్లు మధ్యమధ్య కంటి రెటీనా పరీక్ష, కిడ్నీ పనితీరు (క్రియాటినిన్‌) పరీక్ష చేయించుకోవాలి. 

కాన్పు సమయం
కాన్పు ఎప్పుడు, ఎలా చేయాలి అనే అంశాలను... డయాబెటిస్‌ ఎంత నియంత్రణలో ఉంది, తల్లిలో, బిడ్డలో ఏవైనా అనర్థాలు కనిపిస్తున్నాయా లాంటి అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. చక్కెర నియంత్రణలోకి రాకపోయినా, గర్భధారణను కొనసాగించడం వల్ల తల్లికీ, బిడ్డకూ ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే కాన్పు చేయాల్సి రావచ్చు 

సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు, నొప్పుల వల్ల తల్లిలోని షుగర్‌ మోతాదులో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించుకుంటూ, అవసరాన్ని బట్టి ఇన్సులిన్‌ మోతాదును సెలైన్లలో వేసి ఎక్కిస్తూ కాన్పును జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ చేయాల్సి ఉంటుంది. లేకపోతే గర్భంలోని శిశువుకు అపాయం కలిగే అవకాశాలక్కువ. 

సిజేరియన్‌ : సాధారణ కాన్పు ప్రయత్నం విఫలమైనా, కడుపులోని బిడ్డ సైజు 3.5 కేజీల నుంచి 4 కేజీల కంటే ఎక్కువ బరువున్నా, డయాబెటిస్‌ నియంత్రణలో లేకపోయినా, బీపీ బాగా పెరుగుతూ ఉన్నా, మునుపు గర్భధారణలో శిశువు చనిపోయిన సందర్భాలున్నా... తల్లికి సిజేరియన్‌ చేయాల్సి రావచ్చు. 

కాన్పు తర్వాత
పుట్టిన వెంటనే బిడ్డ పరిస్థితిని బట్టి తల్లి పాలను పట్టించాలి. కడుపులో ఉన్నంత కాలం బిడ్డకు చక్కెర ఎక్కువగా అందుతూ, కాన్పు అయిన వెంటనే షుగర్‌ లెవెల్స్‌ అకస్మాత్తుగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అది పరీక్ష చేసి, అవసరమైతే బయటి పాలు లేదా సెలైన్‌ ద్వారా గ్లూకోజ్‌ ఎక్కించాలి 

కాన్పు తర్వాత నాలుగు గంటలకు ఒకసారి చొప్పున 48 గంటల పాటు షుగర్‌ మోతాదులను పరీక్షిస్తూ ఉండాలి. తల్లికి జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉన్నప్పుడు కాన్పు తర్వాత చక్కెర మోతాదులు మామూలు స్థాయికి వస్తాయి. కాబట్టి తల్లికి ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే తల్లికి ప్రీ–జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉంటే కాన్పుకు ముందు తల్లికి ఉన్న స్థాయికి చక్కెరపాళ్లు వస్తాయి. ఈ

అంశాలను బట్టి ఇన్సులిన్‌ను గర్భం రాకముందు ఇస్తున్న మోతాదుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు మధుమేహం (జెస్టీషనల్‌ డయాబెటిస్‌) వచ్చిన మహిళలు... ఆ టైమ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం లేదా బరువు ఎక్కువగా పెరగడం వంటివి జరిగితే... వాళ్లకు 15–20 ఏళ్ల తర్వాత మళ్లీ డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంది. మిగతా మహిళలతో ΄ోలిస్తే వాళ్లలో ఈ ముప్పు ఎక్కువ. 

గర్భం రాకముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... 
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు తమకు గర్భం రాకముందే... అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునే సమయంలోనే తాము వాడే మందుల్ని డాక్టర్‌ సలహా మేరకు మార్చుకోవాల్సి ఉంటుంది. ముందునుంచే తమ రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాల పరిస్థితి ఎలా ఉందో వైద్యపరీక్షల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఉండాల్సిన దానికంటే తాము ఎక్కువ బరువు ఉంటే... తమ ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

వీలైతే బరువు తగ్గాకే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించడం మంచిది. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న తర్వాత గర్భధారణకు మూడు నెలల ముందునుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వాడటం వల్ల బిడ్డలో స్పైనా బైఫిడా  వంటి వెన్నెముక సరిగా పెరగక΄ోవడం లాంటి చాలా రకాల వైకల్యాలను నివారించవచ్చు. 
డాక్టర్‌ శ్రీనిత్య పున్నంరాజు సీనియర్‌ కన్సల్టెంట్‌ ఆబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌ 

(చదవండి: Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement