నేడు వరల్డ్ డయాబెటిస్ డే.. ప్రపంచవ్యాప్తంగా గడిచిన 40 ఏళ్లలో షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగిందంటే అదెంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో డయాబెటిస్ బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి ఐదు స్థానాల్లో వరసగా కేరళ – 7.5% (మన జాతీయ సగటు కూడా 7.5%), తమిళనాడు –6.6%, ఆంధ్రప్రదేశ్ – 6.6%, తెలంగాణ – 4.8%, కర్ణాటక – 4.6% డయాబెటిస్ బాధితులు ఉన్నారు.
రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా పెరగనుందనే నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ‘ప్రపంచ డయాబెటిస్ డే’ సందర్భంగా డయాబెటిస్ కట్టడి గురించి మరోమారు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది థీమ్... ‘‘డయాబెటిక్ బాధితుల ఆరోగ్య రక్షణ బాటలో... ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? (యాక్సెస్ టు డయాబెటిస్ కేర్... ఇఫ్ నాట్ నౌ, వెన్?)’’. ఈ దృక్కోణంతో డయాబెటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం.
మధుమేహం (డయాబెటిస్)లో ఎన్నో రకాలు. మనకు ప్రధానంగా చెప్పుకునేవి మూడే. టైప్–1, టైప్–2, గర్భవతుల్లో వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్. ఇవిగాక... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (లాడా), మెచ్యురిటీ ఆన్‌సెట్ ఆఫ్ ద యంగ్ (మోడీ), నియోనేటల్ డయాబెటిస్, వోల్‌ఫ్రామ్ సిండ్రోమ్, ఆల్‌స్ట్రామ్ సిండ్రోమ్, టైప్–3 డయాబెటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ డయాబెటిస్ అంటూ అనేక రకాలు ఉన్నాయి. అన్నిట్లోనూ ప్రధానంగా బాధించేది టైప్–2 డయాబెటిస్ కాబట్టి దాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.
డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలివే...
►తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం
►మూత్ర విసర్జన సమయంలో మూత్రం ఎప్పటిలా పూర్తిగా పారదర్శకంగా కాకుండా మబ్బుగా (క్లౌడీ)గా ఉండటంతో పాటు, ఒక రకమైన పండ్ల వాసనలాంటిది రావడం.
►కంటి చూపు మందగించడం/మసకచూపు.
►ఆకస్మికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం.
►నీరసం ∙ఎక్కువగా ఆకలి వేయడం, విపరీతమైన దాహం, నోరూ, గొంతూ ఎండిపోతున్నట్లుగా అనిపించడం.
►చేతులూ– కాళ్లలో స్పర్శ తెలియకపోవడం.
►చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి డయాబెటిస్ వచ్చే ముందర కనిపిస్తాయి.
అలాగే మహిళల్లో... ∙చర్మం పొడిబారడం, దురదలు తరచూ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు. ఇవేగాక... కొందరిలో చర్మ వ్యాధులు, కాస్తంత వినికిడి లోపం, డిప్రెషన్, మానసిక అశాంతి, తరచూ మూడ్స్ మారిపోతూ ఉండటం, దంత సమస్యలు, నుదురు, మెడ, చంకలు, గజ్జలు లాంటి ప్రాంతాల్లో చర్మం రంగు మారి దళసరికావడం. వయసు 35 – 40కి పైబడినవారిలో పై లక్షణాలు కనిపిస్తుంటే వాటిని డయాబెటిస్ హెచ్చరికలుగా భావించి, డాక్టర్‌ను సంప్రదించాలి.
అసలు డయాబెటిస్ అంటే...
నిజానికి రక్తంలో చక్కెర మోతాదులు పెరగడమే ‘డయాబెటిస్’ అని చాలామంది అనుకుంటారు. నిజానికి అదో చిహ్నం మాత్రమే. డయాబెటిస్ రావడానికి ముందు దేహంలో చాలా మార్పులు జరుగుతాయి. వాటన్నింటినీ కలుపుకుని డయాబెటిస్ అనవచ్చు. మనకు అర్థమయ్యే తేలిక భాషలో డయాబెటిస్ గురించి చెప్పుకుందాం.
►మనం చేసే పనులకు శక్తి కావాలి. ఆ శక్తినిచ్చేదే గ్లూకోజ్.
►మనం తిన్న ఆహారం గ్లూకోజ్‌గా మారుతుంది. అప్పుడది ఇన్పులిన్ సహాయంతో గ్లైకోజెన్‌గా మారి కాలేయంలో, కండరాలలో నిల్వ ఉంటుంది. మనకు మళ్లీ శక్తి అవసరమైనప్పుడు గ్లూకగాన్ అనే హార్మోన్ స్రవించి, ఆ గ్లూకోజ్/చక్కెరను బయటకు తెస్తుంది.
►అలా రాగానే... దాన్ని కండరాల్లోని కణాలకు అందేలా చేయడంతో పాటు, పని పూర్తయ్యాక రక్తంలో మిగిలిపోయిన చక్కెరను మళ్లీ కాలేయంలో నిల్వ ఉంచేలా చేసేందుకు ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ అవసరమవుతుంది.
►ఈ ఇన్సులిన్‌ను ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది.
►డయాబెటిస్ అంటే అందరూ రక్తంలో చక్కెర మిగిలిపోవడం అనో లేదా ఇన్సులిన్ ఉత్పత్తికాకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిపోక రక్తంలో చక్కెర వృథా అయిపోవడం, అది మరింతగా పెరిగినప్పుడు మూత్రంలో వెళ్లడం అనుకుంటారు. కానీ నిజానికి ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ... శక్తి వనరు అయిన గ్లూకోజ్‌ను కండరాలకు సరిగా అందించలేదు. దీన్నే ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ అంటారు.
నిజానికి రక్తంలో మిగిలిపోయిన చక్కెరతో మొదట్లో పెద్దగా హాని జరగదు. కాకపోతే రక్తం సహజంగా చిక్కగా ఉంటుంది. దానికి తోడు దానిలో కలిసే చక్కెరతో అది మరింత చిక్కబడి, ఉండలు (క్లాట్స్) ఏర్పడటం, ఆ చిక్కబారిన రక్తాన్ని పంప్ చేయడం కోసం మరింత ఎక్కువ ఒత్తిడి అవసరమై హైబీపీ రావడం వంటి పరిణామాలు జరుగుతాయి. దానివల్ల దేహానికి హాని చేకూరుతుంది. ఈ క్రమంలో డయాబెటిస్ దేహంలోని అన్ని అవయవాలపై తన దుష్ప్రభావం చూపుతుంది. ఇవీ డయాబెటిస్ దుష్ప్రభావంతో జరిగే వాటిల్లో కొన్ని మాత్రమే.
అందుబాటులోకి రానున్న కొత్త చికిత్సలు
►ఇప్పటివరకూ డయాబెటిస్ బాధితులకు మెట్‌ఫార్మిన్, సల్ఫోనైల్ యూరియా, ఆల్ఫా అకార్బో ఇన్హిబిటర్స్, డీపీపీ4–గ్లిపిన్స్, జీఎల్‌పీ–1 అనలాగ్‌లతో పాటు ఇన్సులిన్ వంటివీ...వాటినీ వ్యాధి తీవ్రతను బట్టి వాటిని రెండు, మూడు, నాలుగు మాత్రల మోతాదుల్లో ఇస్తుంటారు. ఇటీవల తెలియవచ్చిన కొన్ని అత్యాధునికమైన అంశాల ఆధారంగా రోగి నుంచి రోగికి చికిత్సలు మార్చుతూ వేర్వేరు రకాల వైద్యాలు అందిస్తున్నారు.
కారణాలను బట్టి వ్యక్తిగతమైన చికిత్స
బాధితుల్లో డయాబెటిస్‌కు కారణమైన అంశం... అది ఒత్తిడి కావచ్చు లేదా అధికమోతాదుల్లో తినడం, వ్యాయామం లేకపోవడం లేదా మరో అంశం కావచ్చు. వాటి ఆధారంగా కొన్ని ‘ఇన్‌ఫ్లమేటరీ టెండెన్సీస్’ రావడాన్ని గమనించి, డాక్టర్లు... ఆ ‘ఇన్‌ఫ్లమేటరీ గుణాలు’ తగ్గేలా మందులు ఇవ్వనున్నారు.
►ఎన్‌క్యాప్సులేటెడ్ బీటా సెల్ రీప్లేస్‌మెంట్ థెరపీ: ఇది టైప్–1 డయాబెటిస్‌కు అందుబాటులోకి రానున్న చికిత్స. ప్యాంక్రియాస్‌లో రెండు రకాల కణాలుంటాయి. మొదటివి ఆల్ఫా సెల్స్. ఇవి గ్లూకగాన్‌ను ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. రెండో రకం కణాలు బీటా సెల్స్. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేవి. ఈ చికిత్సలో ఇతర రోగుల నుంచి బీటా సెల్స్‌ను సేకరించి, వాటిని రోగి ప్యాంక్రియాస్ వద్ద ప్రవేశపెడతారు.
అవి క్రమంగా క్రియాశీలమవుతాయి. అవి... పేషెంట్ రక్తంలో ఎంత మోతాదులో చక్కెర విడుదల అవుతుందో గమనించి, దాన్ని నియంత్రించడానికి సరిగ్గా ఎంత కావాలో అంతే ఇన్సులిన్ విడుదల అయ్యేలా చేస్తాయి. దాదాపుగా ఇదే రకమైన చికిత్సనే మరో పద్ధతిలో టైప్–2 డయాబెటిస్ రోగులకూ అందుబాటులోకి త్వరలో రానుంది. ఈ ప్రక్రియలో.. చురుగ్గా ఉన్న బీటా సెల్స్‌ను బయటకు తీసి, వాటిని కృత్రిమ కణవిభజన ప్రక్రియ ద్వారా పెరిగేలా చేసి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు.
►నానో పార్టిక్యూలేట్ ఆధారిత చికిత్స : ఇది మరీ మరీ సరికొత్తది. ఇందులో మందు మోతాదు చాలా తక్కువ పాళ్లలో కణాల్లోకి ప్రవేశించడమే గాక, అదక్కడ చాలాకాలం ఉండి, కణం తాను వినియోగించుకోవాల్సిన చక్కెరను సమర్థంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇలాంటి సరికొత్త చికిత్సలు బాధితుల పాలిట ఆశారేఖగా కనిపిస్తున్నాయి.
డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
సీనియర్ ఫిజీషియన్
అండ్ డయాబెటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment