
ప్రభుత్వాస్పత్రుల్లో మధుమేహుల దీనావస్థ
నెలకు లక్ష వరకు వెయిల్స్ అవసరం.. సరఫరాలో సర్కారు విఫలం
గత ప్రభుత్వంలో రోగులకు ఇంటి దగ్గర వేసుకోవడానికి వీలుగా వెయిల్స్ అందజేత
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం కకావికలం చేసింది. కనీసం బీపీ, షుగర్ రోగులకు సాంత్వన చేకూర్చలేని దీనావస్థలోకి ప్రభుత్వాస్పత్రులను నెట్టేసింది. బోధనాస్పత్రుల్లో వందకు పైగా రకాల మందులు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. నాలుగైదు నెలలుగా ఆస్పత్రుల్లో మధుమేహ బాధితులను ఇన్సులిన్ కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వంలో రోగులు ఇంటివద్దే ఇన్సులిన్ తీసుకోవడానికి వీలుగా ఆస్పత్రుల్లో వెయిల్స్ ఇచ్చేవారు.
ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరిన వారికి కూడా ఇన్సులిన్ వెయిల్స్ అందుబాటులో ఉండటం లేదు. బయట కొని తెచ్చుకోండని స్లిప్‌లు రాసిస్తున్న అధ్వాన్న పరిస్థితులు దాపురించాయని బాధితులు మండిపడుతున్నారు. టైప్–1 షుగర్ బాధితులతో పాటు, టైప్–2 బాధితుల్లో సమస్య తీవ్రంగా ఉన్న వారికి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తుంటారు.
ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో హ్యూమన్ యాక్టాపిడ్, హ్యూమన్ మిక్స్‌టార్డ్ 70/30 ఇన్సులిన్ కొరత ఉంటోంది. ముఖ్యంగా హ్యూమన్ మిక్స్‌టార్డ్ రకం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచే సరఫరా చేయడం లేదని తెలుస్తోంది.
పేద రోగులపై ఆర్థిక భారం
ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు లక్ష వరకూ హ్యూమన్ మిక్స్‌టార్డ్ ఇన్సులిన్ వెయిల్స్ అవసరం అవుతాయని అంచనా. కొద్ది నెలలుగా ఆస్పత్రులకు ఈ రకం ఇన్సులిన్ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల ఆస్పత్రులు పెట్టిన ఇండెంట్‌లో నామమాత్రంగానే సరఫరా అవుతోంది. దీంతో కొన్ని బోధనాస్పత్రులు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ఇన్‌పేòÙంట్ల కోసం స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు.
ఇక కొన్నిచోట్ల అవుట్ పేషెంట్లకు ఇన్సులిన్ వెయిల్స్ ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపిశారు. షుగర్ మోతాదు 300, 400పైగా ఉండే రోగులకు నెలకు 3 నుంచి 5 వెయిల్స్ అవసరం అవుతుండగా కర్నూలు జీజీహెచ్‌లో నెలకు ఒక వెయిల్ మాత్రమే ఇస్తున్నారు. ఆ వెయిల్ అయిపోయాక నెలలో రెండోసారి వెళితే ఇవ్వడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కాకినాడ జీజీహెచ్‌లలో ఓపీలో రోగుల నెలవారీ అవసరాలకు అనుగుణంగా వెయిల్స్ ఇవ్వడం లేదు. పీహెచ్‌సీలకు రెండో క్వార్టర్‌లో పెట్టిన ఇండెంట్ మేరకే ఇన్సులిన్ సరఫరా లేదని మెడికల్ ఆఫీసర్‌లు, ఫార్మాసిస్ట్‌లు చెబుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇదిగో అదిగో అనే సమాధానాలే ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఇన్సులిన్ లేక మెటార్ఫిన్, జిమ్ ఫ్రైడ్ వంటి మాత్రలు ఇస్తుంటే.. షుగర్ లెవెల్స్ తగ్గడం లేదని రోగులు తమపై గొడవకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్‌లో వెయిల్ ధర రూ.170కు పైగా ఉంటోంది. 300 నుంచి 350 మధ్య షుగర్ మోతాదు ఉండే బాధితులకు నెలకు నాలుగు వెయిల్స్ నిమిత్తం రూ.700 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల వారికి ఇంత సొమ్ము వెచ్చిoచడం తలకు మించిన భారంగా మారుతోంది. చాలామంది ఇన్సులిన్ కొనుగోలు చేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
స్టాక్ లేదంటున్నారు
కొన్నేళ్లుగా షుగర్ సమస్యతో బాధపడుతున్నాను. నాకు నెలకు నాలుగు వెయిల్స్ వరకూ అవసరం అవుతాయి. గతంలో పెద్దాస్పత్రిలో నెలకు సరిపడా వెయిల్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఒక వెయిల్ మాత్రమే ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అది కూడా లేదంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆస్పత్రిలో స్టాక్ లేదని చెబుతున్నారు. నెలనెలా ఇన్సులిన్ కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. – వెంకటేశ్వర్లు, మధుమేహ బాధితుడు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment