healthy baby
-
తల్లి కాబోతున్నారా? జాంపండు లాంటి బేబీ కోసం బెస్ట్ అండ్ హెల్దీ జ్యూసెస్
గర్భిణీ స్త్రీలు స్వయంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, పిండం పెరుగుదల, అభివృద్ధికి మంచి పోషకాహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో అధిక ప్రోటీన్ ఆహారాలతో పాటు తొందరగా శక్తిని, పోషకాలను అందించే జ్యూస్‌లను సేవించాలి. దీంతోపాటు గర్భిణీ స్త్రీలు గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏమిటంటే..చక్కెర వాడకాన్ని తగ్గించాలి. కృత్రిమ స్వీట్నర్లు ,ప్రిజర్వేటివ్‌లు లేని సహజ పండ్ల రసాలను మాత్రమే తాగాలి. ప్రెగ్నెంట్ లేడీస్ మెచ్చే జ్యూస్‌లు కొన్ని చూద్దాం.. బనానా జ్యూస్ అరటిపండులో శరీరానికి కావల్సిన పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B6 కూడా ఉంటుంది, అరటి పండులో కొద్దిగా తాగా మీగడ వేసుకుని జ్యూస్, కొద్దిగా తేనె లేదా బెల్లం పొడి కలుపుకుని తాగి కడుపు నిండినట్టూ ఉంటుంది. ప్రారంభ నెలల్లో ఈ జ్యూస్ శక్తిని, బలాన్నిస్తుంది. వాంతులు, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్లు ,మినరల్స్ అధికంగా ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైన ఫోలిక్ యాసిడ్ కంటెంట్ కూడా నారింజలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పిండంలోని లోపాలను నివారించడానికి , మెదడు , వెన్నెముకలో అసాధారణతలను నివారించడానికి సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ 1వ, 2వ , 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలకు క్యారెట్ రసం ఉత్తమమైన రసం. క్యారెట్లో విటమిన్ ఎ, ఐరన్, బి విటమిన్లు, పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఎ కంటెంట్ కడుపులోని పిండం ఎముకలు ,దంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలు క్యారెట్ రసాన్ని తగినంత పరిమాణంలోనే తీసుకోవాలి. రోజుకు 1 గ్లాసు చాలా ఎక్కువ విటమిన్ ఎ ఆరోగ్యానికి తగినది కాదు ఎందుకంటే ఇది విషపూరిత ప్రభావాలను కలిగిస్తుంది. ఆపిల్ జ్యూస్ ఆపిల్‌లో ఫైబర్‌తోపాటు విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించే ఫ్లేవనాయిడ్సీ , ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఐరన్ హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది , రక్తహీనతను నివారిస్తుంది.రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవోకాడో జ్యూస్ అవకాడోస్లోని ఐరన్, ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం , పొటాషియం వంటి అనేక పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవకాడోలోని కోలిన్ శిశువు మెదడు, నరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అవకాడోలో అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి, ఇవి గర్భధారణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మిక్స్డ్ జ్యూస్ సన్నగా తరిగిన అరకప్పు లేత పాలకూర, నాలుగు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు ఆవకాడో, అరకప్పు నీళ్లు తీసుకుని జ్యూసర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌ను వడగట్టకుండా అలాగే తాగాలి. గర్భిణులకు ఈ స్మూతీ అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. గర్భిణీ స్త్రీకి అధిక పోషకాహారం ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, పానీయాలను కూడా తీసుకోవాలి. అందులోనూ వేసవి కదా మరికొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్యూస్‌లు అందరికీ ఒకేలా పనిచేయవు. ఏదైనా ఎలర్జీలాంటివి ఉంటే ఈ జ్యుసెస్ను సేవించటేపుడు అప్రమత్తంగా ఉండాలి. సమతుల ఆహారం,చిన్నపాటి వ్యాయామం, ఎవరి టేస్ట్‌కు తగినట్టు, ఆయా జ్యూస్‌లను తాగుతూ, ఒత్తిడికి దూరంగా ఉంటూ, ప్రసూతి వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉంటే పండంటి బిడ్డ మీసొంతం. -
పండంటి పాపాయికి జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని భార్య
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (57) మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య క్యారీ సైమండ్స్ గురువారం తెల్లవారు జామున లండన్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సంవత్సరం మేలో వివాహం చేసుకున్న ఈ జంటకు 2020 ఏప్రిల్‌లో విల్ఫ్రెడ్ అనే కుమారుడు జన్మించాడు. విదేశాంగ కార్యదర్శిగా జాన్సన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ గా పనిచేసిన క్యారీ సైమండ్స్ తో 2018 నుండి సహజీవనం చేశారు. 2019లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లోకి మారారు. 2019 చివర్లో నిశ్చితార్థం, ఆ తరువాత ఈ ఏడాది మే 29న వెస్ట్‌మినిస్టర్ కేథడ్రల్‌లో ముప్పై మంది అతిథులతో రహస్య వేడుకలో వివాహం చేసుకున్నారు. 1993లో బ్రిటన్ ప్రధాని జాన్సన్ మొదటి భార్య అలెగ్రా మెస్టిన్ నుంచి విడిపోయిన మెరీనా వీలర్‌తో వివాహం, విడాకులు తెలిసిన సంగతి తెలిసిందే. -
గర్భవతులు బరువు పెరుగుతుంటే?
ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం సాధారణంగా జరిగేదే. గర్భధారణ సమయంలో మహిళలు 8 నుంచి 10 కిలోల బరువు వరకు పెరుగుతారు. అయితే ఎవరెవరు ఏ మేరకు, ఎంతెంత బరువు పెరగడం ఆరోగ్యకరం అన్నది... గర్భం దాల్చక ముందు వారెంత బరువున్నారన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు ఎంత బరువున్నారు, అది ఆరోగ్యకరమైన పరిమితేనా అన్నది... వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) మీద ఆధారపడి ఉంటుంది. బరువును కేజీల్లో తీసుకుని, దాన్ని మీటర్లలో వారి ఎత్తు స్క్వేర్తో భాగిస్తే వచ్చే సంఖ్యను ‘బీఎంఐ’ అంటారు. (కిలోగ్రామ్స్/ మీటర్స్ స్కే్కర్). ఇలా లెక్కవేయగా వచ్చిన ఈ సంఖ్య 18 కంటే తక్కువగా ఉంటే... వారిని తక్కువ బరువువారిగా(అండర్‌వెయిట్‌గా) వర్గీకరించవచ్చు. అలాగే ఈ సంఖ్య 18.5 నుంచి 24.9 వరకు ఉంటే వారిని సాధారణ బరువు ఉన్నవారిగా చెప్పవచ్చు. అదే 25 నుంచి 29.9 వరకు ఉంటే వారిని ఎక్కువ బరువు ఉన్నవారిగానూ (ఓవర్ వెయిట్), 30 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయులుగానూ (ఓబేస్గా) చెప్పవచ్చు. వీరిలో బరువు తక్కువగా ఉన్నవారు ప్రెగ్నెన్సీ టైమ్‌లో 15 కిలోల వరకు పెరిగినా పర్లేదు. కానీ స్థూలకాయులు మాత్రం తమ బరువు పెరుగుదలను 5 నుంచి 9 కిలలో లోపే పరిమితం చేసుకోవడం మంచిది. సగటున చూస్తే గర్భంతో ఉన్నప్పుడు మహిళలు సాధారణంగా వారానికి 200 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు. ఇక వేవిళ్లతో బాధపడుతూ తరచూ వాంతులు చేసుకునేవారు 20 వారాలలోపు ఒక్కోసారి అసలు బరువే పెరగకపోవచ్చు.ఇలా బరువు పెరగకపోవడం కూడా వారి సాధారణ ఆరోగ్యానికి లేదా ఆరోగ్యకరమైన గర్భధారణకూ (హెల్దీ ప్రెగ్నెన్సీకి) అవరోధమేమీ కాదు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అంటే సాధారణ ఆహారంతో పాటు పాలు, గుడ్లు, పండ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవడం మంచిది. మాంసాహారం తినేవారైతే చికెన్, చేపలు తినవచ్చు. శాకాహారులు తమ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గర్భవతులు ఇద్దరికోసం తినాలంటూ చాలామంది వారిని ఒత్తిడి చేస్తుంటారు. నిజానికి కడుపులోని బిడ్డ తన ఆహారాన్ని తల్లినుంచి ఎలాగైనా గ్రహిస్తుంటాడు. కాబట్టి సాధారణ బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు మామూలుగానే తింటే సరిపోతుంది. అంటే బరువు తక్కువగా ఉన్నవారు మినహా మిగతా వారంతా ఇద్దరి కోసం తినడం అన్నది సరికాదని గ్రహించాలి. ఇది బరువును పెంచి, ముప్పునూ పెంచుతుంది. -
ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా?
ఇప్పుడంతా ప్రణాళికాబద్ధంగా జరిగే కాలం. యువతీ యువకులకు తమ కెరియర్ ప్లానింగ్‌లో టైమే తెలియడం లేదు. దాంతో వారికి అనువైన సమయంలో ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే... అప్పుడు మనోరథం నెరవేరకపోతే సమస్యే కదా. అలాంటి సమస్యలేమీ రాకుండా... తాము కోరుకున్నట్లే పాపనో, బాబునో పొందడం కోసం దంపతులకు కొన్ని తేలికపాటి జాగ్రత్తలివే! ►కాబోయే తల్లి దండ్రులిద్దరూ ప్లానింగ్ చేసుకున్ననాటి నుంచి మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవాలి. అదీ వేళకు తింటూ ఉండాలి. అన్ని రకాల పోషకాలు అందేలా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ►డాక్టర్‌ను సంప్రదించి ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండండి. ఇవి తీసుకోవడం వల్ల బిడ్డల్లో పుట్టుకతో వచ్చే అనేక లోపాలను నివారించవచ్చు. ►నిత్యం ఆహ్లాదకరమైన, సంతోషభరితమైన వాతావరణంలో ఉండండి. ఆహ్లాకరమైన సంగీతం వింటూ, టీవీ చూస్తున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రాములే చూస్తూ ఉండండి. ఎప్పుడూ సానుకూల దృక్పథం (పాజిటివ్ యాటిట్యూడ్)తో ఉండండి. ►ఒత్తిడి ఎక్కువగా ఉండే వృత్తుల్లో ఉండేవారు వీలైతే కొద్ది రోజులు దాని నుంచి దూరంగా ఉండండి. ఇందుకోసం వీలైతే మళ్లీ మరో హనీమూన్‌కు వెళ్లిరండి. ►యువతుల్లో పీరియడ్స్ వచ్చిన 11వ రోజు నుంచి 18వ రోజు వరకు రోజూ సెక్స్‌లో పాల్గొనండి. ఈమధ్య రోజుల్లోనే అండం విడుదల (ఓవ్యులేషన్) జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో జరిగే కలయిక వల్లనే గర్భధారణ జరుగుతుంది. ►ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందుగా వీలైతే – మహిళలైతే పీసీఓ వంటి సమస్యలు ఉన్నాయేమోనని, పురుషులైతే స్పెర్మ్ కౌంట్ వంటి పరీక్షలు చేయించుకోవడం చాలా మేలు చేసే అంశం. అలాంటప్పుడు సమయం వృథాపోకుండా కొన్ని అవసరమైన చికిత్సలు అంది, మీ ప్లానింగ్ విజయవంతమవుతుంది. చేయకూడనివి... ►ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర, మసాలాలు, నూనెలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ►ఈ టైమ్‌లో పురుషులు లాప్‌టాప్‌ను తమ ఒడిలో పెట్టుకుని పనిచేయడం లేదా తమ మొబైల్‌ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఉంచుకోవడం... ఈ రెండుపనులూ చేయకూడదు. (ఇవి శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తాయనే అంశం ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఆ విషయంలో ఆందోళన వద్దు. అయితే స్పెర్మ్ నాణ్యత బాగుండటం కోసం ప్రకృతి కొన్ని మంచి ఏర్పాట్లు చేసింది. మనంతట మనమే అక్కడ ఉష్ణోగ్రత పెరిగేందుకు ఆస్కారం ఇస్తే ఎలా? అందుకే ల్యాప్‌టాప్‌తో పనిచేయడం వల్ల వాటి ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం లేదా అవి మందకొడిగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టే ఈ జాగ్రత్త). ►దంపతులిద్దరూ గర్భధారణ సక్రమంగా జరగడానికి కృషి చేయాలి. కడుపు పండటానికి అంటూ కొందరు... పల్లెటూళ్లలో ఇచ్చే నాటుమందులనూ, హెర్బల్ మందులను సిఫార్సు చేస్తుంటారు. మీ డాక్టర్ సలహా లేకుండా అలాంటివేమీ వాడకండి. అవి మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీయవచ్చు. ►సోయా ఉత్పాదనలు, టోఫూ వంటి వాటిని ఎక్కువపాళ్లలో తీసుకోవద్దు. ►ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత దంపతులు మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటి పానీయాలను కూడా చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. ►ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలోనే గర్భధారణ జరగకపోతే అంతలోనే నిరాశ వద్దు. కనీసం ఏడాదిపాటైనా ప్రయత్నించాక... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించాలి. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? పార్కిన్సన్స్ కౌన్సెలింగ్స్ మా తాతగారి వయసు 68 ఏళ్లు. ఈమధ్య చాలా బలహీనంగా తయారయ్యారు. చేతులు, కాళ్లు, తల చాలా ఎక్కువగా వణుకుతున్నాయి. మాట్లాడే విధానం కూడా మారింది. ఇదివరలో ఎన్నడూలేనంత గంభీరంగా తయారయ్యారు. ఎంతో ఇష్టంగా తినే వంటలు కూడా ఏమాత్రం ఇష్టం లేదంటున్నారు. ఏం పెట్టినా రుచిలేని తిండి పెడుతున్నారంటూ లేచి వెళ్లిపోతున్నారు. మాకు దగ్గర్లోని పెద్దాసుపత్రిలో చూపిస్తే పార్కిన్సన్స్ వ్యాధి వస్తున్నట్లు కనిపిస్తోందని స్పెషలిస్టు డాక్టర్‌కు చూపించమని చెప్పారు. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – ఎ. సందీప్, కరీంనగర్ పార్కిన్సన్స్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఇది వస్తుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాలకూ... శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనికి తయారుచేసే కణాలు క్షీణించడం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో శరీరభాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా అరవై ఏళ్లకు పైబడ్డవారే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇది వంశపారంపర్యంగా వస్తూ, చిన్న వయసు వారిలోనూ కనిపిస్తుంటుంది. మన దేశంలో దాదాపు కోటికి పైగా మంది దీనితో బాధపడుతున్నారు. సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఆధునిక సౌకర్యాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా దీన్ని అదుపు చేయడానికి వీలుంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్స ఇటీవల సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్తులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపు చేసుకొని, సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్యపరమైన ఔషధాలు, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్సన్స్ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శరీరక పరిమితులు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతో పాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ఠప్రయోజనం పొందేందుకు ఇప్పుడున్న ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. చికిత్స : ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపు చేసి, వ్యాధిగ్రస్తులు సాధారణ జీవితాలు గడిపే లక్ష్యంగా ఈ చికిత్స జరుగుతుంటుంది. ఇందుకుగాను వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి, శరీరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియోథెరపీ, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట కనిపెట్టిన ‘ఎల్ డోపా’ అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తిమంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మోతాదులో ఏవైనా లోటుపాట్లు జరిగితే మొత్తంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సహాయపడుతూ డోపమైన ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దాంతో అవయవాలు బిగుసుకుపోవడం, వణుకుడు తగ్గుతుంది. డీబీఎస్ శస్త్రచికిత్స అంటే? మా మామగారికి 60 ఏళ్లు. చేతి వేళ్లలో వణుకు మొదలైంది. ఆపైన చేయి, కాలు వణుకుతుంటాయి. ఏ పనీ చేయకుండా ఉన్న సమయంలో కూడా చేతివేళ్లు, చెయ్యి, కాళ్లు, సెకనుకు నాలుగైదుసార్లు వణుకుతుంటాయి. అదేవిధంగా చూపుడువేలు, బొటనవేలు లయబద్దంగా రాపిడికి గురవుతుంటాయి. చేతులు, కాళ్లు వణికే ఈ పరిస్థితిలో నడవడం చాలా ఇబ్బందికరం అవుతోంది. డాక్టర్‌కి చూపిస్తే ఇవి పార్కిన్సన్ లక్షణాలుగా గుర్తించారు. ఈ వ్యాధిని నిరోధించడంలో ‘డీబీఎస్’ శస్త్రచికిత్స బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. డీబీఎస్ సర్జరీ అంటే ఏమిటి? దాంతో ఉపయోగం ఏమిటి? వివరంగా తెలపగలరు. – శ్రావణి, ఏలూరు పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి చేసే చికిత్సల్లో డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) కీలకమైన శస్త్రచికిత్స. పార్కిన్సన్స్ వ్యాధి పెరుగుదలను నిరోధించడంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్స ఎంతగానో తోడ్పడుతున్నట్లు గుర్తించారు. గుండెపనితీరును మెరుగుపరిచేందుకు పేస్‌మేకర్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్‌ను అమరుస్తారు. ఇందుకుగాను ముందుగా ఎమ్మారై, సీటీస్కాన్ ద్వారా వ్యాధిగ్రస్తుల మెదడులో సమస్య ఎక్కడ ఏర్పడిందో గుర్తిస్తారు. ఆ పైన చిన్న ఎలక్ట్రోడ్‌ను అమరుస్తారు. దీనికి ఓ చిన్న బాటరీ–తీగ ఉంటాయి. మెదడులోని కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. అలా డోపమైన్ తయారీని పునరుద్ధరించవచ్చు. పెద్దగా రక్తస్రావం జరగకుండా, ఇంజక్షన్లు అవకాశం లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స వల్ల మెదడు... తన శరీర భాగాలను తన అదుపులోకి తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను తీసివేయలేదు గానీ వాటిని అదుపులో ఉంచగలదు. ఇది సంక్లిష్టమైన, క్రమం తప్పకుండా న్యూరలాజికల్ ఫాలోఅప్ అవసరమైన శస్త్రచికిత్స. అయితే ఔష«ద చికిత్స అందిస్తున్నప్పటికీ, రోగి పరిస్థితి ఆమోదకరం కాని స్థితికి దిగజారినప్పుడు డీబీఎస్ ప్రభావశీలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియమ్, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పూటకు కిలోన్నర మాంసం తిని...
బీజింగ్: అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువజంట పిల్లల కోసం అష్టకష్టాలు పడుతోంది. ఎలాగైనా బరువు తగ్గించుకొని ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలనే కోరికతో.. వెయిట్ లాస్ థెరపీ, మసాజ్‌లు, జిమ్ అంటూ తెగ కుస్తీలు పడుతోంది. సుమారు 220 కేజీలకు పైగా బరువు పెరిగిన ఈ దంపతులు బరువును తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చైనాకు చెందిన లిన్ యూ (29) , డెంగ్ యాంగ్ (27) లకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. అయినా పిల్లలు పుట్టకపోవడంతో వైద్యులను సంప్రదించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పిల్లల మాట దేవుడెరుగు.. ముందు ఆరోగ్యం కుదుటపర్చుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ అప్పటికే అధిక బరువు వల్ల కలిగే సర్వ అనర్థాలు, అనారోగ్యాలు వారిని చుట్టుముట్టాయి. ఫ్యాటీ లివర్, హైపర్ లిపిడిమియా, బీపీ ఇలా అన్ని వ్యాధులు వచ్చేశాయి. బరువు తగ్గితే తప్ప పిల్లలు పుట్టడం సాధ్యం కాదని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో ఒబెసిటీకి ఉచితంగా చికిత్స అందించే చైనాలోని చాంగ్‌చున్ ఆసుపత్రిలో చేరారు. దీంతోపాటు చైనాలో ప్రసిద్ధిచెందిన ఆక్యుపంక్చర్, మసాజ్‌లు సహా, జిమ్‌ల చుట్టూ తిరుగుతూ చెమటోడుస్తున్నారు. ఇప్పటికి కొంత ఫలితం కనబడినా మరింత కష్టపడాలని ఈ దంపతులకు వైద్యం చేస్తున్న డా.షుఝాంగ్ తెలిపారు. పెళ్లికి ముందు నుంచి కొంచెం లావుగా ఉన్నా, పెళ్లి తర్వత దాదాపు రెట్టింపు బరువు పెరిగామని యూ దంపతులు తెలిపారు. పూటకు కిలోన్నర మాంసం తినేవారమని, అందుకే భారీకాయులుగా మారిపోయామన్నారు. ఇద్దరమూ 220 కేజీల బరువుతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీనివల్ల బయటకు గానీ, షాపింగ్‌కు గానీ ఎక్కడికి వెళ్లాలన్నా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని డెంగ్ వాపోయింది. అందుకే ఉద్యోగాన్ని కూడా వదులుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆరోగ్యవంతమైన బిడ్డను కనడమే తమ లక్ష్యమని తెలిపింది. అయితే ముందు పది కిలోలు బరువు చాలా సులభంగానే తగ్గామని, అసలు కష్టమంతా ముందు ఉందని యు తెలిపారు. అయినా ఇద్దరూ పట్టువీడకుండా ప్రయత్నిస్తున్నామని.. ఒక ఏడాది ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు.