పూటకు కిలోన్నర మాంసం తిని...
బీజింగ్: అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువజంట పిల్లల కోసం అష్టకష్టాలు పడుతోంది. ఎలాగైనా బరువు తగ్గించుకొని ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలనే కోరికతో.. వెయిట్ లాస్ థెరపీ, మసాజ్లు, జిమ్ అంటూ తెగ కుస్తీలు పడుతోంది. సుమారు 220 కేజీలకు పైగా బరువు పెరిగిన ఈ దంపతులు బరువును తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
చైనాకు చెందిన లిన్ యూ (29) , డెంగ్ యాంగ్ (27) లకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. అయినా పిల్లలు పుట్టకపోవడంతో వైద్యులను సంప్రదించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పిల్లల మాట దేవుడెరుగు.. ముందు ఆరోగ్యం కుదుటపర్చుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ అప్పటికే అధిక బరువు వల్ల కలిగే సర్వ అనర్థాలు, అనారోగ్యాలు వారిని చుట్టుముట్టాయి. ఫ్యాటీ లివర్, హైపర్ లిపిడిమియా, బీపీ ఇలా అన్ని వ్యాధులు వచ్చేశాయి.
బరువు తగ్గితే తప్ప పిల్లలు పుట్టడం సాధ్యం కాదని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో ఒబెసిటీకి ఉచితంగా చికిత్స అందించే చైనాలోని చాంగ్చున్ ఆసుపత్రిలో చేరారు. దీంతోపాటు చైనాలో ప్రసిద్ధిచెందిన ఆక్యుపంక్చర్, మసాజ్లు సహా, జిమ్‌ల చుట్టూ తిరుగుతూ చెమటోడుస్తున్నారు. ఇప్పటికి కొంత ఫలితం కనబడినా మరింత కష్టపడాలని ఈ దంపతులకు వైద్యం చేస్తున్న డా.షుఝాంగ్ తెలిపారు.
పెళ్లికి ముందు నుంచి కొంచెం లావుగా ఉన్నా, పెళ్లి తర్వత దాదాపు రెట్టింపు బరువు పెరిగామని యూ దంపతులు తెలిపారు. పూటకు కిలోన్నర మాంసం తినేవారమని, అందుకే భారీకాయులుగా మారిపోయామన్నారు. ఇద్దరమూ 220 కేజీల బరువుతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీనివల్ల బయటకు గానీ, షాపింగ్‌కు గానీ ఎక్కడికి వెళ్లాలన్నా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని డెంగ్ వాపోయింది. అందుకే ఉద్యోగాన్ని కూడా వదులుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆరోగ్యవంతమైన బిడ్డను కనడమే తమ లక్ష్యమని తెలిపింది.
అయితే ముందు పది కిలోలు బరువు చాలా సులభంగానే తగ్గామని, అసలు కష్టమంతా ముందు ఉందని యు తెలిపారు. అయినా ఇద్దరూ పట్టువీడకుండా ప్రయత్నిస్తున్నామని.. ఒక ఏడాది ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు.