Obese
-
వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి?
లండన్: బ్రిటన్ ప్రజలు ఇప్పుడు ఎలుకల పేరు చెబితేనే వణికిపోతున్నారు. వీధుల్లో చెత్తకుండీల వద్ద కుప్పలుకుప్పలుగా కన్పిస్తున్న మూషికాలను చూసి హడలిపోతున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 20-30 కోట్ల ఎలుకలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పొరపాటున బ్రిటన్ను చుట్టుముట్టి ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు మారుతున్న కొద్ది బ్రిటన్ ప్రజలు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఫాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫుడ్‌ను ఇష్టపడుతుత్నారు. బేకరీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో కస్టమర్లు తినివదిలేసిన ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. వీటిని ఆరగించేందుకు ఎలుకలు డస్ట్బిన్ల వద్ద కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అటువైపు వెళ్లే వాళ్లు జడుసుకుంటున్నారు. (చదవండి: కొత్త జంటపై విధి చిన్న చూపు.. పెళ్లై గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం) కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాలు తిని బ్రిటన్‌లో ఎలుకలు ఫ్యాటీగా తయారవుతున్నాయి. కొవ్వు పదార్థాలు అధికమై ఊబకాయం బారినపడుతున్నాయి. దీంతో వాటి పరిమాణం చిన్నసైజు కుక్క స్థాయికి పెరిగిపోతుంది. వీటిని చూస్తేనే హడలిపోయేలా కన్పిస్తున్నాయి. ఊబకాయంతో విషం తట్టుకునే శక్తి.. ఎలుకలు ఫ్యాటీగా తయారు కావడంతో వాటిని చంపేందుకు మందుపెట్టి విషప్రయోగం చేసినా అవి తట్టుకుంటున్నాయి. బ్రిటన్‌లో మూషికాలను చంపేందుకు 1950 నుంచి ఉపయోగిస్తున్న పెస్ట్ కంట్రోల్‌ను ప్రయోగించినా అవి చావడం లేదని పారిశుద్ధ్య నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 78 శాతం ఎలుకలు విషాన్ని సైతం తుట్టుకునే నిరోధక శక్తి కలిగి ఉన్నాయని వాపోతున్నారు. అయితే ఎలుకల సంఖ్య గణనీయంగా పెరగడానికి పారిశుద్ధ్య ప్రమాణాలు, పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడమూ ఓ కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. వాటిని ఎప్పుడో నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. లండన్ గ్రీన్విచ్ యూనివర్శిటీలోని నేచురల్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్లో ఎకాలజీ ప్రొఫెసర్ స్టీవ్ బెల్మైన్ ఎలుకల సంఖ్య గురించి మాట్లాడుతూ.. 'ఇక్కడ కనీసం 200 నుంచి 300 మిలియన్ల(సుమారు 30 కోట్లు) ఎలుకలు ఉన్నాయని నేను ఊహించగలను' అని అన్నారు. వ్యాధి ప్రాబల్యాన్ని పరీక్షించడానికి నార్ఫోక్, ఎసెక్స్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకలను బోణుల ద్వారా ట్రాప్ చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్‌లో 2018లో బోర్న్మౌత్ పెస్ట్ హంటర్ పట్టుకున్న ఓ ఎలుక 21 అంగుళాల పొడవు ఉంది. అంటే ఇది చిన్న కుక్క సైజులో ఉంటుందన్నమాట. బ్రిటన్‌లో అప్పటివరకు పట్టుకున్న ఎలుకల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఎలుకల పరిమాణం ఇంకా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా.. 2021 లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు. చదవండి: ప్రాణులకు ప్లాస్టికోసిస్ ముప్పు -
మీ BMI సరిచూసుకోండి.. తేడా వస్తే ఇబ్బందులే!
న్యూఢిల్లీ: కోవిడ్ బారినపడిన ఊబకాయులకు రిస్క్ ఎక్కువని ఓ అధ్యయనం తేల్చింది. కోవిడ్–19 సోకిన ఊబకాయులు ఐసీయూల్లో చేరాల్సి రావడం వంటివి ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కోవిడ్ రిస్క్‌కు, శరీర బరువు(బాడీ మాస్ ఇండెక్స్, బీఎంఐ)తో సంబంధమున్నట్లు మొట్టమొదటిసారిగా చేపట్టిన తమ విస్తృత అధ్యయనంలో రుజవైందని యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఒక వ్యక్తి బరువు(కిలోగ్రాములు), అతని ఎత్తు(మీటర్లు)ను భాగించడం ద్వారా శరీరంలోని కొవ్వును బీఎంఐ ద్వారా లెక్కిస్తారు. ఇంగ్లండ్‌లోని 69 లక్షల మంది ప్రజలతోపాటు కోవిడ్‌తో ఆస్పత్రి పాలైన 20 వేల మంది బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని పరిశోధకులు తెలిపారు. బీఎంఐ 23 కేజీ/ఎం2(కిలోగ్రాములు పర్ స్క్వేర్ మీటర్) ఉంటే దానిని ఆరోగ్యకరమైన స్థాయిగా భావిస్తారు. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువున్నా కోవిడ్‌తో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే చాన్స్ 10 శాతం పెరుగుతుందని తెలిపారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్న వారికీ కోవిడ్–19తో రిస్క్ ఎక్కువేనని వారు వివరించారు. ఇలాంటి రిస్క్ 20–39 ఏళ్ల మధ్య వారిలో అత్యధికం కాగా, 60 ఏళ్ల వారి నుంచి తగ్గుతుందని వెల్లడించారు. 19 ఏళ్లలోపు వారితోపాటు 80 ఏళ్లపైబడిన కోవిడ్ బాధితుల్లో బీఎంఐ చూపే ప్రభావం తక్కువని తెలిపారు. మొత్తమ్మీద చూస్తే 20–39 ఏళ్ల వారిలో మిగతా వయస్సు గ్రూపుల వారితో పోలిస్తే కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని వెల్లడించారు. -
కరోనాను జయించిన ఊబకాయ మహిళ
ముంబాయి: ప్రపంచంలో ప్రస్తుతం అందరిని వణికిస్తున్న వ్యాధి కరోనా. ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటున్నాయి. కొంతమందికి లక్షణాలు పైకి కనిపిస్తుంటే, కొంతమందిలో అసలు లక్షణాలే కనిపించడంలేదు. మరికొంత మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక షుగర్, బీపీ, ఉబకాయ సమస్యలు ఉన్నవారికి కరోనా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయులకు కరోనా సమస్య అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే 172 కేజీల బరువు, క్యాన్సర్, ఆస్తమా ఇలా అనేక రకాల వ్యాధులు ఉన్న ఒక మహిళ మాత్రం కరోనాతో యుద్దం చేసి గెలిచింది. వైద్యులను సైతం ఆశ్చర్యపరుస్తూ భారతదేశానికి చెందిన 62 ఏళ్ల మహిళ కరోనాను జయించింది. ముంబైకి చెందిన మెహ్నాజ్ లోఖండ్వాలా అనే మహిళ కరోనా చికిత్స కోసం ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరింది. మహిళ 172 కేజీల బరువు ఉండటమే కాదు దానితో పాటు ఆమెకు మధుమేహం, ఉబ్బసం, క్యాన్సర్‌లాంటి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి. అయితే రోగికి సకాలంలో చికిత్స చేయడం ద్వారా కరోనా నుంచి రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెహ్నాజ్ లోఖండ్వాలా అనే రోగిని తెల్లవారు జామున 2 గంటల సమయంలో బొంబాయి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికి ఆమె ఆక్సిజన్ లెవల్స్ 83-84కు పడిపోయాయి. దాంతో ఆమెకు నాలుగురోజుల పాటు ఆక్సిజన్‌ను పెట్టారు. తరువాత ఆమె కోలుకుంది. ఆసుపత్రిలో రోజుకు 15 లీటర్ల ఆక్సిజన్ అందించగా, ప్రస్తుతం ఒక లీటర్ ఆక్సిజన్ మద్దతుతో ఆమె ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. చదవండి: కరోనా సోకిన అగ్ర నేతలు వీరే ! -
జైలుకు పంపడానికి ట్రక్కును తెప్పించారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లోని మొసుల్‌లో పట్టుబడిన ఐసిస్ నేత, ప్రభోదకుడు, భారీకాయుడైన షిఫాల్ నిమను జైలుకు తరలించేందుకు అధికారులు ముప్పతిప్పలు పడ్డారు. 130 కిలోలకు పైగా బరువున్న షిఫల్ను కారులో ఎక్కించలేక ఆయన కోసం ప్రత్యేకంగా ట్రక్కును తెప్పించారు. ఐఎస్ నేత స్ధావరం బేకరీ అయి ఉంటుందని ఆయన ఆకారాన్ని చూసిన నెటిజన్లు జోక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐసిస్ ప్రముఖ నేతగా పేరొందిన షిఫల్ నిమ జారీ చేసిన ఫత్వాలు మేథావులు, ఆథ్యాత్మిక వేత్తల హత్యలకు దారితీశాయని ఇరాక్ పోలీసులు పేర్కొన్నారు. నిమ పట్టుబడటం ఐసిస్‌కు మానసికంగా కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. కాగా. 2013లో పురుడు పోసుకున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద గ్రూపు తమ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాది హతమైనా ప్రపంచానికి పెనుముప్పుగానే పరిణమించింది. చదవండి : రాజధానిలో కలకలం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ -
అవి పాటిస్తే.. నమ్మలేనంత మార్పు..!!
కాలిఫోర్నియాః అమెరికా శాన్ డియాగో కు చెందిన ప్యాట్రిక్ మాగ్నో.. ఇటీవల నిర్వహించిన ఓ ఫిట్నెస్ పోటీలో మొదటి బహుమతిని పొందాడు. 'తక్కువ సమయంలో ఎక్కువ ఫిట్నెస్' అన్న విషయంపై నిర్వహించిన పోటీల్లో కేవలం మూడు నెలల్లో 49 పౌండ్ల బరువు తగ్గడమే కాక, శరీర ఆకారంలోనూ నమ్మలేనంత మార్పును తెచ్చుకొని అందర్నీ ఆకట్టుకున్నాడు. 30 శాతం అధికంగా కొవ్వు ఉండటంతోపాటు, టైప్ 2 మధుమేహం ప్రమాదం ఉందని వైద్యపరీక్షల్లో వెల్లడైన తర్వాత ప్యాట్రిక్.. తన జీవన శైలిలో మార్పు తెచ్చుకునేందుకు నిర్థారించుకున్నాడు. ప్రమాదాల్లో ఉన్నవారిని బయట పడేయడమే ధ్యేయంగా... ఓ సామాజిక కార్యకర్తగా పనిచేయడం ప్యాట్రిక్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎప్పుడూ ఇతరుల యోగక్షేమాలగురించి ఆలోచించే అతడు.. తన ఆరోగ్యం గురించి పట్టించుకోపోవడంతో శరీరంలో మధుమేహం లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అతడు... ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో బాడీబిల్డింగ్ డాట్ కామ్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ పోటీల విషయం తెలుసుకొని ఎలాగైనా పోటీలో గెలుపు సాధించాలన్నదే లక్ష్యంగా కృషి ప్రారంభించాడు. వెబ్ సైట్లో ఇచ్చే వ్యాయామం, మీల్ ప్లాన్, ఫిట్నెస్ సలహాలు పాటించి బరువును తగ్గి బహుమతిని గులుచుకోవాలన్న నిర్వాహకుల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాడు. కేవలం మూడు నెలల్లోనే 49 పౌండ్ల బరువు తగ్గడంతోపాటు.. మంచి శరీరాకృతిని పొంది 'బాడీబిల్డింగ్ డాట్ కామ్ 250 కె' ఛాలెంజ్ లో మొదటి బహుమతిగా 100.000 డాలర్ల నగదును గెలుచుకున్నాడు. మూడు నెలల షెడ్యూల్ లో ప్యాట్రిక్ పూర్తిశాతం తన ఆహార అలవాట్లు మార్చేసుకున్నాడు. ఫిట్నెస్ డాట్ కామ్ అందించే బాడీ స్పేస్ యాప్ ను ఫాలో అయిపోయాడు. ఏదో గుడ్డిగా ఫాలో అయిపోవడం కాదు.. వెబ్ సైట్ లోని వ్యాసాలను పూర్తిగా అధ్యయనం చేయడంతోపాటు... అందులోని విషయాలను నిర్దుష్గంగా పాటిస్తూ.. అనుకున్న సమయానికి ఆకట్టుకునే శరీరాకృతితోపాటు.. భారీగా బరువు తగ్గి డాట్ కామ్ నిర్వహించిన పోటీల్లో బహుమతి గెలుచుకున్నాడు. ఎటువంటి శిక్షణ, ఖర్చు లేకుండా శరీరంలో అధికంగా ఉన్న 30 శాతం బరువును 6 శాతానికి తెచ్చుకోగలిగాడు. అంతేకాదు మంచి బాడీ బిల్డర్ గా మారాడు. పోటీలో బహుమతి గెలుచుకోవడంతోపాటు.. మ్యాట్రిక్.. ఇప్పుడు ఎంతోమంది ఊబకాయంతో బాధపడుతున్నవారికి మార్గదర్శకమౌతున్నాడు. సామాజిక కార్యకర్తయిన అతడు... ఓ వ్యక్తిగత శిక్షకుడుగా మారి, ఇతరులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసేందుకూ పాటుపడుతున్నాడు. -
ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడి మృతి
మెక్సికో సిటి: ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడుగా పేరున్న మెక్సికోకు చెందన ఆండ్రస్ మొరేనో(38) శుక్రవారం మృతి చెందాడు. ఒకానొక దశలో 450 కిలోల బరువుకు చేరుకున్న మొరీనో.. రెండు నెలల క్రితం బరువు తగ్గడానికి బెరియాట్రిక్ సర్జరీని ఆశ్రయించాడు. సర్జరీ ద్వారా సుమారు 100 కిలోల బరువును డాక్టర్లు తగ్గించారు. దీంతో పాటు అహారం మితంగా తీసుకోవడానికి పొట్టలో ట్యూబ్‌ను అమర్చారు. క్రిస్మస్ రోజున ఒక్కసారిగా మొరేనో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఫైర్‌మెన్ సహాయంతో అతడిని హుటాహుటిన అసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో మొరేనో పోలీస్మెన్గా పనిచేశాడు. అధిక బరువు మూలంగా కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యాడు. వెయిట్ లాస్ కోసం చేయించుకున్న బెరియాట్రిక్ సర్జరీ విఫలం కావడం వలనే మొరేనో మృతి చెందాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. -
పూటకు కిలోన్నర మాంసం తిని...
బీజింగ్: అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువజంట పిల్లల కోసం అష్టకష్టాలు పడుతోంది. ఎలాగైనా బరువు తగ్గించుకొని ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలనే కోరికతో.. వెయిట్ లాస్ థెరపీ, మసాజ్‌లు, జిమ్ అంటూ తెగ కుస్తీలు పడుతోంది. సుమారు 220 కేజీలకు పైగా బరువు పెరిగిన ఈ దంపతులు బరువును తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చైనాకు చెందిన లిన్ యూ (29) , డెంగ్ యాంగ్ (27) లకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. అయినా పిల్లలు పుట్టకపోవడంతో వైద్యులను సంప్రదించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పిల్లల మాట దేవుడెరుగు.. ముందు ఆరోగ్యం కుదుటపర్చుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ అప్పటికే అధిక బరువు వల్ల కలిగే సర్వ అనర్థాలు, అనారోగ్యాలు వారిని చుట్టుముట్టాయి. ఫ్యాటీ లివర్, హైపర్ లిపిడిమియా, బీపీ ఇలా అన్ని వ్యాధులు వచ్చేశాయి. బరువు తగ్గితే తప్ప పిల్లలు పుట్టడం సాధ్యం కాదని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో ఒబెసిటీకి ఉచితంగా చికిత్స అందించే చైనాలోని చాంగ్‌చున్ ఆసుపత్రిలో చేరారు. దీంతోపాటు చైనాలో ప్రసిద్ధిచెందిన ఆక్యుపంక్చర్, మసాజ్‌లు సహా, జిమ్‌ల చుట్టూ తిరుగుతూ చెమటోడుస్తున్నారు. ఇప్పటికి కొంత ఫలితం కనబడినా మరింత కష్టపడాలని ఈ దంపతులకు వైద్యం చేస్తున్న డా.షుఝాంగ్ తెలిపారు. పెళ్లికి ముందు నుంచి కొంచెం లావుగా ఉన్నా, పెళ్లి తర్వత దాదాపు రెట్టింపు బరువు పెరిగామని యూ దంపతులు తెలిపారు. పూటకు కిలోన్నర మాంసం తినేవారమని, అందుకే భారీకాయులుగా మారిపోయామన్నారు. ఇద్దరమూ 220 కేజీల బరువుతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీనివల్ల బయటకు గానీ, షాపింగ్‌కు గానీ ఎక్కడికి వెళ్లాలన్నా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని డెంగ్ వాపోయింది. అందుకే ఉద్యోగాన్ని కూడా వదులుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆరోగ్యవంతమైన బిడ్డను కనడమే తమ లక్ష్యమని తెలిపింది. అయితే ముందు పది కిలోలు బరువు చాలా సులభంగానే తగ్గామని, అసలు కష్టమంతా ముందు ఉందని యు తెలిపారు. అయినా ఇద్దరూ పట్టువీడకుండా ప్రయత్నిస్తున్నామని.. ఒక ఏడాది ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు.