ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడి మృతి
మెక్సికో సిటి: ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడుగా పేరున్న మెక్సికోకు చెందన ఆండ్రస్ మొరేనో(38) శుక్రవారం మృతి చెందాడు. ఒకానొక దశలో 450 కిలోల బరువుకు చేరుకున్న మొరీనో.. రెండు నెలల క్రితం బరువు తగ్గడానికి బెరియాట్రిక్ సర్జరీని ఆశ్రయించాడు. సర్జరీ ద్వారా సుమారు 100 కిలోల బరువును డాక్టర్లు తగ్గించారు. దీంతో పాటు అహారం మితంగా తీసుకోవడానికి పొట్టలో ట్యూబ్ను అమర్చారు.
క్రిస్మస్ రోజున ఒక్కసారిగా మొరేనో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఫైర్మెన్ సహాయంతో అతడిని హుటాహుటిన అసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో మొరేనో పోలీస్మెన్గా పనిచేశాడు. అధిక బరువు మూలంగా కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యాడు. వెయిట్ లాస్ కోసం చేయించుకున్న బెరియాట్రిక్ సర్జరీ విఫలం కావడం వలనే మొరేనో మృతి చెందాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.