అవి పాటిస్తే.. నమ్మలేనంత మార్పు..!!
కాలిఫోర్నియాః అమెరికా శాన్ డియాగో కు చెందిన ప్యాట్రిక్ మాగ్నో.. ఇటీవల నిర్వహించిన ఓ ఫిట్నెస్ పోటీలో మొదటి బహుమతిని పొందాడు. 'తక్కువ సమయంలో ఎక్కువ ఫిట్నెస్' అన్న విషయంపై నిర్వహించిన పోటీల్లో కేవలం మూడు నెలల్లో 49 పౌండ్ల బరువు తగ్గడమే కాక, శరీర ఆకారంలోనూ నమ్మలేనంత మార్పును తెచ్చుకొని అందర్నీ ఆకట్టుకున్నాడు. 30 శాతం అధికంగా కొవ్వు ఉండటంతోపాటు, టైప్ 2 మధుమేహం ప్రమాదం ఉందని వైద్యపరీక్షల్లో వెల్లడైన తర్వాత ప్యాట్రిక్.. తన జీవన శైలిలో మార్పు తెచ్చుకునేందుకు నిర్థారించుకున్నాడు.
ప్రమాదాల్లో ఉన్నవారిని బయట పడేయడమే ధ్యేయంగా... ఓ సామాజిక కార్యకర్తగా పనిచేయడం ప్యాట్రిక్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎప్పుడూ ఇతరుల యోగక్షేమాలగురించి ఆలోచించే అతడు.. తన ఆరోగ్యం గురించి పట్టించుకోపోవడంతో శరీరంలో మధుమేహం లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అతడు... ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో బాడీబిల్డింగ్ డాట్ కామ్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ పోటీల విషయం తెలుసుకొని ఎలాగైనా పోటీలో గెలుపు సాధించాలన్నదే లక్ష్యంగా కృషి ప్రారంభించాడు. వెబ్ సైట్లో ఇచ్చే వ్యాయామం, మీల్ ప్లాన్, ఫిట్నెస్ సలహాలు పాటించి బరువును తగ్గి బహుమతిని గులుచుకోవాలన్న నిర్వాహకుల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాడు. కేవలం మూడు నెలల్లోనే 49 పౌండ్ల బరువు తగ్గడంతోపాటు.. మంచి శరీరాకృతిని పొంది 'బాడీబిల్డింగ్ డాట్ కామ్ 250 కె' ఛాలెంజ్ లో మొదటి బహుమతిగా 100.000 డాలర్ల నగదును గెలుచుకున్నాడు.
మూడు నెలల షెడ్యూల్ లో ప్యాట్రిక్ పూర్తిశాతం తన ఆహార అలవాట్లు మార్చేసుకున్నాడు. ఫిట్నెస్ డాట్ కామ్ అందించే బాడీ స్పేస్ యాప్ ను ఫాలో అయిపోయాడు. ఏదో గుడ్డిగా ఫాలో అయిపోవడం కాదు.. వెబ్ సైట్ లోని వ్యాసాలను పూర్తిగా అధ్యయనం చేయడంతోపాటు... అందులోని విషయాలను నిర్దుష్గంగా పాటిస్తూ.. అనుకున్న సమయానికి ఆకట్టుకునే శరీరాకృతితోపాటు.. భారీగా బరువు తగ్గి డాట్ కామ్ నిర్వహించిన పోటీల్లో బహుమతి గెలుచుకున్నాడు. ఎటువంటి శిక్షణ, ఖర్చు లేకుండా శరీరంలో అధికంగా ఉన్న 30 శాతం బరువును 6 శాతానికి తెచ్చుకోగలిగాడు. అంతేకాదు మంచి బాడీ బిల్డర్ గా మారాడు. పోటీలో బహుమతి గెలుచుకోవడంతోపాటు.. మ్యాట్రిక్.. ఇప్పుడు ఎంతోమంది ఊబకాయంతో బాధపడుతున్నవారికి మార్గదర్శకమౌతున్నాడు. సామాజిక కార్యకర్తయిన అతడు... ఓ వ్యక్తిగత శిక్షకుడుగా మారి, ఇతరులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసేందుకూ పాటుపడుతున్నాడు.