ప్రతీకాత్మక చిత్రం
మేడం! నా వయసు 21 ఏళ్లు. ఎత్తు 5.5, బరువు 95 కిలోలు. నాకు ఎనిమిది నెలల కిందట పెళ్లయింది. ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. మా వాళ్లు నన్ను చాలా ప్రెషర్ చేస్తున్నారు. నేను, మావారు ప్రెగ్నెన్సీకి అన్ని విధాలా ట్రై చేస్తున్నాం. అయినా ఫలితం కనిపించడం లేదు. నేను ఎక్కువ వెయిట్ ఉండటం వల్లనే ప్రెగ్నెన్సీ రావడం లేదా? ప్రెగ్నెన్సీకి ఎంత వెయిట్ ఉండాలో చెప్పండి.. ప్లీజ్.
– అంజు సీపాన (ఈ–మెయిల్)
నీ ఎత్తుకి, నువ్వు 57–61 కేజీల మధ్య బరువు ఉండాలి. కాని నువ్వు 95 కేజీలు ఉన్నావు అంటే నువ్వు దాదాపుగా 35కేజీల అధిక బరువు ఉన్నావు. నీకు పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా? రావట్లేదా అనేది తెలియజేయలేదు. నీ వయస్సు ఇప్పుడు 21 సంవత్సరాలు మాత్రమే. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ప్రెగ్నెన్సీ కంటే ఆరోగ్యంగా ఉండటానికి, ప్రెగ్నెన్సీ రావాలన్నా, అందులో కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలన్నా బరువు తగ్గడమే ప్రధానం. అధిక బరువు వల్ల హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, అండం సరిగ్గా పెరగకపోవడం వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవచ్చు.
మొదట నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అధిక బరువు వల్ల థైరాయిడ్ వంటి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి రక్తపరీక్షలు, స్కానింగ్ చేయించుకుని కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, గర్భాశయంలో సమస్యలు, అండాశయంలో సిస్ట్‌లు, నీటి బుడగలు (పీసీఓడీ) వంటి సమస్యలు, అండం పెరుగుతుందా లేదా అనే విషయాలను తెలుసుకోవడం మంచిది. ఆహారంలో అన్నం వంటి కార్బోహైడ్రేట్లు, స్వీట్లు, నూనె వస్తువులు, జంక్‌ఫుడ్‌లు బాగా తగ్గించి వీలైతే న్యూట్రీషనిస్ట్ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వాకింగ్, ఏరోబిక్ వ్యాయామాలు సక్రమంగా కొన్ని నెలల పాటు చేయడం వల్ల బరువు తగ్గి, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి చికిత్స తీసుకుని, తర్వాత గర్భం గురించి ఆలోచించడం మంచిది. బరువు తగ్గడం వల్ల హార్మోన్లు సక్రమంగా విడుదల అయ్యి, అండం పెరిగి, ఎటువంటి చికిత్స లేకుండానే 80–90 శాతం మందిలో ప్రెగ్నెన్సీ వస్తుంది.
మిగతా 10–20శాతం మందిలో మందులతో ప్రెగ్నెన్సీ రావడానికి చికిత్స అవసరం పడవచ్చు. కాబట్టి నువ్వు ఉన్న 35కేజీలు అధిక బరువును తగ్గించడానికి ప్రయత్నం చెయ్యాలి. అందులో కనీసం 25కేజీల బరువన్నా తగ్గితే, నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అధికబరువు మీద గర్భం వచ్చినా, చాలామందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గర్భం సమయంలో ఇంకా బరువు పెరగడం వల్ల బీపీ, షుగర్ పెరిగి వాటివల్ల కాంప్లికేషన్స్ పెరగడం, నెలలు నిండకుండా కాన్పు అవ్వడం, కాన్పు సమయంలో సమస్యలు, తల్లి ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నీ వయసు చాలా చిన్నదే, ప్రెగ్నెన్సీ కంటే ముందు బరువు తగ్గడం పైన శ్రద్ధ పెట్టడం మంచిది.
- డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment