Doctors advice
-
ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే..!
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వైద్య నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అలా అయితే ఫ్లూ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో మార్చి 9 వరకు హెచ్3ఎన్2 సహా మొత్తం 3,038 ఇన్‌ఫ్లూయెంజా ఉపరకాల కేసులు నమోదయ్యాయి. ఇందులో జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చిలో 9 రోజుల్లోనే 486 కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజా బారినపడకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. బస్సులు, రైళ్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, జనం గుంపులుగా ఉన్న చోట్ల కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ ఇన్‌ఫ్లూయెంజా ఎక్కువగా తుంపర్ల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ముక్కు, నోటిని చేతులతో ఎక్కువగా తాకకుండా చూసుకుంటే వైరస్ లోనికి ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబతున్నారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్-19తో పాటు స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1), హెచ్3ఎన్2, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా- బీ వైరస్ల కాంబినేషన్లు వెలుగుచూస్తున్నాయి. హెచ్3ఎన్2, హెచ్3ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా- ఏ రకాల కిందకు వస్తాయి. వీటినే ఫ్లూగా పిలుస్తారు. లక్షణాలు ఇలా.. ఇన్‌ఫ్లూయెంజా బారినపడేవారిలో జ్వరం ఎక్కువరోజులు ఉండటం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం బాగా క్షీణిస్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల్లో కూడా చాలా రోజుల తర్వాత పెరుగుదల కన్పిస్తోంది. ఆదివారం కొత్తగా 524 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో, జనసమూహాల్లో తిరిగేవారు మాస్కులు ధరించండ చాలా ఉత్తమం అని, లేకపోతే వైరస్ల బారినపడే ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్ -
సీపీఆర్ చేస్తే బతికేవారేమో
కోల్‌కతా/ముంబై: గుండెపోటుతో మరణించిన ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే)కు సకాలంలో సీపీఆర్ చేసుంటే ప్రాణాలు నిలిచేవని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడ్డారు. ‘‘ఆయన గుండెలో ఎడమవైపు ధమనిలో 80 శాతం బ్లాకేజీ ఉంది. మిగతా ధమనులు, రక్తనాళాల్లోనూ చిన్నచిన్న బ్లాక్‌లున్నాయి. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నట్టుంది. దీనికి తోడు లైవ్ షోలో ఉద్విగ్నంగా గడపటంతో గుండెకు రక్తం సరిగా అందక మరణానికి దారితీసింది. స్పృహ కోల్పోగానే సీపీఆర్ చేసుంటే బతికేవారు’’ అని ఒక వైద్యుడు పీటీఐకి చెప్పారు. కేకే యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది. గుండెనొప్పిని అజీర్తిగా భావించి వాటిని వాడి ఉంటారని వైద్యులు చెప్పారు. కోల్‌కతా నుంచి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఛాతిలో నొప్పిగా ఉందని, చేతులూ భుజాలూ లాగుతున్నాయని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అభిమానుల కన్నీటి నడుమ కేకే అంత్యక్రియలు ముంబై వెర్సొవా హిందు శ్మశానవాటికలో గురువారం జరిగాయి. కుమారుడు నకుల్ అంతిమ సంస్కారం నిర్వహించారు. శ్రేయఘోషల్, అల్కాయాజ్ఞిక్, హరిహరన్, సలీమ్ మర్చంట్ వంటి సింగర్లు నివాళులర్పించారు. -
BMI: బీఎంఐతో ఆందోళన వద్దు!
బీఎంఐ... బాడీ మాస్ ఇండెక్స్.. ఈ నంబరు పెరిగితే అనారోగ్యమని నమ్ముతూ, భయపడుతూ బతుకుతున్నాం! అయితే ఆరోగ్యాన్ని బీఎంఐ ఆధారంగా అంచనా వేయడం సరికాదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం గురించి ప్రాథమిక అవగాహన కల్పించే పలు కొలతల్లో బీఎంఐ ఒకటి మాత్రమేనంటున్నారు... నంబర్లు మనిషి జీవితాన్ని శాసించే స్థితికి వచ్చాయి. అటు చదువు నుంచి ఇటు ఆరోగ్యం వరకు జీవితమంతా నంబర్లాటతోనే సరిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్ని కేలరీల భోజనం చేయాలి, ఇన్ని అడుగులు నడవాలి, ఇన్ని గంటలు పడుకోవాలి అంటూ ప్రతి ఒక్కరిలో జ్ఞానం పెరిగిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో శరీరంపై శ్రద్ధ పెట్టేందుకు సమయం సరిపోనివాళ్లంతా ఇలాంటి నంబర్లను నమ్ముకొంటున్నారు. రోజుకు ఎన్ని అడుగులు నడిచాం, హృదయ స్పందన రేటు ఎలాఉంది, ఆక్సిజన్ స్థాయి ఎంత, ఎంతసేపు నిద్రించాం.. అనేవి లెక్కించడానికి స్మార్ట్ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ప్రతిఒక్కరం తెలియకుండానే నంబర్ల రేసులో పరిగెడుతున్నాం. ఇలాంటి నంబర్లలో అందరినీ బెంబేలెత్తించేది బీఎంఐ.. బాడీ మాస్ ఇండెక్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో చెప్పే కొలత. ఇది కాస్త ఎక్కువైతే మనిషి పడే ఆరాటం అంతా ఇంతాకాదు. కానీ తాజా పరిశోధనలు మాత్రం బీఎంఐకి అంత సీన్ లేదంటున్నాయి. అసలు దీన్ని ఆరోగ్యంతో లింకు పెట్టి చూసే ధోరణి మానుకోవాలంటున్నారు పరిశోధకులు. ఇది అనేక ప్రాథమిక కొలతల్లో ఒకటని చెబుతున్నారు. ప్రభుత్వానికి సాయం కోసం బీఎంఐ అనే భావనను 1832 సంవత్సరంలో బెల్జియన్ గణాంకవేత్త లాంబెర్ట్ అడోల్ఫ్ క్విటెలెట్ రూపొందించారు. అప్పటి ప్రభుత్వానికి దేశ జనాభాలో అధిక బరువున్నవారి జనాభాను గుర్తించేందుకు క్విటెలెట్ ఈ బీఎంఐకి రూపకల్పన చేశారు. తర్వాత రోజుల్లో మనుషుల బరువు ఆధారంగా వారి బీమా ప్రీమియం లెక్కించేందుకు అవసరమైన సులభమైన కొలత అమెరికా బీమా కంపెనీలకు కావాల్సివచ్చింది. ఈ కంపెనీలు జనాభాలో సగటు బరువును లెక్కించేందుకు అనేక అశాస్త్రీయ పద్ధతులు వాడేవి. వీటితో విసుగొచి్చన యాన్సెల్ కీస్ అనే డాక్టరు దాదాపు 7వేల మందిపై క్విటెలెట్ సమీకరణంతో ప్రయోగం చేశారు. ఈ సమీకరణంతో సగటు జనాభా బరువు కనుక్కోవడం సులభమని గుర్తించి దీనికి బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) అని నామకరణం చేశారు. తర్వాత రోజుల్లో మనిషి బరువు పెరిగితే అనారోగ్యమని గుర్తించడంతో పలువురు డాక్టర్లు తమ పేషెంట్ల సాధారణ ఆరోగ్య సూచీగా బీఎంఐని వాడడం ఆరంభించారు. ప్రస్తుతం డాక్టర్ల నుంచి జిమ్ ట్రైనర్ల వరకు అంతా దీన్ని నమ్ముకొని ఆరోగ్యంపై అంచనాలు వేస్తున్నారు. అదే ఫైనల్ కాదు.. ఎందుకంటే? బీఎంఐ ఎక్కువున్నంత మాత్రాన అనారోగ్యంతో ఉన్నట్లు భావించవద్దని తాజా పరిశోధనలు సూ చిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నామనేందుకు బీఎం ఐ గుర్తించని కొన్ని అంశాలున్నాయంటున్నాయి. - బీఎంఐలో బీఎఫ్పీ (బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్– శరీరంలో కొవ్వు శాతం) లెక్కింపు ఉండదు. ఇది కేవలం శరీర బరువును సూచించే కొలత మాత్రమే! అయితే అనారోగ్యమనేది బరువు వల్ల కాదు, శరీరంలోని కొవ్వు వల్ల వస్తుందని గుర్తించాలి. బీఎంఐ కొవ్వుకు, కండకు తేడాను గుర్తించదు. ఉదాహరణకు ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ బీఎంఐ ఓవర్‌వెయిట్ రేంజ్లో, ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు టామ్ బ్రాడీ బీఎంఐ ఒబేస్ రేంజ్లో ఉన్నాయి. వీరిలో కొవ్వుకు, కండకు తేడాను బీఎంఐ గుర్తించకపోవడమే ఇందుకు కారణం. - శరీరంలో బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ (శరీరంలో కొవ్వు వ్యాప్తి)ని కూడా బీఎంఐ లెక్కించదు. శరీరంలో అన్ని కొవ్వు పదార్థాలు ఒకటి కాదు, వీటిలో చెడువి, మంచివి ఉంటాయి. ఉదాహరణకు పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ, తుంటి వద్ద కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ అధికంగానే ఉంటాయి. కానీ వీరిలో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువున్నవారు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అధికం. - బీఎంఐ జనాభా వైరుద్ధ్యాలు గుర్తించదు. ఆంగ్లోశాక్సన్లను ఉదాహరణగా తీసుకొని క్విటెలెట్ ఈ సమీకరణం రూపొందించారు. కానీ ప్రకృతి సహజంగా ఆయా భౌగోళిక ప్రాంతాల్లో మనుషుల మధ్య వైరుద్ధ్యాలు సహజం. ఉదాహరణకు ఆసియా జనాభాలో బీఎంఐ పెరిగితే అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి, కానీ పాలినేసియన్ జనాభాలో(పసిఫిక్ సముద్రంలోని కొన్ని దీవుల సముదాయాన్ని పాలినేసియా అంటారు) అధిక బీఎంఐ ఉన్నా ఆరోగ్యంగానే ఉంటారు. అందువల్ల బీఎంఐ అనేది ఆరోగ్యానికి సింగిల్ సూచిక కాదని, అనేక ప్రాథమిక కొలతల్లో ఇదిఒకటని నిపుణులు నిర్ధారిస్తున్నారు. మీ బీఎంఐ ఓవర్‌వెయిట్ లేదా ఒబేస్ రేంజ్లో ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అంతమాత్రాన పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. బీఎంఐ బాగా ఎక్కువుంటే ఇతర పరీక్షలు (లిపిడ్ ప్రొఫైల్ తదితరాలు) చేయించుకొని ఆరోగ్యంపై నిర్ధారణకు రావాలి. అంతేకానీ బీఎంఐ ఎక్కువైందన్న కంగారులో అనవసర డైట్ పద్ధతులు పాటించి కొత్త అనారోగ్యాలు కొనితెచ్చుకోవద్దన్నది నిపుణుల సలహా. ఇలా లెక్కిస్తారు.. ఆన్లైన్లో బీఎంఐని లెక్కించేందుకు పలు ఉచిత అప్లికేషన్లున్నాయి. బీఎంఐ లెక్కించేందుకు మీ బరువు, ఎత్తు తెలిస్తే చాలు! బరువును కిలోల్లో, ఎత్తును మీటర్లలో అప్లికేషన్లో ఎంటర్ చేస్తే మీ బీఎంఐ ఎంతో సెకన్లలో తెలుస్తుంది. బీఎంఐ 18.5 కన్నా తక్కువుంటే అండర్‌వెయిట్ (ఉండాల్సినదాని కన్నా తక్కువ బరువు), 18.5– 24.9 ఉంటే నార్మల్, 25– 29.9 ఉంటే ఓవర్‌వెయిట్ (ఉండాల్సినదాని కన్నా అధిక బరువు), 30పైన ఉంటే ఒబేస్ (ఊబకాయం)గా వర్గీకరిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
యువతలో ఇడియట్స్.. గూగుల్‌నే నమ్ముతున్న వైనం!
లబ్బీపేట (విజయవాడతూర్పు): యువత, విద్యావంతుల్లో ఇడియట్స్ పెరిగిపోతున్నారు. ఇడియట్ అంటే తిట్టు కాదు. ఇంటర్నెట్ డెరీవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారని అర్థం. వీరిని డాక్టర్ గూగుల్‌గా కూడా పిలుస్తారు. వారికి ఏదైనా జబ్బు చేస్తే, ఆ లక్షణాలను గూగుల్‌లో సెర్చ్ చేసి జబ్బు, దానికి చికిత్స ఏమిటో తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ వద్దకు వెళ్లి, తనకు ఫలానా జబ్బు అని, చికిత్స చేయాలని అడుగు తారు. జబ్బు లక్షణాలు ఏమిటో చెప్పాలని అడిగితే, తాను గూగుల్‌లో పరిశీలించి, తెలుసుకున్నానంటూ బదులిస్తారు. ఇటీవల కాలంలో వైద్యుల వద్దకు ఇలాంటి వారు ఎక్కువగా వస్తున్నారు. డాక్టర్ మందులు రాసిన తర్వాత కూడా వాటి గురించి గూగుల్‌లో శోధిస్తున్నారు. అక్కడ ఆ ముందుకు సంబంధించి ఏవైనా దుష్ఫలితాలు ఉంటా యని పేర్కొంటే, వాడకుండా మానేస్తున్నారు. డాక్టర్ల వద్దకు వస్తున్న 100 మంది చదువుకున్న వారిలో 60 శాతం మంది డాక్టర్ చీటీలోని మందుల సమాచారం కోసం గూగుల్‌లో శోధిస్తున్నారు. మరో 15 శాతం మంది ఇడియట్సేనని వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా.. కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడమే.. ప్రతి విషయాన్నీ గూగుల్‌లో శోధించడం ద్వారా కొత్త సమ స్యలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మందులు, జబ్బు విషయంలో సందేహం ఉంటే వైద్యుడిని అడిగి నివృత్తి చేసుకోవాలే కానీ, గూగుల్‌లో చూడటం సరైన విధానం కాదని పేర్కొంటున్నారు. ఒక మందు వాడిన వారిలో లక్ష మందిలో ఒకరికి దుష్ఫ లి తాలు వచ్చినా, గూగుల్‌లో పెడుతుంటారని, దానిని చూసి మందు వాడకుంటే, జబ్బు ముదిరి ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వాడే క్రోసిన్‌కు కూడా దుష్ఫలితాలు ఉన్నట్లు గూగుల్‌లో ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రతి మందు గురించీ గూగుల్‌లో శోధించడం సరికాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. డాక్టర్ గూగుల్‌గా మారిన వైనం ఇప్పుడు కొంత మంది ఏదైనా జబ్బు చేస్తే, గూగుల్‌లో శోధించి సొంతగా మందులు వాడేస్తున్నారు. మందులను కూడా ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు. అది సరి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జబ్బుకు చికిత్స సరిగ్గా జరగక పోతే ప్రాణాల మీదకు వస్తుందని పేర్కొంటున్నారు. గూగుల్ డాక్టర్‌గా మారిన వారు కూడా ఇడియట్ అనే సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాల్సి ఉందన్నారు. రోగి వ్యవహారశైలి, మానసిక పరిస్థితిని కుటుంబ సభ్యులు అంచనా వేయాల్సి ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని రకాల మానసిక జబ్బులు, సెక్స్ సామర్థ్యం పెరిగేందుకు వాడే వయగ్రా వంటి వాటి గురించి కూడా ఎక్కువగా గూగుల్‌లో శోధిస్తున్నారని వివరించారు. చదవండి: అమ్మఒడిపై లఘు చిత్రం ఆవిష్కరణ -
నా పెళ్లి ఫిక్సైంది, ఆ ఆలోచన తప్పా డాక్టర్!
మెనోపాజ్ వచ్చి నాలుగేళ్లవుతోంది. ఈ మధ్య తరచుగా మూత్రంలో మంట, దురదగా ఉంటోంది. షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. లేదు. థైరాయిడ్ కూడా లేదు. అయినా ఎందుకిలా అవుతోంది. వేడి చేసిందేమో అనుకున్నాను. కానీ ఎక్కడో చదివాను వేడి చేయడమంటూ ఉండదని. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – జి. రాజేశ్వరి, తర్లికొండ ఆడవారిలో గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. దీని ఉత్పత్తి 45 ఏళ్ల వయసు దాటే కొద్ది క్రమంగా తగ్గుతూ, పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరుకోవడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల యోని భాగంలో మూత్రం బయటకు వచ్చే యురెత్రా ద్వారంలో మ్యూకస్ పొర ఎండిపోకుండా, అందులో ద్రవాలు ఊరేట్లు చేస్తుంది. అలాగే ఈస్ట్రోజన్ యోనిలో ల్యాక్టోబ్యాసిలై అనే మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. ఈ బ్యాక్టీరియా నుంచి విడుదలయ్యే యాసిడ్ యోని స్రావాలను ఆమ్లగుణం కలిగేటట్లు చేస్తుంది. ఈ యాసిడ్ వల్ల వేరే ఇన్ఫెక్షన్ క్రిములు పెరగకుండా ఉంటాయి. అలాగే ఈస్ట్రోజన్ యురెత్రా, యోని భాగంలో ఉండే కండరాలు వదులు కాకుండా, దృఢంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు మెనోపాజ్ వచ్చి నాలుగు సంవత్సరాలు దాటింది కాబట్టి మీ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ చాలావరకు తగ్గిపోయి ఉంటుంది. ఈస్ట్రోజన్ లోపం వల్ల యురెత్రా, వజైనా కణజాలానికి రక్తప్రసరణ తగ్గిపోయి మ్యూకస్ పొర పల్చబడి, మ్యూకస్ స్రావాలు ఆగిపోయి ఎండిపోయినట్లు అయిపోతుంది. దీనివల్ల యోనిభాగంలో పొడిబారేటట్లయి మంటగా అనిపిస్తుంది. అవసరమైతే యూరిన్ కల్చర్ పరీక్షలు చేయించి, యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఎంత ఉన్నదీ, ఎలాంటి బ్యాక్టీరియా పెరుగుతున్నదీ తెలుసుకుని, దానిని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులతో పాటు మెనోపాజ్‌తో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వచ్చే ఈ సమస్యలను నివారించడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ క్రీమ్, జెల్, ఆయింట్మెంట్ లేదా వజైనల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రీమ్‌ను మొదటి రెండు వారాలు రోజూ రాత్రిపూట యోని లోపల మూత్ర భాగంలో పెట్టుకోవాలి. తర్వాతి నుంచి వారానికి రెండుసార్లు వాడుకోవచ్చు. అలాగే రోజుకు మూడు లీటర్ల మంచినీళ్లు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకు మంచినీళ్లతో శుభ్రపరచుకోవాలి. ల్యాక్టోబ్యాసిలై ఇంటిమేట్ వాష్‌తో రోజుకొకసారి జననేంద్రియాలను శుభ్రపరచుకోవచ్చు. అవసరాన్ని బట్టి ల్యాక్టోబ్యాసిలైతో కూడిన ప్రోబయోటిక్ మందులను కొన్ని రోజులు డాక్టర్ సలహాపై తీసుకోవచ్చు. రోజూ కొద్దిగా క్యాన్‌బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కొందరిలో ఈ–కోలి బ్యాక్టీరియా మూత్రాశయానికి అంటుకోకుండా, ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా తరచుగా మూత్రవిసర్జన చేస్తూ ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆడవారిలో మలద్వారం యోనిభాగానికి, మూత్రద్వారానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మలద్వారం నుంచి వచ్చే ఈ–కోలి బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు యోనిలోకి, మూత్రద్వారంలోనికి సులువుగా పైకి పాకి యూరినరీ ఇన్ఫెక్షన్లు, వజైనల్ ఇన్ఫెక్షన్లు అతి త్వరగా, తరచుగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. దీని వల్ల మూత్రం పోసేటప్పుటు మంట, దురద వంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. కొందరిలో ఈస్ట్రోజన్ లోపం వల్ల మూత్రాశయం కిందకు జారడం, దానివల్ల మూత్రం పూర్తిగా బయటకు రాకుండా ఉండటం, కొంచెం మూత్రాశయంలోనే ఉండిపోవడం, దానివల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగి, యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చి, మూత్రంలో మంట వంటి లక్షణాలు ఏర్పడతాయి. అశ్రద్ధ చేసి, చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ మూత్రాశయం నుంచి యురెటర్స్ ద్వారా కిడ్నీలకు పాకి ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, పరీక్ష చేయించుకుంటే, వారు స్పెక్యులమ్ పరీక్ష చేసి, మూత్రం ద్వారా యోనిభాగంలో బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, మూత్రాశయం జారడం వంటి సమస్యలేమైనా ఉన్నాయా అనేది చూసి, సమస్యను బట్టి యాంటీఫంగల్, యాంటీబయోటిక్ మందులు, క్రీములు సూచించడం జరుగుతుంది. మేడమ్... మా పెళ్లి ఖరారైంది. నిశ్చితార్థానికి ముందు మా రెండు కుటుంబాల హెల్త్ హిస్టరీ చూసుకోవాలనుకున్నాం. పుట్టబోయే పిల్లల ఆరోగ్య దృష్ట్యా. అమ్మాయీ ఒప్పుకుంది. కానీ వాళ్ల కుటుంబ సభ్యులకు నా తీరు నచ్చక సంబంధం కేన్సిల్ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా నా మీద అభాండాలూ వేస్తున్నారు. నా ఆలోచన తప్పా డాక్టర్ గారూ... – రాఘవకృష్ణ, ప్రొద్దుటూరు నీ ఆలోచనలో తప్పేమీ లేదు. కానీ ప్రాక్టికల్‌గా అది అందరికీ నచ్చకపోవచ్చు. కొందరు దాన్ని వెర్రి ఆలోచనగా పరిగణించవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల జన్యు సమస్యలు, అవయవ లోపాలు, మానసిక ఎదుగుదల లోపాలు, మెటబాలిక్ డిజార్డర్స్, థలసీమియా, హీమోఫీలియా, సికెల్‌సెల్ ఎనీమియా వంటి రక్త సమస్యలు వంటి అనేక సమస్యలతో పిల్లలు పుట్టవచ్చు. ఈ సమస్యలకు మూలాలు తల్లిదండ్రుల్లో గాని, వారి తల్లిదండ్రులు, ఇంకా దగ్గరి రక్తసంబంధీకులలో గానీ కొన్ని జన్యువులలో లోపాలు ఉండవచ్చు. కొన్ని జన్యుపరమైన సమస్యలతో పుట్టిన పిల్లలతో పాటు, వారి తల్లిదండ్రులు జీవితాంతం ఇబ్బంది పడవలసి ఉంటుంది. కొన్ని సమస్యలు ఏ కారణం లేకుండా కూడా పిల్లల్లో ఏర్పడవచ్చు. కొందరిలో కొన్ని జన్యువులు బలహీనంగా ఉండటం జరుగుతుంది. అలాంటి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు రెండు బలహీన జన్యువులు బిడ్డకు సంక్రమించినప్పుడు జన్యలోపాలు ఏర్పడతాయి. కాబట్టి పెళ్లికి ముందు ఇద్దరి తరఫు దగ్గరి బంధువుల ఆరోగ్య చరిత్ర తెలుసుకోవడం వల్ల వారిలో ఏవైనా సమస్యలు ఉంటే, అవి పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో ఒక అంచనాకు రావచ్చు. అవసరం అనుకుంటే జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చు. ఇందులో జెనెటిసిస్ట్ డాక్టర్ కుటుంబ చరిత్రను బట్టి పుట్టబోయే పిల్లల్లో జన్యుసమస్యలు ఎంతశాతం వరకు రావచ్చనేది అంచనా వేసి చెప్పడం జరుగుతుంది. డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ చదవండి: కరోనా కాలంలో పిల్లలకు సీజనల్ జ్వరాలు.. జాగ్రత్తలు -
కరోనా సెకండ్ వేవ్: ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఈ కరోనా టైమ్ లో ఆహారం విషయంలో కానీ, ఇతరత్రా ఆడవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పండి మేడం.... – నూర్జహాన్, గుల్బర్గా మన భారతదేశంలో సగటున యాభై శాతం మంది ఆడవారు భర్త, పిల్లల ఆలనపాలన చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. పనులలో నిమగ్నమై సమయానికి సరైన ఆహారం తీసుకోకుండా, మిగిలిన వారు తినగా ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా చాలామంది ఆడవారిలో 35 సంవత్సరాలు దాటేకొద్ది పీరియడ్స్, కాన్పులు, పిల్లలకు పాలు ఇవ్వడం వంటి వాటి వల్ల రక్తహీనత, విటమిన్స్, క్యాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే హార్మోన్ల ప్రభావం వల్ల కూడా కొంచెం కొంచెంగా ఎముకలలో క్యాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఒళ్లు నొప్పులు, నడుం నొప్పులు, నీరసం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. రక్తహీనత ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకితే, వాటిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని జయించాలన్నా, తిప్పికొట్టాలన్నా రోగనిరోధక శక్తి చాలా కీలకం. ఈ సెకండ్‌వేవ్‌లో కుటుంబంలో ఒకరికి కరోనా వచ్చినా, అది కుటుంబంలోని అందరికీ వ్యాప్తి చెందుతుంది. అందులో 90 శాతం మంది సరైన జాగ్రత్తలు పాటిస్తూ, డాక్టర్ల సూచనతో మందులు వాడుతూ ఇంట్లోనే ఉంటే తగ్గిపోతుంది. ఈ సమయంలో కుటుంబంలోని అందరూ ఒకరికి ఒకరు తోడుగా ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా కలసి అన్ని పనులూ చేసుకుంటూ, ఆందోళన చెందకుండా ఉంటే కరోనాను జయించవచ్చు. పది శాతం మందికి మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అయినా సరే, మన దేశంలో చాలామంది ఆడవాళ్లు వాళ్లకు కూడా సమస్య ఉన్నా, మిగతావారికి విశ్రాంతినిచ్చి, వారే అన్ని పనులూ చేస్తూ, వారికి సపర్యలు చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వారి ఆరోగ్యం ముందు నుంచే సరిగా ఉండి, రోగనిరోధక శక్తి బాగా ఉంటే వారికి సమస్య తీవ్రతరం కాకుండా చిన్నచిన్న లక్షణాలతో బయటపడి కరోనాను జయించవచ్చు. అలాగే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. కాబట్టి ఆడవారు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఆహార నియమాలు పాటించడం మంచిది. పొద్దున నిద్రలేవగానే గ్లాసుడు గోరువెచ్చని మంచినీళ్లు– కావాలంటే అందులో నిమ్మకాయ పిండుకుని, తేనె కలుపుకొని తాగవచ్చు. ఉదయం తొమ్మిదిగంటల సమయానికి బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ/ దోశ/ ఉప్మా/పాలు/ఓట్స్/గుడ్డు వంటివి తీసుకోవచ్చు. పదకొండు గంటలకు స్నాక్స్‌లో ఏదైనా పండు/మొలకెత్తిన గింజలు/డ్రైఫ్రూట్స్, మధ్యాహ్న భోజనంలో కొద్దిగా అన్నం/రోటీ/పప్పు/ఆకుకూర/కూరగాయలు/పెరుగు, మాంసాహారులు చికెన్/మటన్ వంటివి తీసుకోవచ్చు. సాయంత్రం 4–5 గంటలకు స్నాక్స్ రూపంలో కొద్దిగా మసాలా టీ/సూప్/ ఉడికించిన గింజలు వంటివి, రాత్రి భోజనంలో చపాతీ, ఆకుకూరలు/కూరగాయలు/ పెరుగు/రాగిజావ వంటివి, పడుకునే ముందు వేడి పాలు తాగడం మంచిది. రోజూ పది పన్నెండు గ్లాసుల మంచినీరు (రెండు లీటర్లు) తాగవలసి ఉంటుంది. ఇలా అందరూ తమకు అందుబాటులో ఉన్న పోషక పదార్థాలతో రోజును ఆరుసార్లుగా విభజించుకుని ఆహారం తీసుకోవడం మంచిది. అన్ని రకాల పండ్లు (డయాబెటిక్ పేషెంట్లు అరటిపళ్లు, మామిడి, సపోట తక్కువగా తీసుకోవాలి) మజ్జిగ, కొబ్బరినీళ్లలాంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మా ఆడపడుచుకి 52 ఏళ్లు. ఈ మధ్యనే కుడి రొమ్ములో లంప్ ఏర్పడి, అది తర్వాత క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉందని కుడి రొమ్ము తొలగించారు. ఇప్పుడు ఆమెకు సెర్విక్స్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. తొలి దశలోనే ఉంది ప్రమాదమేం లేదన్నారు. అయినా మాకు భయంగానే ఉంది. రొమ్ములో గడ్డ గర్భసంచి వరకు వ్యాపించి ఉండొచ్చంటారా? యేడాదిలోపే ఇక్కడిదాకా వచ్చింది. – మంజుల రాణి, ఆత్మకూరు కొందరిలో కొన్ని జన్యువులలో మార్పుల వల్ల వారి శరీర తత్వాన్ని బట్టి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటిలో రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, అండాశయాలలో క్యాన్సర్, పేగులలో క్యాన్సర్ వంటివి ఉంటాయి. వీటిలో సెర్వైకల్ క్యాన్సర్ అరుదుగా ఉంటుంది. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే రొమ్ములో గడ్డకు, సెర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధం ఉన్నట్లు అనిపించడం లేదు. సందేహం ఉంటే రొమ్ములోని గడ్డకు సంబంధించిన బయాప్సీ రిపోర్టును, సెర్విక్స్ నుంచి తీసిన బయాప్సీ రిపోర్టును పరీక్ష చేసి చూడవచ్చు. సాధారణంగా రొమ్ము క్యాన్సర్ నుంచి క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులు, లివర్, ఎముకలు, అండాశయాలకు, మెదడుకు వ్యాప్తి చెందవచ్చు. సెర్విక్స్‌కు పాకే అవకాశాలు చాలా తక్కువ. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ చదవండి: -
Coronavirus: గర్భంతో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నా వయసు 36 ఏళ్లు. పెళ్లయిన పన్నెండేళ్లకు గర్భం ధరించాను. ఇప్పుడు నాకు నాలుగో నెల. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లంతా కరోనా వాక్సీన్ తీసుకోవాలంటున్నారు. గర్భంతో ఉన్నప్పుడు వాక్సీన్ తీసుకోవచ్చా? – ఎన్. ప్రసన్న (ఇ మెయిల్ ద్వారా అందిన ప్రశ్న) ఈ కొత్త కరోనా వైరస్ ప్రపంచానిఇ తెలిసి ఒకటిన్నర సంవత్సరాలు అవుతోంది. దీనికి వ్యతిరేకంగా యాంటిబాడీస్ తయారయ్యి దాని మీద దాడి చేసే వైరస్ శరీరంలో పెరగకుండా ఉండటానికి కరోనా వ్యా క్సిన్ తయారు చేయ్యడం జరిగింది. కానీ, మిగితా వ్యాక్సన్లాగా మెల్లగా అనేక మంది మీద అన్ని రకాలుగా ఎక్కువ సంవత్సరాలు పరిశోధనలు జరగకుండాకే అత్యవసరంగా ఎమర్జెన్సీగా ఇది కూడా ఒక ఫ్లూ వైరస్ జాతికి సంబంధించిదిగా పరిగణించి, తక్కువ కాంలో ట్రయల్స జరిపి తయారు చేశారు. అలాగే అత్యవసరంగా ప్రజలకు ఇవ్వడానికి ఆమెదింపబడినది. కానీ, ఈ పరిశోధనలు గర్భం దాల్చిన వారి మీద చేయ్యలేదు. కాబట్టి, దాని ఫలితాలు దుష్ఫలితాలు గర్భిణీల మీద కడుపులో ఉన్న బిడ్డపైన ఎలా ఉంటాయి అనేది కచ్చితంగా చెప్పటం కష్టం. కాబటి ఐసీఎమ్ఆర్ గర్భీణీలలో కరోనావైరస్ ఇవ్వవచ్చు అనే మార్గదర్శకాలను ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటీ వరకూ చూసిన అనుభవాల మేరకు గర్భీణీలు వ్యాక్సిన్ తీసుకోవడటం వలన మంచి, చెడు, తీసుకోకపోవడం వలన వచ్చే సమస్యలతో పోలిస్తే మంచి జరిగేది ఎక్కువ అని, చెడు తక్కువ అని తెలుపుతున్నారు. సీడీసీ, ఎఫ్‌డీఏ, ఏ సీఓజీ, ఆర్‌సీఓజీ, ఎఫ్ఓజీఎస్ఐ వంటి సంస్థలు గర్భంతో ఉన్నప్పుడు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడమే మంచిది అని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే, కరోనా వైరస్సంక్రమించి దాని వలన ముప్పుకంటే, వ్యాక్సిన్ వలన వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువ అని. ఇప్పటి దాకా వ్యాక్సిన్ తీసుకోవడం వలన వచ్చే చిన్నచిన్న ఇబ్బందులే అంటే, జర్వం, ఒళ్లునొప్పులు, వంటివే గర్భవతులకు కూడా రావచ్చు. దానికి పారసిటబాలు మాత్ర వేసుకోవచ్చు. ఎవరిలోనైనా అరుదుగా ఏ వ్యాక్సిన్‌కైనా వచ్చే తీవ్రమైన రియాక్షన్లు, దీనిలో కూడా ఉండవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన యాంటిబాడీస్ తయారయ్యి అవి పిండంలోని బిడ్డకు కూడా చేరతాయి. దీంతో తల్లిబిడ్డల క్షేమంగా ఉండేటట్లు చేయడం జరిగింది. మొదటి దశతో పోలిస్తే, ఈ సెకండ్ వేవ్‌లో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువ గర్భీణీలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అదృష్టం కొద్ది మొదట్లోనే దీనిని గుర్తించి పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే చాలా వరకు సురక్షితంగా బయట పడుతున్నారు. ఇక దీర్షకాల వ్యాధులు ఉన్న గర్భవతులు, అధిక వయసు, అధిక బరువు ఉన్న వారిలో కొంచెం వ్యాధి తీవ్రత ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వీరు కొంచెం వ్యాధి తీవ్రతను బట్టి ఎక్కువగా జాగ్రత్తలు, ముందుగానే వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గర్భవతులైన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. మనదేశంలో గర్భీణీలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చుననే ఖచ్చితమైన మార్గదర్శకాలు వచ్చే వరకు ఆగి చూడాల్సి ఉంటుంది. ఈ లోపల ఒకవేళ వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి వస్తే గర్భీణీలు వారి డాక్టర్‌తో సంప్రదించి కొంత రిస్క్‌పైన వ్యాక్సిన్ తీసుకోవలసి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ వేసుకోవటం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు మాత్రం కొనసాగించవలసిందే. ఎందుకంటే వ్యాక్సిన్ నూటికి నూరుశాతం కరోనా వైరస్‌ను అరికడుతుంది అని నిర్ధారణ కాలేదు. కాబట్టి, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మళ్లీ కరోనా వచ్చినా, వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకుండా చాలా వరకు సురక్షితంగా బయటపడుతుండటం గమనించాలి. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ చదవండి: తల్లి ద్వారా కడుపులో బిడ్డకు కోవిడ్?.. నిరూపించిన హైదరాబాద్ డాక్టర్ -
నాకిప్పుడు ఐదో నెల, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మేడం.. నా వయసు 23 ఏళ్లు. నాకు పెళ్లయి రెండేళ్లవుతోంది. నాకిప్పుడు ఐదో నెల. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో నాకు డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? – ప్రమీల, నందికొట్కూరు సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, అధిక బరువు, వయసు పెరగడం, శరీరతత్వం బట్టి, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల రక్తంలో షుగర్ శాతం పెరగడం జరుగుతుంది. దానిని డయాబెటిస్‌గా గుర్తిస్తారు. ముందు నుంచి షుగర్ లేకుండా గర్భధారణ సమయంలోనే షుగర్ పెరగడాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది. ముందు నుంచే ఘగర్ ఉండి తర్వాత గర్భం దాలిస్తే దానిని ప్రీ–డయాబెటిస్ అంటారు. నీకు ఇప్పుడు వయసు 23 సంవత్సరాలే. నీ బరువు, ఎత్తు ఎంత ఉన్నావో రాయలేదు. ఈ వయసుకు ఐదో నెలకే డయాబెటిస్ ఉందని తేలింది. అంటే, మీ కుటుంబంలో తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉందా అని తెలియవలసి ఉంది. షుగర్ లెవెల్స్ ఇప్పుడే పెరిగాయా? ముందు రక్త పరీక్షలు చేయించుకోలేదు కాబట్టి ముందు నుంచే ఉండి తెలియకుండా ఉండవచ్చు కూడా. ఒకసారి రక్త పరీక్షలలో హెచ్‌బీఏ1సీ అనే పరీక్ష చేయించుకుంటే ముందు మూడు నెలల నుంచి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. కాబట్టి, డయాబెటిస్ ముందు నుంచి ఉందా లేదా ఇప్పుడే వచ్చిందా అనేది అంచనా వెయ్యవచ్చు. డయాబెటిస్ ప్రెగ్నెన్సీలోనే వస్తే, సరైన చికిత్సతో షుగర్ లెవెల్స్ అదుపులో పెట్టుకుంటే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్ ఎక్కువ లేకుండా బయటపడచ్చు. ఒకవేళ నీకు హెచ్‌బీఏ1సీ ఎక్కువ ఉంటే డయాబెటిస్ ముందు నుంచే ఉండి ఉండవచ్చు. డయాబెటిస్ ముందు నుంచే ఉండి, షుగర్ అదుపులో లేకపోతే మొదటి మూడు నెలల్లో అబార్షన్లు, బిడ్డ ఎదుగుదలలో, గుండె, వెన్నుపూస వంటి అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్మనీరు పెరగటం, బిడ్డ బరువు అధికంగా పెరగటం, నెలలు నిండకుండా కాన్పు అవ్వటం, మరీ షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే బిడ్డ కడుపులోనే చనిపోవటం, సాధారణ కాన్పు సమయంలో ఇబ్బందులు, సిజేరియన్ ఆపరేషన్ అవసరం ఎక్కువగా ఉండడం, కాన్పు తర్వాత అధిక రక్తస్రావం వంటి సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే డయాబెటిక్, లేదా జనరల్ ఫిజీషియన్, లేదా ఎండోౖక్రెనాలజిస్ట్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా షుగర్ టెస్టులు చేయించుకుంటూ, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవటానికి, వారి సలహా మేరకు మెట్ఫార్మిన్ మాత్రలు, ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటూ, మితమైన ఆహార నియమాలు(ఆహారంలో అన్నం తక్కువ, తీపి పదార్థాలు తక్కువ తీసుకుంటూ) పాటించవలసి ఉంటుంది. నీకు ఇప్పుడు ఐదవ నెల కాబట్టి, 18–20 వారాల సమయంలో టిఫా స్కానింగ్ చేయించుకుంటే అందులో బిడ్డలో అన్ని అవయవాలు సరిగా ఉన్నాయా, ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. అలాగే 6వ నెలలో ఫీటల్ 2డి ఇకో స్కానింగ్ చేయించుకుంటే గుండెలో రంధ్రాలు, ఇంకా ఏమైనా లోపాలు ఉంటే తెలుస్తాయి. గైనకాలజిస్ట్ దగ్గర క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకుంటూ, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది అని 8వ నెలలో స్కానింగ్, 9వ నెలలో డాప్లర్ స్కానింగ్ వంటివి చేయించుకుంటూ, డాక్టర్ సూచనలు పాటిస్తూ, వారిచ్చిన ఐరన్, కాల్షియం ఇంకా అవసరమైన మందులను వాడుకుంటూ ఉంటే, కాంప్లికేషన్స్ ముందుగా గుర్తించే అవకాశాలు ఉంటాయి. అలాగే సమస్యలు ఎక్కువ కాకుండా తగిన సమయానికి పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. - డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
బైక్ రైడింగ్‌తో నడుమునొప్పా.. అయితే ఇది మీకోసమే!
సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని నిర్ణీత ప్రమాణాలను పాటిస్తుంటారు. బైక్ నడుపుతున్నప్పుడు ఆయా అవయవాలపై ఒత్తిడి పడకుండా ఉండేలాంటి (ఎర్గానమిక్స్) జాగ్రత్తలతో వాటిని తయారు చేస్తుంటారు. దాంతో దాదాపుగా అవయవ సమస్యలు రావు. ఒకవేళ బైక్‌లోని హ్యాండిల్‌బార్, సీట్, ఫుట్రెస్ట్స్ వంటి వివిధ అంశాలు సరైన ప్రమాణాలతో లేకపోతే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలా బైక్ ఎర్గానమిక్స్ సరిగా లేక నడుమునొప్పి వస్తుందని అనుమానిస్తుంటే ఈ కింది జాగ్రత్తలు పాటించడం మంచిది. ►బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. అలాగని మరీ దగ్గరగా కూడా ఉండకూడదు. ఈ రెండు అంశాల్లో ఎక్కడ తేడా వచ్చినా నడుమునొప్పి రావచ్చు. ►బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. నడుమునొప్పితో బాధపడేవారు తమ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, అలాగే వారు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి తగ్గవచ్చు. ఈ జాగ్రత్తల తర్వాత కూడా నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడమే మంచిది. -
ఉప్పును ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఉప్పు రక్తపోటును పెంచుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే హైబీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఉప్పు వల్ల రక్తపోటు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. మనం ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కవగా తీసుకున్నప్పుడు... ఆ ఉప్పు ద్వారా సోడియం అనే మూలకం రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరుతుంది. ఇలా చేరిన ఆ సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల నరాల లోపల రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోయి, రక్తపోటు పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందుకే సాధ్యమైనంతవరకు మన ఆహారపదార్థాల్లో ఉప్పును పరిమితంగా తీసుకోవడమే మంచిది. ఇక ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువకాలం నిల్వ ఉంచేలా తయారు చేసే బేకరీ ఐటమ్స్ పరిమితంగా తీసుకోవాలి. హైబీపీ ఉన్నవాళ్లు వాటిని తీసుకోకపోవడమే మంచిది. -
నాకు పిల్లలు కలిగే అవకాశం ఉందా?
నా వయసు 36 ఏళ్లు. బరువు 83 కేజీలు. ఎత్తు 5.2. రెండేళ్ల కిందటే పెళ్లయింది. నాకు చిన్నప్పటి నుంచే టైప్–1 డయాబెటిస్ ఉంది. ఇంకా పిల్లల్లేరు. డాక్టర్ సూచనపై పరీక్షలు చేయించుకుంటే పీసీఓడీ అని తేలింది. నాకు పిల్లలు కలిగే అవకాశం ఉంటుందంటారా? నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – అనిత, ఆదిలాబాద్ మీ ఎత్తు 5.2కి సాధారణంగా 50 నుంచి 57 కిలోల వరకు బరువు ఉండొచ్చు. కాని మీరు 83 కేజీలు ఉన్నారు. అంటే దాదాపు 25 కేజీల అధిక బరువు ఉన్నారు. టైప్ 1 డయాబెటిక్ ఉన్నప్పుడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల జన్యుపరమైన కారణాల వల్ల పీసీఓడీ కూడా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. అధికబరువుతో పాటు పీసీఓడీ ఉండడం వల్ల హార్మోన్ల అసమతుల్యత చాలా ఎక్కువగా ఉండి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యలు ఏర్పడి సాధారణంగా గర్భం దాల్చడానికి ఆలస్యం, ఇబ్బంది ఏర్పడుతుంది. గర్భం రావడానికి ఇబ్బంది ఒకటే కాకుండా మీకు ఉంటే డయాబెటిస్, పీసీఓడీ మరియు అధికబరువు వల్ల బీపి, గుండె సమస్యలు, రక్తనాళాలలో రక్తం గూడుకట్టడం, స్ట్రోక్ వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ వయసు 36 సంవత్సరాలు కాబట్టి ఎక్కువ సమయం వృథా చెయ్యకుండా గర్భం కోసం ప్రయత్నం, చికిత్స తీసుకునే ముందు, బరువు తగ్గడానికి డైటీషియన్ పర్యవేక్షణలో మితమైన ఆహార నియమాలను పాటిస్తూ, నడక, యోగా, ఏరోబిక్స్ వంటివి నిపుణుల సలహా మేరకు కొద్దిగా ఎక్కువ సమయం చేస్తూ తొందరగా బరువు తగ్గడం మంచిది. బరువు తగ్గినప్పుడు కొందరిలో సాధారణంగానే గర్భం నిలుస్తుంది. లేని పక్షంలో బరువు తగ్గి గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో అవసరమైన పరీక్షలు చేయించుకుని అండం పెరుగుదలకు మందులు వాడుతూ గర్భం కోసం ప్రయత్నం చెయ్యవచ్చు. బరువు తగ్గకుండా షుగర్ అదుపులో లేకుండా గర్భం కోసం మందులువాడినా, గర్భం నిలిచినా, చాలామందిలో గర్భం అబార్షన్లు అవ్వడం, గర్భం సరిగా పెరగకపోవడం, బిడ్డలో అవయవలోపాలు, మీకు బీపీ పెరగడం, షుగర్ అదుపులో లేక ఎక్కువ మోతాదులో మందులు వాడటం, నెలలు నిండకుండా కాన్పు అవ్వడం, బిడ్డ అధికబరువు, లేదా బీపీ వల్ల బరువు సరిగా పెరగకపోవడం, కాన్పు సమయంలో ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా పైన చెప్పిన సలహాలను పాటిస్తూ.... బరువు తగ్గి, గర్భం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడున్న చికిత్సలతో మీకు తప్పకుండా గర్భం నిలుస్తుంది. - డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
ఆ సమయంలో విపరీతమైన నొప్పి.. ఎందుకిలా?
మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. ఏడాది కిందట రజస్వల అయింది. నెలసరి వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. చదువు మీద దృష్టి పెట్టలేకపోతోంది. దయచేసి పరిష్కారం సూచించగలరు.– రత్నమాల, పెదపాడు సాధారణంగా పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ తగ్గిపోయి, ఆ నెలలో అప్పటి వరకు పెరిగిన ఎండోమెట్రియమ్ పొరకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. దానివల్ల ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం నుంచి విడిపోయి, నొప్పితో పాటు బ్లీడింగ్ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఈ హార్మోన్స్ వల్ల గర్భాశయాన్ని కుంచించుకుని, బ్లీడింగ్ బయటకు రావడం జరుగుతుంది. దాని వల్ల కూడా నొప్పి ఉండవచ్చు. కొందరిలో నొప్పి ఒకరోజు ఉంటుంది. కొందరిలో బ్లీడింగ్ అయినన్ని రోజులూ నొప్పి ఉండవచ్చు. ప్రోస్టాగ్లాండిన్స్ విడుదలయ్యే మోతాదును బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరిలో అసలు ఎలాంటి నొప్పీ ఉండదు. కొందరిలో తక్కువ నొప్పి, కొందరిలో ఎక్కువ నొప్పి ఉండవచ్చు. ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్లు వేరే అవయవాల మీద కూడా ప్రభావం చూపడం వల్ల కొందరిలో పొత్తికడుపులో నొప్పితో పాటు నడుంనొప్పి, వాంతులు, మోషన్స్, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. ఈ కారణాల వల్ల వచ్చే నొప్పి వల్ల అసౌకర్యం, ఇబ్బంది తప్ప వేరే ప్రమాదమేమీ ఉండదు. కాబట్టి ఈ సమయంలో నొప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతుంటే, నొప్పి ఉన్నన్ని రోజులు రోజుకు రెండుసార్లు నొప్పి నివారిణి మాత్రలు వేసుకోవచ్చు. అలాగే పొత్తికడుపు మీద వేడినీటితో కాపడం పెట్టుకోవచ్చు. ప్రాణాయామం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం మంచిది. ఈ వయసులో అరుదుగా గర్భాశయ నిర్మాణంలో తేడాల వల్ల బ్లీడింగ్ గర్భాశయంలోకి వెలువడినట్లే పొత్తికడుపులోకి వెళ్లవచ్చు. అలా కొందరిలో ఎండోమెట్రియమ్ పొర పొత్తికడుపులో పాతుకుని, ఎండోమెట్రియాసిస్ అనే సమస్య మొదలు కావచ్చు. దీనివల్ల కూడా నొప్పి తీవ్రత పెరగవచ్చు. ఏది ఏమైనా పైన చెప్పిన సలహాలను పాటిస్తూ, ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి వారి సలహాలను పాటించడం మంచిది. నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.1, బరువు 78 కిలోలు. పెళ్లి కాలేదు. నేను హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటున్నాను. ఏడు నెలలుగా నాకు నెలసరి రావడం లేదు. ఇదివరకు బాగానే వచ్చేది. ఇలా ఎందుకు జరుగుతోంది. నాకు భయంగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. –నాగజ్యోతి, విశాఖపట్నం మీ ఎత్తుకి 47 కిలోల నుంచి 55 కిలోల వరకు బరువు ఉండవచ్చు. మీ బరువు 78 కిలోలు– అంటే, ఉండాల్సిన దాని కంటే దాదాపు ఇరవై కిలోలకు పైగానే బరువు ఉన్నారు. అధిక బరువు వల్ల హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలు ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. అలాగే అధిక బరువు వల్ల చిన్న వయసులోనే బీపీ, సుగర్, ఆయాసం, నడుంనొప్పి, మోకాళ్ల నొప్పులు వంటివి రావచ్చు. కాబట్టి నువ్వు మొదట బరువు తగ్గడానికి ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వాకింగ్ లేదా ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏడునెలల నుంచి పీరియడ్స్ రాలేదు కాబట్టి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి సీబీపీ, ఆర్బీఎస్, ఎస్ఆర్టీఎస్హెచ్ వంటి రక్తపరీక్షలు, పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని, సమస్యను బట్టి బరువు తగ్గడంతో పాటు ఇతర చికిత్సలు తీసుకోవడం మంచిది. -డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
డయాబెటిస్‌కు ఇలా చెక్ పెట్టొచ్చు..
అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 463 మిలియన్ల మంది డయాబెటిస్ రోగులున్నారు. ఒక్క దక్షిణాసియా (ఎస్‌ఇఎ)ప్రాంతంలో 88 మిలియన్ల బాధిఉతులుండగా, అందులో 77 మిలియన్ల మంది కేవలం మన దేశం నుంచే ఉన్నారని అంచనా. మరోవైపు దేశంలో అనారోగ్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో 2శాతం మరణాలకు డయాబెటిస్ ప్రధాన కారణం అవుతోంది. ఈ గణాంకాలు మన దేశంలో చక్కెర వ్యాధి మోగిస్తున్న ప్రమాద ఘంటికలకు అద్దం పడుతోంది. ఇప్పటి దాకా ఈ వ్యాధికి శాశ్వతమైన చికిత్స లేని నేపధ్యంలో డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రామ్ చాలా వరకు ఆ లోటును పూడుస్తోంది. దీనికో ఉదాహరణ... ఫెర్టిలిటీ చికిత్సలో భాగంగా నిర్వహించిన రొటీన్ వైద్య పరీక్షల సందర్భంగా ఏలూరుకు చెందిన శ్రీకి డయాబెటిస్ ఉందనే విషయం వెల్లడైంది. అతని రక్తంలో సగటు చక్కెర నిల్వలు 320 వరకున్నాయి. అనంతరం దీనికి సంబంధించి చేసిన వైద్య పరీక్షల్లో అతని కిడ్నీలు, కళ్లకు కూడా సమస్యలున్నట్టు స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో గత జూలైలో డయాబెటిస్ రివర్సల్ ప్రొసీజర్ అమలు చేశారు. దీంతో 5 నెలల్లో ఆయన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి తగ్గిపోయాయి. డయాబెటిస్‌కి ఆ తర్వాత మందులు వాడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. డయాబెటిస్ తగ్గుముఖం పట్టిన కారణంగా కిడ్నీసమస్య, కంటి చూపు సమస్య కూడా పరిష్కారమయ్యాయి. టైప్ 2కి ఉపయుక్తం... టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు దీర్ఘకాలిక పరిష్కారంగా పలు పరిశోధనల్లో నిరూపితమైన రివర్సల్ డయాబెటిస్‌ను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే ఇది దీర్ఘకాలంగా ఉండి, ఎక్కువ పరిమాణంలో ఇన్సులిన్ అవసరం పడుతున్నట్టయితే రివర్సల్ అవకాశాలు స్వల్పం. టైప్ 2 డయాబెటిస్ అయితే.. తొలి నాళ్లలో రివర్సల్ని ఎంచుకోవచ్చు. ఇది శాశ్వతమైన పరిష్కారమా అనే ప్రశ్నకు సమాధానం డయాబెటిస్ అనంతరం రోగి ఎంచుకున్న జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. గతంలో డయాబెటిస్ రావడానికి కారణమైన తరహా జీవనపు అలవాట్లకు రోగి తిరిగి మళ్లితే... మళ్లీ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయితే మంచి అలవాట్లను ఎంచుకుంటే మాత్రం దీర్ఘకాలం డయాబెటిస్ సమస్యలేని స్థితి కొనసాగించవచ్చు. ఏదేమైనా... ఇప్పుడు ఏ వ్యక్తి టైప్ 2 డయాబెటిస్ రోగిగా తేలినప్పుడు.. దీర్ఘకాలం మందుల వాడకానికి బదులుగా.. వెంటనే రివర్సల్‌కు వెళ్లడం సరైన పరిష్కారమే. –డా. మురళీ కృష్ణ గంగూరి, కన్సల్టెంట్ డయాబెటిస్, ఎండోక్రనాలజీ -
మేనరికపు పెళ్లిళ్లా, జర ఆలోచించండి!
మేనరికపు పెళ్లిళ్లు లేదా రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహాలు జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో అంగవైకల్యాలు, ఆరోగ్య సమస్యలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం. సంక్షిప్తంగా చెప్పాలంటే... బిడ్డకు తల్లి నుంచి 23, తండ్రి నుంచి∙23 క్రోమోజోములు వస్తాయి. ఈ క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే బిడ్డలకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాయి. కాసేపు దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాదని అనుకుందాం. అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉందనుకుంటే... తల్లి తాలూకు మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అవుతుంది. అదే తల్లిలో ఉండే లోపభూయిష్టమైన అదే తరహా జన్యువును తండ్రి తాలూకు జన్యువు డామినేట్ చేసి, బిడ్డలో లోపం రాకుండా చూస్తుంది. కానీ ఇద్దరూ ఒకే కుటుంబాలకు సంబంధించిన వారైతే ఒకవేళ ఇద్దరిలోనూ సదరు సమాచారాన్ని తీసుకెళ్లే జన్యువులో లోపం ఉందనుకుందాం. అప్పుడు దాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు ఏదీ లేకపోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. చదవండి: అది అఫైర్ కాదు, ఆమె మీద నాకున్న ప్రేమ! -
నా వయసు 32, ఎంత కాలం ఆగాలి?
నా వయసు 32 సంవత్సరాలు. రెండేళ్ల కిందట నాకు సిజేరియన్ కాన్పు జరిగింది. బిడ్డ ఎదురు కాళ్లతో ఉండటం వల్ల సిజేరియన్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు నేను మళ్లీ గర్భిణిని. ఏడోనెల. ఈసారి సాధారణ కాన్పు కోసం ప్రయత్నించవచ్చా? కాన్పు తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే ఎంతకాలం ఆగాల్సి ఉంటుంది? – శైలజ, కర్నూలు సాధారణ కాన్పు అవ్వాలి అంటే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. వీటిలో మొదటిది బిడ్డ బరువు, బిడ్డ తల పొజిషన్, ఉమ్మనీరు వంటివి. రెండవది తల్లి శారీరక, మానసిక పరిస్థితి, అదుపులో లేని బీపీ, షుగర్, ఇంకా ఇతర మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? బిడ్డ బయటకు వచ్చే దారి పెల్విస్ ఎలా ఉంది? వంటి అంశాలు. మూడవది కాన్పు సమయంలో నొప్పులు ఎలా ఉంటాయి? వాటికి గర్భాశయ ద్వారం ఎలా తెరుచుకుంటుంది, బిడ్డ తల దిగుతుందా లేదా, నొప్పుల వల్ల బిడ్డ మీద భారం పడి గుండె కొట్టుకోవడం తగ్గిపోవడం, ఆయాసపడి బిడ్డ తల్లి గర్భంలోనే మలవిసర్జన చేసి, అది మింగేయడం, దానివల్ల ప్రాణాపాయ స్థితి వంటి ఎన్నో అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. మొదటి రెండు అంశాలను కాన్పుకి ముందు అంచనా వేయవచ్చు. కానీ, మూడో అంశం మాత్రం కాన్పు నొప్పులు మొదలయిన తర్వాతనే తెలుస్తుంది. మీకు మొదటిది సిజేరియన్. ఇందులో గర్భాశయం మీద గాటు పెట్టి బిడ్డను బయటకు తీసి మళ్లీ కుట్లు వేయడం జరుగుతుంది. మళ్లీ గర్భం దాల్చి, బిడ్డ పెరిగే కొలదీ గర్భాశయం కూడా సాగడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంతకుముందు ఆపరేషన్ చేసిన కుట్ల దగ్గర పలుచబడడం జరుగుతుంది. సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు, కాన్పు నొప్పులు మొదలయినప్పుడు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, ముందు కుట్లు సాగే తీరును బట్టి, వాటి పటిష్టతను బట్టి, కొందరిలో పలుచబడిన కుట్లు పగిలిపోయి గర్భసంచి తెరుచుకుని బిడ్డ కడుపులోకి వచ్చి రక్తసరఫరా ఆగిపోయి బిడ్డ చనిపోవటం, కుట్లు పగిలి తల్లిలో విపరీతమైన రక్తస్రావం జరిగి ప్రాణాంతకం అయ్యే పరిస్థితులు ఉండవచ్చు. కొందరిలో అంతా సజావుగానే జరిగి సాధారణ కాన్పు జరగవచ్చు. కానీ, ఎవరికి ఎలా జరుగుతుంది అనేది ముందుగానే ఊహించి చెప్పడం కష్టం. ఆపరేషన్ తర్వాత కాన్పుకి కాన్పుకి కనీసం మూడు సంవత్సరాలైనా గ్యాప్ ఉండి, మొదటి రెండు అంశాలు అంటే బిడ్డ మరీ ఎక్కువ బరువు లేకుండా ఉండి, తల కిందకు ఉండి, ఉమ్మనీరు సరిపడా ఉండి, పెల్విస్ వెడల్పుగా ఉండి, బిడ్డ బయటకు వచ్చేందుకు అనువుగా ఉంటే, అప్పుడు డాక్టరు పైన చెప్పిన ప్రమాదాల గురించి వివరించి, మీరు ఆ రిస్కులను తీసుకునేందుకు అంగీకరిస్తే అప్పుడు సాధారణ కాన్పుకి నొప్పులు వాటంతట అవి వచ్చేవరకు ఆగి ప్రయత్నం చెయ్యడం జరుగుతుంది. దీనినే వీబీఏసీ (వజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్) అంటారు. కానీ, ఈ ప్రయత్నం 24 గంటలూ గైనకాలజిస్టులు, మత్తు డాక్టర్లు, పిల్లల డాక్టర్లు ఉండే, అన్ని వసతులూ కలిగి ఉన్న హాస్పిటల్లోనే చెయ్యటం మంచిది. దీనివల్ల ఉన్నట్లుండి కుట్లు పగిలేటట్లు ఉన్నాయి లేదా పగిలిపోయాయి అనగానే నిమిషాలలో ఆపరేషన్ చేసి, బిడ్డను బయటకు తీసి ఇద్దరినీ కాపాడే ప్రయత్నం చేయవచ్చు. కొన్నిసార్లు ఎన్ని చేసినా బిడ్డను కాపాడలేకపోవచ్చు. తల్లిలో రక్తస్రావం అధికమయ్యి ప్రాణాపాయస్థితికి చేరవచ్చు. మీకు మొదటి బిడ్డ ఎదురుకాళ్లతో(బ్రీచ్ పొజిషన్) ఉంది. ఇప్పుడు ఏడో నెలనే. కాన్పు సమయానికి ఏ పొజిషన్లో ఉంటుందో ఎదురుచూడవలసి ఉంటుంది. కాకపోతే మీకు ముందు సిజేరియన్ అయ్యి రెండు సంవత్సరాలే అవుతోంది. కాబట్టి ఒకసారి మీ కండిషన్ తెలిసిన గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేసి చూడండి. మామూలుగా అయితే రెండోది సిజేరియన్ ఆపరేషన్ అయితే, ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన తర్వాత పిల్లల డాక్టర్ బిడ్డను 5 నిమిషాలు పరీక్ష చేసి, ఆ సమయంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని చూసి, ఎలా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. బాగుంది అంటే సిజేరియన్ సమయంలోనే పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడే పుట్టిన పిల్లల్లో వందలో ఒక్కరికో ఇద్దరికో కొన్ని ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వెంటనే బయటపడకపోవచ్చు. పుట్టిన వెంటనే బాగానే ఉన్నా కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజులు, నెలల తర్వాత కొన్ని తీవ్రమైన సమస్యలు బయటపడి, అవి ప్రాణాంతకమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుత కాలంలో అందరికీ 6 నెలల తర్వాత, బిడ్డ పెరిగి అంతా బాగుంటే అప్పుడు ట్యూబెక్టమీ ఆపరేషన్ చెయ్యించుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాపరోస్కోపీ ద్వారా చెయ్యించుకోవచ్చు. లేదు ఎలాగైనా సిజేరియన్లోనే చేసేయ్యండి అని సంతకం పెడితే అందులోనే ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చెయ్యడం జరుగుతుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా?
మేడమ్! నా వయసు 32 సంవత్సరాలు, బరువు 80 కిలోలు. రీసెంట్గా డీ అండ్ సీ, ఇంకా రైట్ ఎక్టోపిక్ లాపరోస్కోపీ సర్జరీ జరిగింది. లాపరోస్కోపీ సర్జరీ అంటే ఏంటి? సర్జరీలో ఎఫెక్ట్ అయిన ట్యూబ్‌కే కాకుండా, సెకండ్ ట్యూబ్‌కి కూడా బ్లాకేజెస్ ఉన్నాయా అని చెక్ చేస్తారా? హెచ్ఎస్జీ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉందా? నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? గతంలో నాకు పీసీఓడీ కూడా ఉండేది. సర్జరీ తర్వాత స్కాన్ చేస్తే అందులో పీసీఓడీ సింప్టమ్స్ ఏమీ లేవు. ఇప్పుడు నేను ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. – భావన (ఈ–మెయిల్) బరువు 80కిలోలు అన్నారు. ఎత్తు ఎంత ఉన్నారు అని రాయలేదు. అయినప్పటికీ 80కిలోలు అంటే కొద్దిగా అధిక బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. అధిక బరువు వల్ల కూడా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి పీసీఓడీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పెల్విక్ స్కానింగ్‌లో రెండు రకాలుగా చేస్తారు. ట్రాన్స్‌అబ్డామినల్ స్కానింగ్ అంటే నీరు బాగా తాగిన తర్వాత పొట్టపైన నుంచి చేస్తారు. ఇందులో పొట్టలావుగా ఉండి పొత్తికడుపు దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు కొందరిలో నీటి బుడగలు పీసీఓడి, గర్భాశయంలో కొన్ని సూక్ష్మమైన సమస్యలు అంతగా తెలియకపోవచ్చు. అలాంటప్పుడు కొన్ని గర్భాశయంలో, అండాశయంలో సమస్యలను గుర్తించలేకపోవచ్చు. పెళ్ళయిన వారికి ట్రాన్స్‌వెజైనల్ స్కానింగ్ (టీవీఎస్) అంటే యోని ద్వారం నుంచి స్కానింగ్ చేస్తారు. ఇందులో అండాశయంలో ఉండే నీటి బుడగల సమస్య, ఒవేరియన్ సిస్ట్లు, అవి ఎలాంటివి, గర్భాశయంలో గడ్డలు, కంతులు, ఇన్ఫెక్షన్లు, ఇంకా ఇతర చిన్నచిన్న సమస్యలను వివరంగా గుర్తించవచ్చు. నీకు ముందు పీసీఓడి ఉండి, ఇప్పుడు లేదు అంటున్నారు అంటే అబ్డామినల్ స్కానింగ్ చెయ్యడం వల్ల సరిగా కనిపించకపోయి ఉండవచ్చు, లేదా కొందరిలో వయసు పెరిగే కొద్దీ అండాలు తగ్గే క్రమంలో అండాశయాలు మామూలుగా ఉండవచ్చు. మీకు పీరియడ్స్ నెలనెలా సక్రమంగా వస్తున్నాయా లేదా అనేది తెలియవలసి ఉంది. నెలనెలా పీరియడ్స్ సక్రమంగా ఉంటే చాలావరకు ఒక నెల ఒక అండాశయం నుంచి, ఇంకొక నెల ఇంకొక అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. నీకు లాపరోస్కోపీ సర్జరీలో కుడిట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) వల్ల ఆ ట్యూబ్‌ని తొలగించి ఉంటారు. కాబట్టి ఇంకొక ట్యూబ్ సరిగా ఉంటే, ఎడమవైపు అండం విడుదలయిన నెలలో గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. పొట్టలో కొన్నిరకాల సమస్యలకు, పొట్ట కోసి కాకుండా పొట్టపైన 25సెం.మీ గాటు పెట్టి కడుపులోకి కార్బన్డయాక్సైడ్ గ్యాస్‌ను పంపించి పొట్ట ఉబ్బిన తర్వాత 2 నుంచి 3, 0.5సెం.మీ గాట్లు పెట్టి టీవీలో చూస్తూ ఆపరేషన్ చెయ్యడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంకొక ట్యూబ్ ఎలా ఉందని చెక్ చెయ్యడం జరుగుతుంది. ఇంకొక ట్యూబ్ సరిగా ఉంటే మళ్ళీ మామూలుగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అప్పుడు చెక్ చెయ్యకపోతే, అవసరమనుకుంటే హిస్టరోసాల్సింగ్గ్రామ్ (హెచ్‌ఎస్‌జి) పరీక్ష ద్వారా, ఇంకొక ట్యూబ్‌లో బ్లాకేజీలు ఉన్నాయా లేదా తెరుచుకుని ఉందా అని తెలుసుకోవడం జరుగుతుంది. మీకు ఆపరేషన్ ఈ మధ్యనే జరిగింది కాబట్టి, మూడునెలల తర్వాత మళ్ళీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. ఈ లోపల మీరు 80కేజీలు ఉన్నారు కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ, కొద్దిగా వాకింగ్, చిన్న వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నం చెయ్యడం మంచిది. ఆహారంలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) కొవ్వుపదార్థాలు తక్కువ తీసుకుంటూ, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం మంచిది. మీ వయసు 32 సంవత్సరాలు కాబట్టి, ఎక్కువ సమయం వృథా చేయకుండా మూడు నుంచి ఆరు నెలలలో గర్భం కోసం ప్రయత్నించి తర్వాత గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వారి సలహాలను పాటిస్తూ, అండం విడుదల అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఫాలిక్యులార్ స్టడీ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం మంచిది. మేడమ్, నమస్కారాలు! నా వయసు యాభై సంవత్సరాలు. కొన్నాళ్లుగా సుగర్ ఉన్నందువల్ల వైద్యం చేయించుకుంటున్నాను. మెన్సెస్ ఆగిపోయి ఐదు సంవత్సరాలైంది. ఎడమరొమ్ములో చిన్న కంతి ఏర్పడి నొప్పిగా ఉంటోంది. నుదురుపై రెండు కాయలు ఉన్నాయి. ఈ మార్పులు కేన్సర్ లక్షణాలేమోనని భయంగా ఉంది. మీ సలహా కోసం ఎదురు చూస్తున్నాను. –తంగేటి పాపాయమ్మ, ఏలేశ్వరం (తూ.గో.జిల్లా) 50 సంవత్సరాల వయసు కాబట్టి రొమ్ములో చిన్న కంతి నొప్పిగా కూడా ఉందంటున్నారు కాబట్టి మీకుమీరే భయపడుతూ అశ్రద్ధ, ఆలస్యం చేయకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదించి యుఎస్‌జి బ్రెస్ట్, మామోగ్రామ్, అవసరమైతే బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకుంటే ఈ కంతి సాధారణమైనదేనా లేక క్యాన్సర్‌కు సంబంధించినదా అని తెలుస్తుంది. కొందరిలో నొప్పితో కూడిన కంతి అంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా చీముగడ్డ లాగా కూడా అయ్యిండవచ్చు. కాకపోతే ఈ గడ్డ చాలా రోజుల నుంచి లేదా ఈ మధ్యనే వచ్చిందా అనేది తెలియవలసి ఉంది. సాధారణంగా రొమ్ములు అటూఇటూ కదిలే ఫైబ్రోఅడినోమా అనే గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే వాటిలో నొప్పి పెద్దగా ఏమీ ఉండదు. అవి మరీ పెద్దగా అయితే తప్ప, ముందు నుంచీ లేకుండా ఇప్పటికిప్పుడే కంతి అంటే సాధారణంగా అవి చీముగడ్డలు అయ్యిండవచ్చు. నుదిటి మీద కాయలు కూడా అనేక రకాల కారణాల వల్ల రావచ్చు. ఇవి ఈ మధ్యనే వచ్చాయా, లేక చాలా రోజుల నుంచి ఉన్నాయా అనేది చెప్పలేదు. ఏమైనప్పటికీ కూడా మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. - డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
మా అమ్మాయి పెళ్లికి పనికొస్తుందా?
మా అమ్మాయి వయసు 17 ఏళ్లు. ఇంతవరకు రజస్వల కాలేదు. వైద్యపరీక్షలు చేయించితే, అమ్మాయికి యుటెరస్, ఓవరీస్ లేవని చెప్పారు. మా అమ్మాయి పెళ్లికి పనికొస్తుందా? – త్రివేణి, మైసూరు ఆడవారిలో గర్భాశయం, అండాశయాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తయారవుతాయి. కాని కొందరిలో కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, ఎలాగైతే వేరే అవయవాలు సరిగా ఏర్పడవో అలాగే పుట్టుకతోనే కొందరిలో గర్భాశయం ఉండదు. కొందరు గర్భాశయంతోపాటు అండాశయాలు కూడా లేకుండా పుడతారు. వీరికి ఏ విధంగాను పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. వీరిలో కొందరిలో యోని భాగం బాగానే ఉంటుంది. కొందరిలో సరిగా ఉండదు. మూసుకుపోయి ఉంటుంది. యోని ద్వారం సరిగా ఉంటే పెళ్ళి చేసుకుంటే వైవాహిక జీవితానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ యోనిద్వారం మూసుకుపోయి ఉంటే పెళ్ళికి ముందే వెజైనోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా క్రింద నుండి యోనిభాగాన్ని తయారుచెయ్యడం జరుగుతుంది. దీనివల్ల కలయికకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ సమస్యలను పెళ్ళికి ముందే అబ్బాయికి, వారి తరఫు వారికి చెప్పి పెళ్ళి చెయ్యవలసి ఉంటుంది. లేకపోతే తర్వాత మనస్పర్థలు ఏర్పడి గొడవలు వస్తాయి. వీరికి అండాశయాలు లేకపోవడం వల్ల వీరి శరీరంలో నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి ఉండదు. దీనివల్ల వారికి వక్షోజాలు సరిగా పెరగక చిన్నగా ఉండటం, చంకల్లో, జననేంద్రియాల వద్ద రోమాలు లేకపోవడం, స్త్రీ శరీరాకృతి అంతగా ఉండకపోవడం, వయసుపెరిగే కొద్దీ ఎముకల దృఢత్వం తగ్గి ఆస్టియోపోరోసిస్ సమస్య తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరికి వారి శరీరతత్వాన్ని బట్టి డాక్టర్ పర్యవేక్షణలో సమయానుగుణంగా అవసరమైతే ఈస్ట్రోజన్ హార్మోన్స్‌లో చికిత్స (హార్మోన్ రీప్లేస్మెంట్) ఇవ్వవలసి ఉంటుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
ఈ మధ్యే పెళ్లైంది, ప్రయత్నిస్తే సమస్యలొస్తాయా?
నా వయసు 27 ఏళ్లు. పదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాను. దీనికి డాక్టర్లు చెప్పిన మందులు కూడా వాడుతున్నాను. నెల్లాళ్ల కిందటే నాకు పెళ్లయింది. ఫిట్స్ సమస్యకు మందులు వాడుతుండగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తే సమస్యలేవైనా వస్తాయా? దయచేసి వివరించగలరు. – రచన, తణుకు ఈ పది సంవత్సరాలలో ఫిట్స్ మళ్లీ వచ్చాయా, వస్తే ఎన్నిసార్లు వచ్చాయి? లేదా మందులు వాడటం వల్ల మళ్లీ అసలు ఫిట్స్ రాలేదా అనే అంశాలు తెలియవలసి ఉంది. ఈ మధ్యకాలంలో ఫిట్స్ రాకపోతే ప్రెగ్నెన్సీలో సమస్యలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే ఫిట్స్ మందుల మోతాదు కూడా ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉండదు. ఫిట్స్‌కు వాడే అనేక రకాల మందుల వల్ల పుట్టబోయే బిడ్డలో నాడీ వ్యవస్థలో లోపాలు, గుండె సమస్యలు వంటి అవయవలోపాలు ఏర్పడే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చకముందే మీ నరాల (న్యూరోఫిజీషియన్) డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వారు అతి తక్కువ దుష్ఫలితాలు ఉన్న మందులను వీలైనంత మోతాదులో అవసరాన్ని బట్టి మార్చి ఇవ్వడం చేస్తారు. కాబట్టి పుట్టబోయే బిడ్డలో సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా తగ్గుతాయి. గర్భం సమయంలో ఫిట్స్ మందులు న్యూరోఫిజీషియన్ పర్యవేక్షణలో సక్రమంగా వాడుతూ, గైనకాలజిస్ట్ దగ్గర నెలనెలా చెకప్‌లు, అవసరమైన పరీక్షలు, స్కానింగ్‌లు చేయించుకుంటూ ఉంటే, సమస్యలు ఎక్కువ లేకుండా పండంటి బిడ్డకు జన్మనివ్వచ్చు. మేడమ్! నా వయసు 38 సంవత్సరాలు. ఏడాదిగా నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం లేదు. పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా ఉంటోంది. కడుపులో నొప్పిగా ఉంటోంది. మా అమ్మ సర్వైకల్ కేన్సర్‌తో చనిపోయింది. నాకు కూడా కేన్సర్ వస్తుందేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – రాధ, చిత్తూరు ఈ వయసులొ పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్, కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నీ బరువు, ఎత్తు రాయలేదు. ఒక్కొక్కరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి, గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్, కంతులు, పాలిప్స్, అడినోమయోసిస్, అండాశయాలలో సిస్ట్లు, కంతులు వంటి కారణాలు ఉండవచ్చు. థైరాయిడ్ సమస్య వల్ల కూడా బ్లీడింగ్ కొందరిలో ఎక్కువ లేదా కొందరిలో తక్కువ అవ్వవచ్చు. ఈ వయసులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లో ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కాని ఇందులో బ్లీడింగ్ మధ్యమధ్యలో కూడా ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉండదు. కానీ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఇలా ఉండవు. ఇందులో తెల్లబట్టతో పాటు ఎరువు జీరలు లాగా అంటే స్పాటింగ్ లాగా ఉండటం వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరిలో లక్షణాలేమీ లేకుండా కూడా స్పెక్యులమ్ పరీక్ష, ప్యాప్‌స్మియర్, సర్వైకల్ బయాప్సి వంటి పరీక్షలలో నిర్ధారణ అవ్వవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశాలు, ఎండోమెట్రియల్, అండాశయ (ఒవేరియన్) క్యాన్సర్‌తో పోలిస్తే చాలా తక్కువ. ఏది ఏమైనప్పటికీ, నీ లక్షణాలతో ఇబ్బంది పడుతూ, నీకు నువ్వే ఏదో ఊహించేసుకుని భయపడుతూ ఉండే దానికంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, ప్యాప్‌స్మియర్, అల్ట్రాసౌండ్ పెల్విస్, సిబిపి, థైరాయిడ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్య ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకుని సరైన చికిత్స తీసుకోవడం మంచిది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
అబార్షన్: మందులు వాడినా ఫలితం లేదు
నా వయసు 29 సంవత్సరాలు. కొంతకాలంగా నెలసరి సమయంలో నాకు చాలా తక్కువగా రక్తస్రావం జరుగుతోంది. ఆ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటోంది. ఏడాది కిందట నాకు అబార్షన్ జరిగింది. ఆ తర్వాత నుంచే ఈ సమస్య మొదలైంది. నేను ప్రభుత్వాసుపత్రిలో చూపించుకుంటే, మందులు ఇచ్చారు. మందులు వాడినా ఫలితం పెద్దగా లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఉందా? – అవంతి, మెంటాడ (విజయనగరం జిల్లా) మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో హార్మోన్లలో అసమతుల్యత పెరిగి ఉన్నట్లుండి బరువు పెరగడం వల్ల, బ్లీడింగ్ కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో అండాశయాలలో నీటిబుడగలు, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి వంటి వాటివల్ల కూడా రక్తస్రావం కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల గర్భాశయ కండరాలు కుంచించుకున్నట్లయ్యి పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది. విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. కొందరిలో గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిన్ వంటి సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి విపరీతంగా ఉండవచ్చు. కొందరిలో చాలా అరుదుగా అబార్షన్ కోసం డి అండ్ సి ద్వారా గర్భాశయం శుభ్రం చేసినప్పుడు, ఎక్కువగా చెయ్యడం వల్ల గర్భాశయ పొర దెబ్బతినడం వల్ల బ్లీడింగ్ తక్కువగా అవ్వవచ్చు. అలానే ఎక్కువసార్లు అబార్షన్లు చెయ్యించుకోవడం వల్ల కొందరిలో అడినోమయోసిన్ అనే సమస్య ఏర్పడి కూడా పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సిబిపి, ఈఎస్ఆర్, ఎస్ఆర్–టిఎస్హెచ్, ఎస్.ఆర్.ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని పెల్విక్ స్కానింగ్ చేయించుకుని సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే బరువు ఎక్కువగా ఉంటే ఆహారనియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలు చెయ్యడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గి నీ సమస్య తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీకి ఎంత వెయిట్ ఉండాలి?
మేడం! నా వయసు 21 ఏళ్లు. ఎత్తు 5.5, బరువు 95 కిలోలు. నాకు ఎనిమిది నెలల కిందట పెళ్లయింది. ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. మా వాళ్లు నన్ను చాలా ప్రెషర్ చేస్తున్నారు. నేను, మావారు ప్రెగ్నెన్సీకి అన్ని విధాలా ట్రై చేస్తున్నాం. అయినా ఫలితం కనిపించడం లేదు. నేను ఎక్కువ వెయిట్ ఉండటం వల్లనే ప్రెగ్నెన్సీ రావడం లేదా? ప్రెగ్నెన్సీకి ఎంత వెయిట్ ఉండాలో చెప్పండి.. ప్లీజ్. – అంజు సీపాన (ఈ–మెయిల్) నీ ఎత్తుకి, నువ్వు 57–61 కేజీల మధ్య బరువు ఉండాలి. కాని నువ్వు 95 కేజీలు ఉన్నావు అంటే నువ్వు దాదాపుగా 35కేజీల అధిక బరువు ఉన్నావు. నీకు పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా? రావట్లేదా అనేది తెలియజేయలేదు. నీ వయస్సు ఇప్పుడు 21 సంవత్సరాలు మాత్రమే. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ప్రెగ్నెన్సీ కంటే ఆరోగ్యంగా ఉండటానికి, ప్రెగ్నెన్సీ రావాలన్నా, అందులో కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలన్నా బరువు తగ్గడమే ప్రధానం. అధిక బరువు వల్ల హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, అండం సరిగ్గా పెరగకపోవడం వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవచ్చు. మొదట నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అధిక బరువు వల్ల థైరాయిడ్ వంటి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి రక్తపరీక్షలు, స్కానింగ్ చేయించుకుని కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, గర్భాశయంలో సమస్యలు, అండాశయంలో సిస్ట్లు, నీటి బుడగలు (పీసీఓడీ) వంటి సమస్యలు, అండం పెరుగుతుందా లేదా అనే విషయాలను తెలుసుకోవడం మంచిది. ఆహారంలో అన్నం వంటి కార్బోహైడ్రేట్లు, స్వీట్లు, నూనె వస్తువులు, జంక్‌ఫుడ్‌లు బాగా తగ్గించి వీలైతే న్యూట్రీషనిస్ట్ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వాకింగ్, ఏరోబిక్ వ్యాయామాలు సక్రమంగా కొన్ని నెలల పాటు చేయడం వల్ల బరువు తగ్గి, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి చికిత్స తీసుకుని, తర్వాత గర్భం గురించి ఆలోచించడం మంచిది. బరువు తగ్గడం వల్ల హార్మోన్లు సక్రమంగా విడుదల అయ్యి, అండం పెరిగి, ఎటువంటి చికిత్స లేకుండానే 80–90 శాతం మందిలో ప్రెగ్నెన్సీ వస్తుంది. మిగతా 10–20శాతం మందిలో మందులతో ప్రెగ్నెన్సీ రావడానికి చికిత్స అవసరం పడవచ్చు. కాబట్టి నువ్వు ఉన్న 35కేజీలు అధిక బరువును తగ్గించడానికి ప్రయత్నం చెయ్యాలి. అందులో కనీసం 25కేజీల బరువన్నా తగ్గితే, నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అధికబరువు మీద గర్భం వచ్చినా, చాలామందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గర్భం సమయంలో ఇంకా బరువు పెరగడం వల్ల బీపీ, షుగర్ పెరిగి వాటివల్ల కాంప్లికేషన్స్ పెరగడం, నెలలు నిండకుండా కాన్పు అవ్వడం, కాన్పు సమయంలో సమస్యలు, తల్లి ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నీ వయసు చాలా చిన్నదే, ప్రెగ్నెన్సీ కంటే ముందు బరువు తగ్గడం పైన శ్రద్ధ పెట్టడం మంచిది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
టీనేజీలో గర్భం.. రిస్క్ ఉంటుందా?
లేటు వయసులో పిల్లల్ని కంటే మానసిక లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నట్టే చిన్న వయసులో కంటే కూడా అలాంటి రిస్క్ ఉంటుందా? ఎందుకంటే నాకు పదహారేళ్లకే పెళ్లయింది. ఇప్పుడు నాకు పందొమ్మిదేళ్లు. పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నేనేమో చదువు మీద దృష్టిపెట్టాను. మీ సమాధానం మీద నా భవిష్యత్ ఆధారపడి ఉంది మేడం... – దీపికా వత్సల, చెన్నూరు సాధారణంగా అమ్మాయి గర్భధారణకు శారీరకంగా మానసికంగా సిద్ధం అవ్వడానికి 21 సంవత్సరాలు నిండితే ప్రెగ్నెన్సీ సమయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో అమ్మాయి తన కాళ్ల మీద తను నిలబడటానికి, లోకజ్ఞానం తెలియడానికి చదువు కూడా చాలా ముఖ్యం. 21 సంవత్సరాలకు డిగ్రీ పూర్తవుతుంది. పెళ్లి తర్వాత పిల్లలను కని, పెంచడానికి, చదివించుకోవడానికి, కుటుంబం సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సామాజిక పరమైన ఉపయోగాలు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, అమ్మాయి శారీరకంగా పెరగడాని, పెల్విక్ ఎముకలు ధృడంగా తయారుకావడానికి, హర్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి 20 సంవత్సరాలు అవసరం. అంతకంటే ముందు గర్భధారణ వల్ల గర్భం సమయంలో రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, పెల్విక్ ఎముకలు దృఢంగా లేకపోవడం వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బందులు వంటి ఎన్నో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి మామూలు వయసు వారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తల్లిలో పోషకాల లోపం వల్ల కూడా బిడ్డలో మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఎలాగైతే 35 సంవత్సరాలు దాటాక పుట్టబోయే పిల్లల్లో మానసిక లోపాలతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, అలాగే మరీ చిన్న వయసులో గర్భం దాలిస్తే కూడా పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మీ ఇంట్లో వాళ్లకి పెళ్లయి మూడు నాలుగు సంవత్సరాలు దాటింది కనిపిస్తుంది కాని, నీ వయసు కనిపించట్లేదు. అందుకే వాళ్లు కంగారు పడుతున్నారు. ఇంతకు ముందు కాలంలో అయితే 15–20 సంవత్సరాల లోపలే పిల్లలను కనేవాళ్లు. అప్పటి కాలం పరిస్థితులు, వారి శరీరతత్వాలు, ఆహారపు అలవాట్లు, పనులు చేయడం వంటివి ఇప్పటి పిల్లలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి అప్పటి వారిలో, ఇప్పడు ఉన్నంత సమస్యలు ఉండేవి కావు. అలాగే తరాలు మారే కొద్దీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జన్యువులలో కూడా మెల్లగా మార్పులు వచ్చి, తద్వారా పుట్టబోయే పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీవారికి అర్థం అయ్యేటట్లు వివరించి, నీ చదువు పూర్తి చేసుకొని 21 సంవత్సరాలకు పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు. మా దూరపు బంధువుల ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్లది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ముల పిల్లలు అంటే వరుసకు అన్నా, చెల్లి అయ్యేవాళ్లు ప్రేమలో పడ్డారు. ఇంట్లోవాళ్లంతా షాక్ అయ్యి, కౌన్సెలింగ్ ఇప్పించి పెళ్లి ఆలోచనను మాన్పించి చదువు కోసం ఇద్దరినీ చెరో దేశం పంపించారు. అయితే ఆ పిల్లలిద్దరి వాదన ఏంటంటే.. సైంటిఫిక్‌గా బావామరదళ్ల వరస ఎలాగో అన్నదమ్ముల పిల్లల వరస కూడా అలాంటిదే. వాళ్లిద్దరి పెళ్లి సమ్మతమైనప్పుడు ఇది కూడా సమ్మతమే కావాలి కదా అని. నిజంగా ఈ వాదనలో నాకు నిజమే ఉన్నట్టనిపించింది. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే మా ఇంట్లోవాళ్లు మా అమ్మాయిని మా ఆడపడచు కొడుకుకి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. నాకస్సలు ఇష్టం లేదు. మా చుట్టాల పిల్లల వాదనకు సరిపడా మీ జవాబు ఉంటే ఇది చూపించి పెళ్లి ఆపించాలని నా ప్రయత్నం మేడం.. అర్థం చేసుకోగలరు. నిజం వివరించగలరు. – పేరు, ఊరు వివరాలు రాయలేదు. మన హిందూ సంప్రదాయంలో సాధారణంగా ముందు నుంచీ కూడా మేనమామ, మేనత్త పిల్లలను వరుస కలుపుకొని పెళ్ళి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, చిన్నమ్మ పిల్లలను తోబుట్టువులుగా, అన్నా చెల్లెలుగా పరిగణించడం జరుగుతుంది. అదే కొన్ని ఇతర మతాలలో పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలను వరుస కలుపుకుని పెళ్లి చేస్తుంటారు. ఇవన్నీ ఎవరి సంప్రదాయాలలో మత పెద్దలు నిర్ణయించిన దాన్నిబట్టి, వారి వారి ఆచారాలు, నమ్మకాలను బట్టి జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతవరకు సమంజసం, సామాజికంగా తప్పా, ఒప్పా అని చెప్పడం కష్టం. కాని సైంటిఫిక్‌గా, మెడికల్‌గా వైద్యభాషలో చెప్పాలి అంటే ఇలాంటి సంబంధాలు ఏమైనా మొదటితరం, రెండవతరంలో దగ్గరి రక్తసంబంధీకులలో పెళ్ళిళ్లు అంటే అదీ ఏవిధంగానైనా మేనరికం లేదా కన్సాంగ్వినస్ consanguinous పెళ్ళిళ్ళ కిందకే వస్తుంది. ఎలాగైతే మేనత్త, మేనమామ పిల్లలను పెళ్ళి చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలలో కొన్ని జన్యుపరమైన సమస్యలు, పిల్లలలో అవయవ లోపాలు వచ్చే అవకాశాలు, చుట్టరికం లేని వారికి పిల్లలలలో కంటే రెట్టింపు ఉంటాయో, అలాగే పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ పిల్లలతో పెళ్ళిళ్లు అయితే, వారి పిల్లలలో కూడా ఇలాంటి సమస్యల అవకాశం రెట్టింపే ఉంటుంది. కాబట్టి దగ్గర చుట్టాలలో, బంధువులలో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. -
రెండోసారీ రావొచ్చు
సాక్షి, అమరావతి: కరోనా రాకుండా తనను తాను కాపాడుకోవడం ఒకటైతే.. వచ్చాక కోలుకునే వరకూ జాగ్రత్తలు తీసుకోవడం మరొకటి. అయితే.. కొంతమంది ఒకసారి కరోనా సోకి తగ్గిపోతే తర్వాత తమనేమీ చేయదనుకుంటున్నారు. ఒకసారి కోలుకుంటే కరోనాను జయించినట్టేనని ధీమాగా ఉంటున్నారు. కానీ, ఒకసారి కరోనా వస్తే రెండోసారి రాకూడదనే నిబంధన ఎక్కడా లేదని.. రెండోసారి కూడా వచ్చిన వారు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ► ఉదాహరణకు విశాఖలోని వైరాలజీ ల్యాబ్‌లో పనిచేసే ఓ వ్యక్తికి రెండోసారి కూడా కరోనా వచ్చింది. ► ఒకసారి వచ్చి తగ్గిపోయింది కదాని మాస్కులు, శానిటైజర్ వాడకుండా ఇష్టారాజ్యంగా తిరగడం మంచిది కాదు. ► ఇమ్యూనిటీ తగ్గితే కరోనా వైరస్ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. ► ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే కరోనా ఎలా సోకదో.. అది లేకపోతే పదే పదే వచ్చే అవకాశమూ ఉంటుంది ► వైరస్ ఒకసారి సోకి కోలుకున్న తర్వాత కూడా యథావిధిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఇమ్యూనిటీని పెంచే ఆకు కూరలు, కాయగూరలు, గుడ్లు ఆహారంగా తీసుకోవాలి. తరచూ వ్యాయామం చేయాలి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న చోటే కరోనా ఈ వ్యాధి ఒక్కసారి వస్తే మళ్లీ రాదనేది ఎక్కడా లేదు. ఇమ్యూనిటీ ఎవరిలో తక్కువగా ఉంటే వారికి ఇది సోకుతుంది. ప్రధానంగా గుండె జబ్బులున్న వారు ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు వహించాలి. తరచూ వ్యాయామం చేస్తూ ఇమ్యూనిటీని పెంపొందించుకోవాలి. – డాక్టర్ కె.ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు -
ఆ ప్రభావం బేబీపై పడుతోందా?
∙మా పెద్దమ్మ కూతురు ప్రెగ్నెంట్. అయితే ఆమెకు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. ‘మెంటల్ డిజార్డర్’ ప్రభావం బేబీపై ప్రతికూలంగా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలియజేయగలరు. – జీఆర్, తాడేపల్లిగూడెం ఆమె మానసిక సమస్యలకు మందులు ఏమైనా వాడుతోందా లేదా తెలియవలసి ఉంది. అనేక రకాల మానసిక సమస్యలను మెంటల్ డిజార్డర్ అంటారు. మానసిక సమస్యలకు ముందు నుంచే మందులు వాడుతున్నట్లయితే, ఇప్పుడు గర్భంలోని శిశువుపై వాటిలోని కొన్ని రకాల మందుల వల్ల దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి డాక్టర్ని సంప్రదించి, వాటిలో ఏమైనా మార్పులు చెయ్యాలా, మోతాదు తగ్గించాలా అనే దానిపై సలహా తీసుకోవడం మంచిది. ఒకవేళ మందులు ఏమీ వాడకుండా ఉంటే కూడా డాక్టర్‌ను సంప్రదించి, వ్యాధి తీవ్రతను బట్టి, అవసరమనుకుంటే డాక్టర్ పర్యవేక్షణలో అతి తక్కువ దుష్ప్రభావాలు ఉన్న మందులను అతి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. లేకపోతే మానసిక సమస్యలు ఉన్నప్పుడు గర్భం దాల్చినప్పుడు సరిగా వారి పర్యవేక్షణ చూసుకోకపోవడం, ఆహారంపై శ్రద్ధ లేకపోవడం వంటి వాటి వల్ల బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పులు, పుట్టిన బిడ్డలో కూడా కొందరిలో మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం తగినంతగా ఉండాలి. వీరిని జాగ్రత్తగా చూసుకుంటూ, సరైన పోషకాహారం తినిపిస్తూ, మందులు తగిన సమయానికి ఇవ్వడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ∙నాకు హెయిర్ డై వేసుకునే అలవాటు ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. గర్భిణులు హెయిర్ డై వేసుకుంటే పుట్టబోయే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా లాంటివి రావచ్చు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? – కె.శైలజ, నందిగామ తెల్ల వెంట్రుకలకు వేసుకునే హెయిర్ డైలో ఉన్న కెమికల్స్ తలపై చర్మంలో నుంచి శరీరంలోకి, రక్తంలోకి చాలా సూక్ష్మంగా చేరుతాయి. అక్కడి నుంచి బిడ్డకు మరింత సూక్ష్మంగా చేరవచ్చు. ఇంత కొంచెం కెమికల్స్ కడుపులోని బిడ్డకు ఏ హానీ చెయ్యవు. అయినా ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకుంటే, గర్భంలోని బిడ్డలో అవయవాలు ఏర్పడే మొదటి ఐదు నెలల కాలం డై జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆరో నెల నుంచి వేసుకోవచ్చు. వీలైనంత వరకు కాన్పు తర్వాత వేసుకోవడం మంచిది. డై బదులు హెన్నా పెట్టుకోవచ్చు. డై మాడుకు తగలకుండా కేవలం జుట్టుకే వేసుకోవడం వల్ల తలపై చర్మంలోంచి శరీరంలోకి, రక్తంలోకి కెమికల్స్ వెళ్లే అవకాశాలు ఉండవు. హెయిర్ డై వేసుకోవాలనుకుంటే, బాగా గాలి ఆడే గదిలో డై వేసుకోవడం మంచిది. ఈ డైని వీలైనంత తక్కువసేపు ఉంచుకుని, బాగా నీటిలో జుట్టుని, మాడును శుభ్రపరచుకోవడం మంచిది. చేతికి గ్లౌస్ వేసుకుని డై వేసుకోవడం మంచిది. కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని, డై వేసుకోవడం మంచిది. హెయిర్ డై వల్ల బిడ్డలో మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా వంటివేమీ రావు. కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా హెయిర్ డై వాడే సెలూన్స్‌లో పనిచేసే వారిలో, డై కెమికల్స్ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా వంటివి వచ్చే అవకాశాలు, మిగిలిన వారితో పోల్చితే కొద్దిగా ఎక్కువగా ఉంటాయని వెల్లడించడం జరిగింది. -
సీరియస్ సమస్యలు వస్తాయా?
గర్భిణులు నెగటివ్ బ్లడ్‌గ్రూప్‌తో, బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌తో ఉంటే సీరియస్ సమస్యలు వస్తాయా? నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చా? దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. – స్మిత, హైదరాబాద్ గర్భిణులు నెగెటివ్ గ్రూపుతో ఉంటే ‘ఆర్‌హెచ్ నెగెటివ్ ప్రెగ్నెన్సీ’ అంటారు. భర్తకి కూడా నెగెటివ్ గ్రూపు ఉంటే సమస్య ఏమీ ఉండదు. భర్తది పాజిటివ్ గ్రూపు ఉండి, బిడ్డది కూడా పాజిటివ్ గ్రూపు ఉంటే కొందరు పిల్లల్లో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యది నెగెటివ్, భర్తది పాజిటివ్ గ్రూప్ బ్లడ్ ఉన్నా, కొందరి బిడ్డల్లో నెగెటివ్ గ్రూపు వస్తుంది. దీనివల్ల కూడా సమస్యలేవీ ఉండవు. నెగెటివ్ బ్లడ్ గ్రూపు ఉన్న గర్భిణుల్లో బిడ్డ పాజిటివ్ గ్రూపుతో ఉంటే, తల్లి రక్తంలోకి బిడ్డ పాజిటివ్ రక్తకణాలు ప్రవేశిస్తే, బిడ్డ రక్తకణాల మీద ఉన్న ఆర్‌హెచ్ యాంటీజెన్‌కు వ్యతిరేకంగా తల్లిలో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తయారవుతాయి. కొందరిలో కొన్ని రకాల పరిస్థితుల్లో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తల్లి నుంచి మాయ ద్వారా బిడ్డకు చేరి, బిడ్డలో ఉన్న పాజిటివ్ రక్తకణాల మీద దాడిచేసి వాటిని మెల్లగా నశింపజేస్తాయి. దీనివల్ల బిడ్డలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోయి, బిడ్డలో కొన్నిసార్లు కడుపులోనే రక్తహీనత, పసిరికలు వంటివి ఏర్పడటం, బిడ్డకు శరీరమంతా నీరు చేరడం, కడుపులోనే చనిపోవడం, పుట్టిన తర్వాత బిడ్డలో రక్తహీనత, తీవ్రమైన పసిరకలు (జాండీస్) వంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మొదటగా గర్భ నిర్ధారణ తర్వాత తల్లి బ్లడ్‌గ్రూపు పాజిటివా, నెగెటివా తెలుసుకోవాలి. ఒకవేళ నెగెటివ్ గ్రూపయితే, భర్త గ్రూపు పాజిటివా, నెగెటివా నిర్ధారణ చేసుకోవాలి. భర్తది నెగెటివ్ గ్రూపు అయితే సమస్యలేవీ ఉండవు. భర్తది పాజిటివ్ గ్రూపయితే, బిడ్డకు పాజిటివ్ గ్రూపు రావచ్చు లేదా నెగెటివ్ గ్రూపు రావచ్చు. గర్భంలో ఉన్న బిడ్డ గ్రూపు ముందుగా తెలియదు కాబట్టి, ముందు జాగ్రత్తగా పాజిటివ్ అయితే వచ్చే సమస్యలను పరిగణనలోకి తీసుకుని, తల్లికి అవసరమైతే ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ (ఐసీటీ) మూడో నెలలోపు ఒకసారి, ఏడో నెలలో ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ఆర్‌హెచ్ యాంటీబాడీస్ ఏవైనా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ అవేమీ లేకపోతే, అంటే ఐసీటీ నెగెటివ్ వస్తే, ఏడో నెలలో తల్లికి ‘యాంటీ డీ’ అనే ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. సాధారణంగా ఏడో నెల నుంచి బిడ్డలోని పాజిటివ్ రక్తకణాలు తల్లిలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఇంజెక్షన్లో ఉండే యాంటీబాడీస్ తల్లిలోకి ప్రవేశించే బిడ్డకు చెందిన పాజిటివ్ రక్తకణాలను నశింపజేస్తాయి. దాని ద్వారా తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు కావు. కాబట్టి బిడ్డలో సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అలాగే నెగెటివ్ గ్రూపు తల్లులు గర్భంతో ఉన్నప్పుడు, మధ్యలో బ్లీడింగ్ అయినా, కడుపుకి దెబ్బ తగిలినా ఈ యాంటీ–డి ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. చాలావరకు మొదటిసారి గర్భం దాల్చిన వారిలో సమస్యలు పెద్దగా రావు. తర్వాతి కాన్పులలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తల్లిలో ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ పాజిటివ్ వస్తే, అంటే తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయని అర్థం. అప్పుడు అవి ఎంత శాతం ఉన్నాయి, అవి బిడ్డ రక్తకణాలను నశింప చేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్ స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటిలో సమస్య కనిపిస్తే, సమస్య తీవ్రతను బట్టి గర్భంలోని శిశువులో ఎర్రరక్తకణాలు తగ్గిపోయి, రక్తహీనత ఏర్పడతున్నట్లయితే, తల్లి గర్భంలోకే రక్తం ఎక్కించడం జరుగుతుంది. అవసరమనుకుంటే త్వరగా కాన్పు చేయడం జరుగుతుంది. కాన్పు తర్వాత బిడ్డ బ్లడ్ గ్రూపు నిర్ధారణ చేసుకుని, పాజిటివ్ గ్రూపయితే, బిడ్డలో రక్తహీనత, జాండీస్ వంటి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సీబీపీ, డైరెక్ట్ కూంబ్ టెస్ట్, బైలురుబిన్ టెస్ట్ వంటి పరీక్షలు జరిపించి, నిర్ధారించుకోవాలి. రక్తహీనత ఎక్కువగా ఉంటే, అవసరమైతే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా రక్తం ఎక్కించడం జరుగుతుంది. జాండీస్ ఉంటే ‘ఫొటో థెరపీ’ అని బ్లూ లైట్ కింద పెట్టడం జరుగుతుంది. రెండో కాన్పులో బిడ్డకు ఈ సమస్యలు రాకుండా, కాన్పు అయిన 24 గంటల లోపు లేదా గరిష్టంగా 72 గంటల లోపల తల్లి ‘యాంటీ–డి’ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. ఈ ఇంజెక్షన్ వల్ల కాన్పు సమయంలో తల్లిలోకి ప్రవేశించే బిడ్డ పాజిటివ్ రక్తకణాలను ఇంజెక్షన్‌లోని యాంటీబాడీస్ నశింపజేస్తాయి. కాబట్టి తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు కాకుండా ఉంటాయి. మళ్లీ గర్భం ధరించినప్పుడు తల్లిలో యాంటీబాడీస్ ఉండవు కాబట్టి, కడుపులోని బిడ్డపై దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముందు గర్భాలలో అబార్షన్లు ఏవైనా అయి ఉంటే, ఆ సంగతిని గోప్యంగా ఉంచకుండా డాక్టర్‌కు తప్పనిసరిగా వివరించాలి. అబార్షన్ సమయంలో కూడా కొన్నిసార్లు బిడ్డ రక్తకణాలు తల్లిలోకి ప్రవేశించి, తల్లిలో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి తర్వాత గర్భం దాల్చినప్పుడు బిడ్డ రక్తకణాలను నశింపజేసి, బిడ్డలో సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి. కాబట్టి అబార్షన్ తర్వాత కూడా 24 గంటలలోగా ‘యాంటీ–డి’ ఇంజెక్షన్ తక్కువ డోసులో తీసుకోవడం మంచిది. -
ఆ ప్రభావం బిడ్డపై పడుతుందా?
నా వయసు 29 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉంది. డాక్టర్ల సలహాపై చాలాకాలం మందులు, ఇన్హేలర్ వాడాను. ఇప్పుడు నేను గర్భిణిని. నాలుగో నెల. ఇదివరకు నేను వాడిన మందుల ప్రభావం నాకు పుట్టబోయే బిడ్డపై ఉంటుందా? ఒకవేళ ఉంటే ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుందా? – అమరేశ్వరి, భీమవరం ఉబ్బసం వ్యాధి అంటే ఆస్తమా. కొన్ని రకాల అలర్జీల వల్ల లేదా శ్వాస నాళాలలో లేదా ఊపిరితిత్తులలో సమస్య వల్ల రావచ్చు. వీటికోసం దీర్ఘకాలం మందులు వాడవలసి ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత, ఆ సమయంలో ఏర్పడే హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, ఉబ్బసం లక్షణాల తీవ్రత ఉంటుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా మందులు వాడవలసి ఉంటుంది. వాడకపోతే తల్లికి ఇబ్బందితో పాటు కడుపులో బిడ్డకు కూడా శ్వాస తగ్గడం, ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాల వల్ల, కొన్ని సార్లు బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. గర్భంలో ఉన్నప్పుడు మందులు వాడవలసినప్పుడు, డాక్టర్ పర్యవేక్షణలో బిడ్డపై ప్రభావం పడని మోతాదులో మందులు వాడవచ్చు. నువ్వు మందులు గర్భం దాల్చిన తర్వాత వాడలేదు కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడినా, మందులను డాక్టర్‌కు చూపిస్తే ఆ మందులలో మోతాదు ఎంత ఉంది, వాటివల్ల బిడ్డపై ప్రభావం ఎంత వరకు ఉండవచ్చు అనేది అంచనా వేసి చెప్తారు. ఒకసారి 5వ నెల చివరిలో టిఫా స్కానింగ్ చేయించుకుంటే, పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది 90 శాతం వరకు గుర్తించవచ్చు. మా అమ్మాయి వయసు పదేళ్లు. రెండు వారాల కిందటే మెచ్యూర్ అయింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. – భవాని, నెల్లూరు పదేళ్ల వయస్సు అంటే ఆడే పాడే చిన్న లేత వయస్సు. ఇంత చిన్న వయస్సులోనే రజస్వల అవ్వడం వల్ల వారికి అది కొత్తగా కనిపించడం, న్యాప్కిన్స్ వాడటం వంటి విషయాలలో కొద్దిరోజుల వరకు అయోమయంగా ఉంటుంది. మీరు మెల్లగా మీ పాపకి పీరియడ్స్ అంటే ఏమిటి? బ్లీడింగ్ ఎలా అవుతుంది, ఎలా జాగ్రత్త పడాలి, న్యాప్కిన్స్ ఎలా వాడాలి, ఆ సమయంలో ఉండే అసౌకర్యాలు, కడుపునొప్పి, శరీరంలో వచ్చే మార్పులు వంటి అనేక విషయాలను అర్థం అయ్యేలాగ వివరించి చెప్పండి. ఇది పిల్లలు శారీరకంగా పెరిగే వయసు కాబట్టి పప్పు, ఆకుకూరలు, పండ్లు, పాలు, మితమైన మాంసాహారం వంటి పౌష్టికాహారం ఇవ్వాలి. మెచ్యూర్ అయినా ఒకటి, రెండూ లేదా మూడు సంవత్సరాల వరకూ పీరియడ్స్ చాలామందిలో సక్రమంగా ఉండకుండా, ఎప్పుడంటే అప్పుడు రావడం, ఎక్కువగా అవ్వటం వంటివి ఉండవచ్చు. కాబట్టి స్కూల్లో ఇబ్బంది పడకుండా స్కూల్ బ్యాగ్‌లో ఎక్స్ట్రా న్యాప్కిన్స్, ప్యాంటీస్ వంటివి ఉంచటం మంచిది. నా వయసు 27 సంవత్సరాలు, బరువు 40 కిలోలు. నాకు పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇదివరకు పీరియడ్స్ సరిగా వచ్చేవి కావు. అయితే, మందులు వాడిన తర్వాత ఆరు నెలల పాటు పీరియడ్స్ రెగ్యులర్‌గానే వచ్చాయి. గతనెల పీరియడ్ రావాల్సి ఉన్నా, రాలేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ అని వచ్చింది. స్కానింగ్ చేయించుకుంటే పీసీఓడీ అని చెప్పారు. థైరాయిడ్ సమస్య లేదని పరీక్షల్లో తేలింది. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా? నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – దేవి, తాడేపల్లిగూడెం పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్. ఇందులో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో (ఓవరీస్) చిన్న చిన్న నీటి బుడగలు ఎక్కువగా ఏర్పడతాయి. వాటి వల్ల రక్తంలో, మగవారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఏండ్రోజన్ హార్మోన్ పీసీఓడీ ఉండేవారిలో ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అధిక మోతాదులో టెస్టోస్టిరాన్, ఇంకా ఇతర హార్మోన్ల విడుదల వల్ల, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి నెలనెలా తయారయ్యి విడుదలయ్యే అండం సరిగా పెరగకపోవడం, విడుదల కాకపోటం, దాని నాణ్యత సరిగా లేకపోవటం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, అధికంగా మొటిమలు, అవాంఛిత రోమాలు ఏర్పడటం... వంటి అనేక లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడతాయి. అండం పెరగటంలో సమస్య వల్ల, సాధారణంగా గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి కొందరిలో అధిక బరువు, సన్నగా ఉన్నవారిలో కూడా జన్యుపరమైన సమస్య వల్ల, ఇన్సులిన్ హార్మోన్ సరిగా పనిచెయ్యకపోవటం వల్ల, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంటాయి. నువ్వు 40 కేజీల బరువు అంటే లీన్ పీసీఓ క్యాటగిరీ కింద వస్తావు. నువ్వు డాక్టర్ పర్యవేక్షణలో, పీసీఓడీ వల్ల నీలో ఏర్పడిన హార్మోన్ల అసమతుల్యత తగ్గడానికి మందులు వాడుకుంటూ, అండం తయారవ్వటానికి మందులు, వాడటం వల్ల నీకు గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ చికిత్సకు, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని నెలలు లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. ఓపిక పట్టవలసి ఉంటుంది. మందులతో గర్భం నిలవనప్పుడు, ల్యాప్రోస్కోపీ అనే చిన్న ఆపరేషన్ ద్వారా, నీటి బుడగలను కొన్ని తొలగించి, మరలా చికిత్స తీసుకోవలసి వస్తుంది. - డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఇన్ఫెక్షన్ తరచూ వస్తోంది...
నాకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ తరచుగా వస్తుంది. దీనికి మందుల ద్వారా చికిత్స చేయవచ్చా? ఆపరేషన్ అవసరమా? ఏ కారణాల వల్ల ఇలా ఇన్ఫెక్షన్ వస్తుంది? – కేఆర్, నందిగామ మూత్రనాళ ఇన్ఫెక్షన్ అనేక కారణాల వల్ల వస్తుంది. ఆడవారిలో మూత్రం బయటకు వచ్చే ద్వారం (యూరేత్రా), యోని ద్వారం, మలద్వారం దగ్గర దగ్గరగా ఒకదాని కింద ఒకటి ఉంటాయి. బ్యాక్టీరియా, క్రిములు, కలయిక ద్వారా యోనిభాగం నుంచి లేదా మలవిసర్జన తర్వాత మలద్వారం నుంచి మూత్రనాళంలోకి ప్రవేశించడం వల్ల మూత్రనాళానికి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇంకా నీరు సరిగా తాగకపోయినా, మూత్రం కిడ్నీల నుంచి వచ్చేదారిలో రాళ్ల వంటి అడ్డంకులు ఏవైనా ఉన్నా, మూత్రాశయం, మూత్రనాళంలో ఏవైనా లోపాలు ఉన్నా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మూత్రంలో మంట, నొప్పి, మాటిమాటికీ మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం బాగా పచ్చగా రావడం, ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువగా ఉంటే చలి, జ్వరం రావడం, నడుంనొప్పి వంటి అనేక లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ను సీయూఈ, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షల ద్వారా నిర్ధారణ చెయ్యడం జరుగుతుంది. వీటికి సరైన మోతాదులో పూర్తి కోర్సు యాంటీబయోటిక్స్ మందులు వాడటంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాటిమాటికీ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు. రోజూ కనీసం రెండు లీటర్ల మంచినీళ్లు తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా మూత్ర విసర్జన చెయ్యాలి. మల విసర్జన తర్వాత వెనకాల నుంచి ముందుకు కాకుండా, ముందు నుంచి వెనకాలకు శుభ్రం చేసుకోవాలి. కలయికకు ముందు, తర్వాత మూత్ర విసర్జన చెయ్యాలి. నీళ్లతో శుభ్రపరచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. మాటిమాటికీ డెట్టాల్ వంటి యాంటీసెప్టిక్ లోషన్స్‌తో శుభ్రపరచుకోకూడదు. దీనివల్ల మంచి బ్యాక్టీరియా నశించిపోయి హానికరమైన క్రిములు పెరిగే అవకాశాలు ఉంటాయి. కావాలంటే మామూలు సబ్బుతోను లేదా పీహెచ్‌ను భద్రపరచే ఇంటిమేట్ వాష్‌ను వాడుకోవచ్చు. మూత్ర ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వచ్చేవారిలో పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో దీర్ఘకాలం తక్కువ డోస్‌లో యాంటీబయోటిక్స్ వాడాలి. అవసరమైతే ఆరునెలల వరకు వాడాల్సి ఉంటుంది. హైపర్ ప్రోలాక్టీనిమియా ఎక్కువగా ఉంటే గర్భం దాల్చడం కష్టమని ఎక్కడో చదివాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. – శ్రీజ, కర్నూలు మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ప్రోలాక్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది సాధారణంగా గర్భిణి సమయంలో రొమ్ముపై ప్రభావం చూపి, పాలు పడటానికి ఉపయోగపడుతుంది. కొందరిలో అనేక కారణాల వల్ల ఇది ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. దీనినే హైపర్ ప్రోలాక్టీనిమియా అంటారు. మానసిక ఒత్తిడి, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్ మందులు, యాంటాసిడ్స్ వంటి అనేక రకాల మందులు దీర్ఘకాలం వాడటం వల్ల, రొమ్ము మీద ఒత్తిడి, దెబ్బలు, థైరాయిడ్ సమస్య, పిట్యూటరీ గ్రంథిలో కణితులు, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వంటి అనేక కారణాల వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీని ప్రభావం వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్లు తగ్గడం ద్వారా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మిగత హార్మోన్లలో అసమతుల్యత, అండం సరిగా విడుదల కాకపోవడం వల్ల గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. రొమ్ము నొప్పి, రొమ్ము నుంచి పాలు రావడం, నీరు రావడం, కళ్లు మసకగా కనిపించడం, కలయిక మీద ఆసక్తి లేకపోవడం వంటి అనేక లక్షణాలు హైపర్ ప్రోలాక్టీనిమియా వల్ల ఏర్పడతాయి. డాక్టర్ని సంప్రదించి, దీనికి గల కారణాలను విశ్లేషించుకుని, తగిన పరీక్షలు చేయించుకుని కారణం బట్టి చికిత్స తీసుకుంటే గర్భందాల్చచడం సాధ్యమవుతుంది. నా వయసు 20 సంవత్సరాలు. రుతుస్రావంలో చాలా రక్తం పోతుంది. ఇలా పోవడం వల్ల చాలా బలహీనపడతారని, భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. దీనికి నివారణచర్యల గురించి తెలియజేయగలరు. – బి.వాసవి, నర్మెట్ట మొదట ఇరవై సంవత్సరాల వయసులోనే రుతుస్రావంలో బ్లీడింగ్ ఎక్కువగా ఎందుకు అవుతోందో తెలుసుకోవాలి. రక్తం గూడు కట్టే క్రమంలో ఏమైనా సమస్యలు ఉన్నా, గర్భాశయంలో గడ్డలు, పాలిప్స్ లేదా అండాశయంలో సిస్ట్లు, పీసీఓడీ, ఇంకా థైరాయిడ్ వంటి హార్మోన్ సమస్యలతో పాటు చాలా ఇతర కారణాల వల్ల పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. కొందరిలో అధిక బరువు, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా కావచ్చు. బ్లీడింగ్ ఎన్ని రోజులవుతుంది, రోజుకు మార్చే న్యాప్కిన్స్ సంఖ్య, నొప్పి ఉందా లేదా అనే అంశాల బట్టి బ్లీడింగ్ ఎంత ఎక్కువవుతోందనేది అంచనా వేయవచ్చు. బ్లీడింగ్ మరీ ఎక్కువ అవడం వల్ల రక్తహీనత ఏర్పడి దానివల్ల నీరసం, ఒంటినొప్పులు, తలనొప్పి, ఆయాసం, గుండెదడ, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గైనకాలజిస్టును సంప్రదించి, సీబీపీ, ఎస్ఆర్ టీఎస్‌హెచ్, స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణం తెలుసుకుని దానిబట్టి చికిత్స తీసుకోవడం మంచిది. చికిత్సతో పాటు రక్తహీనతకు ఆహారంలో సరైన మోతాదులో పౌష్టికాహారం, ఐరన్ మాత్రలు తీసుకోవడం, యోగా, వ్యాయామాలు చేయడం మంచిది. - డా.వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
అది లేకుండా ఉండలేను
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. మూడో నెల. ఆహారం విషయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేయగలరు. మాంసం, గుడ్లు, చేపలు నేను తినను. వీటికి బదులుగా కూరగాయల్లో ఏవి తీసుకుంటే మంచిదో తెలియజేయగలరు. నేను కాఫీ తాగకుండా ఉండలేను. ఎక్కువగా తాగుతాను. రోజుకు ఎన్నిసార్లు తాగవచ్చు? – కె.నళిని, విజయనగరం ప్రెగ్నెన్సీ సమయంలో తల్లిలో జరిగే మార్పులకు బిడ్డ పెరుగుదలకు మామూలుగా తీసుకునే ఆహారం కంటే రోజుకు 300 క్యాలరీల ఆహారం అదనంగా తీసుకుంటే సరిపోతుంది. సాధారణంగా రోజుకు 1500 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం కావాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలల్లో పెద్దగా బరువు పెరగరు కాబట్టి పెద్దగా క్యాలరీలు అవసరం ఉండదు. 4 నుంచి 7 నెల వరకు రోజుకు 300 క్యాలరీలు, 8 నుంచి కాన్పు వరకూ 450 క్యాలరీలు రోజుకు అదనపు ఆహారం అవసరమవుతుంది. ఆహారంలో 50 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్స్, 25 నుంచి 30 శాతం ప్రొటీన్స్, 20 శాతం కొవ్వు పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శాకాహారులు వీటిలో ఎక్కువగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగు తీసుకోవాలి. అన్నం తక్కువ తీసుకుని.. జొన్నలు, రాగులు వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది. అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. వాటిని బాగా శుభ్రం చేసుకుని వండి తినడం మంచిది. ఆహారంతో పాటు ఐరన్, కాల్షియం, విటమిన్ టాబ్లెట్లు కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కాఫీలో ఉండే కెఫీన్ వల్ల ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దాని వల్ల శరీరంలో నీరు శాతం తగ్గే అవకాశాలు ఉంటాయి. నిద్రని తగ్గిస్తుంది. ఇది హార్ట్ రేట్‌తో పాటూ బీపీని పెంచే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిశోధనలలో రోజుకి మిల్లీ గ్రాముల కెఫిన్ కంటే ఎక్కువ తీసుకునే వారికి అబార్షన్లు, బేబీ బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ అని నిర్ధారణ చెయ్యడం జరిగింది. ‘కెఫీన్’ కాఫీలో, టీలో, కూల్ డ్రింక్స్‌లో, చాక్లెట్స్‌లో కూడా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోక పోవడం మంచిది. మరి బాగా అలవాటు అయిపోయి ఉంటే రోజుకి కాఫీ 250 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. అంటే అరకప్పు రోజుకు రెండు సార్లు కాఫీ పొడి తక్కువగా వేసుకుని తాగవచ్చు. నాకు ఈమధ్య తరచుగా మూత్రానికి వెళ్లాలనిపిస్తోంది. ‘గర్భసంచిలో గడ్డలు ఉండటం వల్ల ఇలా జరుగుతుంది..’ అని ఫ్రెండ్ చెప్పింది. ఎలాంటి లక్షణాల వల్ల గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని నిర్ధారణ చేస్తారు? అసలు ఇవి ఎందుకు వస్తాయి? చికిత్స విధానం ఎలా ఉంటుందో తెలియ జేయగలరు. – బి.శ్రీలత, నెల్లూరు గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఫైబ్రాయిడ్స్ వల్ల వాటి పరిమాణాన్ని బట్టి, గర్భాశయంలో ఉండే పొజిషన్ బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో పీరియడ్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా, ఎక్కువ రోజులు అవ్వడం, పీరియడ్స్ త్వరత్వరగా రావడం, మధ్యమధ్యలో బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్‌తో పాటూ కడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. కేవలం స్కానింగ్ చేసినప్పుడు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. కొందరిలో ఫైబ్రాయిడ్స్ వల్ల గర్భాశయం బరువు వల్ల ముందు ఉండే మూత్రాశయం మీద ఒత్తిడి పడి, మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్లాలనిపిస్తుంటుంది. కొందరిలో ఒత్తిడి వెన్నుపూస మీద, పేగుల మీద పడటం వల్ల మలబద్ధకం, నడుం నొప్పి వంటి లక్షణాలు ఉండవచ్చు. అవి ఎందుకు వస్తాయని కచ్చితంగా చెప్పడం కష్టం. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరిలో జన్యుపరమైన కారణాలను బట్టి, ఎన్నో తెలియని కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ రావచ్చు. వీటి చికిత్సలో భాగంగా లక్షణాలను బట్టి మందులతో లేదా మయోమెక్టమీ ఆపరేషన్ ద్వారా లేదా యుటిరైన్ ఆర్టెరీ ఎంబొలైజేషన్ వంటి చికిత్స విధానాలను పాటించడం జరుగుతుంది. చాలా కాలంగా నిద్రలేమితో బాధ పడుతున్నాను. నిద్ర మాత్రలు తీసుకునేదాన్ని. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ టైమ్‌లో తీసుకోవడం మంచిదేనా? మాత్రలు వేసుకోకుండా చక్కగా నిద్ర పట్టాలంటే ఏంచేయాలి? పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడాలి అని చెబుతుంటారు. దీని గురించి తెలియజేయగలరు. – జి.శాలిని, హన్మకొండ ప్రెగ్నెన్సీ సమయంలో నిద్రమాత్రలు తీసుకోకపోవడమే మంచిది. బిడ్డ అవయవాలు ఏర్పడే మొదటి మూడు నెలల సమయంలో కొన్ని రకాల నిద్రమాత్రల వల్ల బిడ్డలో గ్రహణంమొర్రి వంటి అనేక అవయవ లోపాలు మామూలు వారి కంటే కొద్దిగా ఎక్కువ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిద్రపట్టడానికి వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మంచిది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగా, చిన్నగా నడక వంటి వాటి వల్ల మానసిక ఒత్తిడి తగ్గి నిద్ర పడుతుంది. అలాగే నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం, వేరే పనుల మీద దృష్టి పెట్టడం, పాజిటివ్ దృక్పథంతో మెలగడం, కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా గడపడం, సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం వంటి మార్పులు చేసుకోవటం మంచిది. అన్ని జాగ్రత్తలు పాటించినా, నిద్రపట్టక చాలా ఇబ్బంది పడుతుంటే డాక్టర్ పర్యవేక్షణలో చాలా తక్కువ దుష్పలితాలు ఉన్న నిద్రమాత్రలను వాడుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట పెరిగేకొద్దీ.. నిద్రపోవడానికి మంచంలో అటూ ఇటూ తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా ఎడమవైపుకి తిరిగి పడుకోవడం మంచిది. దీని వల్ల బిడ్డకీ, తల్లికీ రక్తప్రసరణ సరిగా చేరుతుంది. ఈ పొజిషన్లో ఎక్కువ సేపు పడుకోవడానికి ఇబ్బందిగా అనిపించి పొట్ట బరువుగా ఉన్నప్పుడు గర్భిణీల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్ల(మెటర్నిటీ పిల్లోస్)ను వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో u,c,j అనే రకాల షేప్స్‌లో దొరుకుతాయి. ఇవే వాడాలని ఏం లేదు. సాధారణ మెత్తటి దిండ్లని కూడా రెండు కాళ్ల మధ్యలో ఒక్కటి, ఎడమవైపు తిరిగి, పొట్ట కింద లేదా పక్కకి ఒకటి, నడుమ వెనకాల ఒకటి పెట్టుకుని నిద్రపోవాలి. ఇలా వాడటం వల్ల నిద్రలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. - డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
దానివల్ల తక్కువ బరువుతో పుడతారా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. కొన్ని సంవత్సరాలుగా మైగ్రెయిన్‌తో బాధ పడుతున్నాను. మైగ్రెయిన్ సమస్య ఉన్నవాళ్లకు పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడడంతో పాటు రకరకాల సమస్యలు వస్తాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? నివారణ మార్గాలు ఉన్నాయా? – బి.సుష్మ, నిర్మల్ మైగ్రెయిన్ ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత మైగ్రెయిన్ తలనొప్పి తీవ్రత మరింతగా పెరుగుతుంది. కొందరిలో బాగా తగ్గిపోతుంది. కొందరిలో మైగ్రెయిన్ వల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. మైగ్రెయిన్ చాలాసార్లు రావడం వల్ల ఈ సమయంలో వాంతులు, వికారం, తలనొప్పి కారణంగా సరిగా తినలేకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా సరిగా నిద్రపోవడం, ఆనందంగా ఉండటం, యోగా, నడక, ధ్యానం, మనసును వేరే పనుల మీదకు మళ్లించడం వంటివి చెయ్యడం వల్ల మైగ్రెయిన్ తీవ్రత కొంతవరకు తగ్గుతుంది. ఈ సమయంలో కాఫీ, టీ, కారాలు, మసాలాలు వంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మంచినీళ్లు ఎక్కువగా తాగడం, ఆహారం కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిది. తలనొప్పికి పారాసెటిమాల్ మాత్రలు, వికారానికి, వాంతులకు ఓన్‌డన్‌సెట్రాన్ మాత్రలు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. తలనొప్పి మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో కారణాలను విశ్లేషించుకుని, మందులను వాడుకోవడం మంచిది. మా అమ్మాయి పదమూడు సంవత్సరాలకే పుష్పవతి అయింది. చిన్న వయసులో కావడం వల్ల భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయా? ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా? – యంఎన్, హైదరాబాద్ సాధారణంగా పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల లోపల అమ్మాయిలు పుష్పవతులు అవుతారు. అంటే ఈ వయసులో వారికి పీరియడ్స్ మొదలవుతాయి. ఈ ఆధునిక కాలంలో జంక్‌ఫుడ్, ఎలక్ట్రానిక్ మీడియా, త్వరగా హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో మార్పులు జరిగి మరీ పది సంవత్సరాలకే కొందరిలో పీరియడ్స్ మొదలవుతున్నాయి. మీ అమ్మాయి పదమూడు సంవత్సరాలకు– సరైన వయసులోనే రజస్వల అయింది. ఇప్పుడు అమ్మాయిలు బాగా తెలివిగా, హుషారుగా ఉంటున్నారు. అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తను పీరియడ్స్‌కు అలవాటు పడేంత వరకు ప్యాడ్స్ వాడటం, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం వంటి వాటి ప్రాముఖ్యతను వివరించి చెప్పడం మంచిది. రజస్వల అయిన కొన్ని నెలలు పీరియడ్స్ సక్రమంగా ఉండవు. కొందరిలో త్వరత్వరగా పీరియడ్స్ రావడం, బ్లీడింగ్ ఎక్కువ కావడం, కడుపునొప్పి వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వారికి మానసిక ధైర్యం ఇవ్వడం చాలా అవసరం. వారితో ప్రేమగా, ఓర్పుగా వ్యవహరించడం మంచిది. మా స్నేహితురాలికి పొట్టలో నొప్పి వస్తే స్కానింగ్ చేయించుకుంది. గర్భాశయం వాచింది అని చెప్పారట. గర్భాశయం వాయడానికి కారణాలు ఏమిటి? చికిత్స విధానం ఎలా ఉంటుందో తెలియజేయగలరు. – శిరీష, ఖమ్మం అనేక రకాల సందర్భాలలో గర్భాశయంలో వచ్చే మార్పులను వాడుకభాషలో గర్భాశయం వాచింది అంటారు. ఇందులో సాధారణంగా గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చే పరిస్థితిని ‘పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్’ (పీఐడీ) అంటారు. కొంతమందిలో చాలా కాన్పుల తర్వాత గర్భాశయం సాగి పరిమాణం పెరుగుతుంది. దీనిని ‘బల్కీ యుటెరస్’ అంటారు. కొందరిలో ప్రతినెలా బ్లీడింగ్‌లో ఎండోమెట్రియమ్ పొర వచ్చినట్లే, కొందరిలో ఈ పొర గర్భాశయ కండరంలోకి అంటే ‘మయోమెట్రియమ్’ పొరలోకి చొచ్చుకుపోతుంది. ఈ పొరలో ప్రతినెలా బ్లీడింగ్ అవుతూ అవుతూ గర్భాశయ పరిమాణం పెరిగి గట్టిగా తయారవుతుంది. దీనిని ‘అడినోమయోసిస్’ అంటారు. ఇలా అనేక సందర్భాల్లో గర్భాశయ పరిమాణం పెరగడాన్ని గర్భాశయం వాచింది అంటారు. పైన చెప్పిన కారణాలను బట్టి చికిత్స కూడా వేర్వేరుగా ఉంటుంది. పొట్ట పైనుంచి చేసే స్కానింగ్‌తో పాటు ట్రాన్స్‌వజైనల్ స్కానింగ్ కూడా చేయించుకుంటే గర్భాశయం వాపు ఏకోవకు చెందినదనేది చాలావరకు నిర్ధారణ అవుతుంది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. ఇకవేళ ఇన్ఫెక్షన్ వల్ల అయితే దానికి తగిన యాంటీబయోటిక్స్ మందులతో చికిత్స తీసుకోవచ్చు. అడినోమయోసిస్ అయితే హార్మోన్ల చికిత్స తీసుకుని చూడవచ్చు. ఎక్కువ కాన్పుల వల్ల గర్భాశయం సాగితే, దాని వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి చికిత్స అవసరం ఉండదు. కొందరు భయపడి అవసరం లేకున్నా గర్భాశయాన్ని తొలగించుకుంటూ ఉంటారు. అది సరికాదు. అన్ని రకాల మందులు, ప్రత్యామ్నాయాలు వాడినా, బ్లీడింగ్ ఎక్కువగా ఉండటం, కడుపులో నొప్పి విపరీతంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నట్లయితే, ఇక తప్పదు అనుకున్నప్పుడే గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. - డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఇది సహజమేనా?
ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్. బాగా చెమటలు పడుతున్నాయి. రాత్రి వేళల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఇంతకుముందు లేదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇది సహజమేనా? లేక సీరియస్‌గా తీసుకోవాల్సిన సమస్యా? నివారణ చర్యల గురించి తెలియజేయగలరు. – పి.తులసి, భద్రాచలం ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దాని వల్ల ఒళ్లంతా వేడిగా ఉన్నట్లుండి, జ్వరం వచ్చినట్లు ఉండటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తుంటాయి. సాయంకాలం, రాత్రి వేళల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కొందరిలో హైపర్ థైరాయిడిజమ్ సమస్య ఉన్నప్పుడు, సుగర్ మాత్రలు వాడుతున్నప్పుడు సుగర్ శాతం తగ్గడం వల్ల, జ్వరం మాత్రలు, బీపీ మాత్రలు వాడుతున్నప్పుడు చెమటలు ఎక్కువగా పట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కూడా జ్వరంతో పాటు చెమటలు పట్టవచ్చు. ఎక్కువ కారం, మసాలా ఆహారం, కాఫీ, టీ, కూల్డ్రింకులు ఎక్కువగా తీసుకున్నా, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నా చెమటలు పట్టవచ్చు. మీరు చెప్పిన ప్రకారం చెమటలు రాత్రివేళలోనే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే సహజ లక్షణాలుగానే అనిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో అవసరాలకు ఎక్కువ శక్తి ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా చెమటలు పడతాయి. కాబట్టి కంగారు పడకుండా, ఈ సమయంలో ఎక్కువ ఎండలో లేకుండా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. లేతరంగు వదులు దుస్తులు ధరించడం, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం, పచ్చళ్లు, కారాలు, మసాలాలు, కాఫీ, టీ, కూల్డ్రింకులకు వీలైనంత దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. చెమటలు మరీ ఎక్కువగా ఉండి, గుండెదడ వంటి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించి, సమస్యను తెలుసుకోవడానికి తగిన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం మంచిది. ∙నా భర్తకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అసలు వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏమిటి? మందుల ద్వారా పెంచే అవకాశం ఉందా? ‘ఆలిగో అస్తినో స్పెర్మియా’ గురించి వివరంగా తెలియజేయగలరు. – కేఎన్, మామిడిపల్లి, నిజామాబాద్ జిల్లా సాధారణంగా గర్భం రావడానికి మగవారి వీర్యంలో ఒక మిల్లీలీటరుకు 15–20 మిలియన్లు ఉండాలి. వాటిలో మంచి కదలిక కలిగినవి కనీసం 42 శాతం ఉండాలి. మంచి నాణ్యత కలిగినవి 4 శాతం ఉండాలి. పైన చెప్పిన సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో వీర్యకణాలు ఉండటం, కదలిక తక్కువ ఉంటే ఆ పరిస్థితిని ‘అలిగో అస్తినో స్పెర్మియా’ అంటారు. దీనివల్ల సాధారణంగా గర్భం రాదు. మగవారిలో ఎఫ్ఎస్హెచ్, సీహెచ్, ప్రోలాక్టిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ వంటి హార్మోన్ల ఉత్పత్తి, పనితీరు సరిగా లేనప్పుడు వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గుతుంది. కొందరిలో మానసిక ఒత్తిడి, పొగతాగడం, మద్యపానం, మధుమేహం, మంప్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, బీజకోశం మీద ఏదైనా ఆపరేషన్లు, కొన్ని రకాల వృత్తులలో వేడి వల్ల, రసాయనాల వల్ల, వెరికోసిల్, మెదడులో కణితులు వంటి అనేక కారణాల వల్ల వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం జరుగుతుంది. దీనికి చికిత్సలో భాగంగా కారణం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి యూరాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన రక్తపరీక్షలు, స్క్రోటమ్ డాప్లర్ స్కాన్ వంటివి చేయించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకుని చూడవచ్చు. చికిత్స కనీసం మూడు నెలల పాటు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే వీర్యకణాలు టెస్టిస్ నుంచి ఉత్పత్తయి బయటకు రావడానికి కనీసం 70 రోజులు పడుతుంది. సాధారణ జాగ్రత్తల్లో భాగంగా పొగతాగడం, మద్యపానం మానేయాలి. వదులుగా ఉండే లోదుస్తులు ధరించాలి. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, కారాలు, మసాలాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కువ మంచినీళ్లు, మజ్జిగ, డ్రైఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవడం మంచిది. నా వయసు 23 సంవత్సరాలు. కొంచెం బలహీనంగా ఉంటాను. ఈమధ్య మా బంధువుల అమ్మాయికి గర్భస్రావం అయింది. అప్పటి నుంచి నాలో భయం మొదలైంది. ఏయే కారణాల వల్ల గర్భస్రావం జరగడానికి అవకాశం ఉంది? అలా కాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి దయచేసి తెలియజేయగలరు. – కె.సుష్మ, నందిగామ గర్భ నిర్ధారణ తర్వాత ఏడు నెలల లోపే గర్భం పోవడాన్ని అబార్షన్లు అంటారు. మొదటి మూడు నెలల్లో గర్భం పోవడాన్ని ఫస్ట్ ట్రెమిస్టర్ అబార్షన్లంటారు. నాలుగు–ఆరు నెలల్లోపు గర్భం పోతే, సెకండ్ ట్రెమిస్టర్ అబార్షన్లంటారు. సాధారణంగా ఫస్ట్ ట్రెమిస్టర్ అబార్షన్లు జన్యుపరమైన కారణాల వల్ల, పిండంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జన్యువుల్లో లోపాల వల్ల లేదా ఫలదీకరణ సమయంలో అపశ్రుతుల వల్ల, అండం, శుక్రకణం నాణ్యత సక్రమంగా లేకపోవడం వల్ల కావచ్చు. మిగిలిన కొన్ని అనేక రకాల హార్మోన్ల లోపాల వల్ల కావచ్చు. గర్భాశయంలో లోపాలు, గర్భాశయ ముఖద్వారం లూజుగా ఉండటం, ఇన్ఫెక్షన్లు వంటి ఇతర కారణాల వల్ల సెకండ్ ట్రెమిస్టర్ అబార్షన్లు అవుతుంటాయి. కొందరిలో దీర్ఘకాలిక వ్యాధులు, గుండె, కిడ్నీ సమస్యలు, రక్తహీనత, అదుపులోలేని మధుమేహం వంటి వాటి వల్ల కూడా అబార్షన్లు కావచ్చు. కొందరి శరీరంలో రక్తం గూడు కట్టే సమస్యలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పిండం పెరగకుండా అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. బలహీనంగా ఉన్నంత మాత్రాన అబార్షన్లు అవాలనేమీ లేదు. క్రమంగా పౌష్టికాహారం తీసుకుంటూ, గర్భం కోసం ప్రయత్నించవచ్చు. పది శాతం మందిలో ఎన్నో తెలియని కారణాల వల్ల కూడా అబార్షన్లు కావచ్చు. వీటిలో అన్ని అబార్షన్లనూ నివారించలేము. డాక్టర్‌ను సంప్రదిస్తే, అబార్షన్లకు కారణాలను విశ్లేషించి, సమస్యను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. - డా.వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
నాకు ఆ సమస్య ఉంది
నాకు తరచుగా మైగ్రేన్ వస్తోంది. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్లకు మైగ్రేన్ సమస్య ఉంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుందని, లేదంటే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుడతారని విన్నాను. ఇది నిజమేనా? – కె.శైలజ, ఒంగోలు మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత, ఒక్కొక్కరి శరీతత్వాన్ని బట్టి, వారిలో విడుదలయ్యే హార్మోన్స్ మోతాదుని బట్టి... కొందరిలో మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. కొందరిలో అంతే ఉంటుంది. కొందరిలో పెరుగుతుంది. కొందరిలో దీని వల్ల అబార్షన్స్ కావు కానీ, ప్రెగ్నెన్సీకి బీపీ పెరగడం, బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పు కావడం, సిజేరియన్ డెలివరీలు ఎక్కువ అవ్వడం, పుట్టిన తర్వాత బిడ్డలో.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం, ఫిట్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో వికారం, వాంతులు, తలనొప్పి వల్ల సరిగా నిద్రలేకపోవడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా పైన చెప్పిన సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మైగ్రేన్ ఉన్నవాళ్లు, సరైన విరామం, నిద్ర, మానసిక ప్రశాంతత ఉండేటట్లు చూసుకోవడం మంచిది. అలాగే ధ్యానం, యోగా, నడక వంటివి పాటించడం మంచిది. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకోవచ్చు. అలాగే మైగ్రేన్ అటాక్‌ను ప్రేరేపించే అంశాలు అంటే.. స్ట్రెస్ వంటి అంశాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. నా వయసు 29 సంవత్సరాలు. నెలసరి ఆలస్యం అవుతోంది. ఫ్రెండ్ ఒకరు ‘ఫైబ్రాయిడ్ సమస్య కావచ్చు’ అంటున్నారు. మరొకరేమో ‘మెనోపాజ్ టైమ్‌లో తప్ప ఈ వయసులో అలాంటిదేమీ ఉండదు’ అంటున్నారు. ఏది నిజం? – జి.గీత, ఆదిలాబాద్ హార్మోన్లలో అసమతుల్యత, బరువు పెరగటం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, థైరాయిడ్ సమస్య, అండాశయంలో నీటి బుడగలు, కణితులు వంటి అనేక సమస్యల వల్ల 29 సంవత్సరాల వయసులో నెలసరి ఆలస్యం అవుతుంది. ఫైబ్రాయిడ్ సమస్య ఉన్నప్పుడు పీరియడ్స్ త్వరగా రావటం, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ పీరియడ్స్ ఆలస్యం అవ్వవు. పీరియడ్స్ ఆలస్యం అవ్వడం అనేది మెనోపాజ్ సమయంలోనే కాకుండా.. పైన చెప్పిన సమస్యల వల్ల ఏ వయసులోనైనా ఉండవచ్చు. మీకు నెలసరి ఆలస్యం అంటే.. ఎన్ని రోజులు అని రాయలేదు. కొందరిలో శరీరతత్వాన్ని బట్టి ప్రతి నెలా వారం రోజులు ఆలస్యం అంటే.. 35 రోజులకొకసారి రావటం జరుగుతుంది. ఇది వారి శరీరంలో ఉండే హార్మోన్స్‌ను బట్టి ఉంటుంది. అది వాళ్లకి మామూలే అయ్యి ఉండవచ్చు. అదేం సమస్య కాదు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పీరియడ్స్ ఎందుకు ఆలస్యం అవుతున్నాయోనని తెలుసుకోవటానికి అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్ వంటి పరీక్షలు చెయ్యించుకుని సమస్యకు తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. నా వయసు 21 సంవత్సరాలు. పీరియడ్స్ టైమ్‌లో నొప్పి చాలా ఇబ్బందిగా ఉంటోంది. నొప్పిని అధిగమించడానికి, తగ్గించడానికి చిట్కాలు, మందులు ఏమైనా ఉన్నాయా? పోస్ట్ అబార్షన్ బ్లీడింగ్ అంటే ఏమిటి? – బీఆర్, నర్సంపేట సాధారణంగా పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ మోతాదుని బట్టి, కొందరిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొద్దిగా ఉంటుంది. కొందరిలో అసలు ఉండదు. కొందరిలో గర్భాశయంలో కణితులు, ఇన్ఫెక్షన్లు, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే.. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి స్కానింగ్ చేయించుకుని సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి. సమస్య ఏం లేకపోతే నొప్పి ఉన్న రోజులు, నొప్పి నివారణ నెలలో రెండు రోజులు నొప్పి నివారణ మందులు వేసుకోవడం వల్ల ప్రమాదం ఏం లేదు. మాత్రలు వాడుకోవచ్చు. ఆ సమయంలో పొత్తికడుపు మీద వేడి నీళ్లతో కాపడం పెట్టుకోవచ్చు. వేడి నీళ్లతో స్నానం చెయ్యవచ్చు. చిన్న చిన్న యోగాసనాలు, చిన్నగా నడవడం వంటివి చెయ్యడం వల్ల కూడా చాలా వరకూ నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. సాధారణంగా అబార్షన్ తర్వాత అయ్యే రక్తస్రావాన్ని పోస్ట్ అబార్షన్ బ్లీడింగ్ అంటారు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, ఇంకా అనేక అంశాలను బట్టి అబార్షన్ తర్వాత రెండు మూడు రోజుల నుంచి మూడు వారాల దాక అవ్వవచ్చు. కొందరిలో బ్లీడింగ్ కొద్దికొద్దిగా ఉంటుంది. కొందరిలో చాలా ఎక్కువగా ఉండవచ్చు. కొందరిలో ఇన్ఫెక్షన్స్ రక్తంలో క్లాటింగ్ సమస్యలు, ముక్కలు ఉండిపోవడం గర్భాశయానికి చిల్లు పడటం వంటి అనేక సమస్యలు వల్ల కూడా అబార్షన్స్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అవ్వొచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన రక్తపరీక్షలు స్కానింగ్ చెయ్యించుకుని, సమస్యకు తగ్గ చికిత్స తీసుకోవచ్చు. - డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
దాని గురించి నాకు ఏమీ తెలియదు
నా వయసు 38 సంవత్సరాలు. నాకు పెళ్లై అయిదు సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. ఎన్ని పరీక్షలు చేసినా, మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. అందుకే ‘టెస్ట్‌ట్యూబ్ సిస్టమ్’ తో పిల్లల్ని కనాలనుకుంటున్నాం. అయితే దీని గురించి నాకు ఏమీ తెలియదు. దయచేసి టెస్ట్‌ట్యూబ్ విధానంలోని మంచి చెడుల గురించి వివరంగా తెలియజేయండి. – జీఆర్, మందమర్రి సాధారణంగా గర్భం దాల్చడానికి మగవారు ఆరోగ్యంగా ఉండాలి. వారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగినంతగా ఉండాలి. ఆడవారిలో అండం విడుదల సరిగా ఉండాలి. గర్భాశయంలో ఏ లోపాలూ లేకుండా ఉండాలి. ఫేలోపియన్ ట్యూబులు మూసుకుపోకుండా ఉండాలి. హార్మోన్లు సక్రమంగా విడుదలై, వాటి పనితీరు సజావుగా ఉండాలి. సాధారణంగా లేదా మందుల ద్వారా పరీక్షలు అన్నీ సరిగా ఉన్నా గర్భం దాల్చనప్పుడు చివరి ప్రయత్నంగా టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి లేదా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా గర్భం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఆడవారిలో అనేక అండాలు తయారు కావడానికి రోజుకు అనేక హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి, అండాశయాల నుంచి అండాలను బయటకు తీసి, వాటిని ల్యాబ్‌లో వీర్యకణాలతో జతపరచి, తర్వాత మంచి ఆరోగ్యకరమైన పిండాలను వేరు చేసి, ఒకటి లేదా రెండు పిండాలను చిన్న కాన్యులా ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పిండాలను గర్భాశయం స్వీకరించినప్పుడు పిండాలు గర్భాశయం లోపలి ఎండోమెట్రియమ్ పొరకు అతుక్కుని, గర్భం పెరగడం మొదలవుతుంది. ఎన్నో తెలియని కారణాల వల్ల గర్భాశయం పిండాన్ని దరిచేరనివ్వదు. అలాంటప్పుడు ఈ పద్ధతి కూడా ఫెయిలై, గర్భం నిలవకుండా పీరియడ్ వచ్చేస్తుంది. ఒకసారి టెస్ట్‌ట్యూబ్ పద్ధతి ద్వారా గర్భం నిలవకపోతే, మళ్లీ ఒకసారి కారణాలను విశ్లేషించుకుని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, మందులలో కొద్దిపాటి మార్పులు చేసి, మరొకసారి ప్రయత్నించడం జరుగుతుంది. ఇందులో సక్సెస్ రేటు వయసును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్ల స్థాయిని బట్టి, అండాల నాణ్యత, వీర్యకణాల నాణ్యత, ఇంకా ఎన్నో తెలియని అంశాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి ద్వారా గర్భం వంద శాతం నిలుస్తుందని చెప్పడం కష్టం. మీ వయసు 38 సంవత్సరాలు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ చికిత్స విధానానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ అండాల నాణ్యత సరిగా లేక సక్సెస్ కాకపోతే, దాత నుంచి తీసిన అండాలను ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అయినా గ్యారెంటీ లేనిది. ఈ ప్రక్రియలో కొందరిలో కవలలు, ట్రిప్లెట్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల వచ్చే సమస్యలను అధిగమించవలసి ఉంటుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఈ చికిత్సలో దుష్ఫలితాలు చిన్నవి లేదా పెద్దవి ఉండవచ్చు. నాకు ఇటీవల పెళ్లయింది. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. అయితే గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడవం వల్ల శాశ్వతంగా పిల్లలు పుట్టరని, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, ముఖంలో మార్పులు వస్తాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? ప్రత్యమ్నాయాలు ఏమైనా ఉన్నాయా? – పీఆర్, హైదరాబాద్ పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నప్పుడు వాడే సాధనాలు లేక పద్ధతుల్లో గర్భనిరోధక మాత్రలు ఒకటి. వీటిలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల మోతాదు, వెరైటీని బట్టి ఇవి నాలుగు రకాలు: ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జెనరేషన్ పిల్స్ అని, లో డోస్, వెరీ లో డోస్, హై డోస్ పిల్స్ అని అనేక రకాలుగా తయారు చేయబడతాయి. అందరికీ అన్నీ సరిపడకపోవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వం, బరువు, ఇతర సమస్యలు, పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేవి విశ్లేషించుకుని, డాక్టర్ ఇచ్చే సలహా మేరకు వాడుకోవడం మంచిది. వీటిని వాడటం వల్ల శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవడమేమీ జరగదు. ఈ మాత్రలలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదు ఎక్కువగా ఉంటే కొందరిలో మొహం మీద మొటిమలు, బరువు పెరగడం, రక్తం గూడుకట్టడం వంటి దుష్ఫలితాలు కనిపించవచ్చు. లో డోస్, వెరీ లోడోస్ పిల్స్‌లో దుష్ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. థర్డ్, ఫోర్త్ జెనరేషన్ పిల్స్ గర్భనిరోధానికే కాకుండా, పీసీఓడీ సమస్యకు, మొటిమలు, అవాంఛిత రోమాలు ఉన్నవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా మందులు మరీ అవసరమనుకున్నప్పుడు వాడుకుంటే మంచిది. డాక్టర్ సలహా మేరకు, మీ వయసు, మీ మెడికల్ హిస్టరీని బట్టి రెండు సంవత్సరాల వరకు గర్భనిరోధక మాత్రలను పెద్ద సమస్య లేకుండా వాడుకోవచ్చు. పిల్లలు వద్దనుకున్నప్పుడు డాక్టర్‌తో చర్చించి, కండోమ్స్, సేఫ్ పిరీయడ్ వంటివి కూడా పాటించవచ్చు. అయితే, ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా వయసు 27 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లకు ‘ఫిజికల్ యాక్టివీటి’ ఉండాలని చదివాను, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏమిటి? అది ఏలా ఉపయోగపడుతుంది అనేది తెలియజేయగలరు. – బి.నందిని, తెనాలి శారీరకంగా అటూ ఇటూ తిరుగుతూ పని చేయడాన్ని ఫిజికల్యాక్టివిటీ అంటారు. చాలామందిలో గర్భం ధరించిన తర్వాత ఎక్కువ కదలకుండా బాగా విశ్రాంతి తీసుకోవాలనే అపోహలో ఉంటారు. గర్భిణులు విశ్రాంతి తీసుకోవడంలో రకాలు ఉంటాయి. మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఎనిమిది గంటల నిద్ర ఒక రకం. కూర్చుని చేసుకునే పనులు, బరువు పడకుండా చేసుకునే పనులు చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవడం రెండో రకం. మూడవది కాలకృత్యాలు తప్ప మిగతా అంతా బెడ్ రెస్ట్. ఇవి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, గర్భం, మాయ పొజిషన్ బట్టి, ఇంకా అనేక అంశాలను బట్టి సలహా ఇవ్వడం జరుగతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఫిజికల్ యాక్టివిటీ అంటే సమస్యలు ఏవీలేకుంటే రోజువారీ పనులు చేసుకుంటూ ఉండటం, వీలైతే చిన్నగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా బరువు పెరగకుండా శరీరం తేలికగా ఉంటుంది. ఎముకలు గట్టిపడతాయి. లేకపోతే బరువు ఎక్కువగా పెరగడం, బీపీ, సుగర్ వంటి సమస్యలు, కాన్పులో ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ సలహా మేరకు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఫిజికల్ యాక్టివిటీస్‌ని పాటించవచ్చు. - డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఈ రోజు ప్రత్యేకత మీకు తెలుసా?
తీరిక లేకుండా చేసే ఉద్యోగాలు, జీవితంలో మోసే బాధ్యతలు మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తిడిలకు గురిచేస్తుంటాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయలేము. ఫలితంగా సహజ సిద్ధంగా చక్కటి ఆరోగ్యం లభించే పరిస్థితిని కోల్పోయి నిత్యం ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతుంటాము. బహుశా అందుకేనేమో.. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండంటూ ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజులు పెట్టారనుకుంటా. వివధ దినోత్సవాల మాదిరిగానే మార్చి 16కు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదే ప్రపంచ నిద్ర దినోత్సవం (వరల్డ్ స్లీప్ డే-మార్చి 16). మన దేశంలో దీనికి పెద్దగా ప్రాధాన్యత, గుర్తింపు లభించనప్పటికీ వివిధ దేశాల్లో ఈ దినోత్సవాన్ని తప్పకుండా పాటిస్తారు. ఆ రోజు భిన్నచర్చలు జరుపుతుంటారు. వాస్తవానికి శరీరానికి విశ్రాంతి లేకుంటే ఏం చేయలేము.. చేసినా అది స్పష్టంగా ఉండదు. శరీరంలోని ప్రతి భాగం సమన్వయం కావాలంటే నిద్ర తప్పనిసరి. అందుకే ప్రతి మనిషి రోజు కనీసం 8గంటలైనా నిద్రపోవాలని ప్రత్యేకంగా హెచ్చరించి మరీ చెబుతుంటారు. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా నిద్రతో వచ్చే లాభాలుపలువురు, వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పారు.. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. 1.ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఉత్పాదక శక్తి పెరుగుదల మెదడు సక్రమంగా పనిచేయడంలో నిద్రనే కీలక పాత్ర పోషిస్తుంది. అది సరిగా పనిచేస్తే మంచి ఉత్పాదక శక్తి, ఏకాగ్రత లభిస్తుంది. గొప్పగా, తెలివిగా పనిచేయడంలో సహకరిస్తుంది. మంచి జ్ఞాపక శక్తిని పెంచేందుకు కూడా నిద్ర ఉపయోగపడుతుంది. 2.క్రీడల్లో, వ్యాయామాల్లో రాణింపజేస్తుంది సరైన నిద్ర అథ్లెటిక్స్‌లో బాగా రాణించేలా చేస్తుంది. అలాగే, దేహదారుఢ్యం చక్కగా ఉంచుకునేందుకు చేయాల్సిన వ్యాయామానికి సహకరిస్తుంది. మానసిక చలనత్వం వేగంగా చేస్తుంది. 3.రోగ నిరోధకశక్తి పెంపొందుతుంది చక్కటి నిద్రతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిర్ణయించిన 8గంటల లోపుకంటే ఎవరు తక్కువగా నిద్రిస్తారో వారిలో జలుబు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎదుర్కోవడం 8గంటలకంటే ఎక్కువ నిద్రపోవడంతోనే సాధ్యం అవుతుంది. 4. ఒళ్లు నొప్పులు తగ్గిస్తుంది గాఢమైన నిద్ర శరీరంలోకి కలిగే నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. సరిగా నిద్రపోకుంటే శరీరంలోని కణాలు దెబ్బతినే అవకాశం ఎక్కువవుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. నొప్పులకు సంబంధించిన రోగాలు బయలుదేరతాయి. 5. నిద్రలేమితో కష్టమే నిద్రలేమితో శరీరంలో అమితంగా కొవ్వుపేరుకుపోతుంది. ఒబేసిటీకి నిద్రలేమి ముఖ్యకారణం. నిద్ర తక్కువగా పోవడం మూలంగా హార్మోన్లలో సమన్వయం పోతుంది. పైగా వ్యాయామం చేయాలనే ఆలోచనను కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గాలంటే చక్కటి నిద్ర కూడా అవసరం. 6. భావోద్వేగాల నియంత్రణ, సామాజిక సంబంధాలు మంచి నిద్ర వ్యక్తులను భావోద్వేగాల పరంగా బలమైనవాడిగా మారుస్తుంది. అలాగే, తన చుట్టూ ఉండేవారితో చక్కటి సంబంధాలు కొనసాగించేందుకు కూడా సహకరిస్తుంది. 7. నిద్రలేమి వల్లే మానసిక ఒత్తిడి నిద్రలేమి కారణంగానే మానసిక ఒత్తిడిలు వస్తాయి. 90శాతం ఒత్తిడితో బాధపడే రోగులు తగినంత నిద్రపోని వారే ఉంటారని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. చాలినంత నిద్ర పోకుంటే అప్నియా, ఇన్సోమ్నియా, ఒత్తిడివంటి సమస్యలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకే సహజ సిద్ధంగా లభించే నిద్రను ఆస్వాధించండి.. చక్కటి ఆరోగ్యంతో జీవించండి.. హ్యాపీ వరల్డ్ స్లీప్ డే.. -
మగవారు వాడే పిల్స్ ఉంటాయా?
సందేహం నా వయసు 23. నాకు పెళ్లై తొమ్మిది నెలలు అవుతోంది. ఇంకో రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. మొదట్లో డాక్టర్ సలహా మేరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకున్నాను. దాంతో చాలా నీరసంగా, లావు అయ్యాను. దాంతో పిల్స్ వేసుకోవడం ఆపేసి కండోమ్స్ వాడుతున్నాం. కానీ అది సేఫ్టీ కాదని చాలా చోట్ల చదివాను. మగవారు వాడే పిల్స్ ఏమీ ఉండవా? ఈ ప్రశ్నను మావారు అడగమన్నారు. ఎక్కడ చదివినా ఆడవారు వాడేవే ఉన్నాయి తప్ప మగవారికి ఉన్నట్లు ఎవరూ చెప్పట్లేదు. అలా ఏమైనా ఉంటే చెప్పండి. - ఓ సోదరి పిల్లలు పుట్టకుండా వాడే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ఉంటాయి. ఇవి నెలనెలా అండాశయం నుంచి విడుదలయ్యే అండాన్ని తయారు కాకుండా ఆపేసి తద్వారా గర్భం రాకుండా నివారిస్తాయి. ఇంతకు ముందు రోజుల్లో తయారయ్యే పిల్స్‌లో హార్మోన్స్ మోతాదు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల శరీరతత్వాన్ని బట్టి కొందరిలో వికారం, నీరసం, లావు పెరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చే లో-డోస్పిల్స్లో హార్మోన్స్ మోతాదు చాలా తక్కువగా ఉండటం వల్ల.. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కాబట్టి వీటిని ప్రయత్నించి చూడొచ్చు. మీరడిగిన దానికి సమాధానం.. మగవారు వాడే పిల్స్ చాలాకాలం నుంచి ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. ఈస్ట్రోజన్, టెస్టోస్టరాన్, ప్రొజెస్టరాన్ లాంటి రకరకాల హార్మోన్ల కాంబినేషన్స్‌లో.. అలాగే నాన్హార్మోన్ మందులతో పిల్స్ తయారు చేసి కొన్ని జంతువుల మీద.. మరికొన్ని మగవారిపైనా ప్రయోగించి చూశారు. కానీ అవి పని చెయ్యడానికి కొన్ని నెలలు పట్టింది. మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు, అవి ఆపిన తర్వాత కూడా పిల్లలు కలగడానికి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి చాలా నెలలు పట్టవచ్చని తేలింది. ఈ హార్మోన్స్ వల్ల వీర్యకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. కానీ ముందుగా తయారైన వృషణాలలో ఉండే కణాల మొత్తం బయటకు రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. కాబట్టి మగవారు పిల్స్ వేసుకోవడం మొదలుపెట్టినా.. అవి పని చెయ్యడానికి ఎన్ని నెలలు పడుతుందో చెప్పడం కష్టం. ఈ లోపల గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్స్ ఆపిన తర్వాత, హార్మోన్స్ ప్రభావం తగ్గి మళ్లీ వీర్యకణాలు ఎన్ని నెలలకు ఉత్పత్తి అవుతాయో చెప్పడం కష్టం. కాబట్టి ఈ సమస్యలను అధిగమించి... మగవారికి పిల్స్ తయారు చెయ్యడానికి ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అవన్నీ విజయవంతమై మార్కెట్లోకి మగవారి పిల్స్ విడుదలవ్వడానికి ఎంతకాలం పడుతుందో తెలీదు. అప్పటివరకు వేచి చూడాల్సిందే. మీరు చెప్పినట్టుగానే కండోమ్స్ ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. నా వయసు 26. పెళ్లై ఏడాదైంది. ప్రతినెలా పీరియడ్ మిస్ అయితే బాగుండని ఎదురు చూస్తున్నాను. కానీ పీరియడ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ భయంగా ఉంటోంది. మార్నింగ్ సిక్నెస్ తరచూ ఉంటోంది. అది ప్రెగ్నెన్సీకి ఒక లక్షణం అని నెట్లో చదివాను. పీరియడ్ మిస్ కాకముందే నేను ప్రెగ్నెంట్ అవ్వబోతున్నానని తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా? గత నెలలో పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ పీరియడ్ రావడంతో కుంగిపోయాను. త్వరగా పిల్లలు కావడానికి, ఎందుకు కావట్లేదో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రాధిక, నాగర్‌కర్నూలు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తూ ఉండి, భార్యాభర్తలు క్రమంగా కలుస్తూ ఉండి, ఇద్దరిలో వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు... నూటికి ఎనభై శాతం మంది ఏడాది లోపల గర్భం దాల్చుతారు. మిగతా 20 శాతంలో 10-15 శాతం మందికి రెండేళ్ల సమయం పట్టొచ్చు. మిగతా 5-10 శాతం మందికే కొన్ని సమస్యల వల్ల, ఎక్కువ సమయం లేదా చికిత్స అవసరం కావొచ్చు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి వారం ముందు నుంచి కొందరిలో వికారం, నీరసం, రొమ్ముల్లో నొప్పి వంటి లక్షణాలు ఉండొచ్చు. అలా అని అందరికీ ఉండాలనేమీ లేదు. ఈ లక్షణాలు హార్మోన్ల ప్రభావం వల్ల గర్భంలేని వారిలో పీరియడ్ వచ్చే ముందు కూడా రావచ్చు. నెలనెలా సక్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్ మిస్ అయిన వారం రోజుల్లో యూరిన్‌లో ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా పరీక్ష చేసి గర్భం ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీకు గత నెల పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చిందన్నారు. ఏమైనా హార్మోన్ల సమస్య ఏర్పడుతుందేమో తెలుసుకోవడం మంచిది. పెళ్లై ఏడాదైంది. త్వరగా పిల్లలు కావాలని ఆశ పడుతున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా... మీరు, మీవారు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
అతి వ్యాయామంతో గుండెకు చేటు
పరిపరి శోధన ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి, తీరైన శరీరాకృతికి, మంచి ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు సలహా ఇస్తుంటారు. వ్యాయామం ఒంటికి మంచిదే గానీ, అతిగా చేస్తే మాత్రం గుండెకు చేటు తెచ్చిపెడుతుందని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెల్లడైంది. శక్తి మేరకు మాత్రమే ఒక క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలని, అలా కాకుండా అతిగా వ్యాయామం చేస్తే గుండె లయలో అనూహ్యమైన మార్పులు తలెత్తి, గుండె పనితీరును దెబ్బతీస్తాయని, దీనివల్ల ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటు తలెత్తే అవకాశాలూ ఉంటాయని మెల్బోర్న్లోని హార్ట్ అండ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
ఆరోగ్యాన్ని నీళ్లలో ముంచేయకండి..!
ఈ భూమ్మీద జీవం ఆవిర్భవించడానికి కారణం నీళ్లు. ఈ నేల మీద జీవం మనుగడ సాగించడానికి కారణం నీళ్లు. ఇలాంటి నీళ్ల గురించి ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. అన్నానికి ముందు అస్సలు నీళ్లు తాగవద్దని అంటారొకరు. అన్నం తిన్నాక కూడా ఎంతో సేపటివరకు నీళ్లు ముట్టుకోవద్దని అంటారు ఇంకొకరు. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలంటారు వేరొకరు. అసలు ఆరోగ్యం కోసం నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలి, రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి, ఎందుకలా తాగాలి అనే అనేక విషయాలను తెలుసుకుందాం. దాంతోపాటు మన ఆరోగ్యాన్ని నీళ్లలో ముంచేసి దాన్ని ఊపిరాడకుండా చేసే బదులు, ఆ నీటినే జీవజలంగా మార్చుకోవడం ఎలాగో తెసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగితేనే ఆరోగ్యం అంటూ రాస్తూ ఉంటాయి కొన్ని పత్రికలు. నీళ్లు తాగండి... బరువు తగ్గండి అంటూ చెబుతాయి మరికొన్ని సంచికలు. అసలు ఒక వ్యక్తి తన మంచి ఆరోగ్యం కోసం ఎన్ని నీళ్లు తాగాలి? రోజువారీ జీవక్రియలకు నీటి అవసరం ఎంత అన్న విషయాలు చూద్దాం. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల్సిందేనా? ముందు మనం ఎన్ని నీళ్లు తాగాలన్నది పక్కన పెట్టి... అసలు మన శరీరం ఎన్ని నీళ్లను కోల్పోతుందో చూద్దాం. ప్రతిరోజూ మన శరీరం ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల నీటిని విసర్జిస్తుంటుంది. మూత్రం ద్వారా, చెమట ద్వారా మన శరీరం నుంచి నీళ్లు బయటికి పోతాయని మన అభిప్రాయం. కానీ మలం ద్వారా, మనం వదిలే ఊపిరి ద్వారా కూడా నీళ్లు బయటకు వెళ్లిపోతుంటాయి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎనిమిది గ్లాసులనో, రెండు లీటర్లనో... ఇలా నిర్ణీతంగా ఇంత ప్రమాణంలో నీరు తాగాలనే నియమం అవసరం లేదు. గుర్తుంచుకోవాల్సిందల్లా మన శరీరానికి ఎంత నీరు అవసరమో, అంత నీరు తాగాలనే. అంటే దాహమైనప్పుడల్లా అది తీరేలా నీళ్లు తాగాలి. మనకు అవసరమైన నీళ్లు... కేవలం నీళ్లతోనేనా? కాదు... మనం తినే అన్నంలోనూ నీళ్లుంటాయి. మనం వండే కూరగాయల్లో నీరుంటుంది. ఇక మనం తీనే పండ్లు, పాలు, పండ్లరసాలు... వీటన్నింటిలోనూ ఉండేది నీళ్లే. ఇలా ఆహారంతో పాటూ మనం మరెన్నో నీళ్లను అదనంగా తీసుకుంటుంటాం. కేవలం తాగే నీళ్లేగాక... ఇలా అన్నింటినుంచి మన శరీరం తీసుకునే నీళ్లనన్నింటినీ కలుపుకుంటూ వచ్చే పరిమాణాన్ని ‘రిఫరెన్స్ డెయిలీ ఇన్‌టేక్’ (ఆర్డీఐ) ఆఫ్ వాటర్ అని వ్యవహరిస్తాం. మరి మనం ఎన్ని నీళ్లు తాగాలి? తాగే నీళ్లేగాక అన్ని రకాల ఆహారాల పదార్థాల నుంచి 18 ఏళ్లు దాటిన ఒక పురుషుడు తీసుకునే రిఫరెన్స్ డెయిలీ ఇన్‌టేక్ (ఆర్డీఐ) దాదాపు 3.7 లీ/పర్ డే. ఇక 18 ఏళ్లు దాటిన మహిళ ఆర్డీఐ 2.7 లీ/పర్ డే. అయితే ఈ సంఖ్యలను సగటుగా భావించవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యాయామం చేసేవాడైతే అతడి ఆర్డీఐ మారుతుంది. అలాగే ఒక వ్యక్తి ఒక చలివాతావరణం నుంచి వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణానికి వెళ్లగానే అతడి ఆర్డీఐ మారిపోతుంది. అలాంటప్పుడు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడానికి ఎంత నీరు తాగాలన్నదానికి ‘ఫ్లూయిడ్ బ్యాలెన్స్’ అనే అంశమే కీలకం. అంటే మనం విసర్జించే నీరు, మనం తీసుకునే నీటి మధ్య సమతౌల్యం ఉండేలా చూసుకోవడం అన్నమాట. ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అన్నదే ఒక ఆరోగ్య సూచిక... ఒక వ్యక్తి బరువు 70 కిలోలు అనుకుందాం. అతడి జీవక్రియల అవసరాలకు ప్రతిరోజూ 1.750 లీటర్ల నీళ్లు కావాలనుకుందాం. ఈ నీళ్లలో 650 ఎంఎల్. నేరుగా మంచినీళ్లు తాగడం వల్ల అతడికి దొరుకుతాయి. అతడు తినే ఆహారం ద్వారా మరో 750 ఎం.ఎల్. లభ్యమవుతాయి. ఇక మిగతా 350 ఎం.ఎల్. మన శరీరంలోని జీవక్రియల్లో జరిగే ఆక్సిడేషన్ ప్రక్రియ ద్వారా లభిస్తాయి. అంటే... అతడి జీవక్రియలకు 1.750 (ఒకటీ ముప్పావు లీటర్) నీళ్లు అవసరమైనా... అతడు తాగేది మాత్రం 650 ఎం.ఎల్. మాత్రమే. ఇంతకంటే ఎక్కువ నీళ్లు తాగారే అనుకుందాం. అప్పుడు ఆరోగ్యవంతుడిలో ఆ నీళ్లను మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. ఒకవేళ అతడికి ఏ గుండెజబ్బులో, హైబీపీనో, కాలేయ వ్యాధులో, మరే మూత్రపిండాల వ్యాధో ఉంటే? అప్పుడు ఆ అదనపు నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేవు. నీళ్లుతో బరువు తగ్గుతారా / చర్మం మెరుస్తుందా? ఒక వ్యక్తి ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌కు తగినట్లుగా నీళ్లు తాగితేనే ఆ వ్యక్తి సరైన బరువును కలిగి ఉంటాడు. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మారే క్రమంలో ప్రతి 100 క్యాలరీలను ఖర్చు చేయడానికి కనీసం అరకప్పు నీళ్లు కావాలి. దీనికి తగినట్లుగా నీళ్లు తీసుకుంటూ... ఆహారం కంటే ఒకిన్ని నీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆ మొత్తం పొట్టలోకి చేరి ఆహారం తీసుకోడానికి అవకాశం లేకుండా చూసి బరువు తగ్గడానికి కొంతవరకు ఉపకరిస్తుంది. అలాగే చర్మం బిగుతుగా ఉండేందుకు తగినంతగా నీరు ఉన్నంత వరకే అది బాగుటుంది. అంతేగానీ... ఎక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల చర్మం మరింత బిగువుగా ఉంటుందనేదీ, ఆ బిగువును కోల్పోకుండా ఉండటానికి నీళ్లు ఉపకరిస్తాయనే అంశం కేవలం అపోహలు మాత్రమే. ఆరోగ్యసమస్యలుంటే డాక్టర్ సలహా మేరకే నీళ్లు తాగాల్సిందే... ఒక వ్యక్తికి గుండెజబ్బులు, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి ఉంటే అతడు తీసుకునే అదనపు నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేవు. దాంతో ఆ నీళ్లు అతడి కాళ్లలో చేరి, కాళ్లవాపు వస్తుంది. కొందరిలో ముఖంలోకి చేరి ముఖం వాచినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఆరోగ్యం కోసం ఎన్ని ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది అన్న సూత్రం అన్ని వేళలా పనిచేయదు. డాక్టర్ టి.జి. కిరణ్‌బాబు సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మెనోపాజ్ జబ్బు కాదు... ఒక దశ మాత్రమే!
డాక్టర్ సలహా నా వయసు 45 సంవత్సరాలు. ఇటీవల మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు వచ్చే బాధలు భరించలేకపోతున్నాను. దీనికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకోవడం పరిష్కారం అని మా స్నేహితురాలు చెప్పింది. ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోలో హార్మోన్ రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంటుందా? తెలియచేయగలరు. - ఎమ్. సుమలత, రేపల్లె హెచ్ఆర్టి (హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ)... ఇటీవల చాలామంది మహిళలు ఈ చికిత్స వైపు మొగ్గుచూపుతున్నారు. రుతుక్రమం నిలిచిపోయే దశ (మెనోపాజ్)లో హార్మోన్ల విడుదల స్థాయుల్లో గణనీయమైన మార్పు వస్తుంది. అండాశయం నుంచి అండాలు వెలువడకపోవడం, హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోవడం జరుగుతుంది. ఈ మార్పుల సమయంలో దేహం కొన్ని ఒడుదొడుకులకు లోనవుతుంది. ఈ బాధలను తప్పించుకోవడానికి హెచ్ఆర్టి వైపు మొగ్గుచూపిస్తున్నారు. ఈ చికిత్సలో తక్కువ మోతాదులో హార్మోన్లను ఇస్తుంటారు. రుతుక్రమం ఆగిపోయిన వారికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఇవ్వడం వలన రొమ్ము క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మెనోపాజ్ అనేది జబ్బు కాదు. స్త్రీల జీవితంలో ఇది ఒక దశ. ఈ సమయంలో ఎదురయ్యే సమస్యలకు హోమియోవైద్యంలో చక్కటి పరిష్కారం ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ చికిత్స చేయడం ద్వారా మెనోపాజ్ లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్, హోమియో వైద్యులు -
ఆయాసం వస్తే... వేడి వేడి టీ తాగాలి!
డాక్టర్ సలహా నా వయసు 75 ఏళ్లు. ఉబ్బసంతో బాధపడుతున్నాను. చలికాలం తీవ్రమవుతోంది. అలర్జిక్ కోల్డ్ చాలా బాధపెడుతోంది. ఈ మధ్య తలదిమ్ముగా, భారంగా ఉంటోంది. బి.పి, డయాబెటిస్, అజీర్తి వంటి ఇబ్బందులేమీ లేవు. - ఎస్. ఈశ్వరయ్య, కంకిపాడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు ఉబ్బసరోగం (ఆస్త్మా) ఉంది. దీన్నే ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. శరీరానికి సరిపడని అసాత్మ్య (ఎలర్జిక్) పదార్థాల వల్ల ఈ వ్యాధి లక్షణాలు జనిస్తాయి. ఇది కొందరిలో వారసత్వంగా రావచ్చు. మానసిక ఒత్తిడి కూడా ఒక కారణమే. చల్లటి మేఘాలు, వాతావరణంలో అధిక తేమ, దుమ్ము, ధూళి, కొన్ని రసాయనిక పదార్థాలు మొదలైనవి కూడా కొంతమందికి అసాత్మ్యంగా ఉంటాయి. ఆయాసం ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. శ్రమకు గురికాకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేడి వేడి ‘టీ’ తాగితే మంచిది. శీతల పానీయాలకు, ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలకు దూరంగా ఉండాలి. మందులు: శ్వాసకుఠార రస (మాత్రలు) ఉదయం ఒకటి- రాత్రి ఒకటి కనకాసవ (ద్రావకం) మూడు చెంచాలకు సమానంగా గోరు వెచ్చని నీళ్లు కలిపి (ఇది ఒక మోతాదు) రోజుకు మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) తీసుకోవాలి. ఆయాసం తగ్గిపోయిన తర్వాత వాడాల్సిన మందులు: శృంగారాభ్రరస (మాత్రలు) ఉదయం ఒకటి- రాత్రి ఒకటి అగస్త్య హరీతకి రసాయనం (లేహ్యం) ఉదయం ఒక చెంచా- రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. వీటిని ఎంత కాలమైనా వాడవచ్చు. ఈ మందుల వల్ల ఊపిరి తిత్తులకు, శ్వాస కోశ అవయవాలకు బలం కలిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఉబ్బసం అతి తరచుగా రావడం అనే సమస్య తగ్గిపోతుంది. ఒకవేళ ఉబ్బసం వచ్చినా దాని తీవ్రత స్వల్పంగా ఉంటుంది. కొంతకాలానికి అసాత్మ్యత (ఎలర్జీ)కు గురికావడం తగ్గి క్షమత్వం పెరుగుతుంది. ఆయాసం లేనప్పుడు రెండు పూటలా పది నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే మంచిది. గృహవైద్యం: ఒక చెంచా ఆవనూనెలో ఒక చెంచా తేనె కలిపి తాగితే ఆయాసానికి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దగ్గు, కఫం తగ్గడానికి... ఒక చెంచా తులసిరసంలో ఒక చెంచా తేనె కలిపి మూడు పూటలా సేవిస్తే మూడురోజుల్లో బాధ తగ్గిపోతుంది. - డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు -
మాటిమాటికీ నోరు తడారిపోతుంటే...
డాక్టర్ సలహా నాకు మాటిమాటికీ నోరు తడారిపోతోంది. ఎప్పుడూ దాహంగా ఉన్నట్లుగా అనిపిస్తూ, లాలాజలంతో నోరు తడిచేసుకోవాలనిపిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - నరేందర్, కరీంనగర్ మన నోటిలో ఊరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. సాధారణంగా ఈ లాలాజలం నోటిలో ఉండే ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఒకసారి మీరు డయాబెటిస్‌కు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోండి. ఇలా నోరు పొడిబారిపోవడాన్ని వైద్యపరిభాషలో ‘జీరోస్టోమియా’ అంటారు. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా గూడుకట్టినట్లుగా ఒకేచోట అమితంగా పెరిగిపోతాయి. దీన్నే కొలొనైజేషన్ అంటారు. ఇదే దుష్పరిణామం తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారిలోనూ కనిపిస్తుంటుంది. ఇలా నోరు పొడిబారిపోవడం చాలాకాలంపాటు అదేపనిగా కొనసాగితే నోటిలోని మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూస్) దెబ్బతినడం, నొప్పిరావడం మామూలే. ఫలితంగా దంతక్షయం (టూత్ డికే), చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే దంతవైద్యులను కలవాలి. చికిత్స: నోటిలో తగినంత లాలాజలం ఊరని రోగులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చికిత్సలు సూచిస్తారు. దాంతోపాటు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. ఇటీవల మార్కెట్లో అందుబాటులో ఉన్న చక్కెర లేని చూయింగ్ గమ్స్, చక్కెర లేని మింట్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను చాలా పరిమితంగా తీసుకోవడం మంచిది, ఆల్కహాల్‌ను మానితే మంచిది. మీరు ఒకసారి చక్కెరవ్యాధి నిర్ధారణకు చేయించే ఫాస్టింగ్ బ్లడ్, పోస్ట్ ప్రాండియల్ పరీక్షలు చేయించి మీ ఫిజీషియన్‌తో పాటు ఒకసారి దంతవైద్యుడిని కూడా కలవండి. - డా. నరేంద్రనాథ్ రెడ్డి, దంతవైద్య నిపుణులు, స్మైల్ మేకర్ డెంటల్ హాస్పిటల్ , హైదరాబాద్ -
బండి నడుపుతుంటే కళ్లు తిరుగుతున్నాయి!
డాక్టర్ సలహా నా వయసు 44. డ్రైవర్ని. నాకు అప్పుడప్పుడూ సడన్‌గా కళ్లు తిరుగుతున్నాయి. ఆ తర్వాత చూపు మసకగా కనిపిస్తోంది. అందుకు ఇంగ్లిష్ మందులు వాడుతున్నాను. వాటిని వేసుకున్న మరుసటి రోజు బాగానే ఉంటోంది. వేసుకోని మరుసటి రోజు కళ్లు తిరగడం, మసక వస్తోంది. నాకు తగిన వైద్యాన్ని సూచించగలరు. - రామకృష్ణ, ఏలూరు మీ వయసు, ఉద్యోగంలో ఒత్తిడి దృష్టిలో ఉంచుకుని మీరు చెప్తున్న లక్షణాలను పరిశీలించినట్లయితే... ముందుగా మీరు రక్తపోటు (బి.పి) పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. అలాగే మధుమేహం పరీక్షలు కూడా చేయించాలి. మీరు చెప్తున్న లక్షణాలకు మధుమేహంతో నేరుగా సంబంధాలు లేకపోయినప్పటికీ మధుమేహం అనుబంధంగా మరికొన్ని రుగ్మతలు తోడయినప్పుడు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఉన్నట్లుండి కళ్లు తిరగడాన్ని ఆయుర్వేదంలో అపస్మారకం (ఎపిలెప్సీ)గా పరిగణిస్తారు. బ్రెయిన్ స్కాన్ చేసి ఆ సంబంధిత రుగ్మతలు ఉన్నాయేమోనని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపుగా మీరు పై లక్షణాలకు ఆయుర్వేదం సూచించిన ప్రాథమిక ఔషథాలను తీసుకోండి. ఔషధం: లఘుసూతశేఖరరసం (మాత్రలు) ఉదయం రెండు రాత్రి రెండు, స్ట్రెస్వీన్ క్యాప్సూల్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి, అర్జునారిష్ఠ (ద్రావకం) నాలుగు చెంచాలు ఉదయం నాలుగు చెంచాలు రాత్రి సమానంగా నీటిని కలిపి తీసుకోవాలి. ఆహారం: ఈ మందులు వాడుతూ బలవర్ధకమెన ఆహారం తీసుకుంటూ ఉప్పు, నూనెలు తగ్గించాలి. ఖర్జూరం, నువ్వుపప్పు, తాజాపండ్లు తీసుకోవాలి. విహారం: రాత్రివేళ కనీసం ఆరేడు గంటలు నిద్రపోవాలి. ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో ఐదు నిమిషాల సేపు ప్రాణాయామం చేయాలి. - డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ఆయుర్వేద నిపుణులు, హైదరాబాద్ -
పాపాయి చర్మం పొడిబారుతోంది!
డాక్టర్ సలహా మా పాప వయసు ఆరు నెలలు. పాప శారీరక, మానసిక ఎదుగుదల వయసుకు తగినట్లుగానే ఉంది. కానీ చర్మం మాత్రం విపరీతంగా పొడిబారుతోంది. ముఖ్యంగా కాళ్ల మీద (మోకాళ్ల కింద నుంచి పాదాల వరకు) చర్మం పగుళ్లుబారుతోంది. స్నానానికి ముందు నూనె రాస్తున్నాం. స్నానం చేయించిన గంట సేపటికే చర్మం పొడిబారి గీతలు వస్తున్నాయి. నూనె రాయడం మానేస్తే చర్మం పగులుతోంది. - ఎస్. ప్రవీణ, ఏలూరు మీ పాప సమస్య ఎగ్జిమా అయి ఉండవచ్చు. ఎగ్జిమా కారణంగా చర్మం సున్నితంగా మారుతుంది. చిన్నపాటి అసౌకర్యానికి కూడా ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో సరిపడని పదార్థం తీసుకున్నా, వాతారణంలో చిన్న మార్పు వచ్చినా చర్మం ప్రభావితమవుతుంది. చర్మం ఎర్రగా మారడం, మంట, దురద పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పెద్ద సమస్యేమీ కాదు. దీనికి పరిష్కారం చర్మాన్ని పొడిబారనివ్వకుండా చూసుకోవడమే. చర్మానికి నూనెలు, క్రీములు రాస్తూ ఉంటే కొంతకాలానికి తగ్గిపోతుంది. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి స్టిరాయిడ్స్‌తో కూడిన క్రీమ్‌లు వాడాలి. మీరు మొదట సాధారణ నూనెలనే ఉపయోగించండి. నాలుగు వారాలకు కూడా ఫలితం కనిపించకపోతే పిల్లల డాక్టర్ని సంప్రదించండి. అవసరమైతే వారి సూచన మేరకు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించవచ్చు. అంతకంటే ముందు తల్లిగా మీరు... పాపాయి ఫలానా పదార్థం తీసుకున్నప్పుడు ఇలా జరుగుతోంది అని గమనించగలిగితే కొంతకాలం పాటు దానిని మినహాయించాలి. సాధారణంగా కొంతమంది పిల్లలకు ఆవు పాలు, కొన్ని రకాల గింజలు సరిపడకపోవడాన్ని చూస్తుంటాం. - డాక్టర్ ప్రీతమ్ కుమార్ రెడ్డి, రెయిన్బో హాస్పిటల్, సికింద్రాబాద్ -
ప్రమాదంలో దంతాలు విరిగిపోయాయి...
నా వయసు 25 సంవత్సరాలు. ఇటీవల ఒక ప్రమాదంలో ముందు రెండు పళ్లు విరిగాయి. కొన్ని దంతాలు రంగుమారి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఒక పన్ను పూర్తిగా పోయింది. పాడైన దంతాల స్థానంలో కొత్త దంతాలను అమర్చవచ్చా? ఏ చికిత్స చేయించుకోవాలి? - పి. వసంత లక్ష్మి, తణుకు మీ దంతాలను సరిచేయడానికి, సాధారణమైన అసలైన దంతాల లాగే కనిపించేటట్లు చేయడానికి రకరకాల పద్ధతులున్నాయి. మీ సమస్యను సరిదిద్దడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ బాండింగ్ అనే రెండు రకాల కాంబినేషన్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. డెంటల్ బాండింగ్ స్థానంలో క్యాప్, బ్రిడ్జి, ఇంప్లాంట్లలో ఏదో ఒక దానిని కూడా చేయవచ్చు. స్మైల్ మేకోవర్ లేదా స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఇందులో దంతాల మధ్య ఖాళీలను డెంక్చర్, బ్రిడ్జి, ఇంప్లాంట్ పద్ధతుల్లో పూరిస్తారు. ఆ తర్వాత బ్లీచింగ్ ద్వారా దంతాలను తెల్లబరుస్తారు. విరిగిన దంతాలకు కాస్మెటిక్ ఫిల్లింగ్ ద్వారా పోర్సెలైన్ క్యాప్స్ లేదా పోర్సెలైన్ వెనీర్స్తో నింపుతారు. చిన్న చిన్న సందులను, ఎగుడుదిగుళ్లను, దంతాలు ఒకదాని మీద ఒకటి ఉండడాన్ని బ్రేసెస్ ద్వారా సరి చేస్తారు. చిగుళ్లకు చేసే గమ్మీ సర్జరీ కూడా స్మైల్ డిజైన్‌లో భాగమే. నల్లగా ఉన్న చిగుళ్లను ఈ చికిత్స ద్వారా ఆకర్షణీయంగా కనిపించేటట్టు చేస్తారు. ఈ విధానాలన్నీ స్మైల్ డిజైన్లోకి వస్తాయి. మీరు నిపుణులైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకోండి. మునుపటిలా ఆనందంగా జీవించండి. - డాక్టర్ పార్థసారథి, దంతవైద్య నిపుణులు -
పెట్‌తో సన్నిహితం!
డాక్టర్ సలహా నా వయసు 40 ఏళ్లు. ఈ గత ఆరు నెలలుగా దగ్గు, ఆయాసం వస్తున్నాయి. చర్మం మీద దద్దుర్లు కూడా వస్తున్నాయి. నాకు నా పెట్(కుక్కపిల్ల)ని ఒళ్లో పెట్టుకునే అలవాటు ఉంది. అది గోళ్లతో నా ఒంటి మీద గీకుతూ ఉంటుంది, దాని ముఖాన్ని నా ముఖం మీద ఆనిస్తూ ఉంటుంది. నా ఆరోగ్య సమస్యలకు ఈ అలవాటే కారణం కావచ్చా? నాకు గతంలో ఇలాంటి సమస్యలేవీ లేవు. ఏడాది కాలంగా పెట్ని పెంచుకోవడం మొదలు పెట్టాను. మా పెట్‌కి వ్యాక్సిన్లు వేయిస్తున్నాను. - ఎమ్. నీరజ, హనుమాన్ జంక్షన్ మీ సమస్యకు ఆస్త్మా కారణం కావచ్చు, ముందుగా బ్లడ్‌టెస్ట్ (హిమోగ్రామ్), ఎక్స్‌రే (ఛాతీ), లంగ్ ఫంక్షన్ టెస్ట్, ఈసిజి (టు డి ఎఖో), బిపి పరీక్షలు చేయాలి. ఈ పరీక్షల నివేదికలన్నీ నార్మల్‌గా ఉంటే అప్పుడు మీకు పెట్ కారణంగానే ఈ సమస్య వచ్చినట్లు అనుకోవాలి. పెట్స్‌తో సన్నిహితంగా మెలగడం వల్ల కొందరిలో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వస్తాయి. దాంతో మీరు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి మీరు కొంతకాలం పెట్స్‌కు దూరంగా ఉండి మార్పును గమనించాలి. కుక్కలు ఇంట్లో తిరుగుతుంటే వాటి నుంచి కొన్ని పరాన్నజీవులు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి దేహంలో చాలా అవయాల మీద ప్రభావం చూపిస్తాయి. ముందుగా చిన్న సిస్ట్లు ఏర్పడి క్రమంగా అవి పెద్దవుతూ దేహంలో కొంత స్పేస్‌ని ఆక్రమిస్తాయి. ఏ అవయవంలో సిస్ట్ ఏర్పడితే ఆ అవయవం రోగగ్రస్తమవుతుంది. కొందరిలో లివర్ పెరగడం, జ్వరం రావడం, ఊపిరితిత్తుల్లో ఉంటే దగ్గు రావడం, మెదడులో ఏర్పడితే ఫిట్స్, తలనొప్పి రావడం, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు కలుగుతుంది. కుక్క పరిశుభ్రంగా లేకపోతే దాని నుంచి పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం మరీ ఎక్కువ. కుక్కల నుంచి సంక్రమించే ఇకైనో కోకస్ అనే పరాన్నజీవిని నివారించే వ్యాక్సిన్ ఏదీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. - డాక్టర్ గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్ -
పులిపిర్లను సర్జరీతో తొలగించవచ్చా!
డాక్టర్ సలహా నా వయసు 27. నాకు గత నాలుగేళ్ల నుంచి చేతులు, ముఖం మీద పులిపిర్లు వస్తున్నాయి. మొదట్లో రక్తహీనతతో ఇలా వస్తుందని, మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందనుకున్నాను. కొందరేమో ఇదొక చర్మవ్యాధి అని చెబుతున్నారు. స్నేహితులు పూత మందులు వాడాలని, కడుపులోకి మందులు తీసుకోవాలని చెబుతున్నారు. నాకు పులిపిర్ల సంఖ్య, సైజు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. బ్యూటీపార్లర్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయంగా ఉంది. అధునాతన కాస్మటిక్ సర్జరీలో సుశిక్షితులైన డాక్టర్లు పులిపిర్లను తొలగించడానికి సర్జరీ చేస్తారని తెలిసింది. నేను ఆ చికిత్స చేయించుకోవచ్చా? నా సమస్యకు పరిష్కారం తెలియ చేయగలరు. - పి. ఉషారాణి, హైదరాబాద్ పులిపిర్లలో ప్రధానంగా వైరల్ వార్ట్స్, స్కిన్ గ్రోత్ వార్ట్స్ అని రెండురకాలు ఉంటాయి. వైరల్ వార్ట్స్కు మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్తో కూడిన ఈ వార్ట్స్‌ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించడం కుదరదు. చర్మవ్యాధి నిపుణులు (డెర్మటాలజిస్ట్) పరీక్షించి తగిన మందులు ఇస్తారు. స్కిన్ గ్రోత్ వార్ట్స్‌ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించవచ్చు. ముందు మీకు వచ్చినవి ఏ రకమైన పులిపిర్లు అనేది స్వయంగా పరీక్షించి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న చర్మవ్యాధి నిపుణులను లేదా కాస్మటిక్ సర్జన్ (ప్లాస్టిక్ సర్జరీ)ను సంప్రదించండి. మీకు ఏ రకమైన చికిత్స అవసరమో వారు సూచించగలుగుతారు. మీకు వచ్చినవి స్కిన్ గ్రోత్ వార్ట్స్ అయితే వాటిని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించవచ్చు. సాధారణంగా ఇవి చర్మం మీద సిస్ట్ ఏర్పడడం, కొవ్వు చేరడం, పుట్టుమచ్చ పెరిగి బుడిపెలా మారడం... ఇలా రకరకాల కారణాలతో వస్తాయి. వీటి చికిత్స కోసం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఒక రోజులోనే చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. బ్లడ్ షుగర్, సిబిపి (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) వంటి సాధారణ పరీక్షలు చేసిన తర్వాత లోకల్ అనస్థీషియా ఇచ్చి వీటిని తొలగిస్తారు. ఆపరేషన్ అయిన మరుసటి రోజే కాలేజీలు, ఆఫీసులకు వెళ్లవచ్చు. దుమ్ముధూళిలో తిరిగినా, ఎండలో వెళ్లినా ఇబ్బంది ఉండదు. అయితే డాక్టర్ సూచించిన ఆయింట్మెంట్ రాసుకుని వెళ్లాలి. సర్జరీ తర్వాత వారం రోజులకు ఒకసారి, ఆ తర్వాత నెలరోజులకోసారి తదనంతర పరిణామాలు, సలహాల కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. ఆహార మార్పుల వంటి ప్రత్యేక జాగ్రత్తలేవీ అక్కరలేదు. - డాక్టర్ మురళీమనోహర్, ప్లాస్టిక్ సర్జన్